వామపక్షాలు- ఐక్య సంఘటన – అనుభావాలు
వామపక్షాలు- ఐక్య సంఘటన – అనుభావాలు
భారత దేశంలో వామపక్షాలు , ఐక్య సంఘటన విషయంలొ ఎప్పుడూ సరిగ్గా వ్యవహరించినట్లు కనిపించదు . ఏదో ఒక వైపు కొట్టుకుపోవడమే ఎక్కువగా కనిపిస్తుంది . అయితే అతివాదం లేకపోతే మితవాదం . భారత స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో అందరికంటే ముందు , సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని డిమాండు చేసింది కమ్యూనిస్టు పార్టీనే . కానీ కలుపుకు పోవలసిన మిత్ర పార్టీ పేరుతో కాంగ్రెస్ పార్టీ కి తోకగా వ్యవహరించింది . తన స్వతంత్రతనే పోగుట్టుకున్నది . ప్రపంచానికి హిట్లర్ ఫాసిజం ప్రమాదం గురించి కమ్యూనిస్టు పార్టీకి సరిఅయిన అవగాహనే ఉండినా 1942 క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంగా మాత్రం భారత్ లో సరిఅయిన ఐక్య సఘటన ఎత్తుగడలు అవలంబించకపోవడం వలన కమ్యూనిస్టు పార్టికి చాలా నష్టం జరిగింది . ఆ తరువాత కూడా వామ పక్షాలు దేశ చరిత్రలో ఐక్య సంఘటన విషయంలో గొప్ప ఫలితాలు ఎమి సాధించ లేదు . పెట్టుబడిదారి , భూస్వామ్య పార్టీలకే ఎక్కువ ఉపయోగ పడినాయి , వామపక్షాల ఐక్యసంఘటనలు . C P I ఎమర్జన్సీ కాలంలో కాంగ్రెస్ పార్టీకి మద్దత్తు ఇచ్చింది . C P I (M) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీతో చెలిమి చేసి నష్టపోయింది బలహీనపడింది . ఇంకా ఆమధ్యలో ఎటువంటి రాజకీయ పరిజ్ఞానం లేని పవన్ కల్యాణ్ తో చెలిమి చేసి రెండు వామపక్షాలు ఆభాసు పాలయ్యాయి . పవన్ కల్యాణ్ వెల్లి బి జె పి చంకన ఎక్కాడు . పశ్చిమబెంగాల్ లో C P I (M) , కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని నష్ట పోయింది . C P I , C P I (M) లు మన్ మోహన్ సింగ్ మొదటి ప్రభుత్వానికి మద్దత్తు ఇచ్చి నష్ట పోయాయి . ఆ ప్రభుత్వపు అప్రతిష్ట ఎంతో కొంత ఈ పార్టీలకు కూడా అంటుకున్నది .
నక్సలైట్ పార్టీల పరిస్థితి మరో రకం . ఈ పార్టీలు పెట్టుబడిదారీ , భూస్వామ్య పార్టీలతో ఎత్తుగడల రీత్యా కూడా ఎప్పుడూ ఐక్య సంఘటన లేదా పొత్తు పెట్టుకున్న ఉదహరణలు లేవు . జాతీయ పెట్టుబడి దారి వర్గంతో పొత్తు పెట్టుకోవచ్చు అనే అవగాహన ఉన్నా , పాలక వర్గాల మధ్య వైరుధ్యాలు ఉంటాయని వాటిని ఉపయోగించుకోవాలనే అవగాహన ఉన్నా ఎప్పుడూ ఎవరితోనూ ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోలేదు ఈ పార్టీలు . కానీ పాలక వర్గాలు ఈ పార్టీలకు వారి కార్య కలాపాలకు కొంత సడలింపు ఇచ్చి వారి సానుభూతిపరుల ఓట్లు పొందడానికి చేసిన ప్రయత్నాలు కనిపిస్తాయి . అందులో పాలక వర్గాలు విజయవంతం కూడా అయ్యాయి . ఇదంతా ఎన్నికల సమయాలలోనె జరుగుతుంది . నక్సలైట్ పార్టీలు కూడా ఇటువంటి సందర్భాలలో ప్రత్యక్షంగా ఎటువంటి పొత్తులకు పోకుండానే , నిర్భంధ సడలింపు కాలంలో తమ ప్రజా పునాదిని పెంచుకోవడానికి ప్రయత్నించాయి . ఒక విధంగా ఇదీ ఒక రకమైన పొత్తే లేదా పరస్పర అవగాహన . అయితే ఇందులోనూ పెట్టుబడిదారీ , భూస్వామ్య పార్టీలే లబ్ధి పొందాయి .
ఒక్క చెన్నారెడ్డి కాలంలో మాత్రం అప్పటి పీపుల్స్ వార్ పార్టీ తన పునాదిని ఒక మేరకు బలోపేతం చేసుకోగలిగింది .తరువాత NT రామారావు ఎన్నికల ప్రచారంలొ ‘నక్సలైట్ లే దేశభక్తులు’ అని చెప్పి వారి సానుభూతిపరుల ఓట్లు పొందే ప్రయత్నం చేశాడు . అధికారంలోకి వచ్చాక దాడులు చేయించాడు . తిరిగి రాజశేఖర్ రెడ్డి ఇదే ఎత్తుగడ వేశాడు . 2004 లో అధికారంలోకి వచ్చాడు . చరిత్రలో మొదటి సారి మావోయిస్టు పార్టీతో ప్రభుత్వం చర్చలు జరిపింది . కానీ, చెన్నారెడ్డి కాలంలో అప్పటి పీపుల్స్ వార్ పార్టీ పరిస్థితులను ఎలా ఉపయోగించుకున్నదనే అనుభవం ప్రభుత్వం దగ్గర ఉంది . అందుకే చర్చలు , కొన్ని సభలు తప్పితే మావోయిస్టు పార్టీకి పెద్దగా ఉపయోగ పడలేదు . నష్టమే ఎక్కువ జరిగింది . అప్పటికి కాంగ్రెస్ పార్టీ అధికారానికి పది సంవత్సరాల నుండి దూరం ఉన్నందున తను సంఘటిత పడేవరకు సమయం ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి . తరువాత అంతా పాత కథనే కొనసాగింది . మళ్ళి 2014 లో కెసిఆర్ ఎన్నికల సందర్భంగా మావోయిస్టుల ఎజెండానే మా ఎజెండా అని చెప్పాడు . నిజానికి అప్పటికే తెలంగాణాలో మావోయిస్టు పార్టీ బాగా బలహీనపడి ఉంది . అయినప్పటికి ఆ పార్టీ సానుభూతి పరుల ఓట్ల కొరకు కెసిఆర్ ఆ విధంగా ప్రచారం చేసాడు . షరా మామూలే కెసిఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఎన్ కౌంటర్ లు ఆగలేదు . తెలంగాణా రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న శ్రుతి , వివేక్ లను కూడా ఎన్ కౌంటర్ చేశారు . పశ్చిమ బెంగాల్ లోనూ మమతా బెనర్జీ , మొదటి సారి గెలిచినప్పుడు మావోయిస్టు ఉద్యమాన్ని వాడుకున్నది . తరువాత ఉద్యమాన్ని దెబ్బతీసింది .
ఈ చరిత్ర అంతా నిరూపిస్తున్నదేమిటి ? ఎవరితోనూ పొత్తులు పెట్టుకోవద్దు , ఐక్య సంఘటన కట్టవద్దు అని కాదు . వాటిల్లో వామపక్షాలు పాటించాల్సిన సూత్రాలను పాటించలేదని మాత్రమే . ఐక్య సంఘటనలో ఐక్యతా ఉంటుందీ , పోరాటం ఉంటుందీ . స్వతంత్రత ఉంటుంది . వామపక్ష పార్టీలు ఇతర పార్టీలతో ఐక్య సంఘటన కడితే ఇక ఆపార్టీలతో ఐక్యతనే ప్రదర్శిస్తున్నారు . పోరాటం ఉండదనే లాగా వ్యవహరిస్తున్నారు . దీనితో వామపక్ష పార్టీలకు ఇతర పార్టీల తోకలనే పేరు వచ్చింది . ఐక్య సంఘటనలో ఇతర పార్టీలు ఉమ్మడి అవగాహనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నప్పుడు ఐక్యసంఘటనలోనూ పోరాడాల్సి ఉంటుంది . చివరికి ఇస్తామన్న సీట్లు ఇవ్వకపోతే కూడా పొత్తు నుండి బయటికి రావడం లేదు . ఆ పార్టీలను విమర్షిస్తే పొత్తు విఛ్చిన్నమవుతుందని అనుకుంటె అది మితవాదానికి దారి తీసి , వామపక్షాలు ప్రజలకు దూరం అవుతాయి. ఉమ్మడి శతృవుకు వ్యతిరేకంగా పోరాటం ఎమో కాని ఈ పోరాటం లేని పొత్తులు వామపక్షాలకు నష్టదాయకంగా మారినాయి . మరో ముఖ్యమైన విషయం స్వతంత్రత . వామపక్షాలు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తమ స్వతంత్రతను నిలపెట్టుకోవడం లేదు .
ఐక్యసంఘటనలో నిర్నయించబడిన కార్యక్రమానికి ఏ పార్టీ అయినా కట్టుబడి ఉండాలి . ఆ ఉమ్మడి కార్యక్రమానికి భిన్నంగా ఏ పార్టీ వ్యవహరించ కూడదు . అంతే కాని తమ పార్టీ స్వంత కార్యక్రమాలు మిగతావి ఏమి చేయకూడదని అర్ధం కాదు . విచిత్రం ఏమిటంటే ఐక్య సంఘటనలోని పెట్టుబడిదారీ పార్టీలు తమ స్వంత స్వతంత్ర కార్యక్రమాలను నిర్వహించుకుంటాయి . వామపక్షాలు మాత్రం , వారికి ఐక్యసంఘటన కర్యక్రమం తప్ప ఇక మరేమి పని లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి . ఇప్పుడు మునుగోడు లో TRS కు సిపిఐ , సిపిఐ (ఎమ్) పార్టీలు మద్దత్తు ఇచ్చాయి . ఇక ముందు కూడా వామపక్ష పార్టీలు TRS తో పొత్తు పెట్టుకొవచ్చు అని వామపక్ష పార్టీల నాయకులు చెప్పుతున్నారు . ఈ నేపథ్యంలో గత అనుభవాలను ధృష్టిలో పెట్టుకుని ఐక్య సంఘటనలో అవసరం అయినప్పుడు పోరాడుతూ, తమ స్వంత కార్య క్రమాలను కూడా నిర్వహించుకుంటూ ముందుకు వేల్లినప్పుడే ముఖ్యంగా వర్గ పోరాటాల పైన ఆధారపడుతూ ప్రజల రాజకీయ చైతన్యం పెంచినప్పుడే , ఎంత అస్థిర మితృడితో అయినా ఎంత తాత్కాలికం అయినా ఒక ఐక్యసంఘటన ప్రజలకు ఉపయోగ పడుతుంది .
-లంకా పాపి రెడ్డి