టార్గెట్​ తెలంగాణ కాంగ్రెస్​ మిషన్​


–  వ్యూహం మార్చిన రాహుల్​ 

–  గేరు మార్చిన  అధిష్టానం

–  గతానికి భిన్నమైన వైఖరి 

–  గుణపాఠమా?  రణనీతా?

–  అస్థాన నేతలకు అల్టిమేటమ్​ 

–  ప్రజల్లో ఉంటేనే పార్టీ టికెట్​ 

–  ఉలిక్కిపడిన గులాబీ లీడర్లు

–  కాంగ్రెస్​ పై బీజేపీ సెటైర్లు 


(ప్రత్యేక ప్రతినిధి):గతానికి భిన్నంగా తెలంగాణలో వచ్చే ఎ న్నికల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్​ వ్యూహాన్ని అమలు చేస్తుందా? అంటే నిజమనిపిస్తోంది. టార్గెట్​ తెలంగాణ  మిషన్​ను అత్యంత పకడ్బంధీగా  ఆ పార్టీ అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ దఫా ఆషామాషీగా కాకుండా ఒక్కోఅడుగు వేస్తూ  ప్రజల ముందు ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదిస్తూ  పార్టీ ప్రక్షాళన చేపడుతూ అంతా ఒక క్రమ పద్ధతి ప్రకారం చేస్తున్నట్లు అర్ధమవుతోంది. రెండు రోజులుగా తెలంగాణ కేంద్రంగా సాగుతోన్న ఆ పార్టీ అధినేత రాహుల్​గాంధీ పర్యటనను పరిశీలిస్తే ఇది నిజమనిపిస్తుందీ. రెండు దఫాలు కేంద్రంలో రాష్ట్రంలో అధికారానికి దూరమైన అనుభవమా? లేక కాంగ్రెస్​లో వచ్చిన కొత్త మార్పా? ఏమైనా గతంలో కాంగ్రెస్​ అనుసరించిన విధానాలకు భిన్నమైన పరిస్థితి ప్రస్తుతం  స్పష్టమవుతున్నది.  కాంగ్రెస్​ అంటేనే అంతకు ముందు అసమ్మతిని పెంచిపోషించిన అధిష్టానం స్వరంలో సైతం కొత్త మార్పు కన్పిస్తోంది. ఏమైనా పార్టీ తీసుకుంటున్న గుణపాఠమా? రణనీతా అనే చర్చ రాజకీయ వర్గాల్లో చర్చసాగుతోంది. రాహుల్​ రెండు రోజుల పర్యటన పై, ఆయన మాటలపై రాష్ట్రంలో అధికారంలో ఉన్న గులాబీ పార్టీ ఉలిక్కిపడుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్ర నేతలు సైతం తీవ్రంగా ప్రతిస్పందించారు. రాహుల్​ మాటలపై సెటైర్​లు వేస్తున్నారు. భారీ ఎత్తున హాజరైన జనంతో వరంగల్​లో నిర్వహించిన  రైతు సంఘర్షణ సభ సక్సెస్​ అయ్యిందని చెప్పవచ్చు. కాంగ్రెస్​లో నెలకొన్న కొత్త జోష్​ తో  ఈ రెండు పార్టీల్లో ఎక్కడో కంగారు గోచరిస్తోంది. 


– డిక్లరేషన్​తో  వ్యవసాయ రంగానికి భరోసా 


ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా వరంగల్ రైతు డిక్లరేషన్​లో పొందుపరిచిన అంశాలు రైతాంగానికి భరోసా కల్పిస్తాయనడంలో ఎలాంటి సందేహంలేదు. ఇప్పటి వరకు రాష్ట్రంలో టీఆర్​ఎస్​ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమంతో పోల్చితే తాజా డిక్లరేషన్​ ఎంతో మెరుగ్గా ఉందని చెప్పవచ్చు. ఈ డిక్లరేషన్​ పై సభలోనే గట్టిగా బలపరిచిన ఆ పార్టీ అధినేత రాహుల్​, గాంధీభవన్​ కేంద్రంగా జరిగిన పార్టీ ముఖ్యనేతల సమావేశంలో మరింత స్పష్టత నిచ్చారు. వచ్చే నెలరోజుల కాలంలో డిక్లరేషన్​లో పేర్కొన్న అంశాలు తెలంగాణ గడపగడపకు చేరాలని కర్తవ్యాన్ని అందించారు. అంటే రానున్న రోజుల్లో ఈ డిక్లరేషన్​లో రైతులు, సంక్షేమం, కౌలు రైతులు, వ్యవసాయం, ఇన్​పుట్​ సబ్సిడీ, పెట్టుబటి, వ్యవసాయ కూలీలు, భూ సంబంధిత సమస్యలు, వ్యవసాయ కమీషన్​, మద్ధతు ధర కల్పనతో పాటు ఒక రకంగా ఇది తెలంగాణ నూతన వ్యవసాయ విధానంగా చెప్పవచ్చు. ఈ ప్రతిపాదనలు రైతుల్లోకి తీసుకెళితే మంచి స్పందన రావడం ఖాయం. ఈ ప్రతిపాదనలు నిజంగానే చిత్తశుద్ధితో అమలు చేస్తే వ్యవసాయ రంగంతో పాటు దానిపై ఆధారపడిన అనేక లక్షల కుటుంబాల ప్రగతికి కొత్తదారులు వేసినట్లేనని చెప్పవచ్చు. అయితే కాంగ్రెస్​ చెబుతున్న తాజా మాటలు అధికారంలోకి వస్తే అమలు చేస్తుందా? అనేదే ఇక్కడ చిక్కుప్రశ్న. అయితే ఈ విషయం పార్టీ అధిష్టానం గట్టిపట్టదలతో కన్పిస్తోంది. రైతులకు అనుసంధానంగా పార్టీ పనిచేయాలని ఆ పార్టీ నేత రాహుల్​ స్పష్టం చేశారు. ఈ నూతన ప్రతిపాదన అధికార గులాబీ పార్టీకి కొంత మింగుడు పడని అంశంగానే చెప్పవచ్చు. 


–  ఘాటుగానే లీడర్లకు రాహుల్​ వార్నింగ్​ 


కాంగ్రెస్​ పార్టీ పద్ధతికి భిన్నంగా నాయకులు బహిరంగంగా మీడియాలో విమర్శలు చేస్తే ఊరుకునేది లేదంటూ ఎన్నడూ లేని విధంగా రాహుల్​గాంధీ పార్టీ లీడర్లకు గట్టి వార్నింగ్​ ఇచ్చారు. భిన్నాభిప్రాయాలను పార్టీ గౌరవిస్తుందని చెబుతూనే పార్టీ పరువు రోడ్డున పడితే సహించేదిలేదంటూ అల్టిమేటమ్​ జారీ చేశారు. ఇక పార్టీ టికెట్​ల వ్యవహారం కూడా కుండబద్దలు కొట్టారు. ఎంత అనుభవం, ఎంతటి సీనియారిటీ ఉన్న  ప్రజల్లో ఉండే పలుకుబడి వారితో అంటిపెట్టుకునే తీరును బట్టి మాత్రం ఈ దఫా టికెట్​లు కేటాయిస్తామంటూ తేల్చిచెప్పారు. హైదరాబాద్​లోనో, ఢిల్లీలోనో కూర్చునే వారికి రానున్నకాలంలో గడ్డుపరిస్థితి తప్పదంటూ హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ ఆకాంక్షలను ప్రతిఫలించే విధంగా పార్టీ పనిచేయాలని, పార్టీకి దూరంగా ఉన్న యువతను, విద్యార్ధి, నిరుద్యోగులను పార్టీ వైపు సమీకరించాలని కలిసి కొట్టాడుదామంటూ కేసీఆర్​ కుటుంబ అక్రమార్జనతో పాటు అధికారాన్ని తుదముట్టిద్దామంటూ దిశానిర్ధేశం చేశారు. 

ఏదైనా చెల్లుబాటవుతోందనే అభిప్రాయంతో ఉన్న కొందరు పార్టీ నాయకులకు సీరియస్​ వార్నింగ్​ ఇచ్చినట్లుగానే భావించాలి. ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడే వారికే ప్రాధాన్యత ఉంటుందని తేల్చిచెప్పారు. ఇదిలా ఉండగా జాతీయ స్థాయి నేతగా ఉన్న రాహుల్​ను ఉస్మానియా విద్యార్ధులతో ములాఖత్​కాకుండా అనుమతి రాకుండా చేసిన విషయం తెలిసిందే.ఈ విషయంలో నిరసన తెలియజేసి జైలు పాలైన ఎన్​ఎస్​యుఐ నేతలను స్వయంగా జైలుకు వెళ్ళి కలవడం ఒక విధంగా వారిలో కొత్త ఆత్మస్థైర్యాన్ని నింపుతోందని చెప్పవచ్చు. రాహుల్​ కొత్త అడుగులు పార్టీకి నూతనోత్తేజాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. 


–  ఉలిక్కిపడిన గులాబీ శిబిరం 


రాహుల్​ రైతు సంఘర్షణ సభకు ముందు నుంచే పథకం ప్రకారం గులాబీ నేతలు విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ఎందుకో ముందు నుంచే ఒకింత అభద్రత ఆ పార్టీ నేతల్లో స్పష్టమైంది.  పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్​ కేటీఆర్​, మంత్రులు నిరంజన్​రెడ్డి, ఎర్రబెల్లి, నాయకులు సుమన్​, పల్లా రాజేశ్వర్​రెడ్డిలు వరుసగా దాడిని కొనసాగించారు.  ఇక వరంగల్​లో శుక్రవారం రాత్రి సభ ముగిసిందో లేదో గులాబీ లీడర్లు విరుచుకపడుతున్నారు. ఊహించని స్థాయిలో ఈ సభకు జనం హాజరుకావడం టీఆర్​ఎస్​ నేతలు జీర్ణించుకోలేక పోయారేమోనని భావిస్తున్నారు. కడుపుమంటను ఆపుకోలేక రాత్రికి రాత్రే ఆ పార్టీ నేత కేటీఆర్​ ట్విట్టర్​ వేదికగా విమర్శలు చేయగా ఆగమేఘాల మీద మంత్రి ఎర్రబెల్లి రాత్రి 9గంటలకు మీడియా సమావేశం పెట్టి మరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక శనివారం అయితే ఆ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్​, మంత్రి కేటీఆర్ వరంగల్​ పర్యటనలో అభివృద్ధి సంక్షేమం కంటే రాహుల్​ ప్రసంగం పై విమర్శలు చేయడానికే ప్రాధాన్యతనిచ్చినట్లు భావిస్తున్నారు. కాంగ్రెస్​ సభ తెల్లారే ఆయన పర్యటన ఏర్పాటు చేసుకోవడం సభ సక్సెస్​ జోష్​ నుంచి ప్రజలను దారి మళ్ళించేందుకేననే అభిప్రాయం ఉంది. ఇక మరో మంత్రి శ్రీనివాస్​ యాదవ్​ కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అంటూ మాట్లాడాన్ని చూసి నవ్వుతున్నారు. కొట్టిన తెలంగాణవాదులు అంటే బాగుంటుందని సెటైర్​వేస్తున్నారు. విచిత్రమేమిటంటే తెలంగాణ ఉద్యమం, కొట్లాడి తెచ్చుకున్నామని చెప్పే ఈ మంత్రులు, నేతలు ఉద్యమకాలంలో ఎక్కడున్నారనే చిక్కుప్రశ్నను ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు. టీఆర్​ఎస్​ ఎంత ఈ విషయాలను పక్కదోవపట్టించాలని యత్నించినా ఒక విధంగా కాంగ్రెస్​లో ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులున్నారని చెప్పవచ్చు. ​​ఏమైనా తెలంగాణలో కాంగ్రెస్​ పనైపోయిందని అవాకులు చెవాకులు పేలుతూ అవహేలన చేస్తున్న అధికార గులాబీ పార్టీకి రైతు సంఘర్షణ సభ ఒకింత షాక్​నిచ్చిందని చెప్పవచ్చు.  గాంధీ భన్​ మీటింగ్​, జైలు సందర్శనలు సైతం గులాబీ ‘అధిష్టానికి’ సవాల్​గా మారినట్లు భావిస్తున్నారు. 


–  కాంగ్రెస్​ పై బీజేపీ నేతల సెటైర్​లు 


కాంగ్రెస్​ సభ సక్సెస్​తో పాటు రాహుల్​ ఉపన్యాసం పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ స్పందిస్తూ సెటైర్​లు వేశారు. ప్రగతిభవన్​  స్క్రిప్ట్​ను రాహుల్​ చదివారని అంటున్నారు. వాస్తవానికి గత ఎనిమిదేళ్ళుగా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్​ఎస్​ అధికారంలో ఉన్నది అందరికీ తెలిసిన బహిరంగ సత్యమే. ఈ ఎనిమిదేళ్ళకాలంలో రాష్ట్రంలో కాంగ్రెస్​ను బలహీన పరిచే ప్రయత్నాలు కేసీఆర్​ బహిరంగంగానే చేశారనడంలో ఎలాంటి అనుమానం అవసరంలేదు. ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను తమ పార్టీలో రెండు పర్యాయాలు చేర్చుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని బీజేపీ నాయకులే మాట్లాడుతూ కాంగ్రెస్​ ఎమ్మెల్యేలను కాపాడుకోలేదని విమర్శిస్తుంటారు. మళ్ళీ ఆ పార్టీ నాయకులే కాంగ్రెస్​, టీఆర్​ఎస్​ ఒక్కటని ఆరోపించడం గమనార్హం. వాస్తవానికి ఈ ఎనిమిదేళ్ళ కాలంలో టీఆర్​ఎస్​, బీజేపీ మధ్య సయోధ్య, సఖ్యత కన్పించిందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇటీవల ఇద్దరి మధ్య పొసగనట్లు మాట్లాడుతున్నా ఇప్పటికీ ఈ రెండు పార్టీల తీరుపై అనుమానాలున్నాయనేది వాస్తం. ఇక వరంగల్​ రైతు డిక్లరేషన్​పై చర్చించకుండా వాటి అమలు పై చిత్తశుద్ధి ప్రదర్శించకుండా ఆ పార్టీ నేత ఈటెల రాజేందర్​ మాట్లాడుతూ ఇవన్నీ ఆచారణ సాధ్యం కాని హామీలంటూ కొట్టిపారేయడం గమనార్హం. 


–  అధికారానికి మింగుడు పడని కాంగ్రెస్​ తీరు


కాంగ్రెస్​ పార్టీలో కొత్త నడత, నడవడిక, వార్నింగ్​లు, భారీ సభలు, ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు, ప్రజలను గెలుచుకునేందుకు తాపత్రయం ఇవన్నీ అటు గులాబీ శిబిరాన్ని, ఇటు బీజేపీ శిబిరాన్ని ఒక కుదుపుకుదిపినట్లు భావించవచ్చు. ఇంకో వైపు టీఆర్​ఎస్​, బీజేపీలతో దోస్తానా చేస్తున్న కాంగ్రెస్​ నాయకులెవరైనా ఉంటే నిస్సంకోచంగా పార్టీ నుంచి వెళ్ళిపోవచ్చంటూ ఆ పార్టీ అధినేత రాహుల్​ బహిరంగంగా ప్రకటించడం ఇబ్బందిగా మారింది. అయితే రైతు సంఘర్షణ సభ, రాహుల్​ తీరు, పార్టీ రాష్ట్ర నాయకత్వం కనబరిచిన ఐక్యత, ప్రజల ముందుకు తెస్తున్న ప్రతిపాదనలు వెరసి కాంగ్రెస్​ నాయకులు, శ్రేణుల్లో మాత్రం గట్టి విశ్వాసాన్ని కల్పించాయనడంలో సందేహం లేదు. అయితే అధిష్టానం అడుగులో అడుగువేస్తూ అధికారాన్ని ఎలా సాధిస్తారనేదే పీసీసీ నాయకుల మీద ఉన్న గురుతర కర్తవ్యం. 

Relative Post

Newsletter