కొత్త ఎత్తుల్లో గులాబీ బాస్​

కీలక మలుపుకు  ఎత్తుగడ..
– వారసునికి  ‘ముఖ్య’ బాధ్యతలు
– కొత్త ఎత్తుల్లో గులాబీ బాస్​ 
– జాతీయ చద ‘రంగప్రవేశం’
– తెలంగాణపై పట్టుకు గట్టి పునాదులు 
– ఒక్క ఎత్తుగడ మూడు లక్ష్యాలు 

వేకువ ప్రత్యేక ప్రతినిధి: 
ఒకే ఎత్తుగడతో మూడు లక్ష్యాలు సాధించే దిశగా తెలంగాణ ఉద్యమ నేత, సీఎం కేసీఆర్​ రాజకీయ చదరంగమాడుతున్నారు. రాష్టంలో గులాబీ పార్టీని  తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకు సంస్థాగత బలోపేతాన్ని చేపట్టడం. రాజకీయ వారసునిగా ఇప్పటికే అన్నింటా తానై వ్యవహరిస్తున్న తనయుడు కేటీఆర్​ను సీఎంగా చేయడం తన కర్తవ్యాన్ని పూర్తి చేయడం. తనుయున్ని ఒంటరి చేయకుండా తానూ ఈ రాష్టానికి రాజకీయ రక్షకుని ‘పాత్ర’ కొనసాగిస్తూనే జాతీయ రాజకీయాల్లోకి అడుగులు వేసేందుకు అవసరమైన సానుకూలతను ఏర్పాటు చేసుకునే దిశగా పయనిస్తున్నారు. పైకి ప్రకటించకపోయినా ఈ ప్రయాణంలో కళ్ళముందున్న రాజకీయ శత్రువు కాంగ్రెస్​ను కోలుకోలేని దెబ్బకొట్టడం తక్షణ కార్యక్రమాన్ని అమలు చేయడం. ఈ క్రమంలో బీజేపీతో అవసరమైన చోట కలిసి మెలిసి అడుగులేస్తూనే రాష్టంలో ఆ పార్టీ పునాదులు బలపడకుండా చూసుకోవడం కూడా అంతే అవసరం.  ఇదే క్రమంలో  జాతీయ స్థాయిలో కలిసొచ్చే వారితో కలిసి ముందుకు సాగడం అనే దీర్ఘకాలిక లక్ష్యాలతో సాగుతున్నారు. ఎన్నికల ఎత్తుగడల్లో కేసీఆర్​ ఆరితేరారు. ఇప్పటికే రాష్టంలో ఏ ఎన్నిక జరిగినా తనదైన ముద్రను చాటుతూ విజయాలు సాధిస్తున్నారు. ఎన్నికలను మేనేజ్​ చేసేందుకు అవసరమైన హంగులు ఇప్పటికే పుష్కలంగా సమకూరాయి. ఆర్ధికంగా కూడా ఆ పార్టీ బలమైన స్థితిలో ఉన్నందున రాజకీయ పురోగతిలో భాగంగా అనివార్యమైన  మరో మెట్టేక్కేందుకు కేసీఆర్​ ఉవ్విళ్ళూరుతున్నారు. అయితే ఎలాంటి తొందర లేకుండా అనకునన అనుభవంతో ఈ దిశగా ఒక్కో మెట్టేక్కే ప్రయత్నం చేస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో  సానుకూల పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూ, మీడియా అనుకూలతను కాంగ్రెస్​ నిర్మాణాత్మక బలహీనతను బీజేపీ పైన పెరుగున్న వ్యతిరేకతను తనకనుకూలంగా మార్చుకుంటూ ఇప్పటికే బలమైన పాత్ర నిర్వహిస్తున్న ప్రాంతీయ పార్టీల ప్రభావం తదతర అంశాలను పరిగణలోకి తీసుకుని అవసరమైన రాజకీయ ఎత్తుగడలను రూపొందించి పాచికలు విసురుతున్నారు. కార్యక్రమాన్ని ప్రణాళికబద్దంగా అమలు చేస్తున్నారు. ఇవన్నీ కొనసాగించే రాజకీయ చతురతతో పాటు అనుకోని ఆపద తలెత్తితే  ఎజెండాను పక్కన పెట్టి పూర్తి  ‘యు టర్న్​’ తీసుకోవడానికి కూడా కేసీఆర్​ వెనుకంజవేయడనే విషయాన్ని  ఇక్కడ మరిచిపోకూడదు.  
–  ఎత్తుల్లో ఆరితేరిన కేసీఆర్​
గ్రేటర్​ హైదరాబాద్​ ఎన్నికల నుంచి ఎత్తులు వేస్తున్న టీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ ఒక్కో పావును ఆచితూచి కదుపుతున్నారు. ముందస్తు దూరదృష్టితో ఎత్తులు వేసే కేసీఆర్​ రాజకీయ చాణక్యంలో తాజాగా వేగం పెంచారు. ఈ కీలక పరిణామాలన్నీ పరిశీలిస్తే నూతన పరిణామాలకు దారి తీస్తున్నట్లు కన్పిస్తున్నది. పూర్తి స్థాయి నిర్ణయం తనకు తాను ప్రకటించే వరకు గుంభనంగా వ్యవహరిస్తూ చాపకింద నీరులా తన ఎత్తుగడలు అమలు చేయడంతో కేసీఆర్​ ఎప్పుడో ఆరితేరి పోయారనేది రాజకీయ వర్గాల్లో అందరూ ఒప్పుకునే అంశమే.  ఈ నేపథ్యంలో తాజా నిర్ణయాలు తనయుని రాజకీయ భవిష్యతకు ఎలాంటి ముల్లబాట లేకుండా దారిలో దీపాలు ఏర్పాటు చేస్తున్నారు.   గత సాధారణ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన ‘ఫెడరల్​ ఫ్రంట్​’కు సానుకూల సమయం ఏతెంచిందని భావిస్తున్నారు.  ఆ దిశగా ఒక్కో అడుగువేస్తున్నారు అందుకే కేసీఆర్​ చర్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.  
కత్తికి రెండువైపులా పదును 
కేసీఆర్​ కత్తికి రెండు వైపులా పదునుంటుందని ఆయనను దగ్గరగా ఎరిగిన వారు చెప్పే సాధారణ విషయం. మరో మాటలో చెప్పాలంటే తన రాజకీయ, అధికార అవసరాల కోసం ఎవరితోనైనా కలిసేందుకూ,  విడిపోయేందుకు ఎలాంటి సంకోచం, సందేహం లేకుండా వ్యవహరిస్తారని ఆయన ఆచరణను పరిశీలించిన వారు చెబుతుంటారు.  సాధారణ రాజకీయ పరిభాషలో దీన్ని అవకాశవాదమంటారు.  అయితే కేసీఆర్​ ఉద్యమకాలం నుంచి ఇదే తీరుతో వ్యవహరించడం వల్ల అవకాశవాదం  కాస్తా అపర చాణుక్యంగా  మారిపోయింది.  ప్రస్తుతం కేసీఆర్​ తన ఎత్తుగడలను ద్విముఖ రూపాల్లో అమలు చేస్తున్నారు. ఇందులో ఒకటి సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే చర్యలు చేపట్టారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పక్కకు పెట్టిన జిల్లా అధ్యక్షుల నియామకంతో మళ్ళీ సంస్థాగతం పై కేంద్రీకరించారు.  ఉద్యమనేత అనే కీర్తికిరిటం ఎప్పుడైనా మసకబారిపోవచ్చనే భవిష్యత్తు అంచనా పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు సిద్ధమయ్యారు. రానున్న రోజుల్లో  తమ కుమారుడు కేటీఆర్​ రాజకీయ భవిష్యత్​కు అవసరమైన  దారులు పరిచినట్లు కన్పిస్తున్నది.  స్థానికంగా రాష్ట్రంలో  అధికారాన్ని కాపాడుకుంటూనే తనయునికి సీఎం పగ్గాలు అప్పగిస్తే మరి తన ఉనికి, భవిష్యత్తు ఏంటనే ప్రశ్న ఉత్పన్నమైతుంది. దీనికి సమాధానంగా జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు. దీని కోసం తనకంటూ ఒక ప్రోటోకాల్​ పదవి సృష్టించే అవకాశముంది.  ముందు జాగ్రత్తగా పూర్తిగా జాతీయ రాజకీయల వైపు దృష్టి సారిస్తే అక్కడ ఫలితాలెలా ఉన్నా తెలంగాణలో నష్టం వాటిల్లే ప్రమాదాన్ని సైతం ముందుగానే ఊహించి అడుగులేస్తున్నారు. అందుకే ఆయనఉద్యమకాలంలో చెప్పినట్లు తెలంగాణ రాష్టానికి రాజకీయ సంరక్షుని తరహా ఓ కొత్త చైర్మన్​ పదవిలో తానుంటూ  తనయున్ని సీఎం చేసే అవకాశాలున్నాయి. దీని వల్ల తనకు అవసరమైన ప్రోటోకాల్​ లభించి జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టేందుకు ఉపయోగపడుతుంది. రాష్టంలో ఏదైనా సమస్య ఉత్పన్నమైతే తానున్నానంటూ ముందుకు వచ్చి మాట్లాడేందుకు ఈ పదవి వల్ల అవకాశం లభిస్తుంది. 
– రాజకీయ మిత్రుత్వం వైపు అడుగులు 
ఒక్క టీఆర్​ఎస్​ పార్టీగా జాతీయ రాజకీయాల్లో కనీస ఛక్రం తిప్పడం కష్టమనేది కేసీఆర్​ లాంటి సీనియర్​ రాజకీయ వేత్తకు తెలిసిందే .  అందువల్ల జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టాలంటే అవసరమైన ముందస్థు కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది.  దీనికి బీజేపీ, కాంగ్రెస్​లకు వ్యతిరేకంగా ఒక వేదిక​ను రేఖామాత్రంగానైనా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా ముందుగా సీపీఐ, సీపీఎం పార్టీల కేంద్ర నాయకత్వంతో జరిపిన చర్చలనే అభిప్రాయం ఉంది. వీరికి తోడు కలిసొచ్చే మరి కొన్ని  చిన్న  రాజకీయ పక్షాలతో రానున్న రోజుల్లో చర్చలు జరిపే అవకాశం ఉంది.  కేంద్రంలో ప్రస్తుతం కాంగ్రెస్​ బలహీనంగా ఉన్నందున యుపీఎ భాగస్వామ్యపక్షాలైన డిఎంకే లాంటి పార్టీలతో టచ్​లో ఉంటే రానున్న రోజుల్లో కలిసివచ్చే అవకాశముందనే అంచనాతో ఉన్నారు.  బెంగాల్​ మమత, ఒరిస్సా పట్నాయక్​, బీహార్​ ఆర్జేడీ నేతలతో సక్యత వెనుక కేసీఆర్​ రాజకీయ దూరదృష్టి ఉంది.  ప్రస్తుతం ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్​ సహా ఐదు రాష్ట్రాల ఫలితాల తర్వాత కాంగ్రెస్​, బీజేపీల పరిస్థితిని చూసిన  తర్వాత కేసీఆర్​ విధానం మరింత స్పష్టమయ్యే అవకాశాలుంటాయి. బీజేపీ, మోడీ చరిష్మా పడిపోతున్నందున ఈ ఫ్రంట్​ ప్రత్యేక ఉనికిని కొనసాగించినా బీజేపీకి  ‘బి’  టీమ్​గా వ్యవహరించే అవకాశాలు లేక పోలేదనే  అభిప్రాయాలున్నాయి.  ఇక కాంగ్రెస్​ మరోసారి విఫలమైతే యుపీఎను బలహీన పరిచే చర్యలు కేసీఆర్​ నేతృత్వంలో వేగవంతమయ్యే అవకాశం ఉంది. ఇక బీజేపీ అనూహ్యంగా పుంజుకుంటే కాసింత వెనక్కు తగ్గే అవకాశలున్నాయి. ఇప్పుడున్న బీజేపీ ప్రభ తగ్గితే రానున్న రోజుల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉంటే వారితో భేరసారాలు జరిపే అవకాశం కూడా ఈ కూటమికి ఉంటుంది. అయితే ఈ పరిణామాలన్నీ అంతసులువైన విషయాలు కానప్పటికీ రాష్టంలో టీఆర్​ఎస్ అధికారాన్ని కాపాడుకోవాలన్నా బీజేపీ, కాంగ్రెస్​లకు దూరంగా ఉంటూ కేంద్రంలో అవసరాన్ని బట్టి అడుగులు వేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం కేసీఆర్​ అడుగులు బీజేపీతో అమితుమీ తేల్చుకునే పరిస్థితిలో లేవనేది పలువురు చెబుతున్నారు. కేసీఆర్​ అమలు చేస్తున్న ఈ ప్రణాళిక అమలు అంత సులువైన విషయం కానప్పటికీ  ఈ అడుగులు  రానున్న కాలంలో బీజేపీకి తెలంగాణలో అవకాశం దక్కకుండా చేయడం, తక్షణ రాజకీయ శత్రువైన కాంగ్రెస్​ను చర్చలోనే లేకుండా బొందపెట్టే లక్ష్యం ఉందని చెప్పవచ్చు. ఈ విధానం అమలు చేసేందుకు అవసరమైన కార్యచరణ కోసం గత ఎన్నికల్లోనే ఫెడరల్​ఫ్రంట్​ అనే పాచిక విసిరారనే అభిప్రాయం ఉంది. దాన్ని మరింత ముందుకు తీసుకపోయే ఎత్తుగడలతో కేసీఆర్​ ముందుకు సాగుతున్నారు. 
–  కాంగ్రెస్​ పతనం....బీజేపీకి చెక్​ 
గ్రేటర్​ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్​ఎస్​ మధ్య నెలకొన్న ఆంతర్గత పోటీ కాస్తా టీఆర్​ఎస్​లో బలమైన నేతగా ఉన్న ఈటెల బీజేపీలో చేరడంతో మరింత పెరిగింది. ఈటెలను బీజేపీలోకి చేరే విధంగా కేసీఆర్​ మార్గాన్ని సుగమమం చేశారనే భిన్నాభిప్రాయాలున్నప్పటికీ హుజురాబాద్​ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా బరిలో నిలిచిన ఈటెల కేసీఆర్​ ఎత్తులను చిత్తుచేస్తూ విజయం సాధించడం పైకి జీర్ణించుకోలేని విషయం. అంతర్గతంగా ఆ పార్టీల మధ్య ఏ మేరకు సఖ్యత ఉందనేది పక్కకు పెడితే గెలుపోటముల పోటీలో కేసీఆర్​ చరిష్మాను ఈ ఎన్నిక ఫలితం  ఒకింత మసకబార్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. 
– హుజురాబాద్​ ఎన్నిక ప్రభావం
 హుజురాబాద్​ ఉప ఎన్నిక విజయం ఊపుతో బీజేపీ తన ప్రస్థానాన్ని తెలంగాణలో పదిలపరుచుకుంటుందనే అంచనావేసిన గులాబీ బాస్​ ఆ ఫలితాలు ఘనీభవించకుండా బీజేపీతో వ్యూహాత్మక రాజకీయ పోరుకు సిద్ధమయ్యారు. ఈ అంశంలో కాంగ్రెస్​ను దోషిని చేస్తూ, ఆ పార్టీలోనే చిచ్చుపెట్టే  గులాబీ ఎత్తుగడ ఫలించిందని చెప్పవచ్చు. ఈ సమయంలో  శషబిషలు లేకుండా ఆయనే రంగంలోకి దిగి మీడియా యుద్ధాన్ని ప్రారంభించి (గంటల కొద్దీ లైవ్​ ప్రసంగాలు)  తాత్కాలికంగానైనా బీజేపీ నుంచి దృష్టిమళ్ళించే ప్లాన్​ అమలు చేసి ఇందులో కొంత విజయం సాధించారు. ఇదే ఊపులో ధాన్యం కొనుగోళ్ళకు కేంద్రం అడ్డింకిగా మారిందనే విషయాన్ని ఎజెండాపైకి తెచ్చారు. రైతు బాధలను కల్లాల్లో వదిలిపెట్టి  కేంద్రంతో అమీతుమీ తేల్చుకుంటామంటూ గంభీర ప్రకటనలు చేసి పార్లమెంట్​లో మొక్కుబడి నిరసనలు చేపట్టి అర్ధాంతరంగా వెనక్కుతగ్గారు. రైతాంగ చట్టాలపైనయూటర్న్​  తీసుకున్న కేసీఆర్​ మళ్ళీ మద్ధతు పాట అందుకోని తానే నిషేధించిన ధర్మాచౌక్​లో సీఎం హోదాలో ధర్నా చేపట్టి చర్చకు మరింత అగ్గిరాజేశారు.  
– ఎత్తుల్లో కాంగ్రెస్ ప్రధాన లక్ష్యం​ 
టీఆర్​ఎస్​కు కౌంటర్​గా అదే స్థాయిలో బీజేపీ చేసిన యుద్ధంతో టీఆర్​ఎస్​ వర్సెస్​ బీజేపీ అనే రూపంలో రాజకీయ పరిస్థితిని మార్చివేశారు. ఇక్కడ గుర్తించాల్సిన ప్రత్యేక అంశమేమిటంటే  హుజురాబాద్​ ఎన్నికల ఫలితాల వరకు రాష్ట కాంగ్రెస్​లో కొత్త ఉత్సాహం నెలకొంది. ద్విగువ శ్రేణి నాయకత్వం, కేడర్​లో కదలిక వచ్చింది.ఈ స్థితిలో రాష్ట్రంలో టీఆర్​ఎస్​, బీజేపీల ఉమ్మడి రాజకీయ శత్రువుగా ఉన్న కాంగ్రెస్​ను తమ వేలుతో తమ కంట్లోనే పొడుచుకునే ఎత్తుగడ ప్రయోగించి విజయం సాధించారని చెప్పవచ్చు. మళ్ళీ ఆపార్టీలో పాత  పరిస్థితి నెలకొంది. అయితే తాజాగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే కార్యక్రమంలో ఉన్నది. దీని తర్వాతనైనా పుంజుకొని కాంగ్రెస్​ అడుగుముందుకు వేస్తుందా? లేదా? అని ఆ పార్టీ శ్రేణులు, అభిమానులు ఆశతో ఎదురుచూస్తున్నారు. 
– తెరపైకి విభజన హామీల ఉద్యమం
తాజాగా తెరపైకి రాష్ట విభజన హామీలను తీసుకొచ్చి కేంద్రం పై ఒత్తిడి తెచ్చే ఎత్తుగడను టీఆర్​ఎస్​ అమలు చేస్తున్నది. ఇది కూడా  బీజేపీని ఇరుకున పెట్టే చర్య. కాంగ్రెస్​ను వ్యూహాత్మకంగా ప్రజలకు దూరం చేయడమే. అధికార, ప్రతిపక్ష పాత్రను ఏకకాలంలో టీఆర్​ఎస్​, బీజేపీలు పోషించడం గమనార్హం. చట్టబద్దమైన విభజన హామీలపై ఏడున్నరేళ్ళలో ఎప్పుడూ గట్టిగా పట్టుబట్టని టీఆర్​ఎస్​ తన రాజకీయ అవసరార్ధం మాత్రం అప్పుడప్పుడు చర్చకు పెట్టడం అలవాటుగా మారింది. ఇప్పుడు మరోసారి అదే విధానాన్ని అమలు చేసేందుకు కాస్తంత సీరియస్​గా ప్రయత్నాలను కొనసాగిస్తున్నది. ఈ ఒత్తిడి కార్యక్రమంలో వామపక్షాలు, ఇతర సానుకూల రాజకీయ పక్షాలు, సంఘాలతో ఐక్యపోరు చేపట్టేందుకు కార్యక్రమాలను రూపొందించడంలో నిమగ్నమయ్యారు. రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాలు రాష్ట్రంలో ఊపందుకోనున్నాయి. 

Relative Post

Newsletter