వేకువ, మెలకువ - K. Srinivas (ఆంధ్రజ్యోతి సీనియర్ ఎడిటర్)
సమాచారాన్ని, అభిప్రాయాలను, అనుభవాలను పంచుకోవడానికి అనేక డిజిటల్ వేదికలు ఏర్పడుతున్నాయి. బాహుళ్యంతో మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మనల్ని మనం వ్యక్తం చేసుకోవడానికి ఒక అపూర్వమైన అవకాశం. మరోవైపు, మనల్ని సత్యాసత్య విచక్షణకు దూరం చేసేంత ప్రభావశీలత. మనకు తెలియకుండానే, మన ప్రాధాన్యాలను, అభిరుచులను హైజాక్ చేసే ప్రయత్నాలూ ఈ డిజిటల్ ముమ్మరం చాటున జరుగుతాయి. తస్మాత్ జాగ్రత్త. పత్రికలు, టీవీలూ వార్తలను పక్షపాతాలతోనో, వృత్తి ప్రమాణాలతోనో వడగట్టి వార్తలు అందిస్తాయి. వాటిని ఉపయోగించుకునే పాఠకులు, వీక్షకులు తమలో ఉన్నవిచక్షణ ను ఉపయోగించి,వాక్యాల నడుమ వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. డిజిటల్ మీడియాలో వడపోతలు, ద్వారపాలనలు తక్కువ. సమ్మర్దాన్ని ఉపయోగించుకుని జనాన్ని మందలుగా, వైరల్ కంటెంట్ కు వ్యసనపడే మేదకులుగా మార్చే శక్తి నూతన మాధ్యమాలకు ఉన్నది. భావప్రకటనకు ఎంతటి స్వేచ్ఛనో, ఎంతటి సావకాశమో, ఎంతటి వేగమో అని మనం పరవశిస్తుండగానే, అసత్యవాది, నియంత ఈ వేదికల మీద నుంచే వికటాట్టహాసం చేస్తున్నాడు. జాగ్రత్త. ఈ వేదికల దుర్వినియోగాన్ని చూసి సజ్జనులు బాధపడితే, వీటి స్వతంత్రతను చూసి దుర్మార్గులు కన్నెర్ర చేస్తారు. ఒక సంస్కారాన్ని ప్రగతిశీలురు కోరుకుంటే, నిర్బంధాన్ని ఇతరులు కోరుకుంటారు. నూతన మాధ్యమాల స్వేచ్ఛను కాపాడుకోవాలి, ప్రజలకు అనుకూలంగా ఆ స్వేచ్ఛను వినియోగించుకోవాలి. ఏ రకం సమాచార మాధ్యమాన్ని అయినా అధికారపీఠాల నుంచి నియంత్రించడాన్ని వ్యతిరేకించినట్టే, ఈ ప్రజాసామాజిక మాధ్యమాల అదుపు ను కూడా వ్యతిరేకించాలి. మంచి మాట, మంచి రచన, మేలు తలపు పాఠకులకు వీక్షకులకు ఏ ఆటంకమూ లేకుండా వెళ్లాలి. వేలికొసలపై తీర్చిదిద్దుకునే డిజిటల్ మాధ్యమానికి కలం ఒక పురా జ్ఞాపకం మాత్రమే కాదు, రచనకు, సత్యానికి కొనసాగే ప్రతీక. సత్యానికి నిబద్ధమై, సమాజానికి ఉపదేశమో ఆదేశమో ఇవ్వడం కాక, ఆలోచనలను రగిలించే రచనలతో, ప్రజాస్వామికమయిన సరళిలో ‘కలం వేకువ’ ను నిర్వహించాలని మిత్రులను కోరుతున్నాను. డిజిటల్ వేదిక నిర్వహణలో ఇతరులకు మార్గదర్శకం అయ్యేవిధంగా, తగిన ప్రమాణాలు పాటిస్తూ ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నాను.