మోదీ మొండితనం అంతా ఎవరి కోసం..
మోదీ మొండితనం అంతా ఎవరి కోసం....
-----------------------------------------------
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే క్రమంలో ప్రధాని మోదీ లోక్ సభలో అందరి దృష్టిని ఆకర్షించారు. దానికి కారణం... ఒకటి-తాను వేసుకున్న బ్లూ కలర్ జాకెట్ కాగా, రెండోది.. తన బలం దేశ ప్రజల విశ్వాసాల్లో ఉన్నదని ప్రకటించారు. తనకు సమకూరిన శక్తి... పేపర్లు, టీవీలో మెరిసిపోయే ఫొటోలతో వచ్చింది కాదనీ, ప్రజల విశ్వాసాలు పునాదిగా చేకూరిన బలమని చెప్పుకొన్నారు. బహుశా ఈ విశ్వాసంతోనే కావచ్చు... హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్టు, ఆదానీ వ్యాపార సామ్రాజ్యంలోని అక్రమాల గురించి విచారణ జరుపాలనీ, కనీసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని ప్రతిపక్షాలు ఎంత పట్టుబట్టినా పట్టించుకో కుండా... ముసి ముసి నవ్వులతో నిర్లక్ష్యంగా, తిరస్కారంగా చూస్తున్నారు. ఆదానీ గ్రూప్ అనేక అక్రమాలకు పాల్పడిందనీ, షేర్ల అమ్మకాల్లో, వాటి విలువను ఎక్కువ చేసి చూపటంతో మోసానికి పాల్పడి అటు సామాన్య మదుపరులను, బ్యాంకులను మోసగించి లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని హిండెన్‌బర్గ్ రిపోర్టు ప్రకటించింది. దానికి గాను విస్తారమైన సాక్ష్యాధారాలను చూపింది. కాగా... ఆ రిపోర్టులో చెప్పిన విషయాలు తప్పు అనీ, ఆ ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమైని గౌతం ఆదానీ ముందుకు రాక పోగా... తనపై దాడి చేయటమంటే.. భారత్‌పై దాడి చేసినట్లుగా ఆయన ప్రకటిస్తున్నాడు. భారతదేశ అభివృద్ధిని చూసి ఓర్వలేని వారే విమర్శలు చేస్తున్నారని..., తన వ్యాపార వృద్దిని దేశాభివవృద్ధిగా చెప్పుకొచ్చాడు ఆదానీ. ఇదిలా ఉంటే... బీజేపీ నేతలు కూడా... ఆదానీపై దాడి చేయటమంటే... మోదీపై దాడిచేయటంగా చూస్తున్నారు, చెప్తున్నారు. ఆర్ ఎస్సెస్ పత్రిక కూడా... దేశాభివృద్ధిపై కంటగింపే హిండెన్ బర్గ్ రిపోర్టు అని విమర్శిస్తున్నది.
ఆదానీ, మోదీ, బీజేపీ వేరు వేరు కాదని ఇప్పుడు దేశ ప్రజల ముందు సాక్షాత్కారమైంది. ఆదానీ కార్పొరేట్ బలమే తన బలమని మోదీ పరోక్షంగా చాటుకుంటున్నారు. ఆదానీ లాంటి వ్యాపారస్తుల ఆస్తులు పెరగటమే.. దేశాభివృద్ధి అని మోదీ చెప్తున్నారు. ఈ నేపథ్యంలోంచే.. తనకు ప్రజల్లో ఉన్న విశ్వసనీయతను చాటుకుంటున్నారు. కాకతాలీయమే కావచ్చు... కానీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాడిపాడేసిన వాటర్ బాటిళ్లతో తయారు చేసిన ఓ జాకెట్‌ను మోదీకి బహూకరించింది. ఆ జాకెట్‌తోనే మోదీ పార్లమెంటుకు వచ్చి ప్రజల విశ్వాసాలే తన బలమని నొక్కి చెప్పుతున్నారు. రెండు దశాబ్దాలుగా హిందుత్వ శక్తులు దేశంలో పనిగట్టుకొని పాదుకొల్పిన భావజాలం, ప్రజల్లో పెంచి పోషించిన మత మూఢ విశ్వాసాలే వనరుగా మోదీ తన శక్తిగా చెప్పుకొస్తున్నారు. తరతరాలుగా భారతీయ సామాజిక జీవనంలో ఉన్న వెనుకబాటు తనం, మూఢ విశ్వాసాల ఆసరాతో బీజేపీ విస్తరించింది, సంఘటిత పడింది. ఆధునిక జీవనంలో మూలకు పడిన మత విశ్వాసాలకు ప్రాణం పోసి ఆ విశ్వాసాలే తన శక్తి అని మోదీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ అతి విశ్వాసంతోనే... ఇవ్వాళ.. విపక్షాలు అడుగుతున్న ప్రశ్నలను బేఖాతరు చేస్తున్నారు. గతంలో హర్షద్ మెహతా, ఖేతన్ ఫరేక్ ఉదంతాల్లో విమర్శలు వచ్చినప్పుడు, ఆ కుంభకోణాలపై జేపీసీ ఏర్పాటు చేశాయి నాటి ప్రభుత్వాలు. నాటి సంయుక్త పార్లమెంటరీ కమిటీలు ఇచ్చిన రిపోర్టుల ఆధారంగానే.. హర్షద్ మెహతా, ఖేతన్ ఫరేక్ లాంటివారు జైలు పాలై ఊచలు లెక్కపెట్టారు. ఇప్పుడు విపక్షాలు కూడా ఆదానీ కుంభకోణం విషయంలో జేపీసీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. మోదీ, బీజేపీ పరివారం అంటున్నట్లు అక్రమాలు, కుంభకోణం లాంటిదేమీ జరుగక పోతే.. అదే జేపీసీ తేల్చుతుంది కదా అంటున్నాయి. అయినా మోదీ ససేమిరా అంటూ మొండికేయటం ఎవరి ప్రయోజనం కోసమో.. అర్థమవుతూనే ఉన్నది.
్రశామిక