కేసిఆర్ రాజ్యాంగ సవరణ ప్రకటన సరైనదేనా ?
కేసిఆర్ రాజ్యాంగ సవరణ ప్రకటన సరైనదేనా ?
ఇప్పుడా అవసరం ఉందా అన్నదానిపై చర్చ
ప్రత్యామ్నాయ రాజకీయాలకు కేసిఆర్ నడుం బిగించేనా
హైదరాబాద్: దేశంలో గుణాత్మక మార్పు రావాలని సీఎం కేసీఆర్ అభిప్రాయం అక్షరాల నూటికి నూరుపాళ్లు నిజం. దేశానికి కొత్త రాజ్యాగం కావాలని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు సర్వత్రా సానుకూలత వ్యక్తం అవుతోంది. నిజానికి 75 ఏళ్ల స్వాతంత్య్రం తరవాత కూడా మన రాజ్యాంగం ద్వారా పేదలు, అతిపేదలు, ప్రజలకు మేలు కలగడం లేదు. కేవలం రాజకీయ వ్యవస్థమాత్రమే బలోపేతం అయ్యింది తప్ప ప్రజలు బలపడలేదు. ఈ క్రమంలో కేంద్ర,రాష్టాల్ర మధ్య కూడా సంబంధాలు నిర్వచించాల్సి ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అనేక అంశాలపై రాజ్యాంగంలో స్పష్టత లేదు..
నీతి ఆయోగ్ వచ్చినా దానివల్ల ఎలాంటి ఉపయోగాలు కానరావడం లేదు. అలాగే జిఎస్టీ వసూళ్లు పెరిగాయని కేంద్రం చంకలు గుద్దుకుంటున్నా దాని వల్ల ప్రజలు ఎంతగా నష్టపోతున్నారో గమనించడం లేదు. అస్పష్ట రాజ్యాంగాన్ని పదేపదే సవరించడం కాదని, మార్చాలన్న డిమాండ్ సహేతుకంగానే ఉంది. మారిన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పటిష్ట రాజ్యాంగాన్ని రాసుకోవాల్సి ఉంది. సీఎం హోదాలోనే దేశం కోసం పోరాడతానని కేసిఆర్ మరోమారు స్పష్టం చేశారు. మార్పు కోసం ఏం చేయాలో అంతా చేస్తానని.. ఈ అంశంపై అందరినీ కలుపుకుని వెళ్తానని భవిష్యత్ రాజకీయాలపై కేసీఆర్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఆయన ప్రత్యమ్నాయ రాజకీయాలకోసం చేస్తున్న కసరత్తు సాగుతోందని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారత రాజ్యాంగం మార్చాల్సిన అవసరం ఉందన్నది నిపుణుల అభిప్రాయంగానూ ఉంది. అయితే రాజకీయ దృక్కోణంలో కాకుండా దేశ అవసరాలు, ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాల్సి ఉందని ప్రముఖ పర్యావరణవేత్త, పొలిటికల్ ఓయూ మాజీ విభాగాధిపతి ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇప్పుడున్న రాజ్యాంగం పటిష్ఠంగగానే ఉందని..కొన్ని అంశాల్లో మార్పులు చేర్పులు చేసుకుంటే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించడంతో పాటు దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఫెడరల్ వ్యవస్థలకు తూట్లు పొడుస్తూ రాష్టాల్ర హక్కులను హరించేలా కేంద్రం వ్యవహరిస్తోందన్న విమర్శలను ఆయన సమర్థించారు. ఇకపోతే కెసిఆర్ తాను అనుకున్నట్లుగా బిజెపికి ధీటుగా ప్రత్యామ్నాయ రాజకీయాలకు శ్రీకారం చుడతారా అన్నది చూడాలన్నారు. ఇకపోతే కేసిఆర్ ఇప్పటికే బిజెపికి వ్యతిరేకంగా పోరాడు తున్నారు. ధాన్యం సేకరణ మొదలు నిధుల విడుదల వరకు అన్ని అంశాల్లో పోరాడుతున్నారు. కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదు. గుజరాత్ సీఎంగా ఉండి మోదీ ప్రధాని అయ్యాక కూడా రాష్టాల్ర తీరు మారడం లేదని కేసీఆర్ గుర్తుచేశారు. మోదీ టోపీలు, పంచెలు మార్చితే అభివృద్ధి అంటామా అని కేసీఆర్ ప్రశ్నించారు. దేశ ఆర్థిక పరిమితి పెంచే అవగాహన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు లేవని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో 95 నుంచి 105 సీట్లు గెలుస్తామని సీఎం కేసీఆర్ ధీమాగా ఉన్నారు. ఇదే క్రమంలో బిజెపికి చెక్ పెట్టాలన్న ధోరణిలో ప్రత్యామ్నాయ రాజకీయాలు చేయాలని భావిస్తున్నారు. ఇదే క్రమంలో దేశంలో కొత్త రాజ్యాంగం అవసరముందని కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు. చాలా దేశాలు రాజ్యాంగాలను మార్చాయని గుర్తు చేశారు. ఐఏఎస్ అధికారులపై కేంద్రం పెత్తనమేంటని కూడా కేసీఆర్ ప్రశ్నించారు. బీజేపీ, కేంద్ర ప్రభుత్వం మత పిచ్చి రేపుతూ, ప్రజల మధ్య కొట్లాటలు పెడుతూ సమాజ వాతావరణాన్ని కలుషితం చేస్తూ దేశాన్ని విభజించాలని చూస్తోందని కేసీఆర్ ప్రధానంగా ఆరోపించారు. దేశంలో అద్భుతమైన గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఇదే సందర్భంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. ఎన్నికలకు 6 నెలలకు ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. ఈ సారి ఎన్నికల్లో గెలవడానికి తమ వద్ద బ్రహ్మాండమైన మంత్రం ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజల సహకారంతో పోరాడి తెలంగాణను సాధించాం.. ఇప్పుడు దేశ ప్రజల్ని జాగృతం చేయాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఆయన తప్పకుండా జాతీయ రాజకీయాల పై ఫోకస్ పెట్టారని అనుకోవాలి. ఈ దేశానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏం చేసిందనే చర్చకు తాను సిద్ధం అని సవాల్ విసిరారు. దేశంలో గుణాత్మకమైన మార్పు రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రబల పరివర్తన కోసం ప్రయత్నిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు.75 ఏళ్ల తరువాత కూడా మన దేశ ఆర్థిక స్థితి ఏమాత్రం బాగోలేదన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి సిగ్గుతో తలదించు కునేలా ఉందని, కేంద్రం జీడీపీ లెక్కలే ఈ విషయాన్ని చెబుతున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్నవన్నీ అబద్దాలేనని అన్నారు. మొత్తంగా కేసిఆర్ చేస్తున్న ప్రకటన పట్ల సానుకూలత వస్తుందా లేక రాజ్యాంగంపై విమర్శలు వస్తాయా అన్నది చూడాలి. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగంపై చర్చచేయడం కూడా సాహసోపేతంగానే చూడాలి. అమలు చేయడంలో వైఫల్యం చెందిన వారు ఇప్పుడు మార్చాలని చూస్తారా అన్న విమర్శలు కూడా రావచ్చు.