పోరాడితేనే మహిళా సమానత్వం


 ▪️సామాజిక ఆర్థిక, రాజకీయ రంగాల్లో మహిళలకు సమానత్వం  కల్పించాలి

▪️నిర్ణయాధికారం లో భాగస్వామ్యం కల్పించాలి

▪️స్త్రీలు పై అన్ని రకాల హింసలు వ్యతిరేకించాలి

▪️స్త్రీ పురుష సమానత్వం కల్పించాలి

▪️స్త్రీలపై లైంగిక వేధింపులు అరికట్టాలి


(నేడు మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం)



మహిళల హక్కుల సాధనలో జరిపిన అనేక పోరాటాల నుంచి ఉద్భవించిన రోజు మార్చి 8, అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం. పని గంటల తగ్గింపు కోసం, పని స్థలాల్లో సౌకర్యాల కోసం, సమాన వేతనాల కోసం అమెరికాలో వేలాది మంది మహిళా కార్మికులు రోడ్ల పైకి వచ్చారు. హక్కుల కోసం నినదించారు. హక్కుల సాధనలో వారు చేసిన పోరాటాలు చిరస్మరణీయమైనవి. అమెరికాలో 1857 మార్చి 8 పని గంటలు తగ్గింపు కోసం మహిళలు జరిపిన ఊరేగింపుపై లాఠీచార్జి, కాల్పులు జరిపి చెల్లా చెదురు చేశారు. 50 సంవత్సరాల అనంతరం 1908లో వేలాది మంది మహిళలు మార్చి 8 స్ఫూర్తితో ప్రదర్శన నిర్వహించారు. మహిళలు రొట్టెలు, గులాబీలు కావాలంటూ మహిళలు పోరాటాలను ప్రారంభించారు. ఆ తర్వాత జరిగిన అనేక శ్రామిక పోరాటాల్లో భాగస్వాములయ్యారు. యూరప్ లో జరిగిన విప్లవాత్మక పోరాటాల్లో మహిళల పాత్రను స్ఫూర్తిదాయకంగా తీసుకొని ప్రపంచ వ్యాప్తంగా మహిళలు తమ హక్కుల కోసం పోరాడటానికి అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినంగా మార్చి 8ని జరపాలని క్లారాజెట్కిన్ ప్రతిపాదించారు. జర్మనీ కమ్యూనిస్టు పార్టీ నాయకురాలు క్లారాజెట్కిన్ 1910లో కోపెన్​ హగన్​లో  జరిగిన 2వ అంతర్జాతీయ మహాసభలో ప్రతిపాదించారు. మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆనాటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినంగా పాటించుతున్నారు. ‘‘స్త్రీలపై వివక్షకు వ్యతిరేకంగా పోరాడుదాం’’ పిలుపుతో మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినాన్ని జరపాలని క్లారా జెటికిన ప్రతిపాదించారు.

 70 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో స్త్రీలకు స్వాతంత్ర్యం, సమానత్వం లేదు. సామాజిక మత ఆచార సాంప్రదాయాలు, కట్టుబాట్లు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాయి. దురాచారాలకు గృహ హింసకు బలి చేస్తున్నాయి. దీనికి వ్యతిరేకంగా మహిళ ఉద్యమాలు నిరంతరం గొంతెత్తుతూనే వున్నాయి. సమాజంలో సగ భాగంగా వున్న మహిళలకు పురుషులతోపాటు అన్ని రంగాల్లో అవకాశాలను హక్కులను సాధించాలనే పోరాటం సాగిస్తూనే వున్నారు. పురుషులతోపాటు ప్రతి రంగంలోనూ పోటీ పడుతూనే వున్నారు. వంటింటికీ |పరిమిత మవ్వాలేనే ఆలోచనను తుడిచిపెట్టి దేశాభివృద్ధికి పురుషులతో సమానంగా తమ కృషిని సాగిస్తున్నారు. అయినా మహిళలపై వివక్ష తొలగలేదు. అన్ని వర్గాల్లోని మహిళలకు ఒకే రకమైన అవకాశాలు దక్కడం లేదు. శ్రామిక మహిళలకు అవకాశాలు, సమాన హక్కులు దక్కడం లేదు. ఇప్పటికీ ఉద్యోగం, వారసత్వ హక్కుల్లో పురుషాధిక్యతే వుంది. కుటుంబం లోనూ, బయట మహిళలపై హింస తగ్గలేదు. పురుషుడి తక్కువనే భావన సమాజంలో కొనసాగుతూనే వుంది. సమాజంలో పురుషాధిపత్యం గతంలోలా లేదు అది రూపం మార్చుకొని కొనసాగుతుంది. పురుషులతో సమానంగా ఎంతో ప్రతిభా సామర్థ్యాలున్నా స్త్రీలకు రాజకీయ రంగంలో పదవులు ఇవ్వరు. నిర్ణయాధికారాల్లో భాగస్వామ్యాన్ని ఇవ్వరు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చినా నిర్ణయాలు జరిగే చోట స్త్రీలకు స్థానం లేదు. అన్ని రాజకీయ పార్టీలు స్త్రీలకు రాజకీయ రంగంలో అవకాశాలు కల్పించే రిజర్వేషన్లుకు అనుకూలం అని ప్రకటించారు. కాని ఆచరణలో చట్ట సభల్లో రిజర్వేషన్ల బిల్లును అందరూ కలిపి అటకెక్కించారు. . దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కనీసం మహిళలు ఎమ్మెల్యేలుగా కూడా ఎన్ని కాలేదు. నాగాలాండ్లో ఒక ఎమ్మెల్యే కూడా లేరు. ఎమ్మెల్యేలే కాదు ఏ రకమైన ప్రజా ప్రతినిధులుగా కూడా ఎన్ని కాబడలేదంటే సమానతనీ అడ్రసెక్కడ! అని ప్రశ్నించడంలో అతిశయోక్తి లేదు. 

నేడు ప్రపంచం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏదో ఒక రూపంలో జరుపుకుంటున్నది. కానీ, ఆనాడు దాన్ని ప్రకటించుకున్న నేపథ్యాన్ని మరిచి కొన్ని మహిళా మండళ్లు విందులు, వినోదాలకు పరిమితమవుతున్నాయి. వాణిజ్య సంస్థలు మహోన్నతమైన ఆ రోజును మహిళల అందాల దినోత్సవంగా మార్చేసింది. క్యాట్ వాక్ లు, ఫ్యాషన్లు, అందాల ప్రదర్శనల 'పేరుతో ఆ రోజును సిలికాన్ లైట్ల కింద ఉత్సవంగా మార్చేస్తున్నారు. ఇవేమీ తెలియని శ్రామిక మహిళలు మాత్రం శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా, అంతర్జాతీయ శ్రామిక మహిళల హక్కుల సాధన కోసం ఉద్యమిస్తూనే ఉన్నారు. ఎన్నో ఉద్యమాలతో సాధించుకున్న మహిళల హక్కులు రోజురోజుకూ కాలరాయబడుతూనే ఉన్నాయి. ఆనాడు ఫ్యాక్టరీల యాజమాన్యాల అణచివేత, నిర్బంధ పని విధానం ఉంటే వాటిపై పోరాడి గెలిచారు. ఈనాడు ఆఫీసుల్లో కంపెనీల్లో ఉండే అధికారుల అఘాయిత్యాలు, యాజమాన్యాల అరాచకాలు ఎలాగూ ఉన్నాయి. రోడ్ల మీద, బస్సుల్లో, క్యాబుల్లో కొనసాగుతున్న అత్యాచార పర్వాలు అందరికీ తెలిసిందే. అందరికీ తెలిసి ప్రచారంలో ఉన్న నిర్భయ సంఘటన అయితే, అంతకు ముందూ ఆ తర్వాత ప్రతిరోజూ గంటకో నిర్భయ బలవుతూనే ఉన్నది. ఒక్కరూ, ఇద్దరూ, కుటుంబంలోని మహిళలందరిపై పదుల, యాభైల సంఖ్యలో అత్యాచారాల పర్వం సాగుతోంది. హర్యానాలోని ముర్థాల్లో యాభై మంది మహిళలపై 150 మంది పురుషులు ఒకేసారి అత్యాచారానికి పాల్పడడం వెనుక ఈ ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా అర్థమవుతోంది. మహిళలకు కరువైన భద్రత కానవస్తోంది. మహిళలపై అత్యాచారాలు సాగిస్తూ వాటిని మొబైల్ ఫోనుల్లో వీడియోలు తీసి  బ్లాక్​ మెయిల్​ చేయడం, మళ్లీ, మళ్లీ అత్యాచారాన్ని కొనసాగించటానికి వీడియోను ఆయుధంగా వాడుకోవడం చేస్తున్నారు. వారం క్రితం కరీంనగర్ జిల్లా వీణవంకలో కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ట్రైనింగ్ తీసుకుంటున్న యువకులు తోటి ట్రైనీపై అత్యాచారానికి పాల్పడడమే కాకుండా ఆ దృశ్యాలను వీడియోలో చిత్రించి బ్లాక్​మెయిలింగ్​కు పాల్పడ్డారు. ఇలాంటి కొన్ని సంఘటనల్లో ఆ దృశ్యాలను వాట్సప్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇతర వెబ్సైట్లలో షేర్ చేయడం కూడా సాగుతోంది. వీటన్నిటికీ కారణం పితృస్వామ్య సంస్కృతిని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలే. ప్రతీ విషయానికి ప్రభుత్వాలను తప్పుపట్టటమేనా? అని ప్రశ్నించేవారుండొచ్చు. కానీ రోజూ ప్రభుత్వ అనుమతితో ప్రతీ ఇంటిలో మోగుతున్న టీవీలు యువతకు ఏం నేర్పిస్తున్నాయి? సినిమాల్లో, సీరియళ్లలో మహిళలపై ప్రతీకారం తీర్చుకోవడానికి అత్యాచారమే ఆయుధమని చెప్పటం లేదా? మహిళలు పొగరుగా ఉంటే వారి మెడలు వంచడానికి అత్యాచార ప్రయోగం చేయొచ్చని ప్రోత్సహించడం లేదా? గోడల మీద సున్నితమైన భావాలను రెచ్చగొట్టేలా అర్ధనగ్న పోస్టర్లు, అశ్లీల దృశ్యాలతో సినిమాలు, సీరియళ్లు మన కళ్లముందే ఉంటున్నాయి. ఇంటర్నెట్ తెరిచి చూడాలంటే భయమయ్యే రోజులు ఇవి. రక్షణ ఇవ్వాల్సిన రక్షక భటులే స్త్రీలపై విరుచుకుపడుతున్నారు. దేశంలో ఆర్మ్, సివిల్ పోలీసులే అత్యాచారాలకు పాల్పడిన సంఘటనలు కోకొల్లలు. వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన శృతిపై పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారనేది అందరికీ తెలిసిందే. చత్తీస్గఢ్ సాల్వాజుడుం పేర ఆదివాసులపై జరిగిన దాడుల్లో వందలాది ఆదివాసీ మహిళలు ఈ అత్యాచారాలకు గురైనవాళ్లే. గర్భవతులు, చంటిపిల్లల తల్లులు అనే తేడా లేకుండా చంటిపాప నుంచి ముసలి తల్లి వరకూ అందరిపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు.. ఒకవైపు అత్యాచారాలు, వేధింపులు ఇలా సాగుతుంటే మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి మహిళలు సీరియస్ సమస్యలను ఆలోచించకుండా టీవీ మాయాజాలంలో వారిని ముంచేస్తున్నారు. స్త్రీలను సెలబ్రెటీ షోలు, రియాల్టీ షోల పేర వారిని పోపుగింజులు ఏరడం, అరటిపండు పొట్టు ఒలవడం, పట్టుచీరల ప్రదర్శనలు, వంటల కార్యక్రమాలు, డాన్సులకు అంకితం చేస్తున్నారు. సీరియళ్లు, సినిమాల్లో కూడా మహిళలు అస్తిత్వం అనే విషయమే కానరాదు. ఎంతసేపటికీ హీరోల పక్కన చిందులేయడానికీ లేదా పురాణాలలో సహనశీలి పాత్రలు పోషించడానికి వారిని పరిమితం చేశారు. స్త్రీలపై జరుగుతున్న ఈ సాంస్కృతిక పరమైన దాడిపై పోరాడుతూనే, ఈ ప్రదర్శనలకు అనుమతులిస్తున్న ప్రభుత్వాలను నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 


 స్త్రీలపై వివక్షకు వ్యతిరేక పోరాట మంటే అసమానత్వ వ్యతిరేక పోరాటమే. సమాజంలోని అసమానత్వాన్ని పెంచి పోషిస్తున్న పాలకుల విధానాలకు వ్యతిరేకంగా పోరాడకుండా సమానత్వాన్ని సాధించలేం. మార్చి 8 అంతర్జాతీయ మహిళా పోరాట  దినాన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సమాన అవకాశాల కోసం ఉద్యమిద్దాం. అన్ని రకాల వివక్షలను వ్యతిరేకిద్దాం.


వూకె రామకృష్ణ

ఆదివాసీ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

9866073866

Relative Post

Newsletter