ఆవిరవుతున్న అమెరికా ఉద్యోగాలు కుటుంబాలను బలితీసుకుంటున్నాయా..?
ఆవిరవుతున్న అమెరికా ఉద్యోగాలు కుటుంబాలను బలితీసుకుంటున్నాయా..?
కంప్యూటర్, సాంకేతిక నిపుణులుగా అమెరికాలో అడుగుపెట్టిన భారతీయుల ఆశలు పేక మేడల్లా కూలుతున్నాయి. అమెరికాలోని దిగ్గజ కంపెనీలన్నీ ఉద్యోగులను తొలగించుకొని ఖర్చులను తగ్గించుకొనే ప్రక్రియను చేపట్టడంతో వేలు, లక్షల సంఖ్యలో భారతీయులు రోడ్డున పడుతున్నారు. ఇలా ఉద్యోగం కోల్పోయిన భారతీయులు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న సంక్షోభం తీవ్రమైనది. యువకులుగా, ఉద్యోగులుగా అమెరికాలో అడుగుపెట్టిన వారిది ఒక సమస్య అయితే.., వారి సంతానంగా అక్కడే పుట్టి పెరిగిన పిల్లల పరిస్థితి మరింత సున్నితమైనది, గంభీరమైనది. తల్లిదండ్రులు ఉద్యోగం కోల్పోతే... తాము ఎక్కడ ఇండియాకు తిరిగి పోవాల్సి వస్తుందేమోనన్న భయాందోళనలతో ఓ 14ఏండ్ల బాలిక ఇంటినుంచి పారిపోయింది. అమెరికాలోని భారత యువతీ యవకులు, కుంటుంబాల సంక్షోభ స్థితికి అద్దం పడుతున్న తన్వీ మరిపెల్లి గాథ ఇది...
తన్వీ మరిపెల్లి తల్లిదండ్రులిద్దరూ అమెరికా అర్కన్సాస్‌లో టెక్ ఉద్యోగులు. తండ్రి పవన్ రాయ్, తల్లి శ్రీదేవి. ఎప్పటిలాగే జనవరి 17న ఇంటినుంచి స్కూల్ బస్సు ఎక్కిన తన్వీ తిరిగి ఇంటికి రాలేదు. తెలిసిన వారు, స్నేహితుల ఇంటికి పోయిందను కొని ఒకటి రెండు రోజులు చూసి, వెతికినా జాడ తెలియలేదు. తన్వీ దారి తప్పిపోలేదు. ఓ పరిస్థితి నుంచి తప్పించుకొనేందుకు కావాలని కుటుంబంనుంచి అందనంత దూరం పారిపోయింది...ఈ మధ్యకాలంలోనే తన కుటుంబంలో చోటుచేసుకొన్న పరిణామాలు చిన్నారి తన్వీని తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. ఆ మధ్యనే తన తల్లి శ్రీదేవి ఉద్యోగం కోల్పోయింది. ఉద్యోగం, వర్కింగ్ వీసా లేక పోతే.. అమెరికాలో ఉండటానికి ఎవరికీ అవకాశం ఉండదు. దీంతో చేసేది లేక.. శ్రీదేవి ఇండియా తిరిగి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆమె డిపెండెంట్ వీసాకు దరఖాస్తు చేసుకొని, అది మంజూరై భారత్ నుంచి అమెరికా చేరుకొనే సరికి ఆమెకు ఏడాది కాలం పట్టింది. అన్నాళ్లూ తన్వీ తండ్రి దగ్గర ఒంటరిగా, తల్లికి దూరంగా ఉండాల్సి వచ్చింది.
తాజాగా .... తండ్రి పవన్‌రాయ్ ఉద్యోగం చేస్తున్న కంపెనీ కూడా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అందులో పవన్ రాయ్ ఉద్యోగం కూడా కోల్పోవచ్చు అని తెలిసింది. దీంతో తన్వీ తీవ్ర ఆందోళనకు గురైంది. ఉద్యోగం పోతే ఎలా.. అని తండ్రిని తన్వీ అడిగింది. ఉద్యోగానికి ప్రయత్నిద్దాం.. లేదంటే... ఇండియా వెళ్లి తగు ఏర్పాట్లు చూసుకొని భారత్ వెళ్లిపోదామని పవన్‌రాయ్ అన్నాడు. అయితే... మీతో పాటు నేను కూడా ఇండియా రావాలా..? అని ప్రశ్నించింది. అమెరికాలో పుట్టి పెరిగిన తన్వీకి ఇండియా గురంచీ.., ఇక్కడి జీవన పరిస్థితుల గురించి ఏ విధమైన అంచనా, అవగాహన ఉన్నదో... కానీ ఆమె తీవ్రంగా కలతచెందింది. ఆ క్రమంలోంచే... తన్వీ ఇంటినుంచి పారిపోయినట్లు తెలుస్తున్నది. కనిపించకుండా పోయిన కూతురు తన్వీ ఘటనపై పవన్ రాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆర్కన్సాస్ పోలీసులు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయినా ఆచూకీ లేదు. బంగారు కలలు, కోటి ఆశలతో అమెరికా చేరుకున్న యువతీ యువకులు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడటంతో.. వారి జీవితాలు ఏ దరి చేరుతాయో చెప్పటం కష్టం. ఐదెంకెల జీతాలతో జీవంచటానికి అలవాటు పడిన వారు మరో సాధారణ జీతభత్యాలతో సరిపెట్టుకోవటం సులువైన విషయం కాదు. ఆ క్రమంలోంచే అనేక ఆత్మహత్యలు, విషాదాంతాలు వెలుగు చూస్తున్నాయి. ఈ విధమైన దుస్థితి ఒకటి అయితే... భారతీయ జీవనం అనేదే తెలియకుండా అమెరికాలోనే పుట్టి పెరిగిన ఈ తరం పిల్లల పరిస్థితి మరింత అగమ్యగోచరం. అమెరికా కాకుండా మరోచోట తమ జీవితాన్ని ఊహించుకోవటం బరించలేనిదిగా భావించే పిల్లల పరిస్థితులు ఎంతటి పరిణామాలకు దారితీస్తున్నాయో ఈ ఘటన ఓ సక్ష్యం. కరోనా కష్టకాలానికి., ఆర్థిక మాంద్యం తోడవటంతో అగ్రరాజ్యం అమెరికా అతలా కుతలం అవుతున్నది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన అమెరికా దిగ్గజ టెక్ కంపెనీలన్నీ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకొనే ప్రక్రియ చేపట్టాయి. దీంతో చరిత్రలో మున్నెన్నడూ లేని స్థాయిలో నిరుద్యోగం పెరిగిపోయింది. ఈ మధ్యనే జరిగిన ఓ అధ్యయనం ప్రకారం... అమెరికాలో 5 కోట్ల 70లక్షల మంది నిరుద్యోగులున్నారు. స్థూలంగా పరిస్థితి ఇలా ఉంటే... అమెరికాలోని ప్రధాన టెక్ కంపెనీలన్నీ లే ఆఫ్‌లతో ఉద్యోగుల కుదింపు చర్యలు చేపట్టాయి. ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులు కలిగిన 25 కంపెనీలు తమ ఉద్యోగుల్లో ఐదు నుంచి 10శాతం మంది ఉద్యోగులను తొలగించి నిర్వహణా ఖర్చులను తగ్గించుకొనే చర్యలు చేపట్టాయి.
అమెరికా టెక్ కంపెనీల్లో ప్రధానంగా చెప్పుకొనే అమెజాన్ కంపెనీ 18వేల మందిని ఇంటికి పంపింది. అలాగే... ఐబీఎం- 3,900, డెల్-6,600, సీటీ గ్రూప్మై- 2,040, క్రోసాఫ్ట్- 10వేలు, ఆల్ఫాబీట్-12 వేలు, డిస్నీ తాజాగా 7వేల మందితో కలిపి ఇప్పటిదాకా 32వేలు, అమెరికన్ ఎయిర్ వేస్ -40వల మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి. సాంకేతిక నిపుణులుగా ఉన్నత ఉద్యోగాల వెతుకులాటలో అమెరికాలో అడుగుపెట్టిన భారతీయులు సుమారుగా రెండు లక్షల మందిదాకా ఉద్యోగాలు కోల్పోయినట్లు తెలుస్తున్నది. ఈ కుటుంబాల్లోని తన్వీల పరిస్థితి ఏమిటనేది ఇవ్వాళ లక్ష డాలర్ల ప్రశ్న. అమెరికాలో భారత సంతతికి చెందిన వారు 31.80లక్షల మంది ఉంటారని అంచనా. ఎన్ ఆర్ ఐలుగా ఉద్యోగులుగా సుమారు 13 లక్షలదాకా ఉంటారు. భూతల స్వర్గంగా భావించి, భ్రమించి అమెరికా చేరుకున్న వీరంతా ఇప్పటికైనా ఆలోచించాలి. లక్షల జీతాలు పోతే... వేలల్లో బతకటం ఎలాగో... అలవర్చుకోవాలి, సంసిద్ధం కావాలి. ముఖ్యంగా పిల్లలకు భారతీయ జీవన విధానం గురించి, అందులోని సాధారణత్వం గురించి తెలియపర్చాలి. ఇక్కడి సారవంతమైన సాంస్కృతిక జీవనాన్ని చూపించాలి. తద్వారా... తమ మూలాలు అంటేనే అసహ్యించుకొనే, భయపడే దుస్థితి నుంచి పరిరక్షించుకోవాలి. అప్పుడు మాత్రమే తన్వీ లాంటి నేటి తరాన్ని కాపాడుకోగలం.
-శ్రామిక