హ్యాట్రిక్​ కోసం మోడల్​ పాలీ‘ట్రిక్స్​’




దేశ రాజకీయ తెరపైకి ‘తెలంగాణ’ అభివృద్ధి  నమూనా

– కేసీఆర్​ రాజకీయ వ్యూహం

– పాత ఎత్తుకు సరికొత్త రంగు 

– రాష్ట్రంలో అధికార రక్షణ లక్ష్యం

– ముందస్తు రాజకీయ ప్రణాళిక 


వేకువ ప్రత్యేక ప్రతినిధి: దేశంలో ఉన్న పాత విధానానికి సరికొత్త రంగులు రంగరించి టీఆర్​ఎస్ అధినేత కేసీఆర్​ జాతీయ రాజకీయ రంగమెక్కారు.  ఎప్పటి నుంచో అమల్లో ఉన్న మోడల్​ పాలిటిక్స్​కు కాస్తంత ఆకర్షణీయ అద్దకాలు చేసి ఆయన ఏకపాత్రాభినయం చేస్తున్నారు. ఒక విధంగా ఎంతో అనుభవం ఉన్న నేత కేసీఆర్​ కొత్త తరానికి ఐకాన్​గా మారిన  పీకేలాంటి ఫక్తు ఎన్నికల వ్యూహకర్తల తోడు అవసరమైందంటేనే  తాజా పరిస్థితిని అంచనా వేయొచ్చు.  ఇరువురి సమ్మిళిత స్ట్రాటజీతో ఈ కొత్త అవతారమెత్తారు. బంగారు భారతదేశం, దేశ రాజకీయాల్లో భాగస్వామ్యం అంటూ ఎన్నెన్ని ఘాటైన మాటలు మాట్లాడుతున్నా కేసీఆర్​ ప్రధాన లక్ష్యం  రాష్ట్రంలో మూడో పర్యాయం టీఆర్​ఎస్​ అధికారంలోకి రావడం. అందుకే ఆయన ద్విముఖ వ్యూహం, బహుముఖ ఎత్తుగడలతో దేశరాజకీయాల్లో కేంద్రబిందువు కావాలనుకుంటున్నారు. కానీ, ఆయన దృష్టంతా రాష్ట్రంలో గులాబీ ఆధిపత్యాన్ని కాపాడుకోవడం. ఇదిలా ఉండగా కేసీఆర్​ ఏకచత్రాధిపత్యానికి రాష్ట్రంలో బలహీనమైన ప్రతిపక్షాల స్థితి తోడైంది. ముఖ్యంగా తక్షణం అధికారంలోకి రావాల్సిన స్థితిలో ఉన్న కాంగ్రెస్​ను తొక్కేయడంలో కేసీఆర్​ సక్సెస్​ అయ్యారు. అందుకే ప్రతిపక్షాలు  గొంతు సవరించుకుని తిరిగి అధికారంలోకి రాకముందే తనకు అనుకూలమైన ‘వాతావరణాన్ని’ సృష్టించి ఆ కాస్తా సమయంలోనే తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవాలనే అత్యంత జాగ్రత్తగా కేసీఆర్​ పావులు కదుపుతున్నారు. ఈ విషయంలో కేసీఆర్​ గత ఆచరణ పరిశీలిస్తే ఇట్టే తేలిపోతుంది. ఈ విషయంలో కేసీఆర్​ దిట్ట. అదే పాచికను మరోసారి వేశారు.  

  రంగంలో  మోడల్​ ‘పాలీ’టిక్స్​ 

గులాబీ వ్యూహంలో భాగంగా మోడల్​ పాలిటిక్స్​ను తెరపైకి తెచ్చారు.  ఇదేం కేసీఆర్​ సొంతం కాదు. గతంలో దేశంలో  ఉన్న పాత పద్ధతే. కాకుంటే పరిస్థితులు కొంత తారుమారయ్యాయి.  గాంధీ శకం, నెహ్రుకాలం,  ఇందిరా ఇండియా అంటూ దేశం ఈ అనుభవాలను చవిచూసింది. లక్ష్యాలేమైనా వ్యక్తుల పాత్ర ప్రధానంగా రాజకీయాలు, అధికారం చక్కర్లు కొట్టింది.  మూడు దశాబ్దాల్లో కాస్త మార్పు వచ్చింది.  వాజ్​పేయి అధికారంలో ఉన్న కాలంలోనే కొత్త పద్ధతికి బీజం వేసినా మోడీ అధికారంలోకి వచ్చేసరికి పరిస్థితుల్లో  పూర్తి మార్పు వచ్చింది. అందుకే ముందుగా వ్యక్తుల స్థానంలో  ‘గుజరాత్​’ మోడల్​ను తెరపైకి తీసుకొచ్చారు. గుజరాత్​ మోడల్​తో ​ ఆకర్షించి అధికారం దక్కి పట్టును పెంచకోగానే అది కాస్తా మోడీ మోడల్​గా మారిపోయింది.  అంటే మళ్లీ వ్యక్తి ప్రాధాన్యంగా మార్చేశారు. 

 ముందు నుంచీ అధికార బాట

తెలంగాణ ఉద్యమ ఆరంభం నుంచి కేసీఆర్​, వ్యక్తి విధానాన్ని అనుసరిస్తూ సమిష్టి ఆందోళనకు తానే ఏకైక కారకున్ని అనేతీరుగా తన చుట్టు తిప్పుకున్న అనేక విషయాలు అందరి అనుభవంలోని విషయాలే. అప్పట్లో ఈ విషయం చర్చకు వచ్చినప్పటికీ రాష్ట్ర సాధన లక్ష్యం ముందు అందరూ  దీన్ని పక్కకు పెట్టారు. తీరా రాష్ట్రావిర్భావం కాగానే టీఆర్​ఎస్​ను ‘ఫక్తు రాజకీయ పార్టీ’ అంటూ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచి తన వాస్తవ రూపాన్ని తేల్చిచెప్పారు. ఉద్యమంలో నిజాయితీగా పాల్గొన్న అనేక మంది తేరుకునేలోపే అంతా ఆయన గులాబీపరం చేసుకున్నారు.  మేధావులూ, మహా ఉద్యమకారులూ, వందేళ్ళ కాంగ్రెస్​ నేతలు సైతం తెల్లముఖమేశారు. ఆకాంక్ష పరులంతా ఇప్పుడెక్కడున్నారో?  కేసీఆర్​ ఎక్కడ పెట్టారో? బహిరంగ సత్యం. 

  రెండు పర్యాయాలు సెంటిమెంట్​ 

తొలిసారి అధికారంలోకి వచ్చేందుకు ‘ తెలంగాణ – కేసీఆర్​’  అనే సెంటిమెంట్​ లింక్​చేసి వినియోగించుకున్నారు.  రెండో పర్యాయం ఆంధ్రా పార్టీ టీడీపీతో పొంచి ఉన్న కుట్రను ముందుపెట్టి అధికారాన్ని కాపాడుకున్నారు. మూడో సారి అధికారంలోకి రావడం అంత సులువైన అంశం కాదని అందరికంటే ఎక్కువగా కేసీఆర్​కు తెలుసు. అందుకే జాతీయ రాజకీయ రంగ ప్రవేశం మంటూ ద్విముఖ వ్యూహంతో అడుగులేస్తున్నప్పటికీ  రాష్ట్రంలో అధికార రక్షణ ఆయన తొలి లక్ష్యం. అందుకే పాత మోడల్​ పాలిటిక్సుకు కొత్త రంగులద్దారు. అందుకే తెరపైకి  ‘తెలంగాణ మోడల్​’ను తెచ్చారు. ఈ మోడల్​ వల్ల జాతీయ రాజకీయాల్లో అభివృద్ధి నమూనాను ముందుపెట్టి ఆకర్షించడం ఒక కారణమైతే... రాష్ట్రం బంగారు తెలంగాణగా మారిపోయిందనే  భ్రమల్లో ముంచెత్తడం ఆయన లక్ష్యం.  రాష్ట్రంలో ప్రజాకాంక్షలు, విపక్ష గొంతుకు అవకాశం చిక్కకుండా, ఆ శక్తులు మేల్కొని తమ స్వరం పెంచేలోపు తన రాజకీయ చతురతతో అధికారాన్ని చేజిక్కించుకునే ఎత్తుగడతో వేగంగా పావులు కదుపుతున్నారు. 

  తెరపైకి తెలంగాణ మోడల్​ 

కేసీఆర్​  అనే ఆయన మాటల స్థానంలో ‘తెలంగాణ’ మోడల్​ను ప్రజెంట్​ చేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఈ పథకాలున్నాయా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలో కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ రైతుబంధు ఉందా? దళిత బంధు ఉందా? కేసీఆర్​ కిట్​ అమలు చేస్తున్నారా? కళ్యాణ లక్ష్మీ ఎక్కడ అమలైతున్నదీ.? కాళేశ్వరం ప్రాజెక్టులాంటి నిర్మాణం చేశారా? అంటూ ప్రశ్నలు వేస్తూ సాగుతున్నారు. ఈ సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు ఎంతోకొంత ఉపకరిస్తున్నా....‘అవినీతి’  కేసీఆర్​ పాలన అనే ప్రతిపక్ష ప్రశ్నకు ఆస్కారం లేకుండా విమర్శను తనకు అనుకూలంగా మలుచుకుని ‘తానేమీ చేసినా మోడల్​’ అనే తీరుగా వ్యవహరిస్తూ గందరగోళపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్​ పార్టీ కేంద్రంలో అధికారంలో లేనందున నాయకత్వ బలహీనతలను విమర్శిస్తూ ‘హేళన’ చేసే ఎత్తుగడను అమలు చేస్తున్నారు. 

  కేసీఆర్​ ముందు జాగ్రత్త ప్రణాళిక

కేసీఆర్​ ఇటీవల మాటలూ, ప్రెస్​మీట్లూ, భారీ బహిరంగ సభలూ, జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళేందుకు చెబుతున్న మోడల్​ అంతా పక్కా ప్రణాళికలో భాగం. తాజాగా పారిశ్రామిక వేత్తల సమావేశంలో సైతం తనయుడు కేటీఆర్​ రాష్ట్ర పారిశ్రామిక మోడల్​ను వివరించే ప్రయత్నం చేశారు. మొత్తంగా రాష్ట్రంలోని ప్రజాకాంక్షలూ, ప్రతిపక్ష గొంతు సంఘటితమై సవాల్​ చేయకముందే తన ప్రయోజనం పొందేందుకు చెమటోడుస్తున్నారు. ఈ మొత్తం పథకంలో స్వామి కార్యం, స్వకార్యమన్నట్లూ రాష్ట్రంలో మూడో సారి అధికారంలోకి రావడం, జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యం పొందడమనే ద్విముఖ వ్యూహంతో పాచికలు విసురుతున్నారు. గత ఎనిమిదేళ్ళలో కేసీఆర్​కు అవసరమైన అన్ని ‘వనరులు సమకూరాయనడంలో సందేహంలేదు. ఒక విధంగా ఆయనకు జరిగే నష్టమేమీలేదు. మూడో సారి రాష్ట్రంలో  టీఆర్​ఎస్​ గెలిచినా....కేంద్రంలో ప్రాధాన్యం పెరిగినా....కేసీఆర్​కు అదనపు లాభంగానే చెప్పవచ్చు.

Relative Post

Newsletter