కొత్త జాతీయ పార్టీనా ? ప్రాంతీయ పార్టీల కూటమినా ?

కొత్త జాతీయ పార్టీనా ? ప్రాంతీయ పార్టీల కూటమినా ?

దేశంలో  కొత్త జాతీయ పార్టీకి మనగలిగే అవకాశం ఉన్నదా ? 

అసలు జాతీయ పార్టీ పెట్టాల్సిన ఆవశ్యకత ఉన్నదా ?  కాంగ్రెస్ కు కాలం చెల్లిపోయిందా..?

 బీజేపీ ని ఎదుర్కొనే ప్రత్యామ్నాయ శక్తి కావాలంటే అది జాతీయ స్థాయి పార్టీగానే ఉండాలా ?

  జాతీయ స్థాయి పార్టీ నిర్మాణం ఒక్కటే బీజేపీకి ప్రత్యామ్నాయం కాగలదా ?  

బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీల కూటమి  ఎందుకు ప్రత్యామ్నాయం కాలేదు ?

చాలా రోజుల నుండి కేసీఆర్ ఒక కొత్త జాతీయ పార్టీని పెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతున్నది . ఈ మధ్యలో ఈ ప్రచారం మరింత జోరందుకుంది . అయితే టిఆర్ఎస్ పార్టీ గాని కెసిఆర్ గాని ఇప్పటికీ బహిరంగంగా కొత్త పార్టీని పెట్టబోతున్నట్లు గా ప్రకటించలేదు . కానీ తెరాస ఆచరణ అంతా ఆ దిశలోనే సాగుతున్నది . అయితే ప్రస్థత పరిస్థితులలో భారత దేశంలో  కొత్తగా ఒక జాతీయ పార్టీని పెట్టితే మనగలిగే అవకాశం ఉన్నదా ? అసలు ఒక కొత్తగా జాతీయ పార్టీ పెట్టాల్సిన ఆవశ్యకత ఉన్నదా ? అని ఆలోచించాల్సి ఉంది . అయితే తెరాస ప్రకారం కాంగ్రెస్ కు కాలం చెల్లిపోయింది . అది బిజెపికి ప్రత్యామ్నాయంగా నిలబడే పరిస్థితి లేదు . మరో వైపు బిజెపి నిరంకుశ పాలన కొనసాగిస్తున్నది . బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ వేధిస్తున్నది . బిజెపి పైన ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నది . కానీ ప్రత్యామ్నాయం లేదు దానితో బీజేపీనే మళ్లీ గెలిచే అవకాశం ఉన్నది . బీజేపీ ని ఓడించాలంటే బిజెపి నిరంకుశ పాలన అంతం చేయాలంటే జాతీయ స్థాయిలో ఒక కొత్త పార్టీ ఆవశ్యకత ఏర్పడింది అని . ఈ అవగాహన ఈ నేపథ్యంలోనే భారత రాష్ట్ర సమితి నిర్మాణం చేయబోతున్నట్లు గా టిఆర్ఎస్ చెప్పుకుంటున్నది . మొదట్లో కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ లేదా కాంగ్రెసేతర బిజెపియేతర కూటమి నిర్మాణం కొరకు ప్రయత్నించినట్లు కనిపించింది . కానీ క్రమంగా జాతీయస్థాయి లోనే ఒక కొత్త  పార్టీని పెట్టబోతున్నట్లుగా  ప్రచారం మొదలైంది . 2022 ఏప్రిల్ లో జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా కూడా కెసిఆర్ భారత రాష్ట్ర సమితి గురించి ప్రస్తావించారు . అంటే ఒక విధంగా సంకేతం ఇచ్చారు జాతీయ పార్టీ పెట్టబోతున్నట్లు . ఫ్రంట్ విషయంలో చేసిన ప్రయత్నాలు ఒక కొలిక్కి రాకపోవడంతో జాతీయస్థాయి పార్టీ నిర్మాణానికి కెసిఆర్ మొగ్గుచూపిస్తున్నట్లు కనిపిస్తున్నది .

                             బీజేపీకి ప్రత్యామ్నాయం అవసరం అనేది నిజమే . కాంగ్రెస్ పార్టీ బిజెపికి ప్రత్యామ్నాయంగా ముందుకు రాగలిగే పరిస్థితి కూడా దాదాపు గా కనిపించడం లేదనే చెప్పాలి . అయితే బీజేపీ ని ఎదుర్కొనే ప్రత్యామ్నాయ శక్తి కావాలంటే అది జాతీయ స్థాయి పార్టీగానే ఉండాలా ?  జాతీయ స్థాయి పార్టీ నిర్మాణం ఒక్కటే బీజేపీకి ప్రత్యామ్నాయం కాగలదా ?  బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీల కూటమి  ఎందుకు ప్రత్యామ్నాయం కాలేదు ? ఒకటి రెండు ప్రయత్నాలు చేసి ఫ్రంట్ లు టెంట్ లు సాధ్యం కావు అనుకోవడం సరైనది కాదు . అసలు భవిష్యత్తు లో  భారత దేశ రాజకీయాలను ప్రాంతీయ పార్టీలే నిర్దేశించబోతున్నాయి . 

                 ఇప్పటికే భారతదేశంలో జాతీయ పార్టీల పేరుతో దేశంలోని రాష్ట్రాల కంటే ఎక్కువ పార్టీలు ఉన్నాయి . చాలా వరకు అవి పేరుకే జాతీయ పార్టీలు . అందులో కొన్ని మాత్రమే వివిధ రాష్ట్రాలలో అధికారంలో ఉన్నాయి . జాతీయ పార్టీలు నిజానికి ప్రాంతీయ పార్టీలు గానే , కొన్ని పెద్ద ప్రాంతీయ పార్టీలు గానే మారిపోయినాయి . ఈ పార్టీలు జాతీయ పార్టీలుగానే ఆవిర్భవించినప్పటికీ చివరికి  ప్రాంతీయ పార్టీలగానే ఎందుకు మిగిలిపోయాయి ? అదే సమయంలో కొన్ని పార్టీలు నిజంగా జాతీయ పార్టీలు గా ఎందుకు ఉన్నాయి ? ఇవి తెలుసుకోవలసిన విషయాలు . ఈ విషయాలు ఏమీ తెలుసుకోకుండా అర్థం చేసుకోకుండా మరో జాతీయ పార్టీని  నిర్మాణం చేయాలనుకోవడం రాజకీయంగా ఆత్మహత్యకు పూనుకోవడం లాంటిదే . ఈ విషయాలు తెలుసుకోవాలంటే కనీసం వంద సంవత్సరాల భారత దేశ చరిత్ర ను తెలుసుకోవాలి .  వెయ్యి సంవత్సరాల చరిత్ర తెలుసుకుంటే ఇంకా మంచిది . అప్పుడు మాత్రమే ప్రస్తుత పరిస్థితులలో జాతీయ పార్టీ అవసరమా లేక ప్రాంతీయ పార్టీల కూటమి సరి అయిందా అనే విషయం తేలుతుంది .

క్రీస్తు పూర్వం మౌర్యులు మొదటిసారి భారతదేశంలో కేంద్రీకృత పరిపాలన వ్యవస్థను అమలులోకి తీసుకు వచ్చారు . పై నుండి కింది వరకు వివిధ అధికారాలు గల అధికార యంత్రాంగం ఉండింది .  భారత దేశంలోని అన్ని ప్రాంతాలు మౌర్యుల ఆధీనంలో లేకున్నా భారతదేశంలోని  విశాల భూభాగాన్ని మౌర్యులు కేంద్రీకృత అధికారంతో పరిపాలించారు . మౌర్యులకు ముందు కూడా చిన్న చిన్న  రాజ్యాలు , రాజులు  ఉన్నా అవి అన్ని  ఫ్యూడల్ వ్యవస్థకు  పూర్వ దశలో ఉన్న  రాజ్యాలుగా ఉండి నాయి . వివిధ ఆదివాసీ ప్రాంతాలు స్వయం పాలిత ప్రాంతాలుగా ఉన్నాయి . కాలక్రమంలో అభివృద్ధిలో భాగంగా అనేక ప్రాంతాలలో భూస్వామ్య విధానం అభివృద్ధి చెందుతూ స్థానిక ఫ్యూడల్ పాలకులు పుట్టుకు వచ్చారు . తర్వాత మౌర్యుల కేంద్రీకృత రాజ్యాంగ యంత్రం తనకుతానే బరువై కూలిపోయింది .  అంతిమంగా అది సైనిక తిరుగుబాటు లో వ్యక్తమైంది . మౌర్యుల తరువాత ఈ నాటి భారత దేశంలో అనేక చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడినాయి . ఈ చిన్న చిన్న రాజ్యాలను ఓడించి పెద్ద సామ్రాజ్యాలను ఏర్పరచడానికి చాలమందే ప్రత్నించారు . మౌర్యుల తరువాత ఈ నాటి భారత దేశంలోని పెద్ద భూభాగంలో శాతవాహనులు తమ అధికారాన్ని నెలకొల్పి , పరిపాలన సాగించారు . గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే శాతవాహనులు మౌర్యుల లాగ కేంద్రీకృత యంత్రాంగంతో పరిపాలన చేయలేదు . ఓ మేరకు పాలన యంత్రాంగం వుండినా శాతవాహనులు ముఖ్యంగా స్థానిక ఫ్యూడల్ రాజుల మీద ఆధారపడే పరిపాలనను కొనసాగించారు . శాతవాహనులు సామ్రాజ్యం కూడా స్థానిక రాజుల తిరుగుబాట్లు బయటనుండి జరిగిన దాడుల కారణంగా కూలిపోయింది . 

మౌర్యుల కాలంలో లాగ కేంద్రీకృత పాలన యంత్రాంగం తో పరిపాలన చేసే పరిస్థితులు శాతవాహనుల కాలం నాటికి పూర్తిగా పోయాయి . అయినప్పటికీ శాతవాహనుల తరువాత గుప్తులు ఈనాటి భారతదేశంలోని పెద్ద భూభాగంలో సామ్రాజ్యాన్ని స్థాపించ గలిగినారు . అయితే కొందరు చరిత్రకారుల ప్రకారం గుప్తులు , శాతవాహనుల ఇతర రాజులను కొల్లగొట్టడం ద్వారా పొందిన ధనంతో అంత పెద్ద ప్రాంతంలో పరిపాలన చేయగలిగారు అని . లేకపోతే ఆనాటికే పెద్ద రాజ్యాలకు కాలం చెల్లిందని . గుప్తులు కూడా ప్రాంతీయ రాజుల పై ఆధారపడే ప్రధానంగా పరిపాలన చేశారు.  భారత చరిత్రలో ఒక్క మౌర్యులు మాత్రమే  కేంద్రీకృత పరిపాలన సాగించారు . ఎందుకంటే అప్పటికి ఇంకా ఫ్యూడల్ ప్రభువులు ఆవిర్భవించలేదు .  ఇది గుర్తుంచుకోవలసిన విషయం . మౌర్యుల తరువాత రెండు పెద్ద రాజ్యాల పాలకులైన శాతవాహనులు గుప్తులు కూడా స్వంత యంత్రాంగాలు కొంత ఉన్నప్పటికీ ప్రాంతీయ ఫ్యూడల్ ప్రభువుల పాలన పై ఆధారపడే పరిపాలించారు . నిజానికి గుప్తుల కాలానికే పెద్ద రాజ్యాల మనుగడకు అనుకూల పరిస్థితులు లేవు . అందుకే చిన్న చిన్న రాజ్యాలను ఓడించి సామ్రాజ్యాలను ఏర్పరచినా అది తాత్కాలికమే అయ్యేది . ఆ పెద్ద సామ్రాజ్యం కొద్దిగా బలహీన పడగానే చాలు సామంత రాజ్యాలు పూర్తి స్వాతంత్ర్యం ప్రకటించుకునేవి . గుప్తుల  తర్వాత ఈ నాటి భారత దేశంలో ఎన్నో చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడినాయి . ఈ రాజ్యాల సరిహద్దులు నిరంతరం మారుతూ ఉండినాయి . కొన్ని చిన్న రాజ్యాలు అంతమయ్యేవి . మరికొన్ని కొత్త రాజ్యాలు పుట్టుకొచ్చెవి . ఇలా దాదాపు వెయ్యి సంవత్సరాలు సాగింది . గుప్తుల కాలం లోనే బయటి నుండి వచ్చిన శకులు యుద్ధాలు చేసి భారతదేశ వాయువ్య ప్రాంతంలో రాజ్యాలను ఏర్పాటు చేశారు . తరువాత వాయువ్య ప్రాంతం నుండి ముస్లింలు దండయాత్రలు చేసి రాజ్యాలను ఏర్పాటు చేశారు . కాని ఎవరు కూడా ఈనాటి భారత దేశంలో పెద్ద భూభాగంలో రాజ్యాన్ని నిర్మించలేకపోయారు . చివరికి 16వ శతాబ్దంలో వచ్చిన మొగల్ లు ఈనాటి భారత దేశంలోని విశాల ప్రాంతాలను  పరిపాలించ గలిగారు . అయితే గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే వీరు కూడా ప్రాంతీయ ఫ్యూడల్ రాజుల మీద ఆధారపడే పరిపాలన చేయగలిగారు . 


మొఘలుల కాలం నాటి కి ప్రాంతీయ రాజ్యాల అభివృద్ధి చెంది బలపడ్డాయి . ప్రాంతీయ రాజులను ఓడించి వారినో  వారి స్థానంలో మరొకరినో రాజుగా నియమించి చక్రవర్తి పాలన సాగించవలసిందే . అంతేకాని ఒక ప్రాంతీయ రాజు స్థానంలో ఒక అధికారిని నియమించి ప్రత్యక్షంగా పాలన చేసే పరిస్థితి లేదు . అందుకే మొఘల్ లు సామంతరాజుల పై ఆధారపడే పాలించ గలిగారు . అయితే అభివృద్ధి క్రమం ఆగలేదు . మొగల్ ల చివరి కాలం నాటికి చాలా రాజ్యాలలో చేతివృత్తుల అభివృద్ధి చెందుతూ వృత్తి సంఘాలు , వ్యాపారులు , వ్యాపారం అభివృద్ధి చెందినాయి . దీనితో ప్రాంతీయ రాజుల ఆర్థిక శక్తి దానితో వారి సైనిక శక్తి , ఆయుధ శక్తి బలోపేతం అవుతూ వచ్చింది . భూస్వామ్య  విధానంలో పెట్టుబడిదారి లక్షణాలు అభివృద్ధి చెందడం మొదలైంది . మొగలు సామ్రాజ్యం చివరి రోజులలో ఔరంగజేబు దక్షిణ భారత దేశంలోని ప్రాంతీయ రాజ్యాలను స్వాధీనం చేసుకోవడానికి ముఖ్యంగా మరాఠా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి తన శక్తియుక్తుల్ని అంత ఖర్చు చేశాడు . 25 సంవత్సరాలు దక్షిణ భారతంలోనే ఉండవలసి వచ్చింది . దీనితో అంటే సామంతరాజుల తిరుగుబాట్ల తో మొగలు సామ్రాజ్యం బలహీనపడింది . దక్షిణ భారతదేశాన్ని ఆధీనంలో ఉంచుకోవటం కొరకు ప్రయత్నిస్తే ఉత్తరభారతదేశంలో మొగల్  అధికారం బలహీనపడింది . అంతే సామంతరాజులు స్వతంత్రంగా వ్యవహరించడం మొదలయ్యింది . తరువాత మొగల్ చక్రవర్తి పేరుకు మాత్రమే ఉండేవాడు దేశమంతా అనేక చిన్న రాజ్యాలు ఏర్పడినాయి . మళ్లీ బ్రిటిష్ వాళ్ళు వచ్చి క్రమంగా చిన్న చిన్న రాజ్యాలు అన్నింటిని ఓడిస్తూ మొత్తం దేశాన్ని ఆక్రమించుకున్నారు .

మొదట్లో బ్రిటిష్ వాళ్లు కూడా తెలివిగా మొత్తం దేశాన్ని తమ కేంద్రీకృత అధికారం కింద పాలించలేదు . కొంతభాగాన్ని ప్రత్యక్షంగా తమ స్వంత కేంద్రీకృత అధికారం కింద ఉంచుకోగా , కొంత భాగాన్ని ఆయా ప్రాంతీయ రాజుల కిందనే ఉంచి తమ అధికారాన్ని దోపిడీని కొనసాగించారు . తరువాత క్రమంగా ప్రాంతీయ రాజులందరిని నామమాత్ర రాజులుగానే మార్చివేసారు . తమ కేంద్రీకృత అధికారమే అసలైన అధికారంగా భారతదేశాన్ని ఒక పరిపాలన యూనిట్ చేసి పాలించారు . మౌర్యుల తరువాత మళ్లీ బ్రిటిష్ వాల్లే  కేంద్రీకృత పరిపాలనా వ్యవస్థను నెలకొల్పి మొత్తం భారతదేశాన్ని  పరిపాలించారు . బ్రిటిష్ వాళ్లు ఫ్యుడల్ వ్యవస్థ కంటే ఉన్నతమైన పెట్టుబడిదారీ  సమాజం నుండి వచ్చినందున ఫ్యూడల్ రాజులందరినీ కంట్రోల్ చేసి కేంద్ర ప్రభుత్వ పరిపాలన వ్యవస్థను నెలకొల్ప కలిగినారు . మౌర్యులు కేంద్రీకృత అధికారానికి పునాది భూస్వామ్యపు పూర్వపు సమాజం . 

బ్రిటిష్ వాళ్లు ఈ దేశానికి చేసిన లాభం గురించి తన పుస్తకం “ అసఫ్ జాహీ సంస్థానం విలీన గాధ “ లో వి.వి. మీనన్ ఈ విధంగా చెప్పాడు . “ భారతదేశం భౌగోళిక ఏకత్వం ఉన్న దేశం . సుదీర్ఘమైన చరిత్ర ఉన్నప్పటికీ భారత్ లో రాజకీయ ఐక్యత ఎప్పుడూ సాధ్యం కాలేదు . “ ( 11 వ పేజి)

“ భారతదేశంలో రాజకీయ ఏకీకరణ చేయడం కంటే గొప్ప పని బ్రిటిష్ వారు ఏది చేయలేదు . ఈ సాఫల్యం వల్ల , జాతీయోద్యమ స్ఫూర్తి వల్ల స్వతంత్ర భారతదేశం దేశీయ సంస్థానాలను శాంతియుతంగా భారత్ లో కలిపే ప్రయత్నాలను విజయవంతంగా చేపట్ట గలిగింది . “ (13 వ పేజి)

భారతదేశం నుండి బ్రిటిష్ వాళ్లు వెళ్లిపోయిన తర్వాత స్వాతంత్ర్య ఉద్యమాన్ని నడిపిన పార్టీగా ఆ పేరుతో కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా ఎన్నికలలో గెలిచి ప్రభుత్వాలను ఏర్పరిచింది . కాంగ్రెస్ పార్టీకి అన్ని రాష్ట్రాలలో ప్రాతినిధ్యం ప్రభుత్వాలు ఉండినాయి . కాంగ్రెస్ పార్టీ కి మొదట్లో కమ్యూనిస్టులే రెండవ స్థానంలోనూ ప్రత్యామ్నాయంగా ఉండినారు . మొదటిసారిగా కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి 1957లో కేరళలో కమ్యూనిస్టులు సవాలు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు . తరువాత  1967లో ఉత్తరప్రదేశ్ లోను తమిళనాడు లోను కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడినాయి . అయినా మొత్తంగా చూసినప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీనే ఆధిపత్యంలో ఉండింది . 1952లో జరిగిన సాధారణ ఎన్నికల నుండి 1977లో జరిగిన సాధారణ ఎన్నికల వరకు కేంద్రంలో కాంగ్రెస్ ఓటమిని చూడలేదు . 1975 లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించి నిరంకుశ పాలన సాగించిన కారణంగా 1977లో వివిధ పార్టీల కూటమి అయిన జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది . కానీ అంతర్గత కుమ్ములాటల కారణంగా జనతాపార్టీ 1980 వరకే అధికారాన్ని పోగొట్టుకుంది . 1980లో మళ్లీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వచ్చింది . కేంద్రంలో 1980 నుండి 1989 వరకు  కాంగ్రెస్ పార్టీనే అధికారాన్ని సాగించింది . 

1980 వరకు భారతదేశంలో ప్రాంతీయ పార్టీలు నామమాత్రంగా రెండు మూడు  రాష్ట్రాల్లోనే అంటే పంజాబ్ తమిళనాడు జమ్మూ కాశ్మీర్ ఈశాన్య భారతం లోని కొన్ని రాష్ట్రాలలో మాత్రమే బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి . 1980 తర్వాత నుండి ప్రాంతీయ పార్టీల పెరుగుతూ వచ్చాయి . 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు పెట్టుబడిదారీ వర్గం చాలా తక్కువగా ఉండింది . అది కూడా ప్రధానంగా ఉత్తర భారతదేశంలోనే ఎక్కువగా కేంద్రీకృతం అయ్యి ఉండేది .  క్రమంగా అన్ని రాష్ట్రాలలో అభివృద్ధిలో భాగంగా పెట్టుబడిదారీ వర్గం అభివృద్ధి చెందుతూ వచ్చింది . వివిధ రాష్ట్రాలలో అభివృద్ధిలో భాగంగా ప్రజల ఆకాంక్షలు కోరికలు ప్రత్యేకతలు కూడా అభివృద్ధి చెందుతూ వచ్చాయి . ఈ నేపథ్యంలోనే ప్రాంతీయ పార్టీలు అభివృద్ధి చెందుతూ వచ్చాయి . ఈ రోజు తమిళనాడు , ఆంధ్రప్రదేశ్ , కేరళ , తెలంగాణ , ఒరిస్సా , పశ్చిమబెంగాల్ , మహారాష్ట్ర , జార్ఖండ్ , ఢిల్లీ , బీహార్ , పంజాబ్ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలే అధికారంలో ఉన్నాయి . లేదా జాతీయ పేరుమీద ఉన్న ప్రాంతీయ పార్టీలే అధికారంలో ఉన్నాయి . ఇంకా కర్ణాటక , హర్యానా , కాశ్మీర్ , ఉత్తర ప్రదేశ్ , గోవాలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి . ఈశాన్య భారతంలోని మెజారిటీ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి . అంటే భారతదేశంలో జాతీయ పార్టీల బలాన్ని ప్రాంతీయ పార్టీలు తీసుకోవడం మొదలైంది . 


చివరికి 1989 తర్వాత ఏ జాతీయ పార్టీకి కూడా ఇతర ప్రాంతీయ పార్టీలు సహాయం లేకుండా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి ఏర్పడింది . 2014 వరకు అంటే 25 సంవత్సరాల వరకు కాంగ్రెస్ అయినా బిజెపి అయినా ప్రాంతీయ పార్టీల పైన ఆధారపడే అందరం లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి . కానీ ప్రాంతీయ పార్టీలు వివిధ కూటముల పేరుమీద కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వాలు స్థిరమైన అందించలేకపోయాయి . ఈ పరిస్థితిని ఉపయోగించుకొని బిజెపి, కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేయడానికి ప్రయత్నిస్తున్నది . అందుకే అది కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే నినాదాన్ని ఇస్తున్నది . కాంగ్రెస్ పార్టీ బలహీన పడడాన్ని ఎవరూ ఆపలేరు . ప్రాంతీయ పార్టీలు అభివృద్ధి అవుతున్న కొలది కాంగ్రెస్ పార్టీ పతనం వైపు ప్రయాణిస్తుంది . అయితే కాంగ్రెస్ స్థానాన్ని బీజేపీ భర్తీ చేయగలుగుతుందా ? ప్రాంతీయ పార్టీలు బలోపేతమవుతున్న కొలది బీజేపీ కూడా తప్పకుండా  బలహీనపడుతుంది . ఇప్పుడు బీజేపీ ని ఆ భయమే వెంటాడుతున్నది . అందుకే ఈ మధ్య బిజెపి నాయకులు, కాంగ్రెస్ పార్టీ కంటే ప్రాంతీయ పార్టీలనే లక్ష్యంగా చేసుకుని విమర్షించుతున్నారు . మెజారిటీ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ కంటే ప్రాంతీయ పార్టీల తోనే బీజేపీ తల పడవలసి వస్తుందని బిజెపి అధ్యక్షుడు నడ్డా ఇటీవలనే అన్నారు . అంటే ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం దేశవ్యాప్తంగా ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు .

భారత దేశంలో ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలు యుగమే నడుస్తున్నది . కాంగ్రెస్ పార్టీ నామమాత్రంగా అవుతున్నది . కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని బిజెపి ఎప్పుడూ భర్తీ చేయలేదు . కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న తీవ్ర వ్యతిరేకత వల్ల నూ ప్రాంతీయ పార్టీలు స్థిరమైన ప్రభుత్వాన్ని ఇవ్వలేని పరిస్థితుల్లోనే బిజెపి 2004లో అధికారంలోకి వచ్చింది . అంతే కానీ కాంగ్రెస్ లాగ అన్ని రాష్ట్రాలలో ప్రాతినిధ్యం ఉండి కాదు . ప్రాంతీయ పార్టీల కూటమి స్థిరమైన ప్రభుత్వాన్ని ఇవ్వగలిగినప్పుడు బీజేపీ కూడా కాంగ్రెస్ పార్టీ సరసన మ్యూజియం లోకి చేరుతుంది . ఇంకా మిగిలిన రాష్ట్రాలలో కూడా పెట్టుబడిదారీ వర్గం అభివృద్ధి చెందిన కొద్దీ అక్కడ కూడా ప్రాంతీయ పార్టీలు అభివృద్ధి చెందుతాయి . దేశంలో ప్రస్తుత పరిస్థితి జాతీయ పార్టీలకు అనుకూలంగా లేదు . అన్ని జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలతోనే తలపడుతూ బలహీన పడుతూ వస్తున్నాయి . ఇటువంటి స్థితిలో కొత్తగా మరో జాతీయ పార్టీ నిర్మణం సాధ్యం కాదు . ఏదో ఒకటి చేసి కేసీఆర్ జాతీయ పార్టీ అని పెట్టినా , అది టీఆర్ఎస్ కి భారం అయ్యి  తెలంగాణలో ఉన్న పునాది కూడా దెబ్బతినవచ్చు . జాతీయ పార్టీకి అనుకూలంగా పరిస్థితి ఉండి శీఘ్రగతిన అభివృద్ధి చెందితే తెలంగాణాలో టిఆర్ఎస్ కు అదనపు బలాన్ని ఇస్తుంది . కానీ అటువంటి పరిస్థితి లేనందున కొత్త జాతీయ పార్టీ తెలంగాణలో తెరాస పునాదిని దెబ్బతీయవచ్చు . ప్రస్తుత పరిస్థితి ప్రాంతీయపార్టీల కూటమికే అనుకూలంగా ఉంది . కావలసిందల్లా ఒక స్పష్టమైన కనీస ఉమ్మడి కార్యక్రమం ఆధారంగా ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని అందించాలి . ఆయా రాష్ట్రాల ప్రజల ఆకాంక్షలను కోరికలనూ ప్రత్యేకతలను గుర్తించి తగిన ఫెడరల్ వ్యవస్థను ప్రాంతీయ పార్టీల కూటమి అందించగలిగితే స్థిరమైన ప్రభుత్వం సాధ్యమే . ఇప్పుడు దేశంలో ఏ కొత్త జాతీయ పార్టీ వచ్చినా అది ముందు ప్రాంతీయ పార్టీలతోనే తలపడవలసి ఉంటుంది . ఆ కొత్త జాతీయ పార్టీ కూడా చివరికి మల్లీ ప్రాంతీయ పార్టీ గానే మారుతుంది . ఇప్పుడు ఫెడరల్ వ్యవస్థకు పునాదిగా ఉండే ప్రాంతీయ పార్టీల కూటమే సరైనదిగా ఉంటుంది .

-లంకా పాపిరెడ్డి


 

Relative Post

Newsletter