ఆక్స్ ఫామ్ చెప్పే పరిష్కారాలు ఉపశమనాలు మాత్రమే
ఆక్స్ ఫామ్ చెప్పే పరిష్కారాలు ఉపశమనాలు మాత్రమే
ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా స్విట్జర్లాండ్ లోని దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు ఈ జనవరిలో మూడు రోజులు జరిగాయి . ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక ప్రభుత్వేతర సంస్థ కార్పొరేట్ సంస్థలకు సహాయసహకారాలు సూచనలు , సమాచారం ఇచ్చే సంస్థ . బహుళజాతి సంస్థలకు ఉపయోగపడే సంస్థ ఆక్స్ ఫామ్ ఇంటర్నేషనల్ కూడా ఒక ప్రభుత్వేతర సంస్థ . అంటే అది ఒక NGO . కొందరి విమర్శకుల ప్రకారం ఇది ఒక బింగో ( BINGO) కూడా . అంటే బిగ్ ఇంటర్నేషనల్ NGO అని అర్థం . 21 NGO లు కలిసి ఏర్పడిన ఒక పెద్ద NGO ఆక్స్ ఫామ్ . వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల సందర్భంగా ఆక్స్ ఫామ్ ఇంటర్నేషనల్ ప్రపంచంలో పెరిగిపోతున్న అంతరాల రిపోర్టును సమర్పించింది . ప్రపంచంలోని అంతరాలతో పాటు భారతదేశంలోన పెరుగుతున్న అంతరాలు గురించి కూడా ఆక్స్ ఫామ్ తన రిపోర్టులో పేర్కొన్నది .
ఆక్స్ ఫామ్ రిపోర్టు లో ఏమున్నది ?
ప్రతి సంవత్సరం రిపోర్టులో పేర్కొన్నట్లు గానే ప్రపంచవ్యాప్తంగా సంపదలో , ఆదాయాలలో పెరుగుతున్న అంతరాల గురించి ఈ సంవత్సరం కూడా పేర్కొన్నది . ఆక్స్ ఫామ్ ప్రకారం ప్రపంచ బిలియనీర్ల సంపద రోజుకు 2.7 బిలియన్ డాలర్ల చొప్పున పెరుగుతున్నది . ఈ ప్రపంచ బిలియనీర్ల పైన 5 శాతం పన్ను విధిస్తే 1.7 బిలియన్ ల డాలర్ లు ప్రతి సంవత్సరం లభిస్తాయి . ఈ డబ్బుతో ప్రపంచంలోని రెండు వందల కోట్ల మందిని పేదరికం నుండి పైకి తీసుకు రావచ్చు . 2020 నుండి ప్రపంచ వ్యాప్తంగా సృష్టించబడిన 42 ట్రిలియన్ డాలర్ల సంపదలో రెండు వంతుల సంపదను ప్రపంచంలోని ఒక శాతం ధనవంతులు తమ ఖాతాలో వేసుకున్నారు . క్రింది స్థానంలో ఉన్న ప్రపంచ జనాభాలోని 99 శాతం ప్రజల ఆదాయం కంటే దాదాపు ఇది రెండింతలు . ఒకవైపు తీవ్ర పేదరికం మరోవైపు అధిక సంపద ఇంతగా పెరగడం గత 25 సంవత్సరాలలో మొదటి సారి జరిగింది . ఈ రిపోర్టు భారతదేశంలో కూడా పెరుగుతున్న అంతరాల గురించి పేర్కొన్నది . భారత దేశంలోని సంపదలో 40 శాతం సంపద జనాభాలోని ఒక శాతం వారి వద్ద పోగుపడ్డది . క్రింది స్థాయిలో ఉన్న జనాభాలోని 50 శాతం మంది వద్ద కేవలం 3% సంపద మాత్రమే ఉన్నది . భారతదేశంలోని బిలియనీర్ల మొత్తం సంపద పైన 2% పన్ను వేస్తే 40423 కోట్ల రూపాయలు సేకరించవచ్చు . అతిపెద్ద బిలియనీర్లు అయిన 10 మంది బిలియనీర్ల పైన ఒకసారి 5 శాతం పన్ను వేస్తే , 1.37 లక్ష కోట్ల రూపాయలు సేకరించవచ్చు . ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రాలయం , ఆయుష్ మంత్రాలయాల ఉమ్మడి బడ్జెట్ , 1.5 రెట్లు ఎక్కువ ఉంటుంది . ఈ పని అంటే ధనవంతుల పైన వేసే పన్నుల తో ప్రజలకు ఉపయోగపడే పనులు చాలా చేయవచ్చు అని అర్థం .
అయితే ఈ లెక్కలు ఒక్క ఆక్స్ ఫామ్ మాత్రమే ప్రకటించిందా ? అలా ఏమీ లేదు . ఈ లెక్కలు ప్రపంచంలో చాలా సంస్థలు ప్రకటించాయి . దేశంలో కూడా ఎందరో స్వతంత్ర ఆర్థికవేత్తలు ఇటువంటి లెక్కల గురించి ఎప్పటినుండో రాస్తున్నారు . ప్రభుత్వ గణాంకాలు కూడా కొంత అటుఇటుగా ఇటువంటి చిత్రాన్నే ఇస్తాయి . ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఆచరణలో పెరుగుతున్న అంతరాలు , తేడాలు ప్రజలకు అర్థం అయ్యే విషయాలే . అసలు విషయం ఏమిటి అంటే , అసలు ఈ అంతరాలు ఎందుకు పెరుగుతున్నాయి ? ఈ అంతరాలు ఎలా అంతం అవుతాయి ? ఈ విషయాలు సరిగ్గా చెప్పకుండా ఎన్ని లెక్కలు చెప్పినా పెద్ద ఉపయోగం ఉండదు . ఇటువంటి రిపోర్టులు ప్రకటించినప్పుడల్లా రెండు రోజులు పత్రికలు , TV లు విషాద రాగాలు పలికించి , రెండు రోజులు సంతాప దినాలు పాటించి తరువాత రొటీన్ పనుల్లో మునిగి పోతాయి . అంతరాలకు అసలు కారణాలు తెలవనంత వరకు , అసలు పరిష్కారాలు కూడా లభించవు రోగం ఒకటి అయితే మందు ఒకటి అవుతుంది . అంతరాల లెక్కలన్ని చెప్పి , కారణాలు తప్పుగా చెప్పితే ఆ సంస్థలు ప్రజలను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నాయనే అనుకోవాలి .
ఈ అంతరాలకు ఆక్స్ ఫామ్ చెపుతున్న కారణాలు ఏమిటి ?
అసమానతలకు కారణం ప్రపంచంలోని ఆర్థిక నమూనాలు విఫలం కావడమేనని ఆక్స్ ఫామ్ చెప్పుతుంది . కానీ అది ఏ ఆర్థిక నమూనా అనేది ఆక్స్ ఫామ్ నిర్దిష్టంగా చెప్పదు . ప్రపంచ ప్రజలను అణిచి పెట్టి పిడికెడు మంది తమ చేతుల్లో అధికారాన్ని కేంద్రీకరించుకున్నారు అని చెబుతుంది . పర్యావరణాన్ని విధ్వంసం చేయడం వలన లక్షలాది ప్రజల జీవన ఆధారం దెబ్బతింటున్నది . క్రోనీ క్యాపిటలిజం వలన కూడా అసమానతలు పెరుగుతున్నాయని ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు అని చెప్పుతుంది . లింగవివక్ష అమలు వలన కూడా అంతరాలు పెరుగుతున్నాయని చెపుతుంది .
ఆక్స్ ఫామ్ చెపుతున్న పరిష్కారం ఏమిటి ?
ఇదే అసలు విషయం . ఒక్కోసారి అసమానతలకు నిజమైన కారణాలు చెప్పి కూడా పరిష్కారం తప్పుగా చెప్పవచ్చు . అయితే ఆక్స్ ఫామ్ ముందు చెప్పిన కారణాలకు అనుగుణంగానే పరిష్కారాలు చెపుతుంది . ఆర్థిక నమూనాలు విఫలం అయ్యాయి కావున న్యాయమైన ఆర్థికవ్యవస్థను , స్థిరమైన ప్రపంచాన్ని నెలకొల్పాలి అంటుంది . పర్యావరణాన్ని రక్షించాలి అంటుంది . ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి . వివక్షను రూపు మాపాలి అంటుంది . మొత్తంగా , అసమానతలు అనివార్యం కాదు మెరుగైన సమాజం సాధ్యమే , అది మన చేతుల్లోనే ఉంది అంటుంది . అందరూ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నది అని చెపుతుంది . ధనవంతుల మీద పన్నులు ప్రత్యేకంగా వేస్తే పేదరికాన్ని అంతం చేయవచ్చు అని చెప్పుతుంది . విద్య వైద్యం లాంటి విషయాలలో మెరుగైన సేవలు అందించవచ్చు అని చెపుతుంది .
ఆక్స్ ఫామ్ చెప్పే మెరుగైన ప్రపంచం సాధ్యమేనా ?
ఆక్స్ ఫామ్ అసమానతలకు చెప్పే కారణాలు పరిష్కారాలు రెండు కూడా ప్రజలను పక్కదారి పట్టించేవే . ప్రపంచంలోని అసమానతల గురించి రిపోర్టులు చాంతాడంత ప్రకటించి , పెద్దఎత్తున ప్రచారం చేసినప్పుడు సాధారణంగానే ప్రజలు ఆ సంస్థ చెప్పే పరిష్కారాల పట్ల కూడా ఆసక్తిని కనబరుస్తారు . ఇంత మంచి రిపోర్టు ఇన్ని లెక్కలతో సహా చెప్పిన తరువాత పరిష్కారం కూడా సరి అయినదే అనుకుంటారు . ప్రజలు తీవ్రమైన అసమానతలను ఎదుర్కొంటూ తమకు తామే పరిష్కారాలను కనుగొంటే , పెట్టుబడిదారీ ప్రపంచానికి ప్రమాదం . అందుకే ఇటువంటి సంస్థలు ఎన్జీవోలు చాలా తెలివిగా అందరికీ తెలిసిన అసమానతలు అన్నీ చెప్పి పరిష్కారాలు మాత్రమే తమకు తెలిసిన తమకు కావలసిన ప్రమాదం లేని పరిష్కారాలు చెపుతాయి . ఉదాహరణకు ఆక్స్ ఫామ్ ఈ సంవత్సరం రిపోర్టులో అసమానతల గురించి చెప్పి ధనవంతుల మీద ప్రత్యేకంగా పన్నులు వేస్తే పేదల సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నట్లుగా చెప్పింది . దానితో అవును నిజమే ధనవంతుల మీద ప్రత్యేక పన్నులు వేయాలి అని ప్రజలు డిమాండ్ చేస్తారు . అప్పుడు అసలు విషయం పక్కకు పోతుంది . ధనవంతుల మీద ప్రత్యేకంగా పన్నులు వేయడం తప్పేమి కాదు . ఆ ధనంతో పేదలకు కొంత ఉపయోగం జరగవచ్చు కూడా కానీ అది ఉపశమనం మాత్రమే కానీ పరిష్కారం కాదు . ధనవంతుల మీద పన్నులు తక్కువ వేయడం వలన సమాజంలో అసమానతలు ఏర్పడలేదు . అసలు పన్నుల వ్యవస్థ కు అసమానతలకు సంబంధమే లేదు . ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారి ఉత్పత్తి విధానం లేదా పెట్టుబడిదారీ ఆర్థిక విధానం అసమానతలకు కారణం . పెరుగుతున్న అసమానతలకు కారణం . ఆక్స్ ఫామ్ ఈ విషయం చెప్పదు కానీ అతి సాధారణంగా ఆర్థిక నమూనా విఫలం అయింది అంటుంది . కానీ పెట్టుబడిదారీ ఆర్ధిక విధానం విఫలం అయ్యిందని చెప్పదు . మీడియా ప్రజల అభిప్రాయాలను రూపొందిస్తున్నట్లుగా ఇటువంటి ఎన్జీవోలు ప్రజల సమస్యలకు ఉపశమన పరిష్కారాలను ముందు పెడుతుంటాయి , ప్రజలు అసలైన పరిష్కారాల వైపు వెళ్లకుండా . మెరుగైన ప్రపంచం సాధ్యమే అని అన్నా న్యాయమైన ఆర్థిక వ్యవస్థ అన్నా అది ఏమిటో ఎలా ఉంటుందో నిర్దిష్టంగా ఆక్స్ ఫామ్ చెప్పదు . అసమానతలకు అసలు కారణం చెప్పకుండా కేవలం లక్షణాలు మాత్రమే చెప్పే ఆక్స్ ఫామ్ సహజంగానే లక్షణాలకు మాత్రమే పరిష్కారం చెపుతుంది . కానీ అసలు రోగం నయం కానంత వరకు లక్షణాలకు ఎంత వైద్యం చేసినా తాత్కాలిక ఉపశమనం తప్ప లక్షణాలు కూడా అంతం కావు . న్యాయమైన ఆర్థిక వ్యవస్థ అంటే పెట్టుబడిదారీ వ్యవస్థనే న్యాయమైన ఆర్థిక వ్యవస్థగా మార్చవచ్చని అవగాహన . అంతేతప్ప పెట్టుబడిదారీ వ్యవస్థను , పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాలు కాకుండా మరో నూతన ఉత్పత్తి విధానం కాదు , నూతన ఉత్పత్తి సంబంధాలు కావు . మెరుగైన ప్రపంచం అంటే కూడా పెట్టుబడిదారి ఉత్పత్తి విధానం పరిధిలోనే మెరుగైన ప్రపంచం సాధ్యం అని అర్థం . అంతేకాని నూతన ఉత్పత్తి విధానం కాదు పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంమే సకల అసమానతలకు మూలం . పర్యావరణ విధ్వంసానికి , లింగ వివక్షతకు , అధికార కేంద్రీకరణకు , క్రోనీ క్యాపిటలిజంకు దానికి కారణమే పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం . పెట్టుబడిదారి విధానాన్ని అలాగే ఉంచి సమస్యలన్నింటిని , కొన్ని సంస్కరణల ద్వారా పరిష్కరిస్తామని చెప్పడం పెద్ద మోసం . అది చెప్పే పరిష్కారాలు ప్రజలను తప్పుదోవ పట్టించేవే . అందుకే ఈ సంస్థ అట్టహాసంగా ప్రతి సంవత్సరం అసమానత రిపోర్టులు ప్రకటించి , పనికి రాని పరిష్కారాలు ప్రజలకు సూచిస్తూ ఉంటుంది . అదే సమయంలో తమ పెట్టుబడిదారీ యజమానులను అప్రమత్తం చేస్తూ ఉంటుంది . ఫోర్డ్ ఫౌండేషన్ , రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ , బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ లాంటి కార్పొరేట్ శక్తులు ఊరికే ఆక్స్ ఫామ్ కు నిధులు సమకూర్చరు మరి .
-లంక పాపిరెడ్డి (84650 53792)