‘సింగరేణి’ స్కాం 50వేల కోట్లు!



సింగరేణి దోచుకునేందుకే సీఎండీ శ్రీధర్ కొనసాగింపు

మోడీ–-కేసీఆర్ బినామీల నాటకం

ఆదానీ,  మోడీ, -ప్రతిమ శ్రీనివాసరావుకు కేసీఆర్ అండ!

వేల కోట్ల దోపిడీకి పీఎంవో అడ్డా

మేం చేసిన ఫిర్యాదుపై చేతులెత్తేసిన గనుల మంత్రి!

కేసీఆర్ ముంబై టూర్ డ్రామా

-టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి


వేకువ వార్త, హైదరాబాద్​: మోడీ, కేసీఆర్ మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం జరుగుతున్నట్లు ప్రజల్లో భ్రమ క‌ల్పిస్తున్నార‌ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. లాభసాటిగా నడుస్తున్న సింగరేణిని కేంద్రం అమ్మేసేందుకు ప్రయత్నిస్తుంటే టీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు అడ్డుకోలేద‌ని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న కోల్‌ స్కాంపై మోడీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటోందని,  కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను ప్రధానికి.. కోల్‌ ఇండియాకి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. డీవోపీటీ నిబంధనలకు విరుద్ధంగా శ్రీధర్‌ ను  సీఎండీగా కొనసాగిస్తున్నారని రేవంత్‌ ఆరోపించారు.  50 వేల కోట్ల దోపిడీకి పాల్పడుతోందని, ప్రధాని, కోల్‌ సెక్రెటరీలకు ఫిర్యాదు చేసిని పట్టించుకోవడం లేదన్నారు. ప్రధానికి, కేసీఆర్‌కి ఎంత అనుబంధం ఉందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చన్నారు.  

  సోమవారం ఆయన హైదరాబాద్​లో మీడియాతో రేవంత్​ రెడ్డి  మాట్లాడారు. ఆదానీ సంస్థకు సింగరేణిని 25 ఏళ్ల పాటు రూ.50 వేల కోట్లకు అమ్ముతున్నార‌ని ఆరోపించారు. సింగరేణిలో జరిగిన రూ.250 కోట్ల డీజిల్ కుంభకోణంపై సీఎండీ శ్రీధర్ మీద సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కేసు నమోదు చేసింద‌న్నారు. అనర్హుడైన శ్రీధర్​ను 8 ఏళ్ల నుంచి ఎందుకు కొనసాగిస్తున్నార‌ని నిల‌దీశారు. ఆయ‌న‌కు కేసీఆర్​కు ఎందుకంత ప్రేమ అని మండిప‌డ్డారు. 

సింగరేణిలో జరిగేది రఫెల్ కుంభకోణం కంటే పెద్దదని అన్నారు రేవంత్ రెడ్డి.  రూ.50 వేల కోట్ల స్కాం ప్రధాన సూత్రధారి సీఎండీ శ్రీధర్ అని ఆరోపించారు. కేంద్ర పెద్దలతో మాట్లాడుకుని శ్రీధర్ ను సీఎం కేసీఆర్ కొనసాగిస్తున్నారని స్వయంగా కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పార‌ని గుర్తు చేశారు. ఆయ‌న విషయంలో కేసీఆర్ కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే.. తన పదవి పోతుందని ప్రహ్లాద్ నిస్సహాయతను వ్యక్తం చేశార‌న్నారు. పీఎం ఆఫీస్ లో కేసీఆర్ పవర్ అంటే అదేన‌ని చెప్పారు. మోడీ బినామీ ఆదానీ సింగరేణిలో అడుగుపెట్టిన తర్వాత కేసీఆర్ బినామీ ప్రతిమ శ్రీనివాస్ ను బ్యాక్ డోర్ నుంచి సింగరేణిలోకి ఎంటర్ చేస్తున్నార‌ని రేవంత్​ ఆరోపించారు. రూ.50 వేల కోట్లను దోచుకునే కుట్రలో భాగంగానే మోడీ, కేసీఆర్ క‌లిసి నాట‌కాలు ఆడుతున్నారని మండిప‌డ్డారు. కేంద్రంపై కేసీఆర్ యుద్ధం నిజ‌మైతే నిబంధనలకు వ్యతిరేకంగా 8 ఏళ్ళ పాటు కొనసాగుతున్న సీఎండీ శ్రీధర్ ను తొలగించే దమ్ము ఉందా? అని స‌వాల్ చేశారు.

యూపీఏ భాగస్వామ్య పక్షాలను విడగొట్టడమే టార్గెట్ గా పెట్టుకున్నార‌న్న రేవంత్‌.. కేసీఆర్‌ సుపారీ గ్యాంగ్ లీడర్ అని విమ‌ర్శించారు. బీజేపీ బలోపేతమే ఆయన లక్ష్యమ‌ని చెప్పారు. కేసీఆర్ పెట్టే ఫ్రంట్ తెలియదని దేవెగౌడ చెప్పార‌ని గుర్తు చేశారు. అలాగే ముంబై టూర్ లో మహారాష్ట్ర, తెలంగాణ డెవలప్ మెంట్ విషయాల గురించి చర్చించామ‌ని శరద్ పవార్, మహారాష్ట్ర సీఎంవో ఆఫీస్, ఎంపీ సుప్రియా సూలే ట్విట్టర్ లో పోస్ట్ చేశార‌ని తెలిపారు. కేసీఆర్ తో రాజకీయాలు చర్చించలేదని దేవెగౌడ, ఉద్ధవ్ థాక్రే, శరద్ పవార్, సుప్రియా సూలే చెబితే.. ఆయ‌న‌ మాత్రం బీజేపీతో యుద్ధం అంటున్నారని ఎద్దేవా చేశారు. ఇంకా ఎన్నాళ్లీ ఝూటా మాట‌లని ప్రశ్నించారు. యూపీలో బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ ఎందుకు వెళ్ళడం లేద‌ని.. జగన్, నవీన్ పట్నాయక్, కేజ్రీవాల్ లాంటి నేత‌ల‌తో ఎందుకు చర్చలు జరపడం లేదని నిల‌దీశారు.

Relative Post

Newsletter