బౌద్ధం పరిఢవిల్లిన నేల తెలంగాణ

బౌద్ధం పరిఢవిల్లిన నేల తెలంగాణ

       (నేడు బుద్ధ వైశాఖ పౌర్ణమి ) 


        అఖండ భారతం (భారత ఉపఖండం) ప్రస్తుత అప్ఘనిస్తాన్ , పాకిస్తాన్ నుండి మయన్మార్‌ వరకు ఇది బుద్ధ భూమి. దీనిలో భాగమైన ప్రస్తుత తెలంగాణా నేల  ఒకప్పటి 16  మహాజనపధాలలో ఒకటైన  బోధన్ రాజధానిగా ఉన్న అస్మక రాజ్యం. దీని చరిత్ర  శాతవాహనుల నుండి పొక్కిలి అయి ఇప్పటికి  జనజీవితంలో భాగమైన అయిన హేతుబద్ధమైన సారంతో  కొనసాగుతున్న జీవగడ్డ. తెలంగాణా చరిత్రని తవ్వితే , ఈ  మట్టిని పెకిలిస్తే , కాలాన్ని మర్లేస్తే ఊరూరా శిథిల , ధ్వంసం చేయబడిన , మార్చబడ్డ మరియు మనం పట్టించుకోని , మన ఇండ్లల్లో తొక్కుడు బoడగా మారిన  బౌద్ధ ఆనవాళ్ళు కనిపిస్తాయి.  మనం పట్టించుకోకుండా మిగిలిపోయిన మన చరిత్ర గురుతులనైనా జాగ్రత్తగా కాపాడుకోవాలి . 


       సమైక్య ఆంధ్రప్రదేశ్ బలవంతపు కౌగిలి నుండి విడివడి తన స్వంత అస్తిత్వం కోసం కొట్లాడడం మొదలు పెట్టిన తొలినాళ్ళలోనే ప్రత్యేక  తెలంగాణ ఉద్యమం తన చరిత్రని , సంస్కృతిని నెమరేసుకుంది. ఆ వారసత్వంలో పోరుబాటని ఎంచుకున్నది. ఊరూరా తిరుగుతూ ప్రజలని చైతన్యవంతం చేయడం మాత్రమే కాక ఆయా గ్రామాల్లో గత చరిత్ర ఆనవాళ్ళుగా  ఉన్న  బొడ్రాయి  , బొడ్డెమ్మ  , దేవాలయాలు ,  బౌద్ధ క్షేత్రాల సందర్శనం , చర్చ మరియు యోచన జరిగింది. 


       తెలంగాణ అంతట ఊరూరా బౌద్ధ ఆనవాళ్ళు ఉన్నాయి. ప్రస్తుత అనేక దేవాలయాలు ఒకప్పటి బౌద్ధ క్షేత్రములే. ఇప్పటికి మిగిలి ఉన్న వాటిలో  ముఖ్యమైనవి ఐదు గొప్ప బౌద్ధ క్షేత్రములు. అవి నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ , ఫణిగిరి , కరీంనగర్ లోని దూళికట్ట మరియు అదిలాబాద్ లోని బాధనకుర్తి మరియు ఖమ్మంలోని నేలకొండపల్లి . 


       నాగార్జునసాగర్  కృష్ణానదీ పరివాహక ప్రాంతం బుద్ధుడి శిష్యుడు ఆచార్య నాగార్జునుడు నడయాడిన నేల . దీనికి గుర్తుగా నాగార్జున సాగర్ హిల్ కాలనీలో 274 ఎకరాల్లో బుద్ధవనం నిర్మించాలని గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది . ఇందులో భాగంగా 2005 లో నాటి పర్యాటక శాఖ అధికారులు బుద్ధవనం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు . 2006 లో బౌద్ధ మత గురువు దలైలామా అమరావతిలో కాలచక్ర యాగానికి వెళుతూ ఇక్కడ బోధి వృక్షాన్ని నాటారు .శంకుస్థాపన చేసిన నాటి నుంచి 2014 లో రాష్ట్ర విభజన జరిగే వరకూ బుద్ధవనం నిర్మాణ పనులకు కేంద్రమే నిధులు ఇచ్చింది . రాష్ట్ర విభజన అనంతరం బుద్ధవనం ప్రాజెక్ట్ కు కేంద్రం నిధులు ఇవ్వకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి . తెలంగాణ రాష్ట్రంలో స్వంత ప్రభుత్వం ఏర్పడిన తరువాత  2015 మే 2, 3 మరియు 4 తేదీల్లో టీఆర్ఎస్ ప్లీనరీ నిమిత్తం నాగార్జున  సాగర్ కు  వచ్చిన సీఎం కేసీఆర్ బుద్ధవనాన్ని సందర్శించారు . బుద్ధ వనం అభివృద్ధికి వెంటనే రూ .25 కోట్లు కేటాయించడమే కాకుండా , మల్లేపల్లి లక్ష్మయ్యను ప్రత్యేక అధికారిగా నియమించారు .ఆ తరువాత 100 కోట్లతో సాగిన ఈ పనులు 17 ఏళ్ళ తరువాత  ఎట్టకేలకు తుది దశకు చేరాయి . అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రంగా రూపుదిద్దుకున్న బుద్ధవనాన్ని మంత్రులు కేటీఆర్ , శ్రీనివాస్ గౌడ్ , జగదీశ్ రెడ్డి ఈ నెల 14 వ తేదీన ప్రారంభించారు. 


        నల్గొండ జిల్లాలో ఫణిగిరి దగ్గరలో గాజుల బండ గుట్ట ఉంది . గాజులబండ ఫణిగిరులలో బౌద్ధ అవశేషాలు చాలా బయల్ప డ్డాయి . గాజులబండపై మహాస్తూప శిథిలాలు చాలా కాలం క్రితమే కనుక్కొన్నారు . ఇక్కడి ఈ స్తూపం ధాన్యకటక శ్రీపర్వత మహాస్తూపాలవలె చక్రాకార పునాదులపై నిర్మించారు . కొండ పడమటి వైపున చైత్యాలయం ఉంది . ఫణిగిరిలో చలువరాతి స్తంభశకలాలు అనేకం బయల్పడినాయి .ఇవి బౌద్ధ విహారానివి. ఇక్కడ అభివృద్ధి కోసం బౌద్ధవనం నుండి మల్లేపల్లి లక్ష్మయ్య మరియు రెవెన్యూ అధికారులతో  ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.


        కరీంనగర్ జిల్లాలోని దూళికట్ట. క్రీ.పూ. రెండో శతాబ్ధికి చెందిన ఈ బౌధ్ధ క్షేత్రంలో ముచిలింధ నాగశిల్పంపై క్రీ.పూ. 1 వ శతాబ్దికి చెందిన రెండు శాసనలున్నాయి. ఈ శిల్పం ప్రస్తుతం కరీంనగర్ లోని పురావస్తు ప్రదర్శనశాలలో ఉంది. ఇక్కడ గౌతమిపుత్ర శాతకర్ణి మరియు శివశ్రీల వెండి నాణేములు లభించాయి. ఇక్కడ బుద్ధుడి జీవిత కథ చిహ్నాల రూపంలో ఉంది. చుట్టూ పక్కల ప్రాంతం అంత ఆక్రమించబడి రోజురోజుకి ధ్వంసం చేయబడుతుంది.  స్థానిక ప్రజలు మరియు బుద్దుడి బోధనలు అనుసరిచేవారు ప్రతి ఏడాది దసరా మరియు వైశాఖ పౌర్ణమి రోజు ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 


       అతి ముఖ్యమైన మరో ప్రాంతం - భాధనకుర్తి. బాసర నుండి ప్రవహిస్తున్న గోదావరి నది రెండుగా చీలి మల్లీ కలుసుకునే ద్వీపంలో ఉన్న గ్రామం ఇది. ప్రస్తుతం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో గల ఈ గ్రామం ఉత్తర తెలంగాణాలోని ఆదిలాబాద్ , నిజామాబాద్ మరియు కరీంనగర్ మూడు ఉమ్మడి జిల్లాలని కలిపే ముఖ్య స్థానం . దక్షిణ భారత దేశానికి బౌధ్ధం చేరడంలో గేట్ వే మరియు ప్రాచీన బౌధ్ధ క్షేత్రం ఇది.  క్రీ॥పూ॥ 4 వ శతాబ్దానికి చెందిన బుద్ధ ఘోషుడు , పరమార్థ జ్యోతిక అనే పేరుతో సుతనిపాత కు రాసిన వాఖ్యాన గ్రంధంలో బావరి మహర్షి మరియు అతని శిష్యుల గురించిన విషయం ఉంది.  ఈ భాదనకుర్తికి అంధకరట్టగా పేరు వుంది . బాధనకుర్తి దీపం మీదనే దేవరవాద బౌద్ధం , అందక బౌద్ధ సంఘం మనుగడ సాధించాయని చరిత్ర చెపుతుంది . బావరి గౌతమ బుద్ధుని విప్లవం గురించి తెలుసుకొని తన 16 మంది శిష్యులని పంపించి బుద్దుని బోధనల ఉపదేశం అందుకోని బౌద్దదమ్మ వ్యాప్తికి తోడ్పడ్డాడు . ఈ బావరికి ఉపదేశం జరిగిన ఈ స్థలాన్ని బావపూర్ కుర్దు అని కూడా అంటున్నారు .దీని పూర్వ నామం ములక.  తెలంగాణ ఉద్యమ కాలంలో మే 17, 2011న ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య మరియు జేఏసీ కో-కన్వీనర్ మల్లేపల్లి లక్ష్మయ్య ఇతర ఉద్యమకారుల ఆధ్వర్యంలో ఇక్కడ బౌధ్ధ పూర్ణిమ వేడుకలు జరిగాయి.  ఇంత ఘన చరిత్ర కలిగిన బాధనకుర్తి గ్రామంలో ఈ నెల 14న ఆ సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణ చేయబడి బుద్దుని జయంతి వేడుకలు ఈసారి స్థానిక సర్పంచ్ పార్శపు శ్రీనివాస్  MPTC శ్రావణ్  మరియు సత్యశోధక్ సమాజ్ , బుద్దిస్ట్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ , అంబేడ్కర్‌ యువజన సంఘాలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 


          ఖమ్మం జిల్లా నేలకొండపల్లి , మజ్జుగూడెం గ్రామాలలో సువిశాలమైన బౌద్ధక్షేత్రం బయల్పడింది . ఇక్కడ దొరికిన శాతవాహన ఇక్ష్వాకునాణేల వల్ల ఇది చాలా ప్రాచీనమైన క్షేత్రమని శిల్పాలవల్ల థేరవాద మహాయానాలు ఇక్కడ విలసిల్లాయని చెప్పవచ్చు . చలువరాతిలో మలచిన సింహాసనమూ , స్తూప నమూనా గమనించదగిన శిల్పాలు . బౌద్ధం తొలిదశలో వీటిని ఆలయాలలో ప్రతిష్ఠించి పూజించి ఉంటారు . మహాయాన దశకు చెందిన బుద్ధప్రతిమలు చాలా దొరికాయి . వీటి సంఖ్యను బట్టి బుద్ధప్రతిమలు తయారుచేసే కర్మాగారం ఇక్కడ ఉండేదా అనే అనుమానం కలుగుతుంది . ఈ ప్రతిమల్లో చాలా భాగం విజయవాడ విక్టోరియా జూబిలీ మ్యూజియంలో ఉన్నాయి .ఈసారి ఇక్కడ ఘనంగా ఉత్సవాలు జరగనున్నాయి. 


  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో  ఆసియాలోనే అతిగొప్ప బౌద్ధక్షేత్రంగా దక్షిణ భారతదేశంలో అతి పెద్ద బౌద్ధ స్థూపంగా విలసిల్లనున్న నాగార్జున సాగర్ బౌద్ధవనం వలే మిగతా బౌద్ధ క్షేత్రాలను అభివృద్ధి చేసుకోవలసిన ఆవశ్యకత ఉంది. దానికి ప్రజల , ఆలోచనపరుల యొక్క తోడ్పాటు , ముందడుగు కూడా అవసరం.

( బౌద్ధ వైశాఖ పూర్ణమి సంధర్భంగా . ) 


- వెంకటకిషన్ ఇట్యాల

9908198484

Relative Post

Newsletter