ఇంట గెలిచి రచ్చ గెలువాలి!
కేంద్రంతో పోరాటం సరే.. తెలంగాణలో సమస్యల పరిష్కారం?
ప్రశాంత్ కిశోర్ సూచనలు కాదు.. ప్రజల గోడు వినండి
నోటిఫికేషన్ల కోసం తల్లడిల్లుతున్న నిరుద్యోగులు
ఆసరా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులు
ప్రజా వ్యతిరేకతను పనులతో పాజిటివ్ చేసుకోండి!
వేకువ ప్రతినిధి: దేశంలో గుణాత్మక మార్పు అంటూ బయలుదేరిన సీఎం కేసీఆర్.. ప్రశాంత్ కిషోర్ సూచనలు పాటిస్తున్న క్రమంలో ...తెలంగాణలో వస్తున్న వ్యతిరేకతలను పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న సూత్రాన్ని పట్టించుకోవడం లేదు. ప్రధానంగా ఇక్కడి ప్రజలతో శహభాష్ అనిపించుకునే చిన్నిచిన్న ప్రయత్నాలను కూడా పాటించడం లేదు. చిన్నచిన్న సమస్యలను కూడా ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దీనికితోడు ముక్కుసూటిగా పోతూ.. పక్కన ఏం జరుగుతుందో పట్టించుకోవడం లేదు. ప్రధానంగా ఎంతోమంది తమకు ఆసరా పెన్షన్లు అందడం లేదని ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు దిగారు. ప్రతీ గ్రామంలో కనీసం ఓ డజన్ మంది పెషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే రైతుబంధు ద్వారా పెద్దపెద్ద భూస్వాములకు అందుతున్న వందలకోట్లు వృథాను అరికట్టగలిగితే సామాన్యులకు పథకాలు అందించవచ్చు. డీఎస్సీ నిర్వహణ, ఉద్యోగాల నోటిఫికేషన్ తదితర అంశాలపై ప్రకటనలకే పరిమితం అయ్యారు.
కేంద్రంతో పోరుకు..
కేంద్రంతో అవిూతువిూకి దిగిన క్రమంలో అనేక సమస్యలను తక్కువగా చేసి కేంద్రంపై దృష్టి కేంద్రీకరించడం వల్ల ఒనగూరే ప్రయోజనం కన్నా వ్యతిరేకత వస్తుంది. ఎప్పుడైనా ఇంటగెలచి..రచ్చ గెలవాలి. అంతా తాను మంచే చేశాననే ఫీల్ గుడ్ వ్యవహారం పనికిరాదు. ఇప్పుడు మోడీ కూడా ఇదే పద్ధతిలో ముందుకు సాగుతున్నారు. మోడీ తరహాలోనే ఒంటెద్దు పోకడలకు పోవడం సరికాదు. ఈ క్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసైకి ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. అసెంబ్లీలో గవర్నర్ అడుగు పెట్టకుండానే ఈ సారి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. గణతంత్ర వేడుకలను రాజ్‌భవన్‌కే పరిమితం చేయడం.. ప్రభుత్వం తరఫున మంత్రులెవరూ ఆ కార్యక్రమానికి హాజరు కాకపోవడం.. మేడారంలో గవర్నర్‌కు ప్రొటోకాల్ పాటించలేదన్న వివాదం.. తాజాగా గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడం.. వంటి ఘటనలన్నింటినీ కూడా కావాలని చేస్తున్నారనే ప్రచారం సాగేవే. ఇలాంటి సమస్యలురాకుండా చూసుకోకుండా ముందుకు సాగడం వల్ల పునాదులు దెబ్బతింటాయి. ఈ పరిణామాలు ముఖ్యమంత్రి కార్యాలయానికి, రాజ్‌భవన్‌కు మధ్య విభేదాలు ముదిరిపోయాయన్న చర్చ జరుగుతోంది. గవర్నర్‌ను నిమిత్తమాత్రురాలిగా చేయడానికి సీఎంవో ప్రయత్నిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
గవర్నర్ వ్యవస్థపై పోరాటం సరే.. ప్రజా సమస్యలు..?
నిజానికి బెంగాల్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థ అభాసుపాలయ్యింది. దీనిపైనా కేసీఆర్ చర్చించారు. నిజానికి గవర్నర్ వ్యవస్థ అక్కర్లేదని ఆనాటి సీఎం ఎన్టీఆర్ గట్టిగానే పోరాడారు. కేసీఆర్ ఎజెండాలో దీనిని ప్రధానంగా చేర్చాలి. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ పార్టీల మధ్య ముదిరిన వివాదం కారణంగా ఆమెను పక్కన పెట్టే ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు. అయితే, రాజకీయ పార్టీల మధ్య ఉన్న పొరపొచ్చాలు, వివాదాలకు వ్యవస్థలను తృణీకరించరాదు. రాజ్యాంగపరమైన పదవులకు విలువ ఇస్తూనే పోరాడాలి. ఒక ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగుతున్న క్రమంలో వివాదాలను కోరి తెచ్చుకోవడం వల్ల ఎక్కువ సమస్యలతో పోరాడాల్సి ఉంటుంది. గవర్నర్ వ్యవస్థపై పోరాడాలన్న సంకల్పం ఉంటే మంచిదే. నుంచి అసెంబ్లీ సమావేశాలు...7వ తేదీనుంచి నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సోమవారం ప్రగతి భవన్‌లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో సమావేశాల తేదీని ఖరారు చేశారు. గత అసెంబ్లీ సమావేశాలు ప్రొరోగ్ కాకపోవడంతో గవర్నర్ ప్రమేయం లేకుండా సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి అనుగుణంగానే శాసనసభా కార్యదర్శి నర్సింహాచార్యులుతో ఉత్తర్వులను జారీ చేయించింది. సాధారణంగా సమావేశాల ప్రారంభ ఉత్తర్వులను గవర్నర్ జారీ చేస్తుంటారు. ఈ ఉత్తర్వులను ఆధారంగా చేసుకుని శాసనసభా కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేస్తారు. రాష్ట్ర రెండో శాసన సభా ఎనిమిదో సమావేశాలు గత సెప్టెంబరు 24న ప్రారంభమై అక్టోబరు 8న ముగిశాయి. అప్పుడు సమావేశాలను నిరవధికంగా వాయిదా వేశారే తప్ప గవర్నర్ ప్రొరోగ్ చేయలేదు. దీంతో ఆ ఎనిమిదో సమావేశాలు ఇంకా కొనసాగుతున్నట్లుగానే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉభయ సభలను సమావేశపర్చాల్సిన అవసరం ఉండదు. ఉభయ సభల సంయుక్త సమావేశం లేనందున.. గవర్నర్ ప్రసంగానికి ఆస్కారం ఉండదని, అందుకే స్పీకర్‌తో ప్రారంభించేలా సమావేశాలను ప్రభుత్వం నిర్ణయించిందని ఆ వర్గాలు వివరిస్తున్నాయి. కాగా, గవర్నర్ లేకుండా సభలు ప్రారంభమైన దృష్టాంతాలు గతంలోనూ ఉన్నాయని, ఇది కొత్తదేవిూ కాదని ప్రభుత్వ వర్గాలు వివరిస్తున్నాయి. 1970లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, ఆ తర్వాత 2014లో తెలంగాణలో గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు సాగాయి. గవర్నర్‌కు, ప్రభుత్వానికి మధ్య చాలా రోజుల నుంచి వివాదం కొనసాగుతోంది. గవర్నర్ కోటా కింద పాడి కౌశిక్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. అప్పటి నుంచి ప్రభుత్వానికి, రాజ్‌భవన్‌కు మధ్య వివాదం రాజుకుందని అంటున్నారు. ప్రతిసారి గణతంత్ర వేడుకలను పబ్లిక్ గార్డెన్‌లో నిర్వహిస్తారు. కానీ.. ఒమిక్రాన్ కేసుల కారణంగా ఈ ఏడాది జనవరి 26న ఉత్సవాలను పరిమిత సంఖ్యలో రాజ్‌భవన్‌లోనే నిర్వహించాలంటూ ప్రభుత్వం నుంచి షెడ్యూలు వెలువడింది. సీఎం కేసీఆర్, ఇతర మంత్రులు ఎవరూ గణతంత్ర వేడుకలకు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది.
అయితే గవర్నర్‌తో వివాదం పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కానీ ప్రజల సమస్యలను పట్టించుకోక పోతే మాత్రం సమస్యలు చుట్టుముడుతాయి. ఈ క్రమంలో తెలంగాణలో ఉన్న వివిధ సమస్యలపై ముందుగా కేసీఆర్ దృష్టి సారించాలి. వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించే ప్రయత్నం చేయాలి. అవి ఖర్చుతో కూడుకున్నవే అయినా వెనకాడరాదు.