సిరియాపై ఇజ్రాయిల్ విమానదాడులు అమానుషం సాయం అందించాల్సిన సమయంలో బాంబుదాడులా..!
సిరియాపై ఇజ్రాయిల్ విమానదాడులు అమానుషం
సాయం అందించాల్సిన సమయంలో బాంబుదాడులా..!
సిరియా-తుర్కియేలో ఇటీవల సంభవించిన భూ కంపం నుంచి ఆ దేశాలు ఇంకా తేరుకోకముందే... సిరియా రాజధాని డమాస్కస్‌పై ఇజ్రాయిల్ విమానదాడికి పాల్పడింది. ఈ దాడిలో సెంట్రల్ డమాస్కస్ లోని అనేక ఇండ్లు ధ్వంసమయ్యాయి. 15మంది మరణించారు. ఒక వైపు భూకంప బాధితులను రక్షించే సహాయక చర్యలు ఇంకా కొనసాగుతుండగానే ఇజ్రాయిల్ ఈ విధమైన దాడికి పాల్పడటంతో అంతర్జాతీయ సమాజం విస్తుపోతున్నది. భూ కంపం సృష్టంచిన పెను విధ్వంసం కారణంగా సర్వం కోల్పోయి మనుషులు ఆహాకారాలు చేస్తుంటే... ఇజ్రాయిల్ దాడి చేయటం అమానుషం. ఇదిలా ఉంటే... ఇరాన్ మిలిటెంట్లే లక్ష్యంగా తమ దాడులు కొనసాగాయని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ ప్రకటించటం గర్హనీయం.
చరిత్రలోనే అత్యంత వినాశకరమైన భూ కంపాల్లో సిరియా-తుర్కియే భూకంపం ఒకటిగా పరిగణించబడుతున్నది. భూ కంపం ధాటికి ఇండ్లు నేలకూలి నివాసితులంతా శిథిలాల కింద నలిగిపోయారు. ఇప్పటిదాకా ఈ రెండు దేశాల్లో మృతుల సంఖ్య 45 వేలకు దాటింది. ఆరో రోజు సహాయక చర్యలు చేపడుతున్న క్రమంలో శిథిలాల కింద చిక్కి కొన ఊపిరితో ఉన్నవారు ఇంకా కనిపిస్తున్నారు. వారిలో ఐదు రోజులుగా ఆహారం, నీరు లేకపోయినా పిల్లలు, యవకులు సజీవంగా బతికి వస్తున్న వారిని చూస్తే ఎంతటి రాతిగుండె అయినా కరుగక మానదు. శిథిలాల కింద ఇంకా ఎంత మంది ఉన్నారో అంచనాకు అందటం లేదు. మరో వైపు రోజులు గడుస్తున్నాకొద్దీ శిథిలాల కింద చిక్కిపోయిన వారు బతికి ఉండే ఆశలు సన్నగిల్లుతున్నాయి. సహాయక చర్యలు ఎప్పటికి పూర్తవుతాయో కూడా తెలియటం లేదు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉన్నది.
2011 అరబ్ స్ప్రింగ్ ఉద్యమాలనేపథ్యంలో... సిరియాలో బషార్ ఆల్ అసద్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. నాటినుంచి నేటిదాకా... ఆ ఉద్యమం కొనసాగుతూనే ఉన్నది. సిరియాలో అధికార అసద్ పాలనకు మద్దతుగా ఇరాక్, రష్యా, హిజ్‌బుల్లా సేనలు పోరాడుతున్నాయి. ఒకానొక దశలో అసద్ సేనలకు మద్దతుగా రష్యా విమానదాడులను కూడా చేసింది. ఈ నేపథ్యంలో తిరుగుబాటు దారులకు మద్దతుగా అమెరికా, ఇతర యూరప్ దేశాలు మద్దతునిస్తున్నాయి. ఆయుధ, ఆర్థిక సాయంతో తిరుగుబాటును ప్రోత్సహిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్ట సమస్యగా సిరియా మారింది. నిజానికి నేటి పాలకుడు బషార్ అల్ అసద్ తండ్రి హఫీజ్ ఆల్ అసద్ పాలన ప్రారంభమైన 1971నుంచీ సిరియాలో అంతర్యుద్ధం కొనసాగుతున్నది. ప్రపంచంలోనే సుదీర్ఘ, అంత్య సంక్లిష్ట సమస్యగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో కనీసం 6 లక్షల మంది చనిపోయారని అంచనా.
దశాబ్దాలుగా అంతర్యుద్ధ సంక్షోభంలో కూరుకుపోయిన సిరియాలో ఈ భూ కంపంతో మరింత దయనీయ పరిస్థితులు ఏర్పడ్డాయి. సహాయక చర్యలు అన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్న స్థితి లేదు. ప్రభుత్వ ఆధీనంలోని ప్రాంతాల్లో సహాయ చర్యలు ఒక మోస్తరుగా అందుతుంటే.., తిరుగుబాటు దారుల ఆక్రమణలో ఉన్న ప్రాంతాలకు సహాయం చేరటం లేదు. దీంతో ప్రజలు ఆకలి దప్పులతో అలమటిస్తున్నారు. ఇండ్లు కూలి గడ్డకట్టే చలిలో రోజుల తరబడి ఉండటంతో మరింత మంది జబ్బులతో చనిపోతున్నారని పరిశీలకులు అంటున్నారు. భూ కంపంతో కూలిపోకుండా ఉన్న హాస్పిటళ్లలో కాలుపెట్టడానికి కూడా సందు లేనంతగా క్షతగాత్రులు నేలపై పడి ఉన్నారని తెలుస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజమంతా మానవతా దృక్పథంతో బాధితులకు సహాయం అందించాలి. సిరియాకు ఇది మరింత అవసరం. ఆహారం, బట్టలు, ఔషధాలతో ఆదుకోవాల్సిన పరిస్థితుల్లో ఇజ్రాయిల్ సిరియాపై విమానదాడికి పాల్పడటం దిగ్భ్రాంతి కరం. ఈ దాడితో ఇజ్రాయిల్ అంతర్జాతీయ న్యాయసూత్రాలను కూడా తుంగలో తొక్కింది. ఇలాంటి దుశ్చర్యలను ఐక్యరాజ్యసమితితో సహా ప్రపంచ దేశాలన్నీ ఖండించాలి. ఏ కారణం చెప్పినా... ఇప్పుడున్న స్థితిలో సిరియాపై ఇజ్రాయిల్ దాడి సమర్థనీయం అనిపించుకోదు.
-శ్రామిక