పరాభవం కాదు...ప్రజాస్వామ్య సంక్షోభం
నీతులకు బాజపా చరమ గీతం
అధికారానికి మోడీషా దాసోహం
తాజా 'మహా' సంక్షోభమే తార్కాణం
ఆరంభం కాదు
అధికారం చుట్టూ చక్కర్
అన్ని 'పక్షులు'
ఆ తాను ముక్కలే
ఫిరాయింపుల చట్టం పరాయి పాలు
-లంక పాపిరెడ్డి
ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి , మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడానికి బిజెపి అదేపనిగా ప్రయత్నిస్తూనే ఉన్నది . అసలు ముందు ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ ను తమ వైపు తిప్పుకొని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూసింది . కానీ ఆ ప్రయత్నం విఫలం అయింది . అయినా బిజెపి ప్రయత్నాలను వదులుకోలేదు . తమ లక్ష్యాన్ని సాధించడం కొరకు అన్ని తరహాల ఎత్తుగడలను ఒత్తిడులను ఉపయోగిస్తున్నారు . కర్ణాటకలో కూడా ముందు ఇలాగే బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలం అయింది . కానీ కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చే వరకు బిజెపి నిద్రపోలేదు . మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చడానికి కొరకు చేతులు కడుక్కొని వెంట పడినట్లు ఉన్నది బిజెపి .
అయితే భారతదేశంలో ఇలా జరగడం మొదటిసారి ఏమీ కాదు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇలాంటివి జరిగాయి . కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలను ఏదో ఒక సాకుతో రద్దు చేసిన ఉదాహరణలే ఎక్కువగా ప్రచారం అయ్యాయి . కానీ బీజేపీ ప్రభుత్వం ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలను రద్దు చేయకుండా , అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలను నయానో భయానో తనవైపు తిప్పుకొని ఆ ప్రబుత్వాలను కూల్చి , బిజెపి ప్రభుత్వాలను ఏర్పటు చేస్తున్నది . అక్రమంగా రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడమే కాక , దేశమంతా మమ్ములనే కోరుకుంటున్నారని ప్రచారం కూడా చేసుకుంటున్నది బిజెపి . కాంగ్రెస్ పార్టీ అప్రత్యక్షంగా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రభావితం చేసేది . కానీ బిజెపి బహిరంగంగానే భయపెట్టో ప్రలోభపెట్టో ఇతర పార్టీల ఎమ్మెల్యేల ను ఎంపీలను బిజెపి లో చేర్చుకుంటున్నది . అప్పటివరకు పరమ అవినీతిపరులంటూ తిట్టిపోసిన వారిని సైతం బీజేపీలో చేర్చుకున్నారు . వారు బిజెపిలో చేరగానే పవిత్రులై పోతున్నారు . బిజెపిలో చేరినవారు అసంతృప్తులు , అవినీతి ఆరోపణలు ఉన్నవారే . ఒక పార్టీ పేరు మీద గెలిచి మరో పార్టీలో చేరి ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం ఏ ఒక్క రాష్ట్రంలోనో జరగడం లేదు . ఇది ఒక సాధారణ విషయంగా మారిన తరువాత దాన్ని రాష్ట్రాల సంక్షోభంగా పేర్కొనడం సరిఅయింది కాదు . ఇది ప్రజాస్వామ్య సంక్షోభమే . అయితే పార్టీ ఫిరాయింపుల చట్టం ఉండగా ఇదంతా రాజ్యాంగబద్ధంగానే ఎలా జరుగుతుంది ? ఎందుకు ఆపలేక పోతున్నారు ?
రాజ్యాంగ సంక్షోభం
బ్రిటిష్ వాళ్ళు భారత్ ను వదిలి వెళ్ళిన తర్వాత జరిగిన ఎన్నికలలో ప్రారంభంలో పెద్దగా సమస్యలు ఉన్నట్లు కనిపించలేదు . ఎన్నికలు సజావుగానే రాజ్యాంగబద్ధంగానే జరుగుతున్నట్లు కనిపించింది . అయితే రాజ్యాంగ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన డాక్టర్ అంబేద్కర్ లాంటి వాళ్లు మాత్రం ఎన్నికల ప్రక్రియలో ఉన్న పరిమితులను అప్పుడే గుర్తించారు . (1953 జూన్ లో నే బిబీసీ కి ఇచ్చిన ఇంటర్యూ ) . 1967 వరకు భారత దేశంలో పార్టీ ఫిరాయింపులు ప్రాధాన్యత సంతరించు కోవడం మొదలైంది . తర్వాత పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం చేయడానికి రెండు మూడు సార్లు ప్రయత్నం జరిగినా ఫలించలేదు . చివరకు 1985 లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పార్లమెంట్లో చేయబడింది . అయినా ఫిరాయింపులు ఆగలేదు . రోజురోజుకు పెరుగుతున్న పార్టీ ఫిరాయింపులు రాజ్యాంగాన్ని హాస్యాస్పదం చేశాయి . తిరిగి బీజేపీ కాలంలోనే 2003లో పార్టీ ఫిరాయింపుల చట్టానికి మరికొన్ని సవరణలు చేశారు . ఎవరు ఏమి చేసినా ఆ చట్టంలో తమకు అవసరం అయిన లోపాలను కొనసాగించారు . అందుకే సవరణల తరువాత కుడా పార్టీ ఫిరాయింపులు ఆగలేదు . ఈ చట్టంలోని లోపాలను ఉపయోగించుకుంటూ రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు యధేచ్చగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయి . రాజ్యాంగంలో ఏమి ఉన్నదో అది అమలు కాకపోవడం అంటే అది రాజ్యాంగ సంక్షోభమే అవుతుంది .
ప్రజాస్వామ్య సంక్షోభం
మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలోని శివసేన లో జరుగుతున్న తిరుగుబాటును శివసేన సంక్షోభంగానూ మహారాష్ట్ర సంక్షోభం గానూ పేర్కొంటున్నారు చాలామంది . కానీ ఇది అసలు ప్రజాస్వామ్యం సంక్షోభం . మరీ ముఖ్యంగా 2014లో కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి భారత దేశ ప్రజాస్వామ్యం హాస్యాస్పదంగా మారింది . ఏ రాష్ట్రంలో ఎవరు గెలిచినా చివరికి బిజెపి నే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది , అనే విధంగా పరిస్థితి మారిపోయింది . మహాశక్తివంతం అయిన జాతీయ పార్టీలు ప్రజల ద్వార ఎన్నుకోబడిన ఏ ప్రభుత్వాన్ని అయినా కూల్చి ప్రజాభీష్టానికి విరుద్దంగా తమ ప్రభుత్వాలను ఏర్పరచడం అంటే అది ప్రజాస్వామ్యం సంక్షోభం తప్ప మరేమి కాదు . కష్టపడి ఎన్నికలలో గెలవడం కంటే గెలిచిన ప్రజాప్రతినిధులను తమ వైపు తిప్పుకోవడం సులువుగా మారింది . భారత ప్రజాస్వామ్యం సాంకేతిక ప్రజాస్వామ్యంగా మారింది . ఎన్నికలలో ఎందరు నిలబడిన ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినా , ఒక్క ఓటు ఎక్కువ వచ్చిన వారే విజేతలు అవుతున్నారు . అందుకే 30 శాతం ఓట్లు వచ్చిన వారు కూడా ప్రభుత్వాలను నడుపుతున్నారు . ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు జరగడం మాత్రమే , ప్రజలు ఓట్లు వేయడం మాత్రమే అనే విధంగా ప్రజల అవగాహనను మార్చి వేశారు . మిగతా విషయాలు అన్ని అనవసర విషయాలుగా మారిపోయాయి . ప్రజలు ఓట్లు వేయడమే కాదు ప్రజలు ఎటువంటి చైతన్యంతో ఓట్లు వేస్తున్నారు అనేది ప్రజాస్వామ్యానికి చాలా ముఖ్యం . డబ్బులకు ఆశపడి ఓటు వేస్తున్నారా ? కులం కారణంగా ఓటు వేస్తున్నారా ? మతం కారణంగా ఓటు వేస్తున్నారా ? బెదిరింపులకు భయపడి ఓటు వేస్తున్నారా ? ఇవన్నీ చూడాల్సి ఉంటుంది . వీటిని పట్టించుకోకుండా ఎన్నికలు జరిగితే చాలు అదే ప్రజాస్వామ్యం అని అనుకుంటున్నారు . అందుకే డబ్బు , కులం , మతం , ప్రలోభాలు , భయపెట్టడం విచ్చలవిడిగా పెరిగిపోతూనే ఉన్నాయి . అసలు ఎన్నికలలో గెలుపు ఓటములను ఇవే నిర్దారిస్తున్నాయి . ప్రజల కోసం పని చేసే వాడిని స్వేచ్ఛగా ఎన్నుకోవడం అనేది ఇప్పుడు ప్రజాస్వామ్యం లెక్కలో లేదు .
ఇక రెండవ విషయం ప్రజాప్రతినిధులే ప్రజాస్వామ్యం లెక్కల ప్రకారం ఎన్నిక కాబడనప్పుడు ఆ ప్రతినిధులు ప్రజాస్వామ్యం కు కట్టుబడడం అసంభవం . ప్రజల వద్ద నుండి ఓట్లు కొని గెలుస్తున్నారు . తరువాత ఈ ప్రతినిధులు తమ ఓట్లను అమ్ముకుంటున్నారు . గతంలో , తాము ఎన్నికలలో ఖర్చు చేసిన ధనాన్ని + గెలిచిన తరువాత ఐదు సంవత్సరాలలో తిరిగి సంపాదించుకునేవారు ఏదోవిధంగా . కాని ఇప్పుడు ఒక్కసారి పార్టీ మారితే ఒక్క రోజులోనే అంతకంటే ఎక్కువ పొందే అవకాశం ఇస్తున్నాయి మహాశక్తివంతమైన జాతీయ పార్టీలు . ఇదే రాష్ట్రాలలోని ఎమ్మెల్యేలను సులువుగా పార్టీ ఫిరాయింపులకు మొగ్గుచూపేలా చేస్తున్నది . చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు . వీరిని కేంద్ర సంస్థల ద్వారా లొంగదీసుకోవడం కూడా సులువైన విషయం . ఇప్పుడు శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల పైన కూడా ఎటువంటి ఆరోపణలు ఉన్నాయని అంటున్నారు . పార్టీలు మారే వారిని , రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి . శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నాయకుడు తనతో ఉన్న ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ మనకు మహా శక్తివంతమైన జాతీయ పార్టీ అండగా ఉంటానని చెప్పింది అన్నాడు . ఇదంతా ప్రజాస్వామ్యం సక్షోభమే తప్ప మహారాష్ట్ర సంక్షోభం కాదు . ఇది పార్టీల సంక్షోభం కాదు ఆయా రాష్ట్రాల సంక్షోభం కాదు ఇది ప్రజాస్వామ్యం సంక్షోభమే .
ప్రాంతీయ పార్టీలకు గుణపాఠం
మహారాష్ట్రలో శివసేన పార్టీ తన హిందుత్వ సిద్ధాంతాన్ని వదులుకున్నందుకే ఈ సంక్షోభం వచ్చినట్లుగా ప్రచారం జరుగుతున్నది . మహా శక్తివంతమైన ఒక జాతీయ పార్టీ యొక్క అప్రజాస్వామిక కుట్రలను కప్పిపుచ్చడానికి చేస్తున్న ప్రచారం మాత్రమే ఇది . నిజానికి హిందుత్వ కంటే శివసేన భూమిపుత్రుల పార్టీగానే మరాట ప్రజల ప్రయోజనాల కొరకు నిలబడిన పార్టీగానే ఎక్కువ మద్దత్తు పొందింది . స్వయంగా బాల్ టాక్రే , నేను ముందు మరాటా పుత్రుణ్ణి తరువాతనే భారతీయుణ్ణి అని అన్నాడు అంటే ఎంత ప్రాంతీయ వాదాన్ని ప్రత్యేకతను వ్యక్తం చేశాడు తెలుసుకోవచ్చు . అయితే ప్రాంతీయ పార్టీలు ఓట్లు కొనగలిగే వారికి కాకుండా ప్రజల అభిమానాన్ని చూరగొన్న వారికి టిక్కెట్లు ఇస్తే అమ్ముడుపోయే ఎమ్మెల్యేలను తగ్గించుకోవచ్చు . పార్టీ ఫిరాయింపు దారులు కాకుండా మొదటి నుండే పార్టీతో ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తే కూడా ఫిరాయింపులు తగ్గుతాయి . ప్రాంతీయ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులతో కార్యకర్తలతో సజీవ సంబంధాలలో ఉన్నప్పుడే పార్టీ లో జరిగే మార్పులను గుర్తించగలుగుతారు . దానికి అనుగుణంగా వ్యవహరించ గలుగుతారు . పార్టీలు తమ రాష్ట్రాలలో ప్రజాస్వామిక పాలన అందించి నప్పుడు మాత్రమే ప్రజల అభిమానాన్ని చూరగొన గలుగుతారు . కేంద్ర ప్రభుత్వం ఎటువంటి అప్రజాస్వామిక చర్యలకు పూనుకున్నా ప్రజలు తిప్పికొడతారు . ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో NT రామారావును ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసినప్పుడు , ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించి ఇందిరాగాంధీ కోరికను వమ్ము చేశారు . కానీ ఒక దశాబ్దం తర్వాత ఎన్టీరామారావు కు ఏమి జరిగినా ఎవరూ పట్టించుకోలేదు . ఒకసారి అధికారంలోకి రాగానే రాజులలాగా వ్యవహరిస్తే పార్టీ మీద పట్టు కోల్పోతారు . అప్పుడు మహా శక్తివంతమైన జాతీయ పార్టీలు , ప్రాంతీయ ప్రభుత్వాలను మింగివేస్తాయి . అంతేకాదు ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలు స్థిరమైనవి కావు అనే ప్రచారం కూడా చేస్తారు . చేస్తున్నాయి .
ముగింపు
పార్టీ ఫిరాయింపుల చట్టం లోని లోపాలను సవరించి , పార్టీ ఫిరాయింపు లకు అవకాశం లేకుండా చూసినప్పుడే , పార్టీ ఫిరాయింపుల చట్టం అమలు సరిగ్గా జరిగినప్పుడే రాజ్యాంగ సంక్షోభం అంతం అవుతుంది . ఎన్నికల విధానంలోనూ ప్రక్రియలోనూ సంస్కరణలు చేసి మెజారిటీ ప్రజల మద్దతు ఉన్న వారే ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే విధంగా చూసినప్పుడు , ధనమూ మతమూ భయమూ లాంటి వాటి ప్రమేయం లేకుండా ఓటరు స్వేచ్చగా ప్రజాస్వామిక చైతన్యం తో ఎన్నికలలో పాల్గొనగలిగినప్పుడు , ప్రజాస్వామ్యం సంక్షోభం అంతం అవుతుంది .
-లంక పాపిరెడ్డి
84650 53792