బడ్జెట్ తీరు మారాల్సిందే...
బడ్జెట్ తీరు మారాల్సిందే...
బడ్జెట్ కాకి లెక్కలేనా..
మేధావులు, ఆర్థిక నిపుణులు ఆందోళన
కేటాయింపులు సమగ్రంగా..సక్రమంగా ఉండడం లేదా... అలాగే దాని స్వరూపం మారుతోందా..కేవలం అంకెల గారడీ తప్ప దేశ భవిష్యత్ దర్శనం కనిపించడం లేదా..మేధావులు, ఆర్థిక నిపుణులు ఆందోళన చెందడంలో అర్థం ఉందా..! రాజకీయ నాయకుల పెదవి విరుపుల వెనక బలమైన కారణాలు ఉన్నాయా.. అంటే సర్వత్రా ఔననే వినిపిస్తోంది.
బడ్జెట్ ద్వారా లెక్కలు అప్పగించడం తప్ప మరోటి కానరావడం లేదు. దేశంలో అభివృద్ది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది. రాష్టాల్రను విశ్వాసంలోకి తీసుకోవడం లేదు. రాష్టాల్ల్రో అభివృద్ది కార్యాక్రమాలు ముందుకు సాగడం లేదు. కేటాయింపులు అరకొరగా ఉంటున్నాయి. నిరుద్యోగం తాండవిస్తోంది. వ్యవసాయం పడకేస్తోంది. రైతులు రోడ్డెక్కినా వారికి న్యాయం దక్కడం లేదు. విద్య,వైద్యం ఖరీదైనదిగా మారింది. ఈ క్రమంలో బడ్జెట్ స్వరూపం మారాల్సి ఉంది. మొక్కుబడిగా కాకుండా దేశ జనాభా, రాష్టాల్రు, అవసరాలు, నిధులను బేరీజు వేసుకుని కార్యక్రమాలు రూపోందించేలా బడ్జెట్ రూపకల్పన జరగాలి. ప్రధానంగా మౌళిక వసతుల కల్పన, అభివృద్ది తదితర అంశాలను ముందుకు తీసుకుని వెళ్లేలా బడ్జెట్ రూపకల్పన జరగడం లేదు. 75 ఏళ్ల స్వాతంత్య్రం తరవాత కూడా నేటికీ విద్యుత్, వైద్యం, విద్య, రోడ్లు వంటి మౌళిక వసతుల కల్పన అంతంత మాత్రంగానే ఉంది. బడ్జెట్‌తో సంబంధం లేకుండా ప్రజలు తమ మానానా తాము జీవిస్తున్నారు. తాము మిగతా పార్టీలకన్నా భిన్నమని చెప్పుకున్న ప్రధాని మోడీ..చేతల్లో మాత్రం ఎలాంటి కొత్తదనం చూపలేకపోయారు. నేలవిడిచి సాముచేస్తున్న తీరు కళ్లకు కడుతోంది. మాటల గారడీ తప్ప మరోటి గోచరించడం లేదు. పేర్లు మార్చడం..పథకాలకు కొత్త పేర్లు పెట్టడం మినహా ఒరిగిందేవిూ లేదు. పేద మద్య తరగతి ప్రజల జీవనం దుర్భరంగా మారింది. బంగారం ధరలు పెరుగుతున్నాయి. సొంతింటి కల కల్లగా మారింది. ఇల్లు కొందామంటే జిఎస్టీ వాయింపులు భారీగా ఉన్నాయి. పేదలు స్వయంగా తమ జీవనం గడుపుకునే పరిస్థితి లేకుండా పోయింది. బ్యాంకులు సామాన్యులకు అందుబాటులో లేవు. ఈ సమస్యలన్నీ తీర్చాలన్న సంకల్పం ప్రభుత్వానికి లేకుండా పోయింది. 2014 సంవత్సరంలో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు.. ఫిబ్రవరి నెల చివరి తేదీ లేదా ఫిబ్రవరి 28 లేదా 29 తేదీల్లో బడ్జెట్‌ను సమర్పించేవారు. అయితే మోడీ ప్రభుత్వం ఈ సంప్రదాయాన్ని మార్చివేసి.. ఫిబ్రవరి నెలాఖరుకు కాకుండా ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టడం ప్రారంభించింది. ఇదో మార్పుగా గమనించాలి. ఇకపోతే రైల్వే బడ్జెట్‌ను మొత్తంగా ఎత్తేశారు. సాధారణ బడ్జెట్‌లో రైల్వే బడ్జెట్‌ను విలీనం చేశారు. ఇదో మార్పుగా మనం చూడాలి. నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేశారు. సంప్రదాయాలను మార్చే రేసులో నరేంద్ర మోదీ ప్రభుత్వం ముందు ఉంటోందనడానికి ఇదే నిదర్శనం. 1924 నుంచి కొనసాగుతున్న రైల్వే బడ్జెట్ సంప్రదాయాన్ని 2016లో మార్చివేసింది. 2016కి ముందు సాధారణ బడ్జెట్‌కు కొన్ని రోజుల ముందు రైల్వే బడ్జెట్‌ను ప్రత్యేకంగా సమర్పించేవారు. అయితే ఈ బడ్జెట్ వల్ల ప్రజలకు లేదా రాష్టాల్రకు కూడా ఒరిగిందేవిూ లేదు. కేవలం రైల్వేల మంత్రులు తమ రాష్టాల్రకు కొన్ని కేటాయింపులు తప్ప మరోటి సాధించలేదు. రైల్వేలను పటిష్టం చేసే ప్రక్రియ మోడీ హయాంలోనూ కలగడం లేదు. 2016లో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రైల్వే బ్జడెట్‌ను సాధారణ బడ్జెట్‌తో పాటు రైల్వే బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టారు. ఇకపోతే చరిత్రలోని సంప్రదాయాలను పరిశీలిస్తే 1947 నుంచి దేశ సాధారణ బ్జడెట్‌ను పార్లమెంటులో సమర్పించేందుకు ఎరుపు రంగు బ్రీఫ్‌కేస్ వినియోగించేవారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2019 సంవత్సరంలో ఈ సంప్రదా యాన్ని మార్చివేసింది. అప్పటి నుంచి ఎరుపు బ్రీఫ్‌కేస్‌కు బదులుగా బడ్జెట్‌ను ఎర్రటి గుడ్డలో చుట్టి, లెడ్జర్ రూపంలో తీసుకువస్తున్నారు.
వాజ్‌పేయి ప్రభుత్వంలోనూ..నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ముందు బిజెపి నేతృత్వంలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం కూడా బడ్జెట్‌కు సంబంధించిన పాత సంప్రదాయాన్ని మార్చివేసింది. 1999కి ముందు అన్ని బడ్జెట్‌లు సాయంత్రం ఐదు గంటలకు సమర్పించేవారు, అయితే 1999లో ఈ సంప్రదాయాన్ని విడిచిపెట్టి, అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా తొలిసారిగా ఉదయం 11 గంటలకు సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఉదయం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతూవస్తున్నారు. మార్పులంటే ఇవి మాత్రమే తప్ప బడ్జెట్ కేటాయింపులు, దేశ విధానాల్లో మాత్రం ఎక్కడా కానరావడంలేదు. ఇకపోతే తాజాగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించిన 2022-23 సంవత్సర బడ్జెట్ ఎలాంటి మెరుపులు, ఆకర్షణలు లేకుండా సాదాసీదాగా ఉంది. బడ్జెట్ అనే కన్నా ఒక ప్రకటన చేసినట్లుగా ప్రసంగం మొత్తం సాగిపోయింది. ఈ ఏడాదైనా తమకు ఏదో ఒరుగుతుందని గంపెడాశలు పెట్టుకున్న ఆయా రాష్టాల్రకు ఖేదం మిగిలింది. అలాగే వేతనజీవికి నిరాశే మిగిలింది. ప్రభుత్వ మద్దతు కోసం చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్న పలురంగాల ఆశలపై నీళ్లు చల్లారు. దేశంలో అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్టాల్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జనాకర్షణ ప్రతిపాదన లు ఉంటాయన్న ఊహాగానాలూ తప్పే అయ్యాయి. ఎవరిపైనా అదనపు వడ్డనలు వేయకపోవడం మాత్రమే కొంత ఊరట కలిగించే అంశంగా చూడాలి. కరోనాతో వైద్యరంగాన్ని మరింత బలోపతేం చేస్తారని అనుకున్నా అలాంటి దాఖలాలు కూడా లేవు. గత కొన్నేళ్లుగా ఐటీ పరిమితి పెంచకపోయినా కనీసం శ్లాబ్‌లలో అయినా మార్పులు చేస్తూ కొంత ఉపశమనం కలిగించారు. ఈ ఏడాది ఆ ప్రయత్నం కూడా జరగలేదు. కరోనా కష్టాల కారణంగా ప్రధాని మోడీ సూచనల మేరకు అదనపు పన్ను ప్రతిపాదనల జోలికి వెళ్లలేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అంటే అవసరమైతే వడ్డించే వారని అర్థంచేసుకోవాలి. తెలంగాణ సిఎం కేసీఆర్ అన్నట్లుగా ప్రభుత్వానికి దూరదృష్టి లేదు. ఆయారంగాలను ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలన్న భవిష్యత్ దృష్టి కానరాలేదు. ఈ బడ్జెట్ తీరు ఇలాగే కొనసాగితే మరో 75 ఏళ్లు గడిచినా భారతదేశ భాగ్యం మారదు. దేశంలో పురోగతి కనిపించదు. సమస్యలపై సమగ్ర దృష్టితో బడ్జెట్ రూపకల్పన జరగాల్సిన అవసరాన్ని అన్ని పార్టీలు గుర్తించాలి.