ప్రేమకు పాతరేసి ఆవును హగ్ చేసుకొనే కు సంస్కృతి...!!
ప్రేమకు పాతరేసి ఆవును హగ్ చేసుకొనే కు సంస్కృతి...!!
తలకాయ చరిత్ర పూర్వయుగంలోనే అట్టిపెట్టి... కాళ్లు కంప్యూటర్ యుగంలోకి సాచి... నడుస్తున్న వాళ్లది వింత పోకడ. అత్యాధునిక సూపర్ కంప్యూటర్‌ను కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించే టెక్నోక్రాట్లు..., రోదసిలోకి రాకెట్లను విజయవంతంగా పంపేందుకు దాని నమూనాను ఏడుకొండల వేంకటేశ్వరుని గుండంలోవేసి అంతా నీదేనయా అంటూ మొక్కులు సమర్పించుకొనే వి(ంత)జ్ఞానులుంటారు. ఇలాంటి వ్యక్తిగత ఆచరణలు, వ్యవహరాలు చూడటానికి తమాషాగా ఉంటాయి. వాటితో ఎవరికీ ఏ పేచీ లేదు. ఒకింత నవ్వుకొని ఊరుకుంటాం. అది సామాజికమైనప్పుడే తంటా. అదింకా.. అధికార వర్గంచేతిలో వ్యవస్థీకృతమై జన జీవితంలోకి వస్తున్నప్పుడు... తమాషా స్థాయి నుంచి... గంభీర విషయంగా మారుతుంది. వాటిని అనుసరిస్తున్న వారిపట్ల పేచీ పెట్టుకోవాల్సిన అగత్యం ఏర్పడుతుంది. సరిగ్గా అదే... ఇప్పటి వర్తమానం.ప్రేమికుల రోజు (వాలంటైన్స్ డే) విదేశీ సంస్కృతి అంటూ... దేశం మీద పడి ఇన్నాళ్లూ నానాయాగి చేసిన వాళ్లు ఇప్పుడు ఆవును హగ్ చేసుకోవాలని అంటున్నారు. ఫిబ్రవరి 14ను ప్రేమికుల రోజును ఆవు కౌగిలింత రోజుగా పాటించాలని పిలుపునిస్తున్నారు. మనుషులు, వారి ప్రేమలంటే.. విదేశీ సంస్కృతిగా చూసిన మన సాంప్రదాయగ్రే సరులు ఆవును ఆలింగనం చేసుకోవటాన్ని మన దేశీయ సంస్కృతిగా చెప్పుకొస్తున్నారు. ఆవును హగ్ చేసుకొంటే... ఆత్మీయులను ఆలింగనం చేసుకున్నంతగా అనుభూతి చెందుతామని కొత్తగా చెప్తున్నారు. అంతటితో ఆగటం లేదు... కృత్రిమంగా దానికో శాస్త్రీయ సమర్థన.. కూడా తెస్తున్నారు. ఆవును కౌగలించుకొంటే.. ఆక్సిటోసిన్ అనే ఎంజైమ్ మన శరీరంలో ఎక్కవుగా విడుదలై.. మనల్ని ఆనంద పరవశుల్ని చేస్తుందని అంటున్నారు..! ఇది ఇవ్వాళ పశువులంటే.. గిట్టని, తెలియని వారు చెప్తుండటమే విడ్డూరం.
అన్నీ మా వేదాల్లోనే ఉన్నాయశ అంటూ.. గొప్పలు పోయే మన సాంప్రదాయ వాదులు తరతరాలుగా భారతీయ జీవనంలో ఆవు (పశువు) ప్రాధాన్యతను పురాణ, ఇతిహాసాల్లో వెతికి చూపేవారు. ఇప్పటిదాంకా అదే చేస్తూ, చెప్తూ వచ్చారు. ఇవ్వాళ... కొత్తగా అభివృద్ధిచెందిన యూరప్ దేశాల్లో కూడా ఆవును హగ్ చేసుకొనేది ఉన్నదని దాన్ని అరువు తెచ్చుకొని చెప్తున్నారు. అమెరికా, స్విట్జర్‌లాండ్, డచ్, నెదర్లాండ్ లాంటి దేశాల్లో కౌ హగ్గింగ్ డేను పాటిస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు. అంతటి అభివృద్ధిచెందిన దేశాల్లో ఆవును పూజిస్తుంటే... మనం దాన్ని పాటించొద్దా అంటూ మన సాంప్రదాయవాదులు బయలు దేరారు. ఆవు అంటే.. ఎరుగనోనికి దాని మీద ప్రేమ పుట్టుకురావటమే వికృతి. గత కొన్నేండ్లుగా.. గోవు పూజనీయమైనదనీ గోవధ నిషేధించాలనీ అంటున్న వారికి తెలిసిందేమంటే... గోడమీది పటంలో కనిపించే ఆవుమాత్రమే. ఆలయం ముందు కనిపించే రాతి విగ్రహం నంది నుదుట పసుపు, కుంకుమలు దిద్దేవారు గోవులను, పశువులను పూజించటం, గౌరవించటం గురించి చెప్తున్నారు. భారత గ్రామీణ జీవితానికి ఆవుతో అనుబంధం చాలా లోతైనది. నిజానికి ఆవును భారత గ్రామీణ జన జీవితం నుంచి విడిగా చూడలేం. పశువు లేనిదే పల్లె లేదు. గొడ్డు, గోదా లేనిదే రైతు లేడు. పశువు (ఆవైనా, ఎద్దైనా, బర్రైనా, దున్న అయినా) ఏదైనా వ్యవసాయ జీవనానికి ఇరుసు, ప్రాణం. ఆవుతోనే గ్రామ జీవితం ముడిపడి ఉంటుంది. వ్యవసాయ సంస్కృతిక జీవనంలో పాడి-పంట, పల్లె- పశువు విడదీయలేనివి.
ఆవుకు మేత వేసిన రైతు తన ఆకలి మర్చిపోతాడు. ఆవుకు పచ్చిగడ్డి మేతేసి, కడుపునిండా కుడితి తాపి మురిసిపోతాడు. గేదెకు ఏమైనా అయితే కన్నబిడ్డకు బాధ వచ్చినట్లుగా తల్లడిల్లిపోతాడు. ఆవు గిట్టల్లో ముల్లు ఇరికితే... తన కాలులో ముల్లుదిగినంతగా తల్లడిల్లి పోతాడు. దాన్ని పన్నుతో పట్టి పీకేస్తాడు. ఆవు నొసటి మీద, మోపురంమీద పావురంగా నిమిరి తనువుతీరా ఆనందపడు తాడు. ఇలాంటి సమాజానికి ఇవ్వాళ ఆవు ప్రాధాన్యం గురించి, ప్రాశస్త్యం గురించి చెప్తున్నారు. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు. ప్రపంచ వ్యాప్తంగా యువతీ యువకులు వాలెంటైన్స్ డేను ప్రత్యేకంగా ఉత్సాహంగా జరుపుకొంటారు. నిచ్చెనమెట్ల కులాధిక్య సమాజ సంరక్షులైన మన సాంప్రదాయ వాదులకు వాలంటైన్స్ డే విదేశీగా కనిపించటంలో వింతలేదు. ఆ క్రమంలో వారు చేసే ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. ప్రేమ అంటే అదొక అసహజ, వికృత, విషపూరిత నడతగా చెప్తూ... దాడులు చేశారు. రోడ్లు, పార్కులు ఎక్కడ పడితే అక్కడ ఇద్దరు మనుషులు (యువతీ, యువకులు) కనిపిస్తే చాలు విదేశీ సంస్కృతి అంటూ హింసించారు. ఇంత విచ్చలవిడి తనమా అంటూ దాడులకు దిగారు. ఆ ఇద్దరూ స్నేహితులో, హితులో, నిజంగానే ప్రేమికులో చూడకుండానే చేతుల్లో పసుపుదారం పట్టుకొని దాన్ని ఆ అమ్మాయి మెడలో కట్టాలని దౌర్జన్యం చేశారు. ఆ నేపథ్యంలో ఎన్నో వికృతాలు విన్నాం.., చూశాం. మనుషులు పరస్పరం ప్రేమగా ఉండటం గిట్టని వారు, ప్రేమికులుగా ఉండటాన్ని సహిస్తారా? సహించరు గాక సహించరు. ఎందుకంటే... మనుషును కులాలు, మతాలుగా మాత్రమే చూసే వారికి, యువతీ, యువకుల ప్రేమలు మానవీయ సహజ స్పందనలుగా కనిపిస్తాయా..! అలా కనిపించాలని అనుకోవటమే మన అత్యాశ.
-శ్రామిక