మతానికి రాజకీయ అండదండలు
మతానికి రాజకీయ అండదండలు
మాటలతో మలినం చేస్తున్న నేతలు
మత ముద్ర ప్రదర్శించేందుకు పోటీ
అధికారమే లక్ష్యంగా ఎత్తుగడలు
సమాజంలో పెరుగుతున్న విద్వేషం
ప్రజా సమస్యల పక్కదోవపట్టించే కుట్ర
(ప్రత్యేక ప్రతినిధి): ఎవరి విశ్వాసాలు వారీగా ఇంత మన మధ్య సాగిపోయిన మతమిప్పుడు మనషులమధ్య విద్వేషాలు రేగ్గొట్టేందుకు ఆయుధంగా మారుతోంది. ఎన్నో యేళ్ళక్రితమే దీనికి వ్యూహాన్ని సిద్ధం చేసిన మత సంస్థలు, తాజాగా రాజకీయాలకు జోడించి సమాజంలో నెలకొన్న శాంతిని, సహృదయ, సామరస్యతను నాశనం చేసి అధికారాన్ని పొందేందుకు అనువైన మార్గంగా ఎంచుకుంటోన్నది. ప్రణాళిక బద్ధంగా దేశంలో చేపట్టిన ఈ యజ్ఞంలో తెలిసీ తెలియకుండానే అందరూ ఇందులో సమిధలుగా మారేందుకు చాలా కాలం పట్టే అవకాశాలు లేవు. ముందుగా కింది కులాలు, వర్గాలు ఈ మంటల్లో పడి మాడిపోతున్నారు.
గత దశాబ్దన్నర కాలంగా దేశంలో మారుతోన్న సహజీవన సంస్కృతీలో విషాన్ని కలుపుతూ కలుపు మొక్కలుగా మారిపోయాయి. మరీ ముఖ్యంగా రెండవ పర్యాయం అధికారంలోకి వచ్చిన బీజేపీ దీనికి కావాల్సిన భూమికను, కావాల్సిన తోడును అందిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మతాన్ని, ఎన్నికలకు, రోజువారీ రాజకీయ కార్యకలాపాల్లో జోడించి ప్రజలను విడదీసి, విభజించి, ఇప్పటికే ఉన్న విభేదాలను పెంచి మరింత అగ్గిరాజేసి తమ పబ్బం గడుపుకుంటున్నారు.
ప్రజలు ఎదుర్కొంటున్న రోజువారీ ఉపాధి, అధిక ధలు, జీవన ప్రమాణాల మెరుగుదలకు అవసరమైన భూమి, కావాల్సిన ఇళ్ళు, జరుగాల్సిన ఆర్ధికాభివృద్ధి, అందుబాటులోకి విద్య, అవసరమైన మేరకు వైద్యం తదితర ప్రాథమిక, మౌళిక సమస్యల పరిష్కారాన్ని పక్కదొవపట్టించి తమ కుట్రలను విజయవంతం చేసుకుంటున్నారు. ఇందులో మెజార్టీ మతం ప్రధాన పాత్ర నిర్వహిస్తుండగా కొందరు ఎంఐఎం లాంటి మైనార్టీ మత విద్వేషకులు సైతం దీనికి తోడుగా నిలిచి అవసరమైన సందర్భంలో నిత్యం మండేందుకు ‘కాష్టం’ కాలేందుకు తగిన సహకారం అందిస్తున్నారు. ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు.
– పెరిగిన మెజార్టీ మత ప్రమాదం
దేశవ్యాప్తంగా మెజార్టీ మతం పేరుతో చేస్తున్న విషప్రచారం. భావజాలరూపంలో సాగిస్తున్న విచ్చలవిడి దాడి. మైనారిటీ మత భావాల పై సాగిస్తున్న దాడి, కులాధిపత్య అహంకార మూక దాడులు దీనికి పరాకాష్ట. ఇవి మత మైనార్టీలకే పరిమితమయ్యే దాడులు కావని గుర్తించాలి. మొదట మైనార్టీ మత విశ్వాసాల పై దాడితో ప్రారంభమై తదుపరి అట్టడుగు కులాల పై వరకు కొనసాగి, మహిళలను ఇందులో పావుగా వాడుకుంటారు. ఆఖరి మెజారిటీ మత విశ్వాసాలు కలిగిన వారిలోని కింది వర్ణాలను లక్ష్యంగా చేసుకుని సాగించే పద్మవ్యూహమని గుర్తించాల్సిన అవసరం ఉంది.
– కూడగట్టుకోవడంలో కొత్తఎత్తు
శతాబ్దాలుగా దేశంలో ఆధిపత్యం చెలాయిస్తున్న మెజార్టీ మతం ముందుగా తన బ్రాహ్మణీయ భావజాల మిత్రులను కూడగట్టుకుంటోందీ. ఈ మిత్రుల్లో కొందరు ఇతర భావజాలం కింద అప్పటికే ఉంటే వారిని తమవైపు తిప్పుకొనేందుకు తొలి ప్రాధాన్యతనిస్తోందీ. వచ్చిన వారిని సంఘటితం చేస్తూనే తమ లక్ష్యంగా ఎంచుకున్న సమాజంలో ఆధిపత్య సంస్కృతికి ప్రచారకులుగా వీరిని తమ రోజువారీ విధుల్లో ఒక భాగం చేస్తోంది. బహిరంగంగా భారీ క్రతువులు చేపట్టి భావజాల ఆధిపత్యాన్నీ ప్రారంభిస్తోందీ. దీనికి అత్యున్నతమైన పవిత్రత, పాప పరిహారం, పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందనీ ఆకర్షణీయమైన తాయిలాలు ప్రకటిస్తారు. తాను చెప్పేదంతా ఔను నిజమే అన్నంత అద్భుతంసృష్టిస్తోంది. ఇక్కడే ఆర్థిక ప్రయోజనాలను సమకూర్చుకుంటోందీ. ఈ ఆర్ధిక వరులన్నీ ప్రజా, పవిత్ర కార్యాలకంటూ ఢంకా బజాయిస్తారు. అధికార హంగులు సమకూర్చుకుంటోందీ. వారిని తమ పంచన చేరేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.
– పాలక రాజకీయ అండదండ
మత భావజాలానికి పాలక పార్టీగా, అధికారంలో కొనసాగితే అందివచ్చే అవకాశాలెన్నో? అందుకే తల్లి సంస్థకు పిల్ల రాజకీయ పార్టీగా అధికారంలోకి వచ్చేందుకు అనువైన అన్నింటిని వినియోగించుకుంటోంది. ఆర్ఎస్ఎస్ వెనుక ఉండి నడిపిస్తే బీజేపీదాని అనుబంధ సంస్థలు అప్రతిహతంగా కొనసాగిస్తున్నాయి. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ కొత్త ఉత్సహం, ప్రణాళికతో దీర్ఘాకాలిక ప్రయోజనాలతో ఈ వ్యూహం కొనసాగుతోందని విమర్శిస్తున్నారు. రాజ్యాంగం అందించిన హక్కులన్నింటిని కనుసైగతో శాసించి, కాలరాచే కుట్రలు పెరిగిపోయాయి. దీనికి రాజకీయ నేతల రూపంలోనే కాకుండా మత ప్రవచనకారుల రూపంలోనూ దేవుడిపేరుతో రాజకీయం సాగిస్తున్నారు.
– మోకరిల్లుతున్న పెద్ద పెద్ద నేతలు
అధికారంలో ఉన్న నేతలు, పార్టీలు, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు పీఠాధిపతుల ముందు మోకరిల్లుతున్న తీరు దేన్ని సంకేతమో సులభంగా అర్ధం చేసుకోవచ్చు. హిందూ ఓట్లు దండుకోవడం పేరుతో లౌకిక రాజ్యాంగానికి తూట్లుపొడిచే చర్యలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. మత కార్యకలాపాల్లో సాక్షాత్తు అత్యున్నత హోదాలో ఉన్న ప్రధాని, రాష్ట్రపతి, సీఎంలు, ముఖ్య నేతలు హాజరై శంకుస్థాపలను, ప్రారంభోత్సవాలను చేపడుతున్నారు. ఆయోధ్యలో రామాలయం, హైదరాబాద్లో రామానుజుని విగ్రహావిష్కరణలు దీనిలో భాగంగానే చూడాలి.
ఈ సంస్థలకు వందల ఎకరాలు ధారదత్తం చేస్తున్నారు. ఈ సంస్థలు వేల కోట్ల సామ్రాజ్యాలకు అధిపతులుగా కొనసాగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ప్రధాన రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నారంటే ఆశ్చర్యం కలుగకమానదు. ఎక్కడ ఎన్నికలున్నా ఈ మత ప్రచారాలకు ఎంతో ప్రాధాన్యత లభిస్తున్నది. ఒకప్పుడు ఈ అంశాలు మాట్లాడేందుకు సిగ్గుపడిన నేతలు ఇప్పుడు బహిరంగంగా మద్ధతులు ప్రకటించడం గమనార్హం. నీదే మతమంటే నీదే మతమని బహిరంగ సవాళ్ళు చేసుకుని తోడలుగొట్టే స్థితికి ప్రధాన పార్టీల పెద్దపెద్ద నాయకులు దిగజారి పోయారు. తమ మత ముద్రను ప్రదర్శించేందుకు పోటీలుపడుతున్నారు.