బిజెపి టచ్ ప్రజాస్వామ్యం , అప్రజాస్వామ్యమే
బిజెపి టచ్ ప్రజాస్వామ్యం , అప్రజాస్వామ్యమే
ప్రపంచంలో భారతదేశం పెద్ద ప్రజాస్వామ్య దేశం అంటూ బీజేపీ నాయకులు కూడా గొప్పగా చెబుతూ ఉంటారు . కానీ 2014లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి భారత దేశ ప్రజాస్వామ్యం మరింత హాస్యాస్పదంగా మారింది . బిజెపి కి దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో స్థానిక స్థాయి నుండి పార్టీ నిర్మాణం లేదు . ఉత్తర భారత దేశంలోనూ కొన్ని రాష్ట్రాల లోనే బిజెపికి స్థానిక స్థాయిలో పార్టీ నిర్మాణం వుంది . కేంద్రంలో అధికారంలో ఉండగానే అన్ని శక్తులను ఉపయోగించి వివిధ రాష్ట్రాలలో బిజెపి ని బలోపేతం చేయాలని , అన్ని రాష్ట్రాలలో పార్టీ నిర్మాణాన్ని విస్తరింప చేయాలని అనుకుంటున్నది దాని నాయకత్వం . ఈ లక్ష్య సాధన క్రమంలో బిజెపి నైతికంగా పూర్తిగా పతనమైంది . అధికారం కొరకు ఎటువంటి పద్ధతులనైనా అవలంబించి ఎవరినైనా బీజేపీలో చేర్చుకోవడానికి సిద్దపడుతున్నది . ఒక సిద్ధాంతం , దానిపై ఆధారపడి ఒక కార్యక్రమం , దానిని అమలు చేయడానికి ఒక రాజకీయ పార్టీ ఉంటుంది . బీజేపీకి సిద్ధాంతం కార్యక్రమం ఉంది . నిజానికి దాని ఆధారంగానే బిజెపి అభివృద్ధి చెంది , అధికారం పొంది , దాని కార్యక్రమాన్ని అమలు చేసుకోవాలి . అయితే బిజెపి తన సిద్దాంతం , కార్యక్రమం ఆధారంగా దేశవ్యాప్త పార్టీగా అభివృద్ధి చెందే అవకాశం లేదని దాని నాయకత్వానికి అర్థం అయ్యింది .
ఉత్తర భారతదేశంలోనూ ఒకటి రెండు రాష్ట్రాల తప్పితే మిగతా రాష్ట్రాలలో బీజేపీ అప్పుడప్పుడూ అధికారంలోకి వచ్చే పార్టీ మాత్రమే .అందుకే అధికారం కొరకు ఎంతటి అవినీతిపరులు నైనా , నిన్నటి వరకూ ఎవరి అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడినారో ఆ అవినీతి పరులను సైతం బిజెపి లో చేర్చుకుంటున్నారు ఎటువంటి బిడియం లేకుండా . ఈ క్రమంలోనే రాష్ట్రాలలో ఎన్నుకోబడిన ప్రభుత్వాలను బిజెపి కూల్చివేస్తున్నది.ఈ మధ్యలోనే మధ్యప్రదేశ్ , కర్ణాటక , మహారాష్ట్ర ప్రభుత్వాలు బిజెపి కూల్చి వేసింది . ఎలాగైనా సంపాదించు సంపాదించిన వాడే గొప్పవాడు నైపుణ్యం కలవాడు అనే ప్రచారం ఎలా జరుగుతుందో , అలాగే ఎలాగైనా అధికారం కైవసం చేసుకో అధికారాన్ని సాధించిన పార్టీయే గొప్ప పార్టీ అనే ప్రచారం చేస్తున్నది బిజెపి . ఆశ్చర్యమేమంటే ప్రభుత్వాలను కూల్చడం కూడా ప్రజాస్వామ్యం ప్రకారమే చేశామని అంటున్నారు బిజెపి నాయకులు . ప్రభుత్వాలను కూల్చడం ద్వారా ఏర్పడిన తమ ప్రభుత్వాల గురించి కూడా , ఎన్నికలలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పరచినంత గొప్పగా చెప్పుకుంటున్నారు . ఇక ఎన్నికలు ఎందుకు ? ఎన్నికలలో గెలిచిన వారిని ఏదో ఒక సాకుతో తమ పార్టీలో చేర్చుకుంటే సరిపోతుంది .
నిజంగానే బీజేపీకి ప్రజలలో బలం ఉంటే ఆ రాష్ట్రాలలో ఎన్నికలు పూర్తి మెజారిటి సాధించి ప్రభుత్వాలను ఎందుకు ఏర్పాటు చేయలేకపోయింది . బీజేపీకి ముందే చాలా రాష్ట్రాలలో ఎన్నికలలో గెలిచి ప్రభుత్వాలను ఏర్పాటు చేసే పరిస్థితి లేదు .ఇక ఇప్పుడు బిజెపి ఎనిమిది సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ పాలనను చవిచూసిన ప్రజలు ఏ రాష్ట్రంలోనూ బీజేపీని గెలిపించే ఆలోచనలో లేరు . అందుకే బిజెపి షార్ట్ కట్ రూట్ ఎంచుకున్నది . గెలిచిన వారిని సామ దాన భేద దండోపాయాలు అవలంబించి తమ పార్టీలో చేర్చుకుని ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం . ఈ అప్రజాస్వామిక పద్ధతి చివరికి బిజెపి పతనానికి దారి తీస్తుంది . ఎవరిని చేర్చుకున్నా , బిజెపి లో కీలక స్థానాలలో ఆర్ఎస్ఎస్ నుండి వచ్చిన వారే ఉండి పార్టీని కంట్రోల్ చేస్తారు కావున బిజెపి కి ఏమి సమస్య ఉండదని అనుకుంటున్నారు . కానీ పార్టీ RSS కంట్రోల్ లోనే ఉండవచ్చు కాని ప్రజలలో మాత్రం బిజెపి అంటేనే దూరం పరిగెత్తే పరిస్థితి వస్తుంది .
ఇక ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలను కూల్చడమే ఒక అనైతిక , అప్రజాస్వామిక చర్య అయితే , బిజెపి నాయకులు బీజేపీ యేతర రాష్ట్ర ప్రభుత్వాలను బహిరంగంగా బెదిరిస్తున్నారు మీ ప్రభుత్వాన్ని కూడా కూల్చివేస్తామని . తెలంగాణలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు మొదలుకొని దాని రాష్ట్ర అధ్యక్షుడు ఇతర నాయకులు రోజు తెలంగాణా ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నారు . తెలంగాణాలో లో కూడా షిండేలు ఉన్నారని బయటకు వస్తారని ఒకరంటే మరో నాయకుడు ఎమ్మెల్యేలు చాలామంది మా టచ్లో ఉన్నారని బహిరంగంగా చెబుతున్నారు గొప్పగా . అంటే బీజేపీకి తెలంగాణా లో తన సొంత బలంతో గెలిచే సత్తా లేదని స్వయంగా ఒప్పుకుంటున్నారనే విషయం నాయకులకు తెలవడం లేదు . అంతేకాదు అలా చెప్పడం అప్రజాస్వామికమనే ఎరుక కూడా లేకుండా పోయింది ఆ నాయకులకు . చివరికి గోబెల్స్ ప్రచారం చేసి ఇలా ప్రభుత్వాలను , పార్టీలను కూల్చడం కూడా ప్రజాస్వామ్యమే అని ప్రజలకు చెప్పలని చూస్తున్నారు .
అంటే బీజేపీకి ఎమ్మెల్యేలే కాదు అసలు ఆ పార్టీకి తెలంగాణాలో నాయకులు ఎవరు లేరనేది అర్థమవుతున్నది . ఇతర పార్టీల నుండి అరువు తెచ్చుకుంటే తప్ప ఆ పార్టీకి పూట గడిచే పరిస్థితి లేదన్నమాట . అయితే బిజెపి నాయకులకు ఎలాగూ ప్రజాస్వామ్యం పట్ల మంచి అభిప్రాయం ఏమీ లేదు . కానీ వామపక్ష ఉద్యమం నుండి వచ్చాను అని చెప్పుకునే ఈటల రాజేందర్ కూడా పూర్తిగా కాషాయీకరణ చెంది అదే భాషలో మాట్లాడుతున్నాడు . బహుశా కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి తనే భావన లో ఉన్నట్లుంది . టిఆర్ఎస్ లో 20 సంవత్సరాలు ఉన్నాను నాకు అందరు తెలుసు చాలా మంది టచ్ లో ఉన్నారు , ఎన్నికలు దగ్గర పడగానే మా పార్టీ లోకి వచ్చేస్తారు అని చెబుతున్నాడు . తెలంగాణ ఉద్యమంలో కూడా ఉన్న ఈటల రాజేందర్ కు టిఆర్ఎస్ లో ఉన్న నాయకులే కనిపిస్తున్నారా ? తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాడి ప్రభుత్వానికి , TRS కు బయట ఉన్న నాయకులు కనిపించడం లేదా ? ముఖ్యమంత్రిని అవుతానని అనుకుని రాజేందర్ గారు ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ పశ్చిమ బెంగాల్లో కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇలాగే తృణమూల్ కాంగ్రెస్ పార్టీని మొత్తం ఖాళీ చేస్తామన్నారు . చాలా మందిని బిజెపిలో చేర్చుకున్నారు కూడా . అయితే ఎన్నికల్లో మాత్రం బొక్కబోర్లా పడ్డారు పశ్చిమబెంగాల్ కు తెలంగాణకు చాలా సారూప్యతలు ఉన్నాయి . తెలంగాణా లో కూడా బిజెపి కలలు కల్లలే అవుతాయి .
-లంకా పాపిరెడ్డి