ఆంగ్ల మాధ్యమం’ ఆంతర్యమేమిటీ!?
ఆంగ్ల మాధ్యమం’ ఆంతర్యమేమిటీ...
– ఆగమేఘాల మీద కేబినేట్ సబ్ కమిటీ
– అమలు పైన సవాలక్ష సందేహాలు
– అంతర్గత ఎజెండా పై అనుమానాలు
– విద్యారంగ నిపుణుల భిన్నాభిప్రాయాలు
హైదరాబాద్: ఆగమేఘాల మీద ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేసేందుకు రాష్ట మంత్రి వర్గ సమావేశంలో ప్రాథమిక స్థాయిలో ఆమోదముద్ర వేసి అవసరమైన అధ్యయనం, విధివిధానాల రూపకల్పనకు మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు నిర్ణయం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినేట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసకున్న విషయం తెలిసిందే. దీనికి తోడు సర్కారు పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనకు ‘మన ఊరు – మన బడి’ పథకాన్ని అమలు చేస్తున్నట్లు, ఫీజు నియంత్రణకు నూతన చట్టాన్ని తేనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మన ఊరు – మన బడి కార్యక్రమానికి నాలుగేండ్లలో కలిపి రూ. 7300 కోట్ల నిధులతో మౌళిక వసతుల కల్పన చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు హైదరాబాద్లో నాలుగు పాఠశాలలను పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి అమలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలుకు సంబంధించి వచ్చే శాసనసభ సమావేవాల నాటికి నూతన చట్టం తీసుకరావాలనే విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పటికీ విధాన రూపలకల్పన, ప్రకటిత లక్ష్యాలు, అమలు తీరు ఎలా ఉంటుందనే విషయంపై పూర్తి స్థాయిలో ప్రణాళిక రూపొందించకపోవడం వల్ల స్పష్టత లేకపోయినప్పటికీ అనుమానాలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యారంగ నిపుణులు, ఉపాధ్యాయ వర్గాల నుంచి అనుకూల, ప్రతికూల అభిప్రాయాలు, విద్యార్ధుల తల్లిదండ్రుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట ఆవిర్భావంతో పాటు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఏడేళ్ళ తర్వాత పాఠశాల విద్యపై కేంద్రీకరించడమే కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని నిర్ణయించడం గమనార్హం.
– అధ్యయనానికి కేబినేట్ సబ్ కమిటీ
గత విద్యాసంవత్సరం నుంచే పొరుగు రాష్టమైన ఆంధ్రప్రదేశ్లో సర్కారు బడుల్లో పూర్తి స్థాయి ఇంగ్లీష్ మీడియం విధానాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై భిన్నాభిప్రాయాలున్నప్పటికీ అదే నమూనాలో మన రాష్టంలో అమలు చేస్తారా? అమలు తీరులో నూతన ఒరవడి ఏమైనా ఉంటుందా? అనే అనుమానాలున్నప్పటికీ కేసీఆర్ మనుసులో మాటగా ఏదైనా ప్రత్యేక ఎజెండా ఉందా? అనే అభిప్రాయాలు ప్రచారంలో ఉన్నాయి. విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అధ్యక్షతన మరో 10 మంది మంత్రులతో ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉపసంఘం నివేదిక అందించిన అనంతరం, మరోసారి సమగ్రంగా చర్చించి అమలుకు సంబంధించి పూర్తి స్థాయి ప్రణాళిక రూపొందించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఈ ప్రణాళిక రూపకల్పనకు ముందు అధ్యయనం, విధివిధానాల రూపకల్పనలో విద్యారంగ నిపుణులు, ఉపాధ్యాయుల అనుభవాలను పరిగణలోకి తీసుకుంటారా? లేదా? వేచి చూడాల్సి ఉంది.
– ఇంగ్లీష్ మీడియం ఆధిపత్యం
ఇప్పటికీ ప్రైవేటు రంగంలో దాదాపు 99శాతం పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను అమలు చేస్తుండగా ప్రభుత్వ పాఠశాలలన్నీంటిలో ఇంగ్లీష్ మీడియంను అమలు చేస్తామని కేబినేట్ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇప్పటికే అనధికారికంగా దాదాపు సగం ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ రూపాల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తున్నారు. అధికారికంగానే 8వేల పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తున్నారు. దీనికి తోడు గురుకులాలు, మోడల్ స్కూళ్ళు, కస్తూరి బా స్కూళ్ళ పేరిట ఇంగ్లీష్ మీడియంను కొనసాగిస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారమే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం 48శాతం, 47శాతం తెలుగు మీడియం అమలైతున్నది. ఎయిడెడ్ పాఠశాలల్లో తెలుగు మీడియంలో కేవలం 23 శాతం, ఇంగ్లీష్ మీడియం 66 శాతం, ప్రైవేట్ పాఠశాలల్లో తెలుగు మీడియం నామ మాత్రం ఒక్క శాతం, 97శాతం ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను అమలు చేస్తామనడంలో ఔచిత్యమేమిటో అర్ధం కావడం లేదని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నూతన విద్యావిధానంలో కూడా మాతృభాషలో విద్యకు ప్రాధాన్యమిచ్చారని, ఇటీవల కేంద్రం తెచ్చిన జాతీయ విద్యావిధానంలో కూడా పాఠశాల స్థాయిలో మాతృభాష బోధనకే ప్రాధాన్యమిచ్చారని వీటన్నింటిని ఆమోదించిన రాష్ట్రం కొత్తగా ఇంగ్లీష్ మీడియంను ఎజెండాపైకి తేవడంలో మర్మమేమిటంటున్నారు.
– అనుకూల, ప్రతికూల వాదనలు
పాఠశాల విద్యలో ఇంగ్లీష్ మీడియం విద్యా విధానంపైన అనుకూల, ప్రతికూల వాదనాలు ప్రారంభ స్థాయి నుంచి కొనసాగుతున్నాయి. ఇంగ్లీష్ మీడియంను అమలు చేయడమంటే మాతృభాషలో విద్యబోధనకు చెల్లుచీటి పలకడమైనందున దీన్ని తెలుగు మీడియం అనుకూలవాదులు వ్యతిరేకిస్తున్నారు. పాఠశాల స్థాయి పిల్లల మనస్తత్వం, మానసిక స్థితి, భౌతిక పరిస్థితులు, తల్లిదండ్రులు, పరిసరాల ప్రభావం, మాతృభాష, పరిసరాలపై అవగాహన తదితర అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్న మనో విజ్క్షాన శాస్ర్తవేతలు, విద్యారంగ నిపుణులు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా మాతృభాషలో విద్యాబోధనకు పూర్తి ప్రాధాన్యత నిస్తున్నారు. ఈ క్రమంలో వీరంతా తెలుగు మీడియంలో విద్యాబోధన ఉండాలని దీని వల్ల పిల్లలకు మనో వికాసంతో పాటు విద్యపరమైన ఆసక్తి అందులో అవగాహన ఏర్పడుతుందని స్పష్టం చేస్తున్నారు. దశాబ్దాలుగా తెలుగు మీడియంలోనే విద్యనభ్యసించి ఉన్నతస్థాయికి చేరిన వారు ఉన్నారని, తదుపరి ఇంగ్లీష్ పై పట్టు సాధించి విదేశాల్లో సైతం ప్రత్యేక గుర్తింపు పొందిన అనేక మందిని ఉదహరిస్తున్నారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన జపాన్, స్వీడన్, జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాల్లో మాతృభాషల్లోనే విద్యాబోధన సాగుతుందని గుర్తు చేస్తున్నారు. భాష మీద గౌరవం లేని పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎలా గౌరవంగా ఉంటారని, తమ చుట్టూ ఉండే వారితో ఎలా వ్యవహరిస్తారని, వారితో సంభాసించాడానికి సైతం మాతృభాషపై ఆధారపడాల్సిందేననే అభిప్రాయంతో ఉన్నారు. విదేశాలకు వెళ్ళే కొందరికి మాత్రం ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నారు. తెలుగుతో పాటు ఇంగ్లీష్ను చదువుకోవడం తప్పుకాదంటున్నారు.
– ఇంగ్లీష్ మీడియంను స్వాగతించే వారు కూడా మాతృభాషపైగానీ, మాతృభాషలో విద్యాబోధనకు సంబంధించి వ్యతిరేక భావన లేనప్పటికీ స్థానిక పరిస్థితులను ప్రత్యేకంగా పేర్కొంటున్నారు. ఫ్రాన్స్, జర్మనీ, జపాన్లలో విద్యంతా మాతృభాషలోనే ఉంటుందని, వేరే భాషకు అవకాశం లేదంటున్నారు. మన దగ్గర అలాంటి పరిస్థితి లేదంటున్నారు. ఆ స్థానాన్ని ఇంగ్లీష్ భర్తీ చేస్తుందన్నారు. సమానత్వ భావన నెలకొంటుందని చెబుతున్నారు. తెలుగు మీడియంలో చదువుకోవడం వల్ల పోటీ ప్రపంచంలో నెగ్గుకరాలేక పోతున్నారంటున్నారు. ప్రధానంగా వృత్తి విద్య, కోడింగ్, పోటీ పరీక్షలు, విదేశీ అవకాశాలు, ఉన్నత విద్యతో పాటు రోజువారీ జీవన పరిస్థితులకు కూడా ఇంగ్లీష్ అనివార్యమైన పరిస్థితి ఏర్పడిందనే వాదన వినిపిస్తున్నారు. ఈ కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులు దీనికి దూరంగా కాకుండా ఉండేందుకు ఇంగ్లీష్ మీడియం దోహదపడుతుందంటున్నారు.
– ఇంగ్లీష్ మీడియం వల్ల ప్రయోజనం:
మాజీ ఐఎఎస్ అధికారి ఆకునూరి మురళి
ఇంగ్లీష్ మీడియం పాఠశాల నుంచి అమలు చేయడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. మాతృభాషలో విద్యను వ్యతిరేకించాల్సిన అవసరం లేనప్పటికీ ఇక్కడ ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఇంగ్లీష్ మీడియంను ఆహ్వనించాల్సి ఉందన్నారు. దీని వల్ల సర్కారు పాఠశాలల్లో చదివే విద్యార్ధుల్లో న్యూనతా భావం తగ్గి, సమానత భావన నెలకొంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తున్నట్లు చెప్పారు. దీనికి ప్రధానంగా ఉపాధ్యాయులకు గట్టి శిక్షణ, పాఠ్యపుస్తకాల రూపకల్పన, విద్యావాతావరణం ఏర్పాటు ప్రధానమన్నారు. ఏపీలో పాఠ్యపుస్తకాల్లో ఒక పేజీలో తెలుగులో, మరో పేజీలో ఇంగ్లీష్లో పుస్తకాలు ప్రింట్ చేశామన్నారు. తెలంగాణలో ఈ విధానం ఏ విధంగా ఉంటుందో చూడాలన్నారు.
– ఇంగ్లీష్ మీడియం మార్కెట్ శక్తుల కుట్ర : ప్రొఫెసర్ హరగోపాల్
ఇంగ్లీష్ భాష పై ప్రజల్లో మోజు ఏర్పడేందుకు మార్కట్ శక్తులు, కార్పోరేట్ల కుట్ర దాగి ఉంది. దీన్ని వ్యతిరేకించే వాళ్ళు వివరించే ప్రయత్నం చేసినా పట్టించుకునే స్థితి దాటిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆ స్థాయిలో ప్రచారం కొనసాగుతుందన్నారు. మాతృభాషలో విద్యాబోధన మానవ వికాసానికి దోహదం చేస్తుందన్నారు. తెలుగు మీడియంలో చదువుకోకుంటే ఒక గద్దర్, గోరటి, జయరాజ్లాంటివారు అద్భుత సాహిత్య సృష్టి చేసేవారా? అంటూ ప్రశ్నించారు. తాను తెలుగుమీడియంలో చదవి విదేశాల్లో సైతం ఇంగ్లీష్లో ఉపన్యసించిన సందర్భాలున్నాయని గుర్తుచేశారు. ప్రజలతో కలిసిపోవాలంటే మాతృభాష తప్పనిసరి అవసరమన్నారు.
– తెలుగు మీడియం తో పాటు ఆంగ్ల మాధ్యమం నడుపాలి:
డా. కె.లక్మినారాయణ.విద్యా పరిరక్షణ కమిటీ, తెలంగాణ.
తెలుగు మీడియం తో పాటు ఆంగ్ల మాధ్యమం నడుపాలి. మాతృభాష మాధ్యమం వదిలేసి కేవలము ఆంగ్ల మాధ్యమం నడపడం కాకూడదు.దానికి సరిపడా మౌలిక వసతులు కల్పించకుండా,ఆంగ్ల మాధ్యమం లో బోధించే ఉపాధ్యాయులను నియమించకుండా ఆంగ్లా మధ్యమం పెట్టడం అనేది విఫలం కాక తప్పదు.ఇంతకు ముందే సక్సెస్ స్కూల్స్ పెట్టి ఆంగ్ల భాషలో బోధిచే ఉపాధ్యాయులను నియమించకుండా విద్యార్థులకు అటు మాతృభాష రాకుండా,ఇటు ఆంగ్లభాష రాకుండా పోయారు. గత సంవత్సరా బడ్జెట్లో విద్యకు కేటాయించిన బడ్జెట్ నుండి ఒక రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ప్రస్తుతం విద్యాకోసం రూ.72987 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పి ఏమేరకు అమలుచేస్తారనేది ప్రశ్నార్ధకమే.
– మాతృభాషకు ప్రాధాన్యత అవసరం:
లింగారెడ్డి, ఉపాధ్యాయ సంఘం ప్రతినిధి
మాతృభాషైన తెలుగులో విద్యాబోధన వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇదే విషయాన్ని విద్యారంగ నిపుణులు తేల్చిచెప్పారు. తెలుగు మీడియంకు ప్రాధాన్య ఇవ్వాలని చెప్పిన సీఎం ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలనడం గమనార్హం. ఈ విధానం విద్యాహక్కు చట్టానికి వ్యతిరేకమైంది. ప్రతి విద్యార్ధికి విద్య తన నివాసప్రాంతంలో అందుబాటులో తాను కోరుకున్న భాషలో ఉండాలి. కామన్ స్కూల్ విధానాన్ని అమలు చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందన్నారు. విదేశీ శక్తుల ప్రోద్బలం ఒత్తిడి కారణంగా ఈ విధానాలు అమలు చేస్తున్నారు.