జీయర్​ వ్యూహాత్మక దాడులు

జీయర్​ వ్యూహాత్మక దాడులు

– పీడితపక్షాలు ఆయన లక్ష్యం

– పాలకపక్షాల భారీ అండదండ 

– మతానికి రాజకీయ రంగులు!

– అప్రమత్తత లేకుంటే అన్యాయం!


ప్రత్యేక  ప్రతినిధి: 


వాడు మొదట ఊరి బొడ్రాయి గురించి మాట్లాడాడు.

బొడ్రాయే కదా అని 

నేను ఉదాసీనత చూపాను

వాడు బొడ్రాయిని 

ఊరి మధ్య నుండి పెకిలించి పారేసాడు!


తర్వాత వాడు గ్రామ దేవతల గురించి మాట్లాడాడు

గ్రామ దేవతలు పోయినా

నేను నమ్మే దేవుళ్ళు ఉన్నారు కదా అని 

నేను మౌనం దాల్చాను

వాడు గ్రామ దేవతల్ని మాయం చేసి

అక్కడ మంత్రజలం చల్లాడు!


తర్వాత వాడు గిరిజన దేవతలని

అసలు దేవుళ్ళే కాదన్నాడు.

నేను ఉండేది అడవిలో కాదు కాబట్టి

నేను మిన్నకుండి పోయాను

వాడు గిరిజన దేవతల్ని నాశనం చేసి

విషపు నవ్వు నవ్వాడు!


తర్వాత వాడు మైనారిటీలు పూజించే

దేవుళ్లపై పడ్డాడు.

వాళ్ళు మన దేశపు దేవుళ్ళే కాదు అన్నాడు

దేశభక్తి తో నా కళ్ళు మూసుకుపోయిన కారణాన

నేను నోరు మెదపలేదు

వాడు మైనారిటీ దేవుళ్ళని మాయం చేసాడు!


తర్వాత వాడు నేను నమ్మే శైవంపై దండెత్తాడు

నాలో సన్నగా భయం పొడసూపింది

ఆసరా కోసం చుట్టూ చూసాను

అప్పటికే నా చుట్టూ ఉన్న వారు

అశక్తులై పోయి ఉన్నారు.

వాడు అనార్య దేవుళ్లంటూ శివుడ్ని భస్మం చేసాడు!


చివరికి వాడు నన్ను మనిషివే కాదన్నాడు

మద్దతు కోసం సాటి మనుషుల వైపు చూసాను

అప్పటికే వాళ్ళు తిరునామాలతో

నోర్లు కుట్టబడి, చేతులు కట్టబడి ఉన్నారు.

వాడు నన్ను కట్టివేసి నిల్చోబెట్టాడు


వాడు నన్ను దేశద్రోహివన్నాడు,

మత ద్రోహివన్నాడు,

అర్బన్ నక్సలైట్ అన్నాడు,

తీవ్రవాదివన్నాడు.

నిజానికి నేనేనాడు 

నా గొంతు విప్పి మాట్లాడిందే లేదు

నేను చేసిందల్లా వాడి 

దేవుణ్ణి పూజించకపోవడమే.

ఇపుడు ఒంటరి బంధీని అయ్యాక అనిపిస్తుంది

నేను అప్పుడే గొంతెత్తి ఉంటే బాగుండేది అని

కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందీ!


ఎవరు రాశారోగానీ ఇందులో అక్షరసత్యాలున్నాయి. గత కొద్ది కాలంగా దేశంలో జరుగుతున్న మెజారిటీ మతాధిపత్య పరిణామాల పరిభ్రమణం ఆందోళన రేకిత్తించే స్థాయికి చేరుతోంది. ఊరి బొడ్రాయి గురించి మాట్లాడినప్పుడే నేను మాట్లాడి ఉంటే ఈ రోజు నేను బంధీనయ్యేవాన్ని కానేమో!? కులాల గురించి మాట్లాడినప్పుడే కూకటివేళ్ళతో పెకిలిస్తే ఈ దుస్థితి దాపురించేది కాదేమో! పీడిత కులాల ఆహారపు అలవాట్ల పై మాట్లాడినపుడు ఎదురుతిరిగితే జ్క్షానోదం కలిగేదేమో! మరో అడుగు వేసి ఆదివాసీ గిరిజన దేవతల పై దిగజారుడు వ్యాఖ్యానాలు చేసేందుకు వెనకంజ వేసేవారేమో? ఏమైనా ప్రారంభంలో మేము చేసిన పొరపాటు ఇవ్వాల మాకే ఉరితాడుగా మారుస్తున్నారనే  దారుణ పరిస్థితి నెలకొంది. ఆధిపత్య మతం పేరుతో దాడులు చేస్తామంటూ బహిర్గతంగా ఎంత భయాందోళనలు సృష్టిస్తున్నారో అంతర్గతంగా నా ఆలోచణలను నియంత్రిస్తూ నన్నూ నా భావాలను నిర్భంధించే కుట్రసాగుతోంది. 


– పేరుకే సన్యాసీ...పేట్రేగుతున్న తీరు 


బహిరంగ ఆహర్యం సన్యాసి రూపం. సర్వసంగ పరిత్యాగి అనే పేరు. అద్వైతానికి ఆరాధ్యుడైన రామానుజుని పరంపరలో ఎదిగివచ్చిన చిన జీయర్​ స్వామీజీ. హిందూ మత విశ్వాసి. వైధిక ధర్మాన్ని ప్రబోధిస్తారు. వీటన్నింటికి ఎవరూ ఎలాంటి అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదూ. కానీ, అది వారి అంతర్గత లక్ష్యం అది కానప్పుడు అసలైన టార్గెట్​ చేరుకునేందుకు అవసరమైన దారులు వేసుకుంటారు. ఆధిపత్య భావజాలానికి అండగా నిలిచే రాజకీయ పార్టీలను రక్షించేందుకు ఎంతటి మాటలకైనాసిద్దమైతారు. ఎదుటివారిని తూలనాడేందుకూ, కించపరిచేందుకు ఎలాంటి వెనుకాముందాడే ప్రసక్తి లేదు. ఇండియాలో మెజారిటీమతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని పదేపదే చెప్పే ఈ  హిందూమత ప్రవచనకారులు, వారి రాజకీయ అనుచరులు  ఈ పరిమితి, పరిధుల మేరకు ఎందుకుంటారు? అందుకే అప్పుడప్పుడు వారి నిజస్వరూపం వెల్లడిస్తారు. అందులో భాగమే చినజీయర్​ స్వామి వెల్లడించే సూక్తులు. 


– తెలంగాణలో వేళ్ళూనుకున్న జీయర్​ 


దేశవ్యాప్తంగా ప్రధానంగా రెండు తెలుగురాష్ట్రాల్లోనూ పెట్రేగిపోతున్న పీఠాధిపతుల ఆధిపత్యం అందరికీ తెలిసిందే. వాస్తవానికి తెలంగాణలో పీఠాధిపతులు, పీఠాల సంస్కృతి కారణమేదైనా పెద్దగా లేక పోవడం గమనార్హం. కానీ, ఈ మధ్యకాలంలో సీఎం కేసీఆర్​ అందించిన అండదండలు, మైహోం రామేశ్వర్​రావు రూపంలో, యాదాద్రి పునర్నిర్మాణం పేరుతో  చేపట్టిన అడుగులు చినజియర్​ స్వామిలాంటి వారి పెత్తనం పెరిగిపోయింది. సమతామూర్తి పేరుతో హైదరాబాద్​ పరిసరాల్లో అడ్డా వేసేందుకు ఉపకరించింది. ఈ పీఠాధిపతి ఇప్పుడు రాష్ట్ర అధికార పీఠాన్ని సవాల్​చేసే స్థాయికి చేరుకుందని అంటున్నారు. బీజేపీకి సన్నిహితంగా మెదులుతూ కేసీఆర్​కే ఏకుమేకయ్యారనే ప్రచారం సాగుతోంది. ఇరువురి మధ్య సాన్నిహిత్యం చెడిందని, ఇందులో మైహోంరామేశ్వర్​రావు పాత్ర ఉందని అంటున్నారు. ఈ క్రమంలోనే జీయర్​ పాత వీడియాలో తాజా విడుదల్లో అధికార పక్ష హస్తం కూడా ఉందనే ఆరోపణలు వ్యక్తమైతున్నాయి. ఆదాయం పెరిగితే చాలు  పన్ను విధించే సర్కార్లు, అధికారులు కోట్ల నిధుల వెనుక సూత్రదారులెవరూ? పాత్ర దారులెవరనే ప్రశ్న వ్యక్తం కాకపోవడం వి‘శేషం’. 


– ప్రణాళిక బద్ద వ్యూహాత్మక దాడి


పాలక ప్రభుత్వాలు కల్పించిన ప్రాధాన్యతరీత్యా ఇయ్యాల వైదిక మతానికి జియ్యర్​ను​ ప్రతీకగా మార్చే ప్రయత్నం సాగుతోంది. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా ఆయనకు ఎక్కడలేని ప్రాధాన్యత నెలకొంది. ఆయన ప్రవచనాలు అత్యంత ఖరీదుగా మారాయి. ఆయన చెబితే దానికి సాధికారత లభించినట్లుగా పరిస్థితిని కల్పించారు. దీనికి కేంద్రంలోని బీజేపీతో పాటు, రాష్ట్రంలోని టీఆర్​ఎస్​ ఇతర రాజకీయ పక్షాల్లోని ప్రముఖ నాయకుల పాత్ర తక్కువేమి కాదు. అందుకే ఆయన ప్రవచనాల పేరుతో ప్రణాళిక బద్దమైన దాడిని కొనసాగిస్తున్నారు. 


– పీడితకులాలపట్ల దారుణ వివక్ష 


మొదట ఆయన కులాల గురించి మాట్లాడుతూ కుల వ్యవస్థను బహిరంగంగా సమర్ధించారు. ఆయా కులాల పొందిక లేకుంటే వర్ణ వ్యవస్థకు ప్రమాదం ఏర్పడుతోందనే స్థాయిలో మాట్లాడిన ఖండించిన నేతలు కానరాలేదు. సమాజంలో కులాల పొందికలో ఎంతో గొప్పతనం ఉందంటూ వర్ణవ్యవస్థ సంకుచితత్వాన్ని చాటేందుకు ప్రయత్నించారు. ఈ కూర్పు మారితే ఎంతో నష్టమని ప్రవచించారు. ఒక విధంగా ఈ చాతుర్వర్ణ వ్యవస్థ కొనసాగింపును సిగ్గూఎగ్గూ లేకుండా సమర్ధించారు. ఇటీవల సమతామూర్తి విగ్రహావిష్కరణలో కులాల ప్రాతిపదికన పనుల అప్పగింత విమర్శలకు తావిచ్చింది. 


–  పీడిత కులాల ఆహార అలవాట్లపై దాడి


కులాల విభజనను సమర్ధించిన జీయర్​ మధ్యలో పీడిత కులాల ఆహారపు అలవాట్లపై దాడి చేశారు. ఇందులో ముఖ్యంగా మాంసాహారం తినే వారిని టార్గెట్​ చేసి మాట్లాడారు. పంది మాంసం తింటే పంది ఆలోచనలొస్తాయి... మనిషి ఆలోచనలు రావు. మేక మాంసం తింటే అదే బుద్ది అంటే గొర్రెలెక్క ఒకటి పోతుంటే దానివెనుక పోవడం తప్ప సొంత ఆలోచనలు రావంటారు. , కోడిగుడ్డు తింటే కొడిబుద్ది తీరు ఆ పెంట మీద ఈ పెంట మీద ఏరుకుతినడమే వస్తాయని, ఏ జంతువు మాంసం తింటే ఆ లక్షణాలు వస్తాయని చాలా చీప్​గా మాట్లాడి కింది కులాల ఆహారపు అలవాట్లపై దాడి చేశారు. పైగా దీనిలో హైళన ఉంది. దీనిని కూడా కొందరు పట్టీపట్టనట్లు వ్యవహరించారు. 


– ఆదివాసీ వనదేవతలపట్ల వివక్ష 


ఆదివాసీ గిరిజన దేవతలుగా కొలిచే సమ్మక్క-సారలమ్మల జాతరను అవమానపరస్తూ చినజీయర్ దుర్మార్గమైన కామెంట్స్ చేశారు. ఈ వీడియా పాతదైనా ఇందులో ఆయన వనదేవతలను పూజించడం పై విషం కక్కారు. 

అసలు సారక్క, సమ్మక్క ఎవరూ? పోనీ దేవతా...? బ్రహ్మలోకం నుంచి దిగొచ్చినావాళ్ళా? ఏమిటీ చరిత్ర? అదేదో ఒక అడవి దేవత. ఏదో గ్రామ దేవత.  పోనీ చేసుకోనియ్యండి అక్కడి వాళ్ళు, చదువుకున్నవాళ్ళు,  పెద్ద పెద్ద వ్యాపారస్తులు, ఆ పేర్లతో బ్యాంకులు పెట్టేశారు. దట్​ బికేమ్​ ఏ బిజినెస్​ నౌ ( అది ఇప్పుడు వ్యాపారమై పోయింది) ఎంత అన్యాయం చేశారండీ...అది ఒక చెడు. నువ్వు సమాజంలో కావాలని వ్యాపింపజేస్తున్నవ్​. అంటూ తన కడుపులోని కాలకూట విషం కక్కారు. 

ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం జాతరకు ఉన్న గొప్పతనాన్ని చూడలేని తత్వమిది. కోట్ల రూపాయల ఆయన ఖరీదైన బ్రాహ్మణ సమారాధోనోత్సవాలకు లేని ఆదరణ ఈ గిరిజన ప్రజల ఆరాధ్యదైవాలపట్ల ఉండడాన్ని జీర్ణించుకోలేక ఉద్దేశ్యపూర్వకంగా చేసిన దాడి. హంగూ అర్భాటం, వేల కోట్ల సామ్రాజ్యం, ప్రచార సాధనలూ, దేశ, రాష్ట్ర నేతల రాకపోకలు, కీర్తనలు, కీర్తికిరిటీలూ బంగారు విగ్రహాలు, భారీ మూర్తులు, ప్రత్యేక విమానాలు పకడ్బంధీ ఏర్పాట్లు. సర్కార్లు సాగిలపడి చేసిన దేదీప్యమానాలు మనం ఇటీవల చూసినవే. ఇతర దేశాల్లో విగ్రహాల రూపకల్పనలు ఇన్నీ చేస్తే జనాదరణ రాలేదని అక్కసు కావచ్చు. ఈ దాడిలో భారీ కుట్ర ఉంది. పీడిత ప్రజల సంస్కృతి,సాంప్రదాయాలను ధ్వంసం చేస్తూ పకడ్బందీ వ్యూహం తో బ్రాహ్మణీయహిదూత్వ సంసృతి నిర్మాణం చేసుకుంటూ వాళ్లఎజెండాను అమలుచేస్తున్నారు. హిందుత్వ ఆధిపత్యాన్ని వ్యవస్థీకృతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.  ఈ దాడి ఇవ్వాల జీయర్​ స్వామి రూపంలో కన్పించినా రానున్న రోజుల్లో మరో వ్యక్తి ఈ దాడిని కొనసాగించే అవకాశం ఉంది. మతం రాజకీయాధికారానికి పనిముట్టుగా మారిపోయిన విషయం బహిర్గతమైందీ! మతాధిపతుల స్థాయి నుంచి మన రాజకీయ నాయకుల నోట్లో ఓట్లు రాల్చే యంత్రంగా మారిపోయింది! రానున్న కాలంలో దీని విషపు కోరలు అందరినీ కాటేయకముందే అప్రమత్తం కావడం అత్యంత అవసరం! 


నేల కోసం పోరాడిన 

అమరులను నమ్మకం కొలిస్తే 

అమ్మలైన 

సమ్మక్క, సారలమ్మలు

సామాన్యులింట సద్దిబువ్వ!

జనం బిడ్డలను 

వనదేవతలుగా కొలిచే 

ఘన సంస్కృతీ!

కంకబొంగు

కుంకుమభరిణ

ఇప్పసార పుప్పొడిల

మట్టిపరిమళత్వం నీకెక్కదర్ధమైతదిలే!?

Relative Post

Newsletter