‘ఉక్కు’ సంకల్పమా.. ఓట్ల బాగోతమా..
అధికార పార్టీల ‘ఉక్కు’ ఛక్రబంధం
– బయ్యారం చుట్టూ భలే రాజకీయం!
– గిరిజనం ఆశల పైన సర్కారు నీళ్ళు !
– ఎనిమిదేళ్ళుగా పరిశ్రమ ఊసేలేదు!
– బీజేపీ, టీఆర్ఎస్ విమర్శలతో పక్కదోవ!
– విభజన చట్టం అమలుకు దిక్కులేదు!
వేకువ ప్రత్యేక ప్రతినిధి: అధికార పక్షాల ఛక్రబంధంలో చిక్కుకుని బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు నలిగిపోతున్నది. రెండు సర్కార్ల మధ్య పరిశ్రమ చుట్టూ రాజకీయం మాత్రం సాగుతున్నది. ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ నేతల పరస్పర విమర్శల వల్ల అప్పుడప్పుడు చర్చనీయాంశమైతున్నది. పరిశ్రమ ఏర్పాటు చేస్తే తమకు ఉపాధి లభిస్తుందనే స్థానిక నిరుద్యోగుల ఆశలను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ నేతలు పరస్పరవిమర్శలు చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. చూసేవారికి అబ్బో ఉక్కు పరిశ్రమ పైన ఈ రెండు పార్టీలకు ఎంత ప్రేమో! అనేంత తీరుగా విమర్శలు చేసుకుంటున్నారు. ఆ తర్వాత సమస్యను అటకెక్కిస్తున్నారు. ఎనిమిదేళ్ళుగా స్థానిక ప్రజల్లో సెంటిమెంట్ రెచ్చగొట్టేందుకు ఉపయోగించుకుంటున్నారు. వాస్తవానికి పరిశ్రమ ఏర్పాటు అనేది రాష్ట్ర విభజన చట్టంలోని హక్కైనప్పటికీ ఒక్క అడుగు ముందుకు వేయలేదు. విపక్షపార్టీలైన కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎం–ఎల్) న్యూడెమోక్రసీ తదితర రాజకీయ పక్షాలు చేపట్టిన నిరసనలనూ, స్థానిక గిరిజన సంఘాల ఆందోళనను అధికార పక్షాలు పెడచెవిన పెడుతున్నాయి.
– మంత్రి కిషన్రెడ్డి వర్సెస్ గులాబీ ఎంపీలు
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఉక్కు పరిశ్రమ ఏర్పాటు పై మొన్న చేసిన ప్రకటనతో మళ్ళీ సమస్య రాజుకున్నది. కిషన్రెడ్డి వ్యాఖ్యలపై ఖమ్మం, మహబూబాద్ ఎంపీలు నామానాగేశ్వర్రావు, మాలోతు కవిత విరుచుకపడ్డారు. దీంతో రాజకీయ రచ్చ ప్రారంభమైంది. ఇటీవల కొద్ది రోజులుగా బీజేపీ పైన టీఆర్ఎస్ మండిపడుతున్న విషయం తెలిసిందే. రెండు పక్షాల మధ్య నెలకొన్న ‘విభేదాల్లో’ రాష్ట్ర విభజన హామీల ఎజెండా కూడా ఉన్నది. ఇదే సమయంలో కిషన్రెడ్డి బయ్యారంలో పరిశ్రమ ఏర్పాటుకు అనుకూలంగా లేదని అన్నారు. ఇక్కడి ఖనిజ సంపద నాణ్యత లేదని చెప్పారు. ఇంకేముంది టీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర మంత్రి పై మండిపడ్డారు. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు ‘సాధ్యం కాదంటవా? ఇక్కడి ఖనిజం పరిశ్రమ ఏర్పాటుకు పనికిరాదంటవా? నీకు నోరెలావచ్చిందంటూ విమర్శించారు. కాగా, ఇంతకాలం చోద్యం చూసిన టీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత బయ్యారంలో ఒక్కరోజు దీక్ష చేపట్టి నిరసన చేపట్టారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం పైన ఇదే ఒత్తిడిని కొనసాగిస్తుందా? మాటమీద నిలబడి బీజేపీని నిలదీస్తుందా? విపక్షాలను కలుపుకుని ముందుకు సాగుతుందా? ఆ చిత్తశుద్ది ఆ పార్టీకి, స్థానిక ప్రజాప్రతినిధులకు ఉందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమైతున్నాయి.
– ఖనిజం ఉన్నా తీరని ఉక్కు ఆశ
బయ్యారం పరిసర ప్రాంతాల్లో దాదాపు 300 మిలియన్ మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజ నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే నివేదికిచ్చినట్లు చెబుతున్నారు. పరిశ్రమ ఏర్పాటు చేయకుండా తప్పించుకునేందుకు ఇక్కడ నాణ్యమైన ఐరన్ ఓర్ లేదని కేంద్రం అబద్దాలు చెపుతుందని విమర్శిస్తున్నారు.
వాస్తవానికి తెలంగాణ ఉద్యమ కాలంలో 2013 జూన్ లో ప్రభుత్వ రంగంలో ఈ గనులను విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేటాయించాలని ప్రభుత్వ పరంగా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గా నిర్ణయం తీసుకున్నారు. మా వనరులు మాకే దక్కాలని బయ్యారం లో ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఉద్యమం కారణంగా ఆ ఆలోచన ను మానుకున్నారు.
అంతకు ముందు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్న కాలంలో తన అల్లుడు బ్రదర్ అనిల్ కు బినామీగా ఉన్న రక్షణ స్టీల్ కు కేటాయించారు. కొందరు స్థానిక ప్రజా ప్రతినిధులతో,గిరిజనుల పేరుతో బినామీ పేర్లతో కాంట్రాక్టు లు పొంది కొంత కాలం ముడి ఇనుపరాతి ఖనిజం తవ్వకాలను చేపట్టి రక్షణ స్టీల్ కు రవాణా కూడా చేసారు.అపుడు బయ్యారం ఉక్కు ఆదివాసీల హక్కు పేర పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగింది.హైకోర్టులో ఆదివాసీ సంఘాల న్యాయపోరాటం కారణంగా తవ్వకాలను నిలిపివేశారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ ఎనిమిది యేండ్ల కాలం లో ఉక్కు పరిశ్రమ గురించి రాష్ట్ర ప్రభుత్వం తగినంత పట్టించుకోలేదు.
బయ్యారం, గూడూరు,భిమాదేవరపల్లి ప్రాంతాల్లో దాదాపు 700 లక్షల కోట్ల సంపద ఉన్నట్లు గుర్తించారు. ఇంత సంపద వున్నా స్థానిక అభివృద్ధి కి,ఉద్యోగ కల్పనకు ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం సైతం మొదటి నుంచి గట్టిపట్టు పట్టలేదు. బీజేపీతో ఇంతకాలం కొనసాగిన స్నేహం ఈ ప్రాంతవాసులకు శాపంగా మారింది. అందుకే బీజేపీ పరిశ్రమ ఏర్పాటును పట్టించుకోలేదంటున్నారు. ఇక తెలంగాణ విభజన హామీల పట్ల తమకు అలవాటైన వివక్షనే బయ్యారం ప్లాంట్ విషయంలోనూ కేంద్రం చూపిస్తున్నదీ. అయినా టీఆర్ఎస్ ప్రభుత్వంలో చలనంలేదని విమర్శిస్తున్నారు. పరిశ్రమ ఏర్పాటు చేస్తే స్థానిక నిరుద్యోగులకు, గిరిజనులకు ఉద్యోగాలు వస్తాయనే ఆశలు ఈ నాయకులే కల్పించారు. తమప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆశించిన స్థానికుల సంతోషం నెమ్మదిగా సన్నగిల్లింది. గిరిజన యువతలో నెలకొన్న ఆశలు నీరుగారుతున్నాయి.
– ప్రత్యామ్నాయ పరిశ్రమకు అవకాశం లేదా?
స్టీల్ ప్లాంట్ నిర్మాణ సాధ్యాసాధ్యాలు నిజాయితీతో పరిశీలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే ఇక్కడ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యం కాకపోతే స్థానిక ఖనిజాన్ని వినియోగించుకుని ప్రత్యామ్నాయ పరిశ్రమ ఏర్పాటు చేయొచ్చుకదా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాలకు నిజాయితీ ఉంటే ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేసి ఉపాధి కల్పించడం కష్టం కాదంటున్నారు. ఈ విషయంలో బీజేపీ అవకాశవాదాన్ని నిలదీయాల్సిన ప్రజాప్రతినిధులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఉక్కు పరిశ్రమ పై విపక్షాల నిరసనలు, నిరుద్యోగుల ఆవేదనను పట్టించుకోకుండా అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటున్నారు. ఇప్పటికైనా ఈ రెండు పార్టీలు తమ చిత్తశుద్దిని నిరూపించుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.