గులాబీకి గట్టి ఝలక్
గులాబీకి గట్టి ఝలక్
కాంగ్రెస్‌లో చేరిన నల్లాల ఫ్యామిలీ
అధికార పార్టీకి తొలి గండి
వలసల ఆరంభానికి సంకేతమా?
ప్రత్యేక ప్రతినిధి:తెలంగాణలో అధికార పార్టీ గా ఎదురు లేదని భావిస్తున్న టి.ఆర్.ఎస్ కు తొలి సారి గట్టి షాక్ తగిలినట్టు ఉంది. ఇప్పటివరకు ఇతర రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, ఆఖరికి వామపక్షాల నుంచి పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు గులాబీ పార్టీలో చేరిన దృశ్యాలను చూస్తూ వచ్చాము. కానీ తాజాగా ఈ పరిస్థితుల్లో ఏదో మార్పు జరిగినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే తాజాగా అధికార పార్టీ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి.దీంతో ఈ అనే అనుమానం కలుగుతోంది. ప్రస్తుతానికి ఒక జడ్పీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే తన కుటుంబంతో సహా టిఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఒక విధంగా చర్చనీయాంశమే.
తాజా రాజకీయ పరిస్థితులలో ఆశ్చర్యానికి లోను చేసే ఈ సంఘటన అధికార పార్టీకి గట్టి షాక్ గానే భావించాల్సి ఉంటుంది. మంచిర్యాలకు చెందిన నల్లాల ఫ్యామిలీ పార్టీ మారినంత మాత్రాన మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికిప్పుడు అధికార పార్టీకి భారీ నష్టం జరగకపోవచ్చు కానీ టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కీలకమైన నాయకునిగా, రెండు మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన నల్లాల ఓదేలు, ప్రస్తుతం జడ్పీ చైర్మన్ గా ఉన్న ఆయన భార్య భాగ్యలక్ష్మి పార్టీ వీడడం ఆలోచనరేకెత్తిస్తోంది.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీలో గురువారం ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం గమనార్హం.
ఈ పరిణామం ఒక అంశాన్ని స్పష్టం చేస్తోంది. ఉద్యమకాలం నుంచి పార్టీలో కీలక భూమిక పోషించిన ఓదేలు కు గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ ను నిరాకరించారు. అప్పటివరకు ఎమ్మెల్యేగా ఉన్న నల్లాలను కాదని స్థానికేతరుడైన బాల్క సుమన్ కోసం బలిపశువును చేశారని గత కొంత కాలంగా ఉన్న రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తనకు టికెట్ నిరాకరించినప్పటి నుంచి ఆవేదనతో ఓదేలు కుటుంబం రగిలిపోతోంది.
అయితే తదుపరి జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓదేలు భార్య భాగ్యలక్ష్మిని జెడ్పీ చైర్మన్ గా ఎంపిక చేశారు. అయినప్పటికీ ఆ కుటుంబం లో నెలకొన్న అసంతృప్తి పోలేదని తాజా పరిణామాలను పరిశీలిస్తే అది స్పష్టమవుతోంది. తమను అవమానించారనే భావన సన్నిహితులు, అనుచరుల వద్ద వ్యక్తం చేస్తూ వచ్చారు.
వచ్చే ఏడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార పార్టీ నుంచి చిన్నదిగా ప్రారంభమైన ఈ వలస కొత్త ఆరంభానికి నాంది పలుకుతోందేమోననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇదిలావుండగా ఇటీవల కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో తన కేంద్రీకరణ పెంచింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తో పాటు రాష్ట్ర నాయకత్వం ఐకమత్యంతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం కూడా తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు సీరియస్గా దృష్టిని కేంద్రీకరిస్తుంది.
ఈ క్రమంలోనే వరంగల్ కేంద్రంగా ఇటీవల భారీ స్థాయిలో బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం నెలకొంది. రైతు సంఘర్షణ సభ పేరుతో నిర్వహించిన సభలో వ్యవసాయ రంగంపై వరంగల్ డిక్లరేషన్ను ప్రకటించారు. ఈ సభకు కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ హాజరు కావడం పార్టీలో ఉత్తేజం నింపింది. ఈ సభలో వ్యవసాయ రంగానికి సంబంధించిన రైతులు, కౌలు రైతులు, కూలీలు, వారి పురోభివృద్ధికి, సంక్షేమానికి తొమ్మిది అంశాలతో కూడిన బలమైన హామీలను పొందుపరిచారు.
ఈ డిక్లరేషన్ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రచ్చబండ పేరుతో ఈ నెల 21 నుంచి కార్యక్రమానికి చేపట్టారు. డిక్లరేషన్ ప్రచారానికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ భారీ ప్రణాళికలు రచించింది. తెలంగాణ జాతిపిత జయశంకర్ స్వగ్రామమైన వరంగల్ జిల్లా అక్కంపేట నుంచి రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ సభ సక్సెస్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న ఉత్సాహం, నాయకుల మధ్య ఐక్యత అధికార పార్టీపై వ్యతిరేకత రానున్న రోజుల్లో కాంగ్రెస్ కు పూర్వవైభవం తెస్తుందా లేదా అనేది కొద్ది కాలంలో తేలిపోనుంది. అయితే సభ సక్సెస్ అనంతరం అధికార పార్టీ నుంచి వలసలు ప్రారంభం కావడం ఒక విధంగా కొత్త దారులు వేస్తున్నది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ లో చేరికల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలావుండగా ఇటీవల కాంగ్రెస్ నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో, అనంతరం గాంధీభవన్లో జరిగిన కాంగ్రెస్ నాయకుల సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ అధికార టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న శక్తులను ఐక్యం కావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చిన విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.
అదే విధంగా భావసారూప్యం కలిగిన వారిని పార్టీలో చేర్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. పార్టీలో చేరే వారికి అడ్డు పడవద్దని పార్టీ నాయకులకు హితవు పలికారు . తాజా చేరికల క్రమాన్ని పరిశీలిస్తే రానున్న రోజుల్లో కాంగ్రెస్ కు మరింత బలం చేకూరే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. చాలా కాలంగా టిఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి తో కొనసాగుతున్న ఉద్యమకారులు కాంగ్రెస్ వైపు ఆకర్షితులు అయ్యే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు. వీరితోపాటు పార్టీలో అభద్రతా భావం లేకుండా ఉన్న అనేక మంది వలసబాట పట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే టీఆర్ఎస్ ఈ వలసలను ప్రారంభంలోనే అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి గండిపెట్టే అవకాశం లేకపోలేదు.