భారత రాజ్యాంగ సారాంశమే , భారత రాజ్యాంగ పీఠిక

భారత రాజ్యాంగ సారాంశమే , భారత రాజ్యాంగ పీఠిక

కొంతమంది సంఘ్ పరివార్ నాయకులు భారత రాజ్యాంగం పీఠిక లో ఉన్న సోషలిస్టు సెక్యులరిస్టు భావాలను వ్యతిరెకిస్తున్నారు .  వీరి వాదన ప్రకారం సోషలిస్టు , సెక్యులరిస్టు పదాలు , భావాలు పీఠికలో మొదట్లో లేవు . ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పార్లమెంటులో సవరణలు చేసి రాజ్యాంగ పీఠికలో ఈ పదాలను చేర్చారు . కావున ఈ పదాలను , భావాలను పీఠిక నుండి తొలగించాలని వీరి డిమాండ్ . వీరి వాదన ఎలా ఉంటుంది అంటే అసలు రాజ్యాంగంలో సోషలిస్టు సెక్యులరిస్టు భావనలు లేనేలేవు కేవలం దుర్బుద్ధి తోనే ఈ పదాలను , భావనలను దొడ్డి దారి గుండా పీఠికలో ఇరికించి దేశ ప్రజలను మోసం చేశారు అన్నట్లుగా ఉంటుంది , కానీ రాజ్యాంగం లోనే సోషలిస్టు సెక్యులర్ భావనలు ఉన్నాయని వీరికి తెలుసు . రాజ్యాంగము యొక్క సారాంశాన్నే రాజ్యాంగ పీఠికలో మొదట్లో కానీ తరువాత సవరణ ద్వారా కానీ చేర్చారు అని కూడా వీరికి తెలుసు . అయితే రాజ్యాంగ పీఠికలో “ భారత దేశ ప్రజలమైన మేము “ అని చెప్పబడే భారత ప్రజలలో అత్యధికులకు రాజ్యాంగంలో ఏమున్నదో , పీఠికలో ఏమున్నదో తెలవదు . దీన్ని ఉపయోగించుకునే సంఘ్ పరివార్ సంస్థల నాయకులు ప్రజలను తప్పుదారి పట్టించడానికి సోషలిజం సెక్యులరిజం భావనలను పీఠికలో దొంగతనంగా ఇరికించారు అన్నట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారు . సోషలిస్టు సెక్యులర్ భావనలు కేవలం పీఠికలో మాత్రమే లేవు రాజ్యాంగం లోనే ఉన్నాయి . రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు , ఆదేశిక సూత్రాలలో సెక్యులరిస్టు భావనలు సోషలిస్టు భావనలు ఉన్నాయి . ప్రాథమిక హక్కులు , లింగ ప్రాంత , వర్గ , కుల , మత భేదాలు లేకుండా అందరికీ సమానంగా వర్తిస్తాయి . మతాలకు అతీతంగా ప్రాథమిక హక్కులు అందరికీ సమానంగా ఉండడం సంఘ్ పరివార్ నాయకులకు నచ్చని విషయం , వారు అంగీకరించని విషయం , ఆదేశిక సూత్రాలు కూడా లింగ ప్రాంతం మతం కులాలకు అతీతంగా అందరికీ వర్తిస్తాయి . ఈ విషయం కూడా సంఘ్ పరివార్ నాయకులకు అంగీకారం కాదు . వారు అన్నింటిలోనూ ఒక మతానికే  ఆధిపత్యం ప్రాముఖ్యత ఉండాలి అనుకుంటారు , అంటారు . అయితే సంఘ్ పరివార్ నాయకులు ప్రస్తుతం నేరుగా రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు , ఆదేశిక సూత్రాల పై బహిరంగంగా దాడి చేసే పరిస్థితి లో లేరు . అందుకే ముందు రాజ్యాంగ పీఠిక లోని సోషలిస్టు సెక్యులరిస్టు పదాల పై , పీఠికలో మొదట్లో లేవు అనే సాకుతో దాడి మొదలు పెట్టారు . తరువాత క్రమంగా ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల పైనే దాడి చేస్తారు . ఉభయసభలలో సరిపోయినంత మెజారిటీ ఉంటే ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలను కూడా సంఘ్ పరివార్ నాయకులు మార్చివేయగలరు .  సంఘ్ పరివార్ నాయకులకు కేవలం సోషలిస్టు సెక్యులరిస్టు భావనలతోనే  సమస్య కాదు . వారికి మొత్తం రాజ్యాంగం తోనే సమస్య . కార్ముకులకు , రైతులకు , ఉద్యోగులకు అనుకూలమైన అంశాలన్నింటిని రాజ్యాంగం నుండి తొలగించడానికి BJP ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది . గత ప్రభుత్వాలు ఉన్న చట్టాలను ఉల్లంఘించి పెట్టుబడి దారులకు లాభాలు చేకూర్చితే , BJP ప్రభుత్వం చట్టాలనే మార్చివేసి దోపిడిని , అవినీతిని చట్టబద్దం చేస్తున్నది . ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద ప్రమాదం . భారత రాజ్యాంగం స్థానంలో హిందుత్వ ఆధిపత్య రాజ్యాంగం , మనువాద తరహ రాజ్యాంగం స్థాపించడం వారి లక్ష్యం .

కేవలం పీఠికలోని కొన్ని అంశాలను తీసివేయాలని మాత్రమే వీరు డిమాండ్ చేయడం లేదు . అంటే కేవలం ప్రచారం వద్దనే వీరు ఆగిపోలేదు . ఆచరణలో కూడా ఇప్పటికే రాజ్యాంగాన్ని సవరించడం మొదలుపెట్టారు . రాజ్యాంగంలోని చాలా విషయాలు పనికి రాకుండా పోయాయని , పనికి అడ్డంకిగా మారాయని ప్రచారం చేసి చేస్తూ రాజ్యాంగాన్ని కొద్దికొద్దిగా మారుస్తున్నారు . కార్మికులకు అనుకూలమైన చట్టాలను తొలగించి పెట్టుబడిదారులకు ఉపయోగపడే నాలుగు లేబర్ కోడ్ లు తీసుకువచ్చారు . ఒకే దేశం ఒకే నీతి అంటూ ప్రచారం చేస్తూ కేంద్రం రాష్ట్రాల మధ్య ఉండాల్సిన సమాఖ్య స్వభావాన్ని సమాధి చేస్తూ పన్నులు (GST) , వ్యవసాయం , విద్య , వైద్యం లాంటి విషయాలలో రాష్ట్రాల అధికారాలను కుదిస్తూ కేంద్రం తన అధికారాలను పెంచుకుంటూ పోతున్నది . BJP గవర్నర్ లు ఇస్తున్న స్టేట్ మెంట్స్ , వ్యవహరిస్తున్న తీరు చూస్తేనే అర్ధం అవుతుంది , BJP భారత దేశాన్ని మన రాజ్యాంగంలో ఉన్న , యూనియన్ ఆఫ్ స్టేట్స్ గా కాకుండా ఒకే యునియన్ చూస్తున్నదని . ఇంకా దీనికి కో-ఆపరేటివ్ ఫెడరలిజం అని అందమైన పేరు కూడా తగిలించింది బిజెపి ప్రభుత్వం . ప్రభుత్వం వ్యాపారం చేయదు , మ్యాగ్జిమం గవర్నెన్స్ మాటల చాటున రాజ్యాంగంలోని ప్రజల సంక్షేమ అవగాహనను లేకుండా చేస్తున్నది . ప్రజల సంక్షేమం రాజ్యం విధిగా మన రాజ్యాంగం ఆదేశిస్తున్నది . దేశ వనరులను ప్రజల సంక్షేమానికి ఉపయోగించాలంటుంది . కానీ బిజెపి ప్రభుత్వం “వ్యాపారం చేయం” “ఉచితాలు వద్దు”  అంటూ ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా చేతులు దులుపు కోవాలని చూస్తున్నది . కేవలం ఎన్నికల ప్రయోజనాల కొరకు మాత్రమే ప్రస్తుతం బిజెపి సంక్షేమ పథకాలను పై పైన వల్లిస్తున్నది . ప్రభుత్వం వ్యాపారం చేయదు ఉచితాలు పంచి పెట్టొద్దు అని ఒకవైపు చెబుతూ మరోవైపు BJP ప్రభుత్వం బడా పెట్టుబడిదారులకు లక్షల కోట్ల అప్పులను మాత్రం రద్దు చేసింది . వ్యాపారం చేయాని ప్రభుత్వానికి బడా పెట్టుబడుదారుల నష్టాలు , అప్పుల గురించి ఎందుకు బాధ . అంటే బిజెపి ప్రభుత్వం వ్యాపారం చేయదు కాని బడా పెట్టుబడిదారులకు దేశ వనరులను చౌకగా అప్ప చెపుతుంది వ్యాపారం చేసుకోవడానికి . పెట్టుబడుదారులకు నష్టాలు వస్తే  అప్పులు రద్దు చేస్తుంది , ప్రజల డబ్బును అప్పుగా ఇస్తుంది . ప్రజల సంక్షేమ రాజ్యంగం కాకుండా పెట్టుబడుదారుల సంక్షేమ రాజ్యాంగం నిర్మాణమే RSS ,BJP ల ఉద్దేశం . ఆదేశిక సూత్రాల లోని ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలి పెట్టి అంటే పెట్టుబడిదారుల దయకు వదిలివేయడానికి పీఠికలోని సోషలిస్టు భావనను బిజెపి ఆర్ఎస్ఎస్ వ్యతిరేకిస్తున్నాయి దానిలో భాగంగానే ఆచరణలో పబ్లిక్ సెక్టార్ పరిశ్రమలు , సర్వీసు రంగాన్ని బడా పెట్టుబడిదారులకు అప్ప చెపుతున్నది . 

సెక్యులరిజం విషయంలో కూడా ఇలాగే ఒకవైపు తప్పుడు నిర్వచనాలు ఇస్తూ రాజ్యాంగ పీఠిక నుండి తీసి వేయాలని డిమాండ్ చేస్తూనే మరోవైపు మతతత్వాన్ని విచ్చలవిడిగా రెచ్చగొడుతున్నారు . మతాన్ని రాజకీయాలకు జోడించవద్దు  అనేదే మన రాజ్యాంగం చెప్పుతున్నది . ఎన్నికల కమిషన్ తన ఎన్నికల నియమ నిబంధనలలో మొదటి నియమమే మతానికి చెందినది . ఎన్నికల ప్రచారంలో మతాన్ని ఉపయోగించవద్దని స్పష్టమైన నిబంధన ఉన్నది . కానీ బిజెపి తన రాజకీయ సభల్లోనూ ఎన్నికల సభలోనూ జైశ్రీరామ్ అనే మతపరమైన నినాదాలు ఇస్తున్నది . మేము ఒక మతానికి చెందిన రక్షకులం అన్నట్లుగా ప్రచారం చేస్తున్నది . 2024 వరకు అయోధ్యలో రామమందిరం పూర్తి అవుతుందని , దాన్ని జాతికి అంకితం చేసి అక్కడి నుండే ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం మొదలు పెడతాడు అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నే స్వయంగా బహిరంగంగా ప్రకటించాడు . ఇది మతాన్ని రాజకీయాలకు వాడుకోవడమే అవుతుంది .  అందుకే బిజెపి సెక్యులరిజాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నది 


రాజ్యాంగ పీఠిక లో భావప్రకటన స్వేచ్ఛ గురించి మత విశ్వాసాల గురించి కూడా ఉంది . ఎవరైనా తమకు ఇష్టమైన మతాన్ని ఎంచుకోవచ్చు ఇష్టమైన పూజా పద్ధతిని ఎంచుకోవచ్చు . తమ భావాలను వ్యక్త పరుచుకోవచ్చు . కానీ సంఘ్ పరివార్ సంస్థలు భావప్రకటన స్వేచ్ఛను ప్రత్యక్షంగా ఎదుర్కోలేక , మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ భావప్రకటన పైన దాడి చేస్తున్నారు . భావ ప్రకటన స్వేచ్ఛను దేశ వ్యతిరేక భావాలుగా కూడా ప్రచారం చేస్తూ బావ స్వేచ్ఛ పైన దాడి చేస్తున్నారు . దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఎంత హక్కు ఉందో దేవుడు లేడని చెప్పడానికి కూడా అంతే హక్కు ఉంది . “మనోభావాలు” “దేశద్రోహం” పేరుమీద భావప్రకటన స్వేచ్ఛ పైన దాడి చేయడం రాజ్యాంగ వ్యతిరేకం . చివరికి భావ సంఘర్షణ జరిగే యూనివర్సిటీలలో కూడా భావ ప్రకటన స్వేచ్ఛను దేశ వ్యతిరేకతకు ముడి పెడుతున్నారు . వీరి మతతత్వ భావజాలానికి సవాలుగా ఉన్న శాస్త్రీయ భావజాలాన్ని ఎదుర్కోలేక దానికి దేశవ్యతిరేక భావజాలం అనే ముద్ర వేసి భావప్రకటన స్వేచ్చ పైన దాడి చేస్తున్నారు . ఏ దేశంలో అయినా విశ్వవిద్యాలయాలలో జరిగే భావ సంఘర్షణలు ఆదేశాలకు ఉపయోగ పడ్డాయి కానీ నష్టం కలిగించ లేదు . చివరికి సంఘ్ పరివార్ సంస్థలు , ప్రశ్నించడాన్ని కూడా దేశద్రోహం గా ప్రచారం చేస్తూ ప్రశ్నించే స్వేచ్ఛ పైన కూడా దాడి చేస్తున్నారు .  

మొత్తంగా ఆర్ఎస్ఎస్ బిజెపి ల సామ్రాజ్యవాద అనుకూల ఆర్థిక విధానాలకు కానీ , ఆర్ఎస్ఎస్ బిజెపి లు నెలకొల్పాలని అనుకుంటున్న  హిందుత్వ అనుకూల రాజ్యానికి కానీ ప్రస్తుతం మన రాజ్యాంగం అనుకూలంగా లేదు . అందుకే సోషలిస్టు సెక్యులర్ తో సహా మొత్తం రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నాయి  ఈ సంస్థలు .

-లంక. పాపిరెడ్డి

Relative Post

Newsletter