కర్ణాటక ఎన్నికల వేళ... మెజారిటీవాద చిచ్చు రేపుతున్న బీజేపీ
కర్ణాటక ఎన్నికల వేళ... మెజారిటీవాద చిచ్చు రేపుతున్న బీజేపీ
-----------------------
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ తిరిగి ఆ రాష్ట్రంలో అధికారం నిలుపుకోవటం కష్టంగానే కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో... మెజారిటీ ఓట్లను తమ వైపు తిప్పుకొనేందుకు బీజేపీ నేతలు హిందుత్వ కార్డును బయటకు తీస్తున్నారు. మతపరమైన సున్నితాంశాలతో వివాదం రేపి లబ్ధిపొందేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. ఆ క్రమంలోనే.. కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ నోరు పారేసుకున్నారు. టిప్పు సుల్తాన్ అనుయాయులు ఈ భూమి మీద ఉండటానికి వీలులేదని ప్రకటించాడు. హనుమాన్‌ను పూజంచే వారు టిప్పు వారసులను అడవులకు తరిమి కొట్టాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చాడు. ఎన్నికల ముంగిట కర్ణాటక లోని కొప్పళ జిల్లా ఎలబుర్గాలో జరిగిన ఓ సమావేశంలో కటీల్ ఈ విధమైన మాటలతో బీజేపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు.
కర్ణాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ మాటలు దేశవ్యాప్తంగా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. వచ్చే ఏప్రిల్, మే మాసాల్లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో ఈ సారి బీజేపీకి ఎదురుగాలే అన్న అంచనాల మధ్య ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి మాటలను చూడాల్సిన అవసరం ఉన్నది. హనుమంతున్ని, శ్రీరామున్ని పూజించని వారు ఇక్కడ ఉండటానికి అనర్హులని ప్రకటిస్తున్న బీజేపీ నేత... ఇదే సందర్భంగా మరో వివాదానికి తెరలేపారు. కర్ణాటకలో త్వరలో జరుగబోయే ఎన్నికలు సావర్కర్, టిప్పుసుల్తాన్ మధ్య పోటీగా జరుగుతాయని ప్రకటించారు. దేశ భక్తుడైన వీర సావర్కర్, దేశ ద్రోహి టిప్పు సుల్తాన్ మధ్య పోటీగా కర్ణాటక ఎన్నికలు ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు. ఆ క్రమంలో.. ఆయన ఒక రకంగా మంచి చర్చకే తెరలేపారు.
కర్ణాటక ఎన్నికలు సావర్కర్, టిప్పు సుల్తాన్ మధ్య పోటీగా జరుగుతాయన్న బీజేపీ నేతల మాటల నేపథ్యంలోంచే ఈ ఇరువురి వ్యక్తిత్వం, స్వాతంత్య్రోద్యమంలో వారి పాత్ర గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యక్త ఉన్నది. ఆ క్రమంలోనే.. ఎవరు ఎంతటి దేశ భక్తులో తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నది.
టిప్పు సుల్తాన్, సావర్కర్ ఇరువురూ బ్రిటిష్ ఇండియాలో స్వాతంత్య్రోద్యమ కాలంలో జన్మించారు. కాకుంటే... ఇరువురికీ వందేండ్ల వ్యత్యాసం ఉన్నది. టిప్పుసుల్తాన్ 1751 డిసెంబర్ 1న జన్మిస్తే, సావర్కర్ 1883 మే 28న జన్మించారు. సావర్కర్ 83ఏండ్లు జీవించి 1966 ఫిబ్రవరి 26న కన్నుమూస్తే, టిప్పుసుల్తాన్ 1799 మే 4న 48వ ఏటనే బ్రిటిష్ వారితో పోరాడుతూ వీరమరణం పొందాడు.
బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారత దేశంలో తమ వ్యాపారంతో పాటు, దేశంలోని చిన్న చిన్న సంస్థానాలు, రాజుల మధ్య చిచ్చుపెట్టి విభజించు పాలించు నీతిని అమలు చేస్తున్నది. ఆ క్రమంలో ఒక్కో సంస్థానాన్ని ఆక్రమించుకొంటున్న కాలంలో హైదర్ అలీ రాచరికంలోని మైసూర్ రాజ్యంలో టిప్పు సుల్తాన్ జన్మించాడు. ఆ నాడున్న స్థితి గతులను బట్టి రాజు హైదర్ అలీ తన కొడుకైన టిప్పు సుల్తాన్‌కు ఆధునిక యుద్ధ విద్యలు, ఆయుధ ప్రయోగాలను ఫ్రెంచీ మిలిటరీ అధికారుల చేత నేర్పించాడు. చిన్నతనం నుంచీ యుద్ధవిద్యల్లో ఆరితేరిన టిప్పు తన 15 వ ఏటనే తండ్రికి సాయంగా మొదటి మైసూర్ యుద్దంలో పాల్గొన్నాడు. పదాతి దళానికి నాయకత్వం వహించి యుద్ధంలో ఓటమినుంచి తప్పించుకోవటంలో కీలక భూమిక పోషించాడు. ఆ క్రమంలోనే టిప్పు సుల్తాన్ ఆయుధాలను తయారు చేయటంలో కొత్తవి రూపొందించటంలో విశేష కృషి చేశాడు. టిప్పు సుల్తాన్ ఆలోచనల్లోంచే మొట్టమొదటి ఇనుము లోహ రాకెట్ తయారు చేశారు. ఈ రాకెట్ ఆయుధంతోనే బ్రిటిష్ వారిని అనేక యుద్ధాల్లో మైసూర్ పాలకుడైన టిప్పు సుల్తాన్ ఎదిరించి నిలిచాడు.
మూడో మైసూర్ యుద్ధంలో బ్రిటిష్ వారిని నిలువరించి పోరాడినా.. అనేక ప్రాంతాలను కోల్పోవాల్సి వచ్చింది. కోల్పోయిన ప్రాంతాల్లో బ్రిటిష్ వాడు మరాఠా పాలకులు, నైజాం పాలకుల సాయంతో తొత్తుపాలన నెలకొల్పాడు. ఈ క్రమంలో బ్రిటిష్ వారి రాజ్య విస్తరణను, మైసూర్‌ను ఆక్రమించాలన్న వారి ఆశలను టిప్పు సుల్తాన్ అడుగడుగునా ప్రతిఘటించాడు. దేశమంతా తమ పాదా క్రాంతమైనా ఒక్క మైసూర్ ఒక్కటే తమ వశం కాక పోవటంతో బ్రిటిష్ వారు టిప్పు సుల్తాన్‌పై కుట్రలు కుహకాలకు పాల్పడ్డారు. ఒక్కడుగా బ్రిటిష్ వాడు టిప్పు సుల్తాన్‌ను ఓడించలేక పొరుగు రాజ్య పాలకులైన మారాఠాలను, నిజాం ప్రభువు అండదండలతో 1799లో మైసూర్‌పై యుద్ధం ప్రకటించారు. నాలుగవ మైసూర్ యుద్ధంగా చరిత్రలో మిగిలిపోయిన ఈ యుద్ధంలో మైసూర్ రాజధాని శ్రీరంగ పట్టణాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించుకొన్నారు. టిప్పు సుల్తాన్‌ను ముట్టడించి హత్య చేశారు బ్రిటిష్ పాలకులు.
తుది వరకూ.. బ్రిటిష్ వారి రాజ్య విస్తరణ కాంక్షను ఎదరించి నిలిచిన టిప్పు సుల్తాన్‌ను మరాఠా, నిజాం పాలకుల తోడ్పాటుతోనే బ్రిటిష్ పాలకులు ఓడించ గలిగారు. లొంగిపోయి శరతులకు ఒప్పుకుంటే... దాడులు ఆపుతామని, తగు భరణం ఇచ్చి తమ ఏజెంటుగా పాలనాధికారాలు అప్ప జెప్తామని బ్రిటిష్ వారు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా.. తుది వరకూ మాతృ భూమి రక్షణ కోసం టిప్పు పోరాడాడు. బ్రిటిష్ వారికి లొంగకుండా, రాజ్యాన్ని అప్పగించకుండా పోరాడి యుద్ధభూమిలో అసువులు బాశాడు టుప్పు సుల్తాన్. ఆనాడు సువిశాల భరతావనిలో 560కి పైగా చిన్నా పెద్ద సంస్థానాలు, రాజ్యాలుంటే.. అందులో బ్రిటిష్ వారికి లొంగకుడా ఎదిరించి నిలిచింది ఒక్క మైసూర్ సంస్థానమే. మైసూర్ పాలకుడిగా టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తన మాతృభూమి రక్షణ కోసం పోరాడి ప్రాణ త్యాగం చేశాడు.
ఇక్కడే మరో విషయం కూడా చెప్పుకోవాలి. టిప్పు సుల్తాన్ కత్తి విశిష్ఠమైనదని ప్రతీతి. ఆ కత్తి ఏడున్నర కిలోల బరువు ఉండేదట. సామాన్యుడు ఆ కత్తిని చేతబట్టి పోరాటం చేయటం సులువైన విషయం కాదని చెప్తారు. టిప్పు సుల్తాన్ కత్తిపై బంగారంతో చేసిన పులి బొమ్మ ఉండేదట. అందుకే ఆయనకు మైసూర్ టైగర్ అనే పేరు ఉన్నది. ఈ కత్తినే ఈ మధ్య కాలంలోనే విజయ్ మాల్యా 21 కోట్ల రూపాయలతో కొనుగోలు చేశాడు. మరో గాథ కూడా ప్రచారంలో ఉన్నది. టిప్పు సుల్తాన్ ఒక రోజు తన ఫ్రెంచీ మిత్రుడిలో కలిసి అడవిలో వేటకు వెళ్తే అకస్మాత్తుగా ఓ పులి వారిపై దాడి చేసిందట. చేతిలో ఏమీలేని టిప్పు సుల్తాన్ ఒట్టి చేతులతోనే పులితో పోరాడి దాన్ని పారదోలాడట. ఈ ఘటన నాటినుంచే టిప్పు సుల్తాన్‌కు మైసూర్ టైగర్ అనే పేరు వచ్చిందని చెప్తారు. బ్రిటిష్ వారికి లొంగిపోకుండా చివరి వరకు పోరాడి యుద్ధక్షేత్రంలో ప్రాణత్యాగం చేసిన టిప్పు సుల్తాన్‌ను చరిత్ర కారులంతా... మొట్టమొదటి స్వాతంత్య్ర సమరయోధుడిగా పరిగణిస్తున్నారు, గుర్తిస్తున్నారు. వార్ రాకెట్‌ను కనుగొన్న మొట్టమొదటి శాస్త్రవేత్త టిప్పు సుల్తాన్ అని మాజీ రాష్ట్ర పతి ఏపీజే అబ్దుల్ కలాం టిప్పును కొనియాడాటం గమనార్హం. టిప్పు సుల్తాన్ రూపొందించిన వార్ రాకెట్ ఇప్పటికీ బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నది.
ఇక.. సావర్కర్ విషయానికి వస్తే... టిప్పు తర్వాత సుమారు 132 ఏండ్లకు సావర్కర్ జన్మించాడు. ఆయన తన కాలంలో సాగుతున్న స్వాతంత్య్ర ఉద్యమంలో నేరుగా ముందుండి పాల్గొన్న దాఖలాలు చాలా తక్కువ. కానీ 1909 నాటి ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ గా పిలువ బడే మోర్లీ-మింటో సంస్కరణలను వ్యతిరేకించటంలో సావర్కర్ ముందున్నాడు. ఈ సంస్కరణ లక్ష్యం ఏమంటే... బారత ప్రతినిధులుగా బ్రిటిష్ పాలనా సౌధంలో ఇద్దరికి స్థానం కల్పిస్తారు. ఆ ఇద్దరిలోనూ ఒకరు ముస్లిం, ఒకరు హిందూ అని నాటి గవర్నర్‌జనరల్ మోర్లీ ప్రకటించాడు. బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి బదులు ప్రాతినిధ్యం పేరిట విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారని మిగతా జాతీయ ఉద్యమ కారులంతా దాన్ని వ్యతిరేకిస్తే.., సావర్కర్ మాత్రం ముస్లింకు స్థానం కల్పించటాన్ని వ్యతిరేకించాడు. ఆ క్రమంలోనే ఆయనను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసి అండమాన్ జైలుకు తరలించింది.
ఆ కాలంలో అండమాన్ జైలులో వందలాది మంది స్వాతంత్య్రోద్యమ కారులున్నారు. కానీ సావర్కర్ అండమాన్ జైలులో ఓ ఉద్యమ కారుడిగా ఉండలేక పోయాడు. బ్రిటిష్ పాలకులకు క్షమాభిక్ష కోరుతూ అనేక ఉత్తరాలు రాశాడు. ఆ ఉత్తరాల్లో సావర్కర్ బ్రిటిష్ పాలకులను ఏ రీతిన ప్రాదేయ పడ్డాడో చూస్తే.. ఆయన త్యాగం తేటతెల్లం అవుతుంది. తనను జైలు నుంచి విడిచి పెడితే జీవితాంతం బ్రిటిష్ ప్రభుత్వానకి విధేయంగా ఉంటానని చెప్పుకొన్నాడు. అంతే కాదు... బ్రిటిష్ వారికి సహాయకారిగా పనిచేస్తానని హామీ ఇచ్చాడు. ఆ క్రమంలోనే ఆయన బ్రిటిష్ వారికి ఇన్‌ఫార్మర్‌గా పనిచేసినట్లు జాతీయోద్యమ చరిత్రలో రికార్డు అయ్యి ఉన్నది. ఈ నేపథ్యంలోంచే... 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమాన్ని సావర్కర్ వ్యతిరేకించాడు. ఆ క్రమంలో.. ఆయన జీవిత కాలమంతా బ్రిటిష్ మద్దతుదారుడిగానే కొనసాగాడు. దీన్ని బట్టి నేటి సంఘ్‌పరివార్ శక్తులు చెప్పుకొంటున్నట్లు వీర సావర్కర్ అని పిలుచుకోవాటానికి అర్హత ఉన్నదా... అందరూ ఆలోచించాలి.
టిప్పు సుల్తాన్ బాల్యం నుంచీ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడితే.., సావర్కర్‌కు ఆ చరిత్ర ఇసుమంత లేదు. టిప్పు సుల్తాన్ మాతృభూమి రక్షణ కోసం యుద్ధ క్షేత్రంలో తుదకంటా పోరాడుతూ అసువులు బాస్తే..., సావర్కర్ జైలు నిర్బంధానికి కుంగిపోయి బ్రిటిష్ పాలకులను ప్రాధేయపడి క్షమాభిక్ష పత్రాలను రాసిచ్చి, మరెప్పుడూ బ్రిటిష్ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొననీ, జీవితాంతం విదేయుడిగా ఉంటానని బతిమాలుకొని జైలు నుంచి బయట పడ్డాడు. ఈ ఇద్దరిలో ఎవరు వీరులో.., దేశ భక్తులో చెప్పాల్సిందేముంది..! అంతా తేట తెల్లం కదా...!!
-శ్రామిక