నేతల అవకాశవాద రాజకీయం

–  టీఆర్​ఎస్​ వర్సెస్ బీజేపీ 

–  అధికారం కోసం నాయకుల అవస్థలు

–  జవాబుదారీ తనంలేని  విమర్శలు

–  ఆత్మవిమర్శలేని కేసీఆర్​ ఆరోపణలు

– మతతత్వం వర్సెస్​ ప్రాంతీయతత్వం 


వేకువ ప్రత్యేక ప్రతినిధి: తాము చేస్తుందేమిటో మరిచిపోయి ఇతరులకు హితోపదేశాలు చేయడంలో స్థాయిభేదం, పార్టీ తేడా లేకుండా రాజకీయ నాయకులు ముందుంటున్నారు. ఎందుకంటే  తాము మాత్రం తమ పరిధిలో అదే పనిచేస్తూ ఎదుటివ్యక్తులకు నీతి సూత్రాలు వడ్డించడానికి పోటీపడుతున్నారు. ఇతరులకు సూక్తులు చెప్పడంలో కనబరిచే శ్రద్ధ తమకు అవకాశం లభించినపుడు ఆచరించకుండా సమయానుకూలంగా మర్చిపోతుంటారు అది మోడీగానీ, కేసీఆర్​గానీ మరొకరని తేడా లేకుండా ఇదే తీరుగా వ్యవహరిస్తూ ప్రజలను పక్కదోవపట్టించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా కేసీఆర్​ టీఆర్​ఎస్​ ప్లీనరీ వేదిక పై నుంచి చేసిన విమర్శలు, ఆరోపణలు పరిశీలిస్తే ఈ తేడా స్పష్టంగా కన్పిస్తోంది. కేసీఆర్​ మాట్లాడిన అనేక అంశాలతో విభేదించాల్సిన అవసరం లేనప్పటికీ ఇంతకాలం మౌనప్రేక్షపాత్రవహించి ఇప్పుడే జ్ఞానోదయమైనట్లు మాట్లాడడమే చర్చనీయాంశం. కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ మతతత్వాన్ని వినియోగించుకుంటే కేసీఆర్​ తెలంగాణ ప్రాంతీయ సెంటిమెంట్‌ను ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చారనేది బహిరంగ సత్యం.   


–  మతతత్వాన్ని కేసీఆర్ ఎందుకు ఉపేక్షించారు?


టీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ ఇటీవల బీజేపీపై విరుచుకపడుతున్నారు.  రెండు పార్టీ మధ్య స్నేహం ఎక్కడ చెడిందనేది పెద్ద ప్రశ్నగా మిగిలే ఉంది. తాజా విమర్శల్లో టీఆర్​ఎస్​  పార్టీ, కేసీఆర్​ తన రాజకీయ ప్రయోజనాలేమున్నా బీజేపీ అనుసరిస్తున్న మతతత్వవిధానాలపై మండిపడుతున్నారు. దీన్ని అంతా సమర్ధించాల్సిందే. కానీ,  బీజేపీ ఇప్పుడే మతాన్ని వినియోగించుకుంటున్నట్లు మాట్లాడడమే గమనార్హం. ఆ పార్టీ పురోభివృద్ధితోపాటు, బలోపేతం చేసుకుంటూ  అధికారంలోకి వచ్చింది మతాన్ని అడ్డం పెట్టుకున్న  విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయం కేసీఆర్​కు  ఇప్పుడే తెలిసినట్టు దానిపైన మాట్లాడుతున్నారు. అధికారం  రావడానికి బీజేపీ ఏ మతాన్ని అయితే వినియోగించుకుందో  దక్కిన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి తిరిగి మత విద్వేషాలను వినియోగించుకుంటుందనేది బహిరంగ సత్యం.  దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మత విద్వేషాలను, అందులో మైనార్టీ ముస్లీం మత వ్యతిరేకతను ప్రజ్వరిల్లజేసి ప్రజలను విభజించి అధికారాన్ని కాపాడుకునేందుకు యత్నిస్తోంది. తాజా కర్నాటకలో హలాల్​, హిజాబ్​ వివాదం, ఢిల్లీ జహంగీర్​పూర్​ కూల్చివేతలన్నీ ఇందులో భాగమే. 


–  ఎనిమిదేళ్ళు దోస్తీ చేసిందెవరు?  


రాష్ట్రంలో టీఆర్​ఎస్​, కేంద్రంలో బీజేపీ ఎనిమిదేళ్ల నుంచి అధికారంలో ఉన్నారు.  నిన్నమొన్నటి వరకు ఇద్దరూ ఒకరికొకరు దోస్తీ చేసుకున్నారు.  నిన్నటి వరకు ఈ విషయమై పల్లెత్తు మాట కూడా అనని కేసీఆర్​ ఇటీవల  ఈ అంశాన్ని లేవనెత్తడం  గమనార్హం.  కేసీఆర్​ విమర్శల్లో వాస్తవం ఉంది అయినప్పటికీ ఇంతకాలం ఎందుకు మౌనం వహిండానికి కారణమేమిటనేది చెప్పడంలేదు. 


– ఆర్ధిక విధానాలకు మద్ధతెవరు తెలిపారు? 


ఇక ఇటీవల బీజేపీ, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న  ఆర్థిక విధానాలను,  మోడీ పరిపాలనపై మండిపడుతున్నారు.  కేంద్ర ప్రజావ్యతిరేక వ్యవహారాలు, ప్రభుత్వ సంస్థలను నిర్వీర్వం చేసి ప్రైవేటు సంస్థలకు, ఒకరిద్దరు తమ నమ్మకమైన వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇప్పుడే మోడీ కొత్తగా ఈ విధానాలను అవలంభిస్తున్నారా?  అనేది ప్రశ్న.  కేసీఆర్​ కళ్ళు ఇప్పుడే తెరిచినట్లు మాట్లాడడమే ఇక్కడ వింత. ఈ విషయాలన్ని పరిశీలిస్తే  కేసీఆర్​గానీ, మోడీ గానీ తమ  రాజకీయ ప్రయోజనాల కోసం, తమ అధికారాన్ని కాపాడుకునేందుకు విమర్శలు చేయడం తప్ప చిత్తశుద్ధి కనబరచడంలేదు.  ఎదుటి వ్యక్తి,  పార్టీ చేసే తప్పులను చూస్తూ ఉండి తమ రాజకీయ అవసరాల కోసం అవకాశవాదం గా వినియోగించుకునేందుకు ఈ పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు. తమ స్వార్ధ ప్రయోజనాల ముందు దేశ అభివృద్ధి, ప్రజాసంక్షేమం దిగదుడుపుగా మారాయి.  ఈ ఇద్దరి మధ్య దోస్తీ సాగినపుడు మోడీకి కేసీఆర్​ వత్తాసు పలికిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. 


– విపక్షాలపై మోడీ ఒత్తిడితెస్తే ఏం చేశారు?


విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మోడీ అధికారం కోసం కదిపిన పావులు, ఆ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలదోసేందుకు చేసిన చర్యలు కేసీఆర్​కు తెలియవా? విపక్ష పార్టీలపై కేంద్రం రకరకాల ఒత్తిడులు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అప్పుడు వీటిపై ఎందుకు నిలదీయలేదని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇదే కేసీఆర్​ తెలంగాణలో అధికారంలో ఉంటూ అనుసరిస్తున్న విధానాలను ప్రశ్నిస్తున్నారు. ఎనిమిదేళ్ళుగా తెలంగాణలో ఏం జరుగుతోందని ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్షాలను అణచివేస్తూ, ప్రజా సమస్యలపై నిలదీసే సంఘాలు, సంస్థల గొంతును నొక్కివేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో నిజాయితీగా వ్యవహరిస్తూ కేంద్రంలోనో, ఇతర పార్టీలో అనుసరించే ప్రజావ్యతిరేక విధానాలను నిలదీస్తే ప్రజల్లో విశ్వాసం కలుగుతోందని గుర్తు చేస్తున్నారు. తాము మాత్రం తప్పులు చేస్తూ ఇతరునుల విమర్శిస్తే ఎవరూ పట్టించుకోరని అంటున్నారు.  


–   బీజేపీ, టీఆర్ఎస్‌ పరస్పర అవినీతి ఆరోపణలు


బీజేపీపై కేసీఆర్​ అవినీతి ఆరోపణలు, కేసీఆర్​పై బీజేపీ నాయకుల అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. పరస్పర విమర్శలతో రాజకీయ వేడిని పెంచడం తప్ప ఇందులో ఏ పక్షం ప్రజలకు జవాబుదారీ తనం వహించకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో తమ సశ్చీలత నిరూపించుకునేందుకు ఏ మాత్రం యత్నించకుండా ఆరోపణలతో కాలం వెల్లదీస్తున్నారు. ఉద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాలు పొందుతున్నారు. నీతులు చెప్పే ఈ పార్టీల నేతలు అవతలి వ్యక్తికి నీతులు చెప్పే ముందు వీరు అనుసరించకపోవడం సిగ్గుచేటు


– నేతలకు రాజకీయ పరిణితి ఉందా! 


రాజకీయాల్లో పరిణితి ఉండాలంటూ కేసీఆర్​ హితోపదేశం చేయడం బాగుంది. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గవర్నర్ రామ్ లాల్​ను  ఉపయోగించుకొని ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ  దాని నుంచి గుణపాఠం తీసుకొని పరిణతి సాధించాలనే మేరకు బాగానే ఉంది. కానీ, పార్టీ ఫిరాయింపుల విషయం కూడా ఇదే తీరుగా మాట్లాడితే బాగుండేది. స్వయంగా తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి ఫిరాయించిన అనుభవం ఉన్నప్పటికీ  తాము అనుభవించి బాధను పక్కన పెట్టి  కేసీఆర్​ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పార్టీ ఫిరాయింపులను అమలు చేయడమంటే అర్ధమేమిటని ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న కేసీఆర్​కు ఉండాల్సిన అవసరం లేదా? 


– కేసీఆర్ ఆత్మవిమర్శ ఎందుకు లేదు?


విలువల గురించి మాట్లడే నాయకులు  తమకు అవకాశం వచ్చినప్పుడు అమలు చేసినప్పుడే గౌరవం దక్కుతోంది.  ఎనిమిదిన్నరేళ్ళ బీజేపీ  అనుబంధంపై మౌనం వహిస్తూ, కనీస ఆత్మవిమర్శ ప్రకటించకుండా, తాము ఇంతకాలం అనుసరించిన మార్గాన్ని విశ్లేషించ కుండా దాటవేస్తున్నారు.  తాజా రాజకీయ అవసరాలకు అనుగుణంగా మాట్లాడమంటే ఎవరికైనా విశ్వాసం సన్నగిల్లుతోంది. కేసీఆర్ ఆర్ చర్చకు పెట్టిన అంశాలను మనం కాదని లేకపోయినప్పటికీ ఆయన ఆచరణ అనుమానాస్పదంగా కన్పించడం ఇక్కడ గమనార్హం. ఇప్పటికైనా కేసీఆర్​ ప్రజాక్షేత్రంలో నిజాయితీ ఆత్మవిమర్శ ప్రకటన చేయాలని కోరుతున్నారు. 

Relative Post

Newsletter