ఏది సెక్యులరిజం ? ఏది సూడో సెక్యులరిజం ?
ఏది సెక్యులరిజం ? ఏది సూడో సెక్యులరిజం ?
ఏదైనా కుక్కను చంపాలంటే దాన్ని పిచ్చికుక్క అని ప్రచారం చేయడం అనేది పాత ముచ్చట . ఆర్ ఎస్ ఎస్ , బిజెపి వాళ్లు , మన దేశంలోని మతతత్వ వాదులు అంతకంటే ఘనులు . కుక్కను అసలు అది కుక్కే కాదు అది పాము అని చెప్పి దాడి చేయగల సమర్థులు . చేస్తున్నారు కూడా . ఇప్పుడు లౌకిక వాదం , సెక్యులరిజం గురించి కూడా అలాంటి పరిస్థితిని సృష్టించారు . లౌకికవాదం నిర్వచనాన్నే , దాని అర్ధాన్నే మార్చివేశారు . లౌకికవాదనికి వాళ్ళ ఇష్టం ఉన్న నిర్వచనం , అర్థం చెప్పి లౌకికవాదం తప్పనీ , అది మెజారిటీ హిందువుల ప్రయోజనాలకు వ్యతిరేకం అని ప్రచారం చేస్తున్నారు . భారత దేశంలో సెక్యులరిజం పేరుతో సూడో సెక్యులరిజాన్నే గత ప్రభుత్వాలు అమలు చేసాయని RSS , BJP లు ఆరోపిస్తున్నాయి .
లౌకిక వాదానికి RSS , బీజేపీ లు ఇస్తున్న నిర్వచనం ఏమిటంటే ?
‘ లౌకికవాదం అంటే అన్ని మతాలను సమానంగా చూడడం ‘ అని బిజెపి వారు , వారి గురువులు RSS బాసులు ఇస్తున్న నిర్వచనం , చెప్పుతున్న అర్ధం . ఇలా చెప్పి వాళ్లు చేస్తున్న దాడి ఏమిటంటే ? లౌకికవాదం అంటే అన్ని మతాలను సమానంగా చూడాలి కానీ కాంగ్రెస్ పార్టీ ఇతర లౌకిక పార్టీల ప్రభుత్వాలు , మైనారిటీ మతాల వారికి అనేక రాయితీలు ఇస్తున్నారు . ఇది లౌకికవాదం , సెక్యులరిజం కాదు . మైనారిటీల ఓట్ల కొరకు ముఖ్యంగా ముస్లింలకు అనేక రాయితీలు ఇస్తూ వారిని సంతృప్తి పరిచే విధనాలను సెక్యులరిజం పేరు మీద అమలు చేస్తున్నారు . అంటే వీరి సెక్యులరిజం మెజారిటీ హిందువుల ప్రయోజనాలకు వ్యతిరేకమైనది . ఇది సూడో సెక్యులరిజం . వీరి సెక్యులరిజం అన్ని మతాలను సమానంగా చూడడం లేదు అంటూ ఒక విష ప్రచారం చేస్తున్నారు . అసలు సెక్యులరిజం అంటేనే మెజార్టీ హిందువులు వ్యతిరేకించే లా దాని అర్ధాన్ని మార్చి దుష్ప్రచారం చేస్తున్నాయి RSS , బిజెపి లు .
వాస్తవం ఏమిటి ? RSS , BJP ల అసలు లక్ష్యం ఏమిటి ?
వాస్తవానికి బిజెపి కేవలం మైనారిటీలను , ప్రత్యేకంగా ముస్లిం సమాజాన్ని వ్యతిరేకించడం కొరకే సెక్యులరిజం నిర్వచనాన్ని , దాని అర్ధాన్ని వక్రీకరించి ప్రచారం చేస్తున్నది అనుకుంటే పొరపాటే . వీరి ఈ నిర్వచనం ప్రకారం అన్ని కులాలు కూడా సమానమే కావున అన్ని కులాలను కూడా సమానంగా చూడాలి అంటారు . నిజానికి ఈ అభిప్రాయంతో మిగతా వాళ్ళెవరికీ అభ్యంతరం ఉండదు . కాని ఆ తరువాత , అన్ని కులాలు సమానమే అయినప్పుడు కొన్ని కులాలకు రాయితీలు ఇవ్వడం తప్పు , రిజర్వేషన్ లు ఇవ్వడం తప్పు అనే దగ్గరికి వెళ్తారు . ఇదేదో గాలిలో చేస్తున్న కుస్తీపట్ల ఊహ కాదు . ఇప్పటికే ఆర్ఎస్ఎస్ అధినాయకులు రెండు మూడు సార్లు రిజర్వేషన్లను సమీక్ష చేయవలసిన అవసరం ఉన్నదని చెప్పారు . లాలూ ప్రసాద్ యాదవ్ ఇతర బీసీ నాయకులు తీవ్రంగా స్పందించడంతోనూ వ్యతిరేకించడంతోనూ , ఆర్ఎస్ఎస్ తన అభిప్రాయాలను కప్పిపెట్టుకున్నది . వాస్తవానికి అన్ని కులాలు సమానం కాదా ? అందరూ మనుషులే కదా , మనుషులం అందరూ సమానం కాదా ? ఇలా అతి సాధారణంగా చూసినప్పుడు అన్ని కులాలలో ఉన్నవారందరూ మనుషులే కావున అందరము సమానమే అని చెప్పుకోవలసి ఉంటుంది . అయితే మనుషులుగా మాత్రమే అందరు సమానం . కానీ అన్ని కులాలకు సమాజంలో సమాన అవకాశాలు లేవు హిందూ సమాజంలో . అన్ని కులాల ఆర్థిక , రాజకీయ పరిస్థితి సమానంగా లేదు . కొన్ని కులాలు సంపదలతో పాటు అనేక అవకాశాలు , విశేషాధికారాలు కలిగి ఉంటే మిగతా కులాలకు సమాన అవకాశాలు లేవు . సంపదలు తక్కువే సమాన అవకాశాలు తక్కువే . ఇటువంటి పరిస్థితులలో , మనది ప్రజాస్వామిక వ్యవస్థ అయితే , సమాన అవకాశాలు లేక వెనుకబడిన కులాల వారిని మనుషులందరి తో నిజంగా సమానంగా చూడాలి అంటే , అటువంటి వారందరికీ అదనంగా సహాయాలు అవకాశాలు రిజర్వేషన్ లు అందించాల్సి ఉంటుంది . అంతేకానీ ఊరికే మనుషులందరూ సమానమే అంటూ ఎన్ని మైకులు పెట్టి ఊదరగొట్టినా సమానం కాలేరు .
అదేవిధంగా అతి సాధారణంగా చూసినప్పుడు అన్ని మతాలు సమానమే . అన్ని మతాల లోని వారందరూ మనుషులే కావున అందరూ సమానమే . కానీ మైనారిటీ మతస్థులకు మెజారిటీ మతస్థులకుండే అవకాశాలు ఏ దేశంలో కూడా ఉండవు . ఇంకా మతతత్వ శక్తులు బలంగా ఉండే దేశంలో మెజారిటీ మతస్థుల కంటే మైనారిటీ మతస్థులకు అవకాశాలు ఇంకా తక్కువగా ఉంటాయి . మన దేశంలోని పట్టణాలలో ముస్లింలకు కనీసం కిరాయికి ఇల్లు దొరకడం కూడా కష్టమే . ఇక మిగతా అవకాశాల గురించి ఆలోచించడం అవసరమే లేదు . రాజేందర్ సింగ్ సచ్చర్ కమిటీ రిపోర్టు చూస్తే చాలు తెలుస్తుంది , భారతదేశంలోని మైనారిటీ ముస్లింల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో . ఇటువంటి పరిస్థితిలో ఏ ప్రజాస్వామిక దేశమైనా అక్కడి మైనారిటీలకు వారు ఎవరైనా అదనంగా సహాయం చేయడం అవసరం . చేయాలి . అప్పుడే అన్ని మతాల ప్రజలు సమానులు అవుతారు . అయితే మైనారిటీలకు అవసరం అనే పేరు మీద ఓట్ల కొరకే అనవసర సహాయాలు చేస్తే వాటిని విమర్శించాలి . ముందు అవేమిటో ఎత్తి చూపించాలి . అవేమి చేయకుండా అన్ని మతాలు సమానమే మనుషులందరూ సమానమే అదనంగా ఎవరికీ ఏ సహాయం కూడా చేయవద్దని అంటే అది ప్రజాస్వామ్యం కాదు మానవత్వం కాదు . ప్రజాస్వామ్యం అందరిని సమానంగా చూస్తుంది కావుననే వెనుకబడ్డ వారిని మిగతా వారితో సమానం గా ఉండటానికి సహాయం చేస్తుంది . ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించే వారే ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడిన వారికి అదనంగా సహాయం అవసరం లేదంటూ ఏదో ఒక సాకుతో దాడి చేస్తూఉంటారు . అయితే ప్రజాస్వామిక హక్కులు పొందాల్సిన వారందరి మీదా ఈ దాడి ఉంటుంది . కేవలం మైనారిటీలే వారి లక్ష్యం అనుకుంటే పొరపాటే . మైనారిటీలకు గురిపెట్టిన తుపాకి దిశలోనే పీడిత కులాలన్ని కూడా ఉన్నయని గుర్తు పెట్టుకోవాలి . వాదాలు , చర్చలు , ఆరోపణలు అన్ని మైనారిటీల గురించి చేస్తున్నట్లే కనిపించినా , వారితో పాటు పీడీత కులాలు కూడా RSS కు BJP కి దెబ్బతీసే లక్ష్యాలే . నిగాహే కహీం .... నిశానే కహీం .
అసలు సెక్యులరిజం అంటే ఏమిటి ?
అసలు సెక్యులరిజం అంటే రాజకీయాలకు ప్రభుత్వానికి మతంతో సంబంధం ఉండకూడదు . రాజకీయాలలో , సామాజిక నిర్మాణాలు కార్యక్రమాల్లో , విద్యా వ్యస్థలో మతం ప్రమేయం , మతం ఆధిపత్యం ఉండకపోవడమే సెక్యులరిజం యొక్క అసలు నిర్వచనం . నిజానికి రాజకీయాల పైన రాజ్యాధికారంపైన మతం ఆధిపత్యం లేనప్పుడే అన్ని మతాలను సమానంగా అంటే ఉచ్చ నీచాలు లేకుండా చూడటం సాధ్యం అవుతుంది . అన్ని మతాలను సమానంగా చూడాలి . ఉచ్చ నీచ స్థాయి మతాలుగా చూడకూడదు . అదే సమయంలో ఏ మతం వారైనా వెనుకబడి ఉంటే మిగతా వారితో సమానంగా ఎదగడానికి సహాయపడాలి . అన్ని మతాలను సమానంగా చూడాలి అంటే అర్థం ఇదే . అంతే కాని అవకాశాలు తక్కువ ఉన్న వారికి వెనుకబడ్డ వారికి సహాయం చేయవద్దని కాదు . మధ్యయుగాల కాలంలో రాజ్యాధికారంలో మతం ప్రమేయం మతం ఆధిపత్యం ఉండేది . నిరంకుశ రాజరికాలకు మతమే ఆధారంగానూ నడిపించేదిగానూ ఉండేది . రాజ్యాధికారం పైన మతం ఆధిపత్యం కారణంగా సమాజాలు అభివృద్ధి చెంద లేక పోయేవి . సమాజంలో కొందరికి విశేషాధికారాలు ఉండేవి . అంటే అందరికీ సమాన అవకాశాలు లేని అప్రజాస్వామిక రాజ్యాలుగా ఉండినాయి . ప్రపంచంలో ఎక్కడైతే రాజరిక ప్రభుత్వాలను ప్రజలు కూల్చివేశారో అక్కడ రాజ్యాధికారం పై మతం ఆధిపత్యం కూడా అంతరించి ప్రజాస్వామ్య దేశాలు అవతరించాయి . అప్పుడే అందరికీ ప్రజాస్వామిక హక్కులు లభించాయి . మత ప్రమేయం లేని ప్రజాస్వామిక దేశాలుగా అవతరించిన సమాజాలే అభివృద్ది చెందినాయి . ఈ రోజుకు కూడా ప్రపంచంలో మతప్రమేయం లేని దేశాలే అభివృద్దిలో అగ్ర భాగాన ఉన్నాయి . రాజకీయాలలో రాజ్యాధికారంలో మతం ప్రమేయం లేని లౌకికవాదమే మన దేశ అభివృద్దికి కూడా తప్పనిసరి అవసరమే .
ముగింపు
అయితే ఆర్ఎస్ఎస్ బీజేపీలు సరిగ్గా రాజకీయాలలో , రాజ్యాధికారంలో , సామాజిక కార్యక్రమాలలో , విద్యలో మతం ఆధిపత్యాన్ని తిరిగి స్థాపించడానికి ప్రయత్నిస్తున్నాయి . అందుకే ఒకవైపు సెక్యులరిజానికి తప్పుడు అర్ధాలు చెబుతూ ప్రజలను అపొహలకు , అనుమానాలకు గురిచేస్తున్నారు . మరోవైపు చాపకింద నీరులా రాజకీయాలలో రాజ్యాధికారంలో మతం ఆధిపత్యాన్ని ప్రమేయాన్ని చొప్పిస్తున్నారు . అది న్యాయసంగతమే అని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నారు . విద్యాసంస్థల అధిపతులుగా ఒక ప్రత్యేక మత దురభిమానులను నియమిస్తున్నారు . దాని ఫలితాన్ని దేశం ఇప్పటికే చూస్తున్నది . కావున సెక్యులరిజం గురించి జరుగుతున్న వక్రీకరణలను , దుష్ప్రచారాన్ని ఎండగట్టి ప్రజలను విద్యావంతులను చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది . సెక్యులరిస్టులం అని చెప్పుకునే వారు , సెక్యులరిస్టు పార్టీలు అని చెప్పుకునే పార్టీలు సెక్యులరిజం గురించి ప్రజలకు అర్థం చేయించుకుంటే పరిస్థితులు ఇంకా ప్రమాదకరంగా మారడానికి అవకాశం ఉన్నది .
-లంకా పాపిరెడ్డి