పాలకులకు పౌరుల వలసలపై పట్టింపు లేదా..
పాలకులకు పౌరుల వలసలపై పట్టింపు లేదా..
ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తున్నదనీ, దేశం వెలిగిపోతున్నదనీ పాలకులు చెప్పుకొస్తున్నారు. సుస్థిర, సమర్థ పాలనలో దేశం ఆత్మనిర్భర్‌గా అవతరించిందని అంటున్నారు. పాలకులు ఈ విధమైన గొప్పలు పోతున్న కాలంలోనే ... మున్నెన్నడూ లేని స్థాయిలో దేశ పౌరులు తమ పౌరసత్వాన్ని వదులుకొని విదేశాలకు వెళ్లిపోతున్నారు! ఒక్కరు కాదు, ఇద్దరు కాదు... ఏకంగా ఈ 11 ఏండ్ల కాలంలో 16 లక్షల 60 వేల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు తమ మాతృభూమిని వదిలి విదేశాలకు వలస వెళ్తున్న స్థితి తీవ్ర ఆందోళనక కరం. ఈ విషయాన్ని మన పాలకులు ఓ సాధారణ విషయంగా చెప్పుకురావటం దిగ్భ్రాంతి కరం. గత కొంత కాలంగా చూస్తే... భారత్ నుంచి వలసలు గణనీయ సంఖ్యలో ఉంటున్నాయి. గతంలో అయితే... ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి , అత్యున్నత ప్రమాణాలు గల సంస్థల్లో పరిశోధకులుగా, నిపుణులుగా ఉద్యోగాలు చేసేవారు. ఆ క్రమంలో అతి తక్కువ మంది మాత్రమే భారత పౌరసత్వాన్ని వదులుకొని విదేశాల్లో స్థిరపడేవారు. కానీ అది ఈ మధ్య కాలంలో పూర్తిగా మారిపోయింది. ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం విదేశీ తోవ పట్టటం అనేది ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో సాధారణంగా జరుగుతుంది. అలా విదేశాలకు పోయే వారు వందలు, వేలల్లో ఉంటారు. కానీ కొన్నేండ్లుగా దేశం నుంచి ఓ ప్రవాహంగా విదేశీ ప్రయాణం కనిపిస్తున్నది.ముఖ్యంగా 2015నుంచి పౌరసత్వాన్ని వదులుకొంంటున్న వారు లక్షల్లో ఉంటున్నారు. 2015 సంవత్సరంలో 1.31లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకోగా.. 2016లో 1.41లక్షలు, 2017లో 1.33లక్షలు... ఇలా ఏటా లక్షమందికి పైగా పౌరసత్వాన్ని వదులుకొని విదేశాల్లో స్థిరపడుతున్నారు. అది క్రమంగా 2021నాటికి 1.63లక్షలకు పెరిగి, 2022నాటికి గరిష్టంగా 2.25,620మందికి చేరుకున్నది. ఇది కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాలంలోనే గణనీయంగా పెరిగిపోవటం గమనార్హం.
గతంలో ... ఉన్నత చదువులు చదివిన వారు, అత్యున్నత ప్రమాణాలు గల వృత్తి నిపుణులు విదేశీ బాట పడుతున్నారనీ, ఇది దేశానికి తీరని నష్టమని భావించేవారు. దీన్నే మేధో వలసగా పిలిచి దీర్ఘకాలంలో ఇలాంటి వలస దేశాభివృద్ధికి నష్టం చేకూరుస్తుందని ఆందోళన చెందారు. ఇప్పుడు ఈ రీతిన పౌరసత్వాన్నే వదులుకొని విదేశాల్లో స్థిరపడటానికి సిద్ధపడటం వెనుక సామాజిక కారణం ఉన్నదని అంటున్నారు. కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో అసహనం, హింసా దౌర్జన్యాలు, మూక దాడులు పెరిగిపోయాయి. సామాజిక భద్రత కరువైన స్థితి కండ్లముందు కనిపిస్తున్నది. ఇలాంటి సామాజిక పరిస్థితుల్లోంచే భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకొని 135 దేశాలకు వలస వెళ్తున్నారు. ఒక వ్యక్తి తన స్వంత ఊరును వదిలిపెట్టే పరిస్థితి ఎదురైతే... ఎంతగానో తన్లాడుతాడు. కరువు కాటకాల కారణంగానో, ఉపాధి దొరకని స్థితిలోనో కన్న ఊరును వదిలి వలస బాట పట్టాలంటే.. జీవితాన్నే కోల్పోతున్నంతగా బాధపడుతాడు. అలాంటిది మాతృదేశాన్ని వదిలివెళ్లే స్థితి ఎదురవుతున్నప్పుడు ఉండే వేదన అంతులేనిది. అయినా లక్షల సంఖ్యలో భారతీయులు వలస బాట పడుతున్నారంటే... పరిస్థితి తీవ్రతను గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఏమైనా.. ఈ తీరు వలసలు దేశాభివృద్ధికి నష్టం అనక తప్పదు. ఇప్పటికైనా... ఈ వలసలపై భారత ప్రభుత్వం ఆలోచిస్తుందా..? దేశ భక్తి , మాతృభూమి గురించి గొప్పలు పోయే వారు ఈ పరిస్థితిపై పెదవి విప్పుతారా..? అన్ని వర్గాల ప్రజల జీవన భద్రతకు, శాంతికి మన పాలకులు హామీ పడాల్సిన అవసరాన్ని ఈ వలసలు తెలియజేస్తున్నాయి.
-శ్రామిక