బహుముఖ పోరుతో త్రిపురలో లాభపడేది ఎవరు?
బహుముఖ పోరుతో త్రిపురలో లాభపడేది ఎవరు?
================================
ఈశాన్య భారతంలో అతిముఖ్యమైన రాష్ట్రాల్లో ఒకటైన త్రిపురలో రేపు అంటే.. ఫిబ్రవరి 16న అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇందుకు ఎన్నికల కమిషన్ సకల సన్నాహాలు చేసింది. అంతర్జాతీయ సరిహద్దుతో పాటు, ఆదివాసుల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న ఇతర రాష్ట్రాలతో సరిహద్దులు కలిగి ఉండటంతో శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ఠ ఏర్పాట్లు ఎన్నికల యంత్రాంగం చేసింది. దశాబ్దాల పాటు త్రిపురలో అధికారం చెలాయించిన సీపీఎం గత ఎన్నికల్లో ఓడిపోయింది. మొదటిసారి 2018 ఎన్నికల్లో ఈశాన్య భారతంపై పాగా వేసిన బీజేపీ ఊహించని స్థాయిలో విజయబావుటా ఎగురవేసింది. ఈ సారి కూడా జెండా ఎగురవేసేందుకు బీజేపీ సర్వశక్తులనూ ఒడ్డుతుంటే... , కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్; సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ కూటమి కూడా నువ్వా నేనా అన్న రీతిలో పోరాడుతున్నాయి. అయితే ఈసారి త్రిపురలో మరో పార్టీ తిప్ర మోత పేరుతో సరికొత్త పార్టీ రంగంలోకి దిగటంతో త్రిముఖ పోరునుంచి బహుముఖపోరుగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
బీజేపీ, ఇండీజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్ టీ) పార్టీలు కూటమిగా రంగంలో దిగుతున్నాయి. 60 స్థానాలున్న త్రిపుర అసెంబ్లీకి బీజేపీ 55 స్థానాల్లో పోటీచేస్తుండగా, దాని మిత్రపార్టీ ఐపీఎఫ్‌టీ ఐదింటిలో పోటీ చేస్తున్నది. లెఫ్ట్ కూటమిలో భాగస్వామ్య పక్షాలైన ఫార్వార్డ్ బ్లాక్, ఆర్ ఎస్‌పీ, సీపీఐ ఒక్కో సీటుకు పోటీ చేస్తుండగా... సీపీఎం 43 స్థానాల్లో పోటీ చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ 13 స్థానాల్లో, తృణమూల్ 28 స్థానాల్లో పోటీకి దిగుతున్నాయి. ఇదిలా ఉంటే... మొదటి సారి... గ్రేటర్ త్రిప్రా ల్యాండ్ నినాదంతో బరిలోకి దిగుతున్న తిప్రమోత పార్టీ 42 స్థానాల్లో పోటీ పడుతున్నది. త్రిపురలో దాదాపు 20 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఆదివాసులు అధిక సంఖ్యలో ఉంటారు. కాబట్టి ఆదివాసులు ఎక్కువగా ఉన్న ఈ నియోజక వర్గాల్లో తిప్రమోత పార్టీ ఎక్కవ ప్రభావం చూపే అవకాశమున్నది. ప్రధాన అంశం ఏమంటే... గత 2018 ఎన్నికల్లో గిరిజనుల ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ 20 నియోజక వర్గాల్లోంచే అధిక సీట్లు బీజేపీ గెలుచుకున్నది. ఈ సారి గిరిజన ఓటర్లు ఎటు మొగ్గుచూపుతారన్నది అంతుపట్టని విషయంగా మారింది.
మరో ముఖ్య విషయం ఏమంటే... మధ్య తరగతి ప్రజల్లో పలుకుబడితో బ్రాహ్మణ్, బనియా పార్టీగా పేరున్న బీజేపీ ఈశాన్య భారతంలో పాగా వేయటం అంచనాకు అందనిదిగా ఎన్నికల విశ్లేషకులకు మిగిలింది. స్వాతంత్య్రోద్యమ కాలం నుంచీ ఈశాన్య భారతంలోని ఏడు రాష్ట్రాల్లో గిరిజనులు స్వయం ప్రతిపత్తికోసం, ప్రత్యేక పాలనాధికారాల కోసం పోరాడుతున్నారు. ఎడతెగకుండా ఏడు దశాబ్దాలుగా ఏదో స్థాయిలో ఈ రాష్ట్రాల్లో సాయుధ పోరాటాలు కొనసాగుతున్నాయి. ఒకానొక దశలో ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజలు భారత్‌ను తమ దేశంగానే భావించని పరిస్థితులు కనిపించాయి. ఇండియన్స్ గో బ్యాక్ అన్న నినాదాలు సర్వత్రా వినిపించాయి. అలాంటి ప్రాంతాల్లో బీజేపీ జీవం పోసుకోవటమే కాదు, అధికారాన్ని చేజిక్కించుకోవటం ఆధునిక చరిత్రలో గుణాత్మక మార్పుగానే పరిగణించవచ్చు.
ఈ సారి ఎన్నికల్లోనూ జెండా ఎగుర వేసి ఈశాన్య భారతాన్ని గుప్పిట పట్టుకోవాలని బీజేపీ సర్వ శక్తులను ఒడ్డుతున్నది. ప్రధాని మోదీ త్రిపురను 51 సార్లు సందర్శించారంటే... ఈశాన్య భారతానికి బీజేపీ ఎంతటి ప్రాముఖ్యం ఇస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. అమిత్ షా అయితే... అక్కడే తిష్ట వేశారు. దశాబ్దాల సీపీఎం పాలనలో త్రిపుర, ఇతర ఈశాన్య భారత ప్రాంతాలు ఎంతో వెనుకబడి పోయాయనీ, దానికి కారణం కమ్యూనిస్టులేనని మోదీ- షా ద్వయం దండెత్తుతున్నది. బీజేపీతో పోలిస్తే... కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్‌లు ప్రచారంలో బాగా వెనుకబడి పోయినట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. లెఫ్ట్ ఫ్రంట్ కూడా బీజేపీకి సరిధీటుగా ప్రచారం చేయటంలో, విమర్శలను తిప్పికోట్టడంలో వెనుకబడి పోయింది.అయితే... మంది మార్బలం, అధికార బలంతో బీజేపీ ప్రచారం ప్రధానంగా కనిపించినా..., ఆదివాసీ సంస్కృతికి ఆలవాలంగా ఉన్న త్రిపుర పౌర సమాజంలో పై పైన కనిపించే విషయాలనే చూసి ఓ నిర్ణయానికి రావటం తొందరపాటు అవుతుంది. మరో వైపు ఈ ఎన్నికలకు ఏడాది ముందు ముఖ్యమంత్రిని మార్చాల్సి రావటం, మరో ముగ్గురు సీనియర్ ప్రభావశీలురైన ఎమ్మెల్యేలు బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరటం బీజేపీకి తీరని నష్టమే. ఈ విధమైన పరిణామాలు తప్పకుండా బీజేపీకి నష్టం చేకూరుస్తాయనటంలో సందేహం లేదు. తిప్రమోత, కాంగ్రెస్, తృణముల్ కాంగ్రెస్ పార్టీల ప్రభావం ఎంత ఎక్కువ ఉంటే.. అది అంతగా బీజేపీకి అనుకూలిస్తుందన్న వాదనలూ ఉన్నాయి. ఏది ఏమైనా.... త్రిపురలో బహుముఖ పోరుతో లాభపడేది ఎవరో... మార్చి 2న తేలనున్నది.
- స్వరూపి