తెరపైకి తెలంగాణ ‘ఉద్యమస్ఫూర్తి’
తెరపైకి తెలంగాణ ‘ఉద్యమస్ఫూర్తి’
– చర్చకు వచ్చిన సమిష్టి పోరు
– అమరుల త్యాగాల స్మరణ
– మోడీ వ్యాఖ్యల పై ఆగ్రహం
– కాంగ్రెస్ తీవ్ర ప్రతిస్పందన
– గొంతువిప్పిన టీఎన్జీవోలు
– ఆత్మరక్షణలో బీజేపీ నేతలు
వేకువ ప్రత్యేక ప్రతినిధి:
ఎవరి రాజకీయ లక్ష్యాలేవైనా? తెరవెనుక కారణమేదైనా! ఏడున్నరేళ్ళుగా తెలంగాణలో ఏకపక్షంగా ప్రతిధ్వనింపచేస్తున్న ‘తెలంగాణను నేనే కొట్లాడి తెచ్చిన’ అనే ఏక వ్యక్తి సంకీర్తన వ్యాఖ్యల స్థానంలో ‘సమిష్టి ఉద్యమ’ ఫలితమనే ప్రతిస్పందన ఒక్కసారిగా వ్యక్తమవడం గమనార్హం. ఎలా? ఇచ్చిందనేది పక్కన పెడితే రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇస్తేనే సాధ్యమైందనీ చెప్పకనే చెబుతున్నారు. లెక్కల్లో అటుఇటూ తేడా ఉన్నా దాదాపు 1200 మంది అమరుల బలిదానాల ఫలితమని ఈ సందర్భంగా నొక్కి చెబుతున్నారు. చాలా కాలానికి అమరులూ, త్యాగ ఫలం, ఉద్యమం, అప్పటి రాజకీయ నిర్ణయాలు చర్చకు రావడం విశేషం. ప్రధాని మోడీ రాజ్యసభలో రాష్ట్ర విభజన, తెలంగాణ ఏర్పాటు అంశం పై మాట్లాడిన వ్యాఖ్యల ఏ నేపథ్యం పుణ్యమా అంటూ మరోసారి తెలంగాణ ఉద్యమ స్పూర్తి సర్వత్రా వ్యక్తమైంది. బిన్న పార్టీలు ఏక గొంతుకతో మాట్లాడుతున్నారు. మరుగు పరిచే యత్నం చేస్తున్న చరిత్రను తెరపైకి తీసుకొస్తున్నారు.
– తెలంగాణ సమిష్టి ప్రతిస్పందన
ప్రధాని మోడీ రాజ్యసభలో తెలంగాణ పట్ల చేసిన వ్యాఖ్యల పట్ల ఆనాటి ఉద్యమ శక్తుల నుంచి తీవ్ర ప్రతిస్పందన వ్యక్తమైంది. ఉద్యమకాలంలో క్రియాశీలకంగా పాల్గొన్న పక్షాలు, భాగస్వామ్య సంఘాలు, కీలక పాత్ర పోషించిన నేతలు ఒకింత తీవ్రంగానే విమర్శిస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్, తెచ్చిన టీఆర్ఎస్, ఐక్య ఉద్యమానికి నాయకత్వ పాత్ర పోషించిన కోదండరామ్, తెలంగాణ జన సమితి, చివరికి క్రియాశీల పాత్ర పోషించిన టీఎన్జీవో నాయకులు, ఉస్మానియా విద్యార్ధులతోపాటు మోడీని ప్రశ్నించే శక్తులంతా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, అమరుల త్యాగాలు ఆనాటి ప్రత్యేక పరిస్థితిని మరోసారి ఏకరువు పెట్టారు.
– కాంగ్రెస్ తీవ్ర విమర్శలు
కాంగ్రెస్ వల్ల రాష్ట్రం సాధ్యమైందని మోడీ వ్యాఖ్యల నేపథ్యంలో తేలిపోయిందని ఆ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రధాని మోడీ తెలంగాణ పట్ల వ్యతిరేక భావంతో వ్యవహరిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో సహా కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా విరుచుకపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ పెద్ద ఎత్తున నిరసలు చేపట్టారు. మోడీ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ఉద్యమకాలమంతా జేఏసీకి నాయకత్వం వహించిన కోదండరామ్ మాట్లాడుతూ మోడీ వ్యవహారశైలిపై మండిపడ్డారు. నిరసనలు చేపట్టారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఇతర శక్తులు సైతం ఇదే రీతిలో ప్రతిస్పందించారు. ఇదిలా ఉండగా అధికార టీఆర్ఎస్ పార్టీ రాత్రికి రాత్రే రంగం సిద్ధం చేసి ర్యాలీలు, నిరసనలు, ఆఖరికి మోడీ దిష్టిబొమ్మలను దగ్దం చేసే కార్యక్రమాన్ని ఆగమేఘాల మీద చేపట్టింది. మరోసారి తెలంగాణ క్రెడిట్‌ను కాంగ్రెస్‌కు దక్కనీయకుండా గులాబీ పక్షాలు ముందు వరుసలోకి వచ్చాయి.
– కేసీఆర్ మౌన స్పందన
ఆకస్మికంగా రంగంలోకి దిగి ‘భారీ బహిరంగ సభలు, సుదీర్ఘ మీడియా సమావేశాలు’ నిర్వహించే టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మాత్రం ఇంకా తెరవెనుకే ఉన్నారు. ఇంకా రంగంలోకి దిగలేదు. అయితే ఈ నెల 11న జనగామలో భారీ బలప్రదర్శన చేస్తున్న నేపథ్యంలో ఈ సభలో మరోసారి కేసీఆర్ తనదైన తీరులో విరుచుకపడే అవకాశాలు మాత్రం లేకపోలేదు. మోడీ రాష్ట్ర పర్యటనకు గైర్హాజరు, రాజ్యాంగం అంశంతో పాటు తాజా మోడీ వ్యాఖ్యాల నేపథ్యంలో ఆయన స్పందించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే తెలంగాణ క్రెడిట్ ఇతరపక్షాలకు వస్తే తట్టుకునే పరిస్థితిల్లో తాజా రాజకీయ వాతావరణం కూడా లేదు.
– అమరులను కీర్తిస్తున్న బీజేపీ
మోడీ కారణంగా సమాధానం చెప్పాల్సిన స్థానంలోకి నెట్టివేయబడిన రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా ఈ అంశాలను భిన్న రూపంలో తెలంగాణ అమరుల త్యాగాల వల్ల ఏర్పడిందని చెప్పడం గమనార్హం. కాగా, బీజేపీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పటికీ ఇచ్చిన తీరు పట్ల విమర్శిస్తున్నారు. కాంగ్రెస్‌ను ప్రధాని తిడితే మిగిలిన వారికేం నొప్పంటూ ఎదురుదాడి చేస్తున్నారు. వందలాది మంది యువకుల ప్రాణాలు బలిగొని రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. రాష్ట్రం కోసం టీఆర్ఎస్ కొట్లాడినప్పటికీ కేసీఆర్‌కు నిజాయితీలేదని తన ఒక్కరి వల్ల సాధ్యంకాలేదని, సమిష్టి ఉద్యమ ఫలితంగానే సాధ్యమైందని ఈ సందర్భంగా మాట్లాడుతున్నారు.
– చరిత్ర చాటిన చేదు నిజం
అనివార్య సందర్భాల్లో ‘చరిత్ర తనను తాను తవ్వకుని తలెత్తుకుని తన ఉనికిని’ ప్రదర్శిస్తుందని మరోసారి తాజాగా రుజువైంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకోపోయినా ఎవరో ఒకరిద్దరి వల్ల తెలంగాణ రాష్రం సాధ్యం కాలేదని ఈ సందర్భంగా మరోసారి చర్చకు రావడం గమనార్హం. ఈ సమిష్టి ఉద్యమ సానుకూల వాతావరణం, ఉద్యమ అంశాలను నెమరువేసుకునే పరిస్థితి ఎంత కాలం చర్చలో ఉంటాయనేది సందేహాస్పదమే. అయినప్పటికీ ప్రజల మనోఫలకంలో ముద్రవేసుకున్న దృశ్యాలను మరోసారి ముందుకు తీసుకొచ్చాయనడంలో సందేహం లేదు.
– ఆత్మరక్షణలో రాష్ట్ర బీజేపీ
దశాబ్దాల పోరాట ఫలితాన్ని ‘వ్యక్తిగత శ్రమ, త్యాగ ఫలితం’గా మార్చిన ఘనాపాటీలున్న సందర్భంలో తెలంగాణ ఉద్యమాభిమానుల అత్యాశ సరైంది కాదేమో? ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన శక్తులను విభజించి, పాలించు నీతితో ఏకం కాకుండా చేసిన ఎన్నో ప్రయత్నాలు, తెరవెనుక కుట్రలు అమలు చేసిన విషయాలను తాజాగా మరోసారి గుర్తుచేస్తున్నారు. ఏదిఎలా ఉన్నా ఎవరి రాజకీయ ప్రయోజనాలేవైనా, భిన్న వాదనలెన్ని ఉన్నప్పటికీ కళ్ళముందు జరిగిన వాస్తవాలను ఎవ్వరూ చాలాకాలం తెరమరుగు చేయలేరని అంటున్నారు. మరుగు పరిచిన ఆ నిజాలే కువిమర్శలకు తగిన సమాధానం చెబుతాయని తాజా పరిస్థితి తేల్పిచెబుతున్నది. ఎవరి రాజకీయ క్రీడలేమైనా ఒక్కసారిగా మళ్ళీ తెలంగాణ ఉద్యమ శక్తులు తమ అభిప్రాయాలను సమిష్టిగా తెలియజేయడంతో ప్రధాని వ్యాఖ్యలను సమర్ధించుకునేందుకు బీజేపీ లీడర్లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఒక విధంగా ఆ పార్టీ నాయకులు ఆకస్మికంగా ఆత్మరక్షలో పడిపోయారు.