శ్రీలంక సంక్షోభానికి కారణం ఎవరు ?

శ్రీలంక సంక్షోభానికి కారణం ఎవరు ?             ఇంద్రవతి కాలమ్ 

 ఎడిట్ పేజి వ్యాసం 

-లంక పాపిరెడ్డి

వార్తా ప్రపంచంలో ఈ రోజు మండుతున్న వార్త శ్రీలంక సంక్షోభం . 1948లో బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం పొందినప్పటినుండి ఇప్పటివరకు శ్రీలంక ఇంతటి సంక్షోభాన్ని ఎప్పుడూ చూడలేదు . దేశం అప్పులపాలు అయింది విదేశీ అప్పుల పైన వడ్డీ కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది . దేశానికి అవసరమైన సరకులను దిగుమతి చేసుకోవడానికి అవసరమైన విదేశీ మారక ద్రవ్యం అడుగంటింది . బంగారం నిల్వలు తరిగిపోయాయి . విదేశాలలో ఉన్న శ్రీలంక ప్రజలు పంపించే ధనం కూడా చాలా తగ్గి పోయింది . ఈ నేపథ్యంలోనే అంటే విదేశీ మారకద్రవ్యం కొరత వలన రసాయనిక ఎరువులను దిగుమతి చేసుకోలేక ప్రకృతి వ్యవసాయం పేరు చెప్పి ఒకేసారి రసాయనిక ఎరువుల దిగుమతులను ఆపివేశారు . దానితో ఉత్పత్తిలో భారీగా తగ్గుదల ఏర్పడి సంక్షోభం మరింత తీవ్రం అయింది . కరోనా కాలంలో టూరిజం దెబ్బతిన్నది . టూరిజం మీద ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ కావడం వలన కరోనా కాలంలో శ్రీలంక ఆదాయం దెబ్బతిన్నది . ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీలంక దివాళా తీసింది . 

అప్పటివరకూ జాతీయ వీరులుగా , తమిళ ఈళం ఉద్యమాన్ని అణచి వేసిన జాతీయ రక్షకులుగా సింహళ ప్రజలలో పేరుగాంచిన రాజపక్షె సోదరులపై శ్రీలంక ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత పెల్లుబికింది . ప్రజల నిరసన జ్వాలలలో అధికార ఆధిపత్య భవనాలు బూడిదయ్యాయి . చివరికి శ్రీలంక అధ్యక్షుడు , యునైటెడ్ నేషనల్ పార్టీకి చెందిన ఏకైక సభ్యుడు మాజీ ప్రధాని అయిన రణిల్ విక్రమ్ సింగె ను ప్రధానిగా నియమించాడు . అయితే దీనితో సంక్షోభం ముగిసే అవకాశాలు ఏమి కనిపించడం లేదు. ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చడానికి ప్రధానిని మార్చినారు కాని  సంక్షోభం కొనసాగినంత కాలం ప్రజల ప్రజల నిరసనలు  ఆందోళనలు కూడా ఆగవు . అధ్యక్షుడు రాజపక్ష రాజీనామా చేసే వరకు కూడా ఆందోళనలు కొనసాగవచ్చు. 

అయితే అసలు సంక్షోభానికి కారణాలు ఏమిటి ? కర్ణుని చావుకు ఎన్నో కారణాలు ఉన్నట్లుగా శ్రీలంక సంక్షోభానికి కూడా ఎన్నో కారణాలున్నాయి . కొంతమంది కరోనాను ఒక కారణాంగా చెప్పితే మరికొందరు ప్రకృతి వ్యవసాయాన్ని కారణంగా చెప్పుతున్నారు . ఎన్నికల హామీ అయిన పన్నుల రాయితీ కారణం అని ఇంకొందరు అంటున్నారు . రాజపక్షె సోదరుల లోపభూయిష్ట  ఆర్ధిక నిర్వహణ అనేవారు కూడా ఉన్నారు. ఇక పశ్చిమ దేశాల మీడియా భారత దేశ మీడియా కూడా ప్రచారం చేస్తున్న  విషయం ఏమిటంటే శ్రీలంక చైనా నుండి తీసుకున్న భారీ అప్పులే శ్రీలంక సంక్షోభనికి కారణం అని .  కారణాలు ఎన్ని  ఉన్నా శ్రీలంక సంక్షోభానికి ప్రధాన కారణం ఒకటే ఉంటుంది . మిగతావన్ని సహాయ కారణాలు మాత్రమే . 

కరోనా కాలంలో టూరిజం దెబ్బతినడం వలన , ప్రకృతి వ్యవసాయం వలన , శ్రీ లంక ఆదాయం కోల్పోయి సమస్యలను ఎదుర్కొం టున్న మాట వాస్త మే . తప్పుడు ఆర్థిక నీతి కారణంగానూ పన్నులలో రాయితీలు వలన కూడా ఆదాయంలో తగ్గుదల ఏర్పడవచ్చు . కానీ వీటి వల్లనే శ్రీలంక సంక్షోభంలోకి నెట్టి వేయబడ లేదు . శ్రీలంక విపరీతంగా చేసిన అప్పుల వల్లనూ విదేశీ వ్యాపార లోటు వల్లనూ శ్రీలంక సంక్షోభంలో చిక్కుకున్నది . చైనా ఇచ్చిన అప్పులే సంక్షోభానికి కారణం అనేది పూర్తిగా తప్పు . చైనా ఇచ్చిన అప్పులు కూడా శ్రీలంక సంక్షోభానికి కారణం . కానీ చైనా అప్పుల వల్లనే శ్రీలంక సంక్షోభంలో పడింది అనడం పూర్తిగా తప్పు . సామ్రాజ్యవాద దేశాలన్నీ శ్రీలంక సంక్షోభానికి కారణం . శ్రీలంక సంక్షోభంలో కూరుకు పోవడానికి మిగతా సామ్రాజ్యవాద దేశాల అప్పుల కూడా కారణమే , అనే వాస్తవాన్ని మరుగున పరచడానికి పశ్చిమ దేశాల మీడియా  చైనా సామ్రాజ్యవాదుల అప్పుల గురించి మాత్రమే ప్రచారం చేస్తున్నది . చైనా కంటే ఎక్కువ అప్పు జపాన్ వచ్చింది . జపాన్ డైరెక్టుగానే కాక తన ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు ద్వారా కూడా అప్పు  ఇచ్చింది .  క్రింది  చూడండి  

       


నిజానికి శ్రీలంక సంక్షోభానికి కారణం అప్పులే . కానీ ఇదంతా ఒక్క రోజు జరగలేదు . దేశంలో దశాబ్దాలుగా జరిగిన అంతర్యుద్దం వలన శ్రీలంక అప్పులు చేయక తప్పలేదు . 1980ల ప్రారంభంలో మొదలైన తమిళ ఈళం  ఉద్యమం 2009 వరకు సాగింది . అంటే దాదాపు 30 సంవత్సరాలు అంతర్యుద్ధంలో శ్రీలంక ప్రభుత్వం ఆయుధాల మీద సైన్యం మీద పెద్ద ఎత్తున అప్పులు చేసి ఖర్చు చేసింది . ఈ ఖర్చు అనుత్పాదక ఖర్చు . ఉత్పత్తి అయ్యేది ఏమీ ఉండదు . ఉండకపోగా దేశ ఆర్థిక వ్యవస్థ ధ్వంసం అయింది . LTTE పైన శ్రీలంక ప్రభుత్వం విజయం సాధించినప్పటికీ దీర్ఘ కాలం సాగిన అంతర్యుద్దం  కారణంగా శ్రీలంక ప్రభుత్వం పునర్నిర్మాణానికి కూడా తిరిగి పెద్దఎత్తున అప్పులు చేయక తప్పలేదు . ఈ అప్పు ఆ అప్పు అంతా కలిసి కొండంత అయ్యింది. మరోవైపు ఈ అప్పులు తీర్చడానికి తన ఆదాయం పెంచుకునే పరిస్థితులు అంతర్జాతీయంగానూ లేకుండా పోయాయి . అప్పులు తీర్చడం అటు పెడితే అసలు వ్యాపార లోటు పూడ్చుకోలేని పరిస్థితి . ఎగుమతులు తక్కువ , దిగుమతులు ఎక్కువ అయ్యాయి . (భారత దేశ పరిస్థితి కూడా ఇలాగే ఉంది.) శ్రీలంక సంక్షోభానికి ఈ అంతర్యుద్దమే పునాది . జాతుల ఆకాంక్షలను రక్తపుటేరులలో ముంచి , శ్రీలంకను నాశనపు అంచులకు తీసుకు వెల్లిన శ్రీలంక పాలకులు .... ధ్వసం అయిన శ్రీలంకను విందుభోజనంగా దొరకబుచ్చుకుని  అప్పులతో , వ్యాపార ఒప్పందాలతో  నిలువు దోపిడి చేసిన సామ్రాజ్యవాద దేశాలు , శ్రీలంక  సంక్షోభానికి ప్రధాన కారణం .-లంక పాపిరెడ్డి

Relative Post

Newsletter