పార్ల మెంట్ లోనూ ప్రజాస్వామ్యం శూన్యం
పార్ల మెంట్ లోనూ ప్రజాస్వామ్యం శూన్యం
హిందుత్వ ఎజెండా ఏమిటో..., అది అత్యంత ప్రమాదకరంగా ఎన్ని రూపాల్లో దూసుకువస్తున్నదో అందరికీ అనుభవంలోకి వస్తున్నది. సామాజిక జీవనంలో ఇతర మతాలు, కులాల పట్ల తీవ్ర అసహనంగా వ్యక్తమవుతూ.., రాజకీయ ఆధిపత్య రూపంలో మరింత నగ్నంగా ముందుకు వస్తున్నది. ఇన్నాళ్లూ ఆర్ ఎస్సెస్ సంఘ్‌పరివార్ భావజాలాన్ని వ్యతిరేకించే వారిని తప్పుడు కేసులతో నిర్బంధించి జైళ్లలో తోయటంగా ఉన్నది కాస్తా.., ఇప్పుడు విపక్ష కాంగ్రెస్ నేతలను సైతం వదిలేట్లు కనిపించటం లేదు. పార్లమెంటు వేదికగా మోదీని విమర్శించినందుకు.. రాహుల్ గాంధీకి లోక్‌సభ సెక్రటేరియెట్ నోటీసులు జారీ చేసింది. మోదీపై చేసిన విమర్శలపై ఈ నెల 15లోగా సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది!
విమర్శలు, ప్రతి విమర్శల సందర్భంగా... చట్ట సభల్లో ఏవైనా అభ్యంతరకరమైన (అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్) మాటలు ఉంటే రికార్డుల నుంచి తొలగించాల్సిందని కోరటం ఆనవాయితీ. దానికి చట్టసభల నియమాల ప్రకారం.. 380 రూల్ ఉన్నది. వీటన్నింటినీ కాదని సెక్రటెరియెట్ నోటీసులివ్వటం, సమాధానం కోరటం నియంతృత్వానికి నిదర్శనం.
ఈ మధ్యనే కేంద్ర బడ్జెట్ సందర్భంగా... రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్బంలో జరిగిన చర్చల్లో విపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హిండెన్‌బర్గ్ రీసెర్చ రిపోర్ట్ ను ఉటంకిస్తూ ప్రధాని మోదీ పనితీరును తప్పుపట్టారు. పారిశ్రామిక వేత్త గౌతం ఆదానీకి అనుగుణంగా, లబ్ధిచేకూర్చే విధంగా మోదీ పనిచేస్తున్నారని ఆరోపించారు. ప్రతిగా అధికార పక్ష సభ్యులు, మంత్రులు ఆరోపణలకు వివిరణ ఇవ్వటానికి బదులు అదిరింపులు, బెదిరింపులకు దిగుతూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నిజానికి... విపక్ష నేత ఆరోపణలపై బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా ఆ ఆరోపణలను ఖండించటమో, వివరణ ఇవ్వటమో చేయాలి. కానీ ఆ విమర్శలు చేసినందుకు తప్పు చేసినవిధంగా సంజాయిషీ అడగటం ఆధిపత్యవాదానికి ప్రతీక మాత్రమే.
మెజారిటీవాద ఆధిపత్య రాజకీయంతో బీజేపీ ఆర్ ఎస్సెస్ శక్తులు దశాబ్దకాలంగా దేశంలో పెట్రేగి పోతున్నాయి. సామాజిక అసహనానికి అయితే అంతేలేదు. దళిత వెనుకబడిన నిమ్న కులాలపై దేశ వ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తర భారతంలో హింసా దౌర్జన్యాలు నిత్యకృత్యంగా మారాయి. చెరువులో దిగి స్నానం చేసినందుకు అది మలినం అయ్యిందని ఓ యువకుడిని చావబాదారు. దళిత, మైనారిటీ మహిళలపై లైంగిక దాడులు సాధారణమై పోయాయి. యూపీలో ఓ దళిత యువతిని గ్రామంలోని పలుకుబడి కలిగిన వారు ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేశారు. శవం ఉంటే సాక్ష్యాధారాలు ఉంటాయని శవ పంచనామా కాకుండానే, పోస్ట్‌మార్టం చేయకుండానే పోలీసుల పహరాలో కాల్చివేశారు. ఈ ఘటనపై నిజనిర్ధారణకు వెళ్లిన కేరళకు చెందిన జర్నలిస్టును అరెస్టు చేసి దేశ ద్రోహ నేరం మోపి, యూఏపీఏ కేసులు పెట్టి జైల్లో వేశారు. ఒక దేవాలయంలోకి వెళ్లాడన్న కారణంగా 17 ఏండ్ల దళిత యువకుడిని కాల్చి చంపారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఘటనలకు అంతే లేదు.
ఇక మతపరమైన అసహనం అయితే హద్దూ, అదుపూలేకుండా సాగుతున్నది. దానికి అఖ్లాక్ ఉదంతమే ప్రతీక. అఖ్లాక్ తన ఇంట్లో గోమాంసాన్ని నిల్వచేసుకొని తింటున్నాడనీ, కొన్ని రోజుల కింద కనిపించకుండా పోయిన ఆవుదే అది అయి ఉంటుందని అతని ఇంటిపై దాడి చేశారు. అది ఆవు మాంసం కాదని అన్నందుకు అతన్ని ఇంటిబయటికి ఈడ్చుకొచ్చి కొట్టిచంపారు. పవిత్రమైన గోవును చంపటంపై నిషేధం ఉన్నా అఖ్లాక్ ఆవును వధించాడని స్థానిక హిందుత్వవాదులు ఆరోపించారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తూ, అఖ్లాక్ ఇంట్లోని మాంసాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. శాస్త్రీయ రిపోర్టు ప్రకారం.. అది గోమాంసం కాదనీ, అది మేక మాంసమని తేలింది. ఇక గోరక్షకుల పేరిట ముస్లిం మైనారిటీలు, దళితులపై విచ్చలవిడిగా దాడులు చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు. వందలు, వేల సంఖ్యలో దళిత, మైనారిటీలు తీవ్రంగా గాయపడ్డారు, హత్యగావింపబడ్డారు.
గత దశాబ్ద కాలంగా సాంఘిక అణచివేతను కొనసాగించిన హిందుత్వ శక్తులు గ్రామీణ సమాజంపై ఆధిపత్యాన్ని సాధించాయి. మెజారిటీ దళిత మైనారిటీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి గుప్పిట్లో పెట్టుకొని ఎన్నికల్లో గెలుస్తున్న బీజేపీ ఇప్పుడు రాజకీయ శక్తులను సైతం నిర్మూలించేందుకు సమాయత్తమవుతున్నది. దానిలో భాగమే రాహుల్ గాంధీని విమర్శలపై వివరణ కోరటం. ఇప్పటికే... అన్ని వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకొన్న బీజేపీ రాజకీయ రంగంలో కూడా ఏకఛత్రాధిపత్యంగా ఉండేందుకు పావులు కదుపుతున్నది. నియంతృత్వం ఎట్లా ఉంటది.. అంటే... ఇట్లాగే ఉంటదని ఇటీవలి మోదీ ప్రభుత్వ విధానాలు చూపితే... మరో వివరణ అవసరం లేదు.
ఈ నేపథ్యంలోంచే కావచ్చు... ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ పార్క్‌లోని చంద్రశేఖర్ ఆజాద్ విగ్రహం కన్నీరు కారుస్తున్నదన్న ప్రచారం జరుగుతున్నది. కొన్నాళ్ల క్రితమే ఆ పార్కులో ఆజాద్ కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు. ఇప్పుడు ఆ విగ్రహం నుంచి నీరు కారుతున్నది. పార్క్ నిర్వాహకుడు చూసి నీటిని తొలగించి శుభ్రం చేశాడు. మరుసటి రోజు చూసే సరికి తిరిగి నీరు కనిపించింది. పరీక్షించి చూస్తే... ఆజాద్ విగ్రహం నుంచే నీరు కారుతున్నదని వారికి అర్థమైంది. ఇన్నాళ్లూ శివలింగమో, వినాయక విగ్రహమో, వేంకటేశ్వరుని పటమో ఏదో మహిమ ప్రదర్శిస్తున్నదని హంగామా చేసి పూజలు నిర్వహించిన హిందుత్వ వాదులు ఆజాద్ విగ్రహం కన్నీరు కార్చటాన్ని ఏమంటారో... చూడాలి.
-శ్రామిక
.