ఉస్మానియా పై టీఆర్ఎస్ సెల్ఫ్‌గోల్
ఉస్మానియా పై టీఆర్ఎస్ సెల్ఫ్‌గోల్
– రాహుల్‌ను నియంత్రించే ప్రయత్నం
– హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌తో సర్కార్‌కు దెబ్బ
– నిరసనలతో వేడెక్కిన వర్సిటీ క్యాంపస్
– గాంధీభవన్ చుట్టూ ఖాకీల మోహరింపు
–
ప్రత్యేక ప్రతినిధి: ఉస్మానియా వర్సిటీ విద్యార్ధులతో కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ నిర్వహించాలని భావించిన సమావేశాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించి గులాబీ శిబిరం సెల్ఫ్‌గోల్ చేసుకుంది. ప్రత్యర్ధిపార్టీ అధినేతకు ఉద్యమాల నిలయమైన ఉస్మానియాలో ప్రవేశాన్ని నిరాకరించేందుకు తెరవెనుకు చేసిన ప్రయత్నాలన్నీ తలకిందులయ్యాయి. వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయం పేరుతో రాజకీయ నేతలకు ప్రవేశంలేదంటూ రాహుల్ రాక సందర్భంగా ప్రకటించింది. దీంతో గత పది రోజులుగా రాహుల్ ఉస్మానియా పర్యటన అంశం రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. వర్సిటీ నిర్ణయంపై విద్యార్ధి సంఘాల నిరసనలు, అరెస్టులు, అద్దాల ధ్వంసంతో ఉస్మానియా వేడెక్కింది. మరోవైపు గాంధీభన్ను పోలీసులు చుట్టుముట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ విషయమైన కాంగ్రెస్ వాదులు హైకోర్టును ఆశ్రయించడంతో సానుకూల ఫలితం వచ్చింది. కాంగ్రెస్ అనుబంధ విద్యార్ధి సంఘం ఎన్‌ఎస్‌యుఐతో పాటు ఆ పార్టీ నేత జగ్గారెడ్డి ఈ విషయంలో మొదటి నుంచి పట్టుదలతో అందుబాటులో ఉన్న అన్ని ప్రయత్నాలు చేశారు. ఆఖరికి హైకోర్టును ఆశ్రయించి రాహుల్‌ను వర్సిటీ రప్పించడంలో సక్సెస్ అయ్యారు.
– వర్సిటీలపై రాజకీయ పెత్తనం
స్వయం ప్రతిపత్తి ఉన్న వర్సిటీ వీసీలపై ప్రభుత్వ ఆధిపత్యం ప్రస్పుటమైంది. విద్యార్ధులతో రాహుల్ సమావేశం కావడాన్ని హుందాగా స్వీకరించి సానుకూల నిర్ణయం తీసుకుంటే వర్సిటీ గౌరవంతో పాటు, ప్రభుత్వానికి మర్యాద దక్కేది. కానీ, దీనికి భిన్నమైన పద్ధతిని ప్రభుత్వం, వర్సీటీ పాలకవర్గం, ముఖ్యంగా వీసీ ఏకపక్షంగా వ్యవహరించి రాహుల్ రాకకు అనుమతిలేదంటూ ప్రకటించారు. రాహుల్ సభ ఏర్పాటు చేసే యోచన ప్రారంభమైనప్పటి నుంచి టీఆర్ఎస్ వర్గాలు ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా అడ్డుకోవాలనే ప్రయత్నాలు చేసింది. దీనికి అధికారంలో ఉన్న సర్కార్ పూర్తి అండగా నిలవడం ప్రజాస్వామిక వాదులు తీవ్రంగా ప్రశ్నించారు. సభను అడ్డుకుంటామంటూ టీఆర్ఎస్ అనుబంధ విద్యార్ధి సంఘం టీఆర్ఎస్వీ ప్రకటించింది. ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఉన్న బాల్క సుమన్ ఈ విషయంలో కాంగ్రెస్‌పై విరుచుకపడ్డారు. రాహుల్ సభకు ఏ పరిస్థితుల్లోనూ అనుమతివ్వకూడదంటూ ఒత్తిడితేవడమే కాకుండా వ్యవహరించారు. ప్రజాస్వామ్యంలో పార్టీ అధినేతలే కాకుండా, ప్రజాప్రతినిధి ఎంపీగా ఉన్న రాహుల్‌గాంధీ విద్యార్ధులతో ఇంట్రాక్షన్ కావాలనే ప్రయత్నాన్ని అడ్డుకోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
– ఉస్మానియాకు ఉన్నత చరిత్ర
ముఖ్యంగా వర్సిటీ ఆవిర్భం నుంచి వందేళ్ళకాలంలో తెలంగాణలో జరిగిన ప్రతీ పరిణామానికి వర్సిటీ విద్యార్ధిలోకం ముందు వరుసలో ఉందనే వాస్తవాన్ని కాదని, కొత్త పద్ధతిని అవలంభించడం సిగ్గుచేటు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఉస్మానియా కీలక భూమిక పాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. అనేక ఉద్యమాలకు, కీలక మలుపులకు, మార్పులకు భూమికగా నిలిచిన ఉస్మానియాలో ప్రజాస్వామిక గొంతులకు అవకాశం లభించకుండా రాజకీయ దురుద్ధేశ్యంతో ఒత్తిడి తెచ్చి అడ్డుకోవాలనే ప్రభుత్వ ప్రయత్నాన్ని హైకోర్టు ఆదేశంలో గులాబీలు ఇబ్బందులో పడ్డారు.
– గులాబీ శిబిరం తీరుపై విమర్శలు
కోర్డు ఆదేశంలో కక్కలేని, మింగలేని గులాబీ నాయకులు, కాంగ్రెస్‌పై రాజకీయ విమర్శలు చేసేందుకు సిద్ధమైతున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌ను గుర్తించకుండా పాత విషయాలను లేవనెత్తి రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఒక వైపు తెలంగాణలో కాంగ్రెస్‌తో తమకెలాంటి ఇబ్బంది లేదంటూ ఆ పార్టీకి బలమెక్కడుందని ప్రశ్నిస్తూ మరోవైపు ఆపార్టీ రాజకీయ కార్యకలాపాలను అడ్డుకోవడం గమనార్హం. విపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు ప్రజల పక్షాన నిరసన తెలియజేయాలంటే పోలీసులను మోహరించి అడ్డుకుంటున్నారని విమర్శిస్తున్నారు. ఒక వైపు రాష్ట్రంలో ఏకపక్ష విధానాలు అవలంభిస్తున్న టీఆర్ఎస్ పార్టీ కేంద్రంలోని బీజేపీ ఆధిపత్య విధానాలను ప్రశ్నించడం గమనార్హం. ఇప్పటికైనా గులాబీ పార్టీ ప్రజాస్వామికంగా వ్యవహరించాలని కోరుతున్నారు.