ఖమ్మంలో ‘కారు’ ఢమాల్?
పీకే సర్వేతో గులాబీ గుండెల్లో గుబులు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు రాదని తేల్చిన పీకే టీం
-రాష్ట్ర వ్యాప్త సర్వేలో కాంగ్రెస్‌కే ఎక్కువ సీట్లు
-ప్రభుత్వ పనితీరుపై కూపీలాగుతున్న టీం
గులాబీ పాలనపై వ్యతిరేకతకు విరుగుడు కనిపెట్టేపనిలో పీకే
-పీకే చేతిలో ఖమ్మం లోగుట్టు
-కేసీఆర్ మౌనం వెనుక రాజకీయ విస్ఫోటనం..?
వేకువ ప్రతినిధి, హైదరాబాద్: పీకే టీం రాకతో రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ శ్రేణుల్లో గుబులు మొదలైంది. గులాబీ పాలనలో ప్రజా వ్యతిరేకత పెల్లుబికుతుండడంతో ఏమి చేయలో తోచక పీకేటీం(ప్రశాంత్ కిషోర్) తో ఈ సారి ఎలాగైనా గట్టెక్కాలని గులాబీ బాస్ రాజకీయ వ్యూహంతో, తన రాజకీయ చాణక్యంతో మరోసారి అధికారంలోకి రావాలని కలలు కంటున్నారు. దానిలో భాగంగానే పీకే జిల్లాల్లో రహస్యంగా పర్యటనలు చేస్తూ ప్రజల నాడీ తెలుసుకుంటున్నారు. దీనికి అనుగుణంగా నే తన యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టారు.
గులాబీకి ‘పోడు’ పోటు..
గులాబీ బాస్‌తో తన పర్యటన సర్వేరిపోర్ట్‌ను విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్ట్‌లు వాటి పరిధిలో ఉన్న ప్రజల మనోగతాలు తెలుసుకుంటున్నారు. దీనిలో భాగంగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తన సర్వే రిపోర్ట్‌లో భాగంగా గులాబీ బాస్‌కు ఖమ్మం జిల్లాలో ఈ సారి గండం తప్పేటట్టులేదని చెప్పినట్టు విశ్వాసనీయ సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కువ భాగం ఆదివాసీ ప్రాంతం కావడంతో ఆదివాసీ ఎమ్మెల్యేలే ఉండడంతో వారి నియోజకవర్గాలో పోడుభూముల సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ‘పోడు భూముల పోడు’ గులాబీకి గుచ్చుకునేటట్లు ఉందని తేల్చిచెప్పినట్టు సమాచారం. గులాబీ పార్టీలో అధికార దుర్వినియోగం రాను రాను తీవ్రం కావడంతో , ప్రజలకు సంక్షేమ పథకాలు అందకపోవడంతో ప్రజా వ్యతిరేకత పెల్లుబికుతున్నదని తన సర్వే రిపోర్ట్‌లో వెల్లడించినట్లు సమాచారం. గ్రూప్ రాజకీయాలు, ముఠా తగదాలు, భూకబ్జాలతో అధికార నేతలు అందలమెక్కుతున్నారని పేర్కొన్నట్టు తెలుస్తోంది.
ఏజెన్సీలో కాంగ్రెస్‌కు స్థిర ఓటు బ్యాంకు..
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో నాలుగు ఎస్టీ నియోజక వర్గాలు ఉన్న కూడా అక్కడి గిరిజనులకు సరైనా ప్రభుత్వ పథకాలు అందడం లేదని ఆ సామాజిక వర్గం కొంత ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఏజెన్సీలో కాంగ్రెస్‌కు స్థిర ఓటు బ్యాంక్ ఉండడంతో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నది. గతంలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీలో గెలిచి గులాబీ కండువా కప్పుకున్నవారే కావడంతో నేడు గులాబీ నేతల కుమ్ములాటలు పాలనపై వ్యతిరేకత కాంగ్రెస్‌కు కలసి వచ్చినట్టు పీకే టీం అబిప్రాయపడుతోంది. దీనిలో భాగంగానే ఖమ్మం జిల్లాలో ఏ ఒక్క సీటు రాదనే సర్వే రిపోర్ట్ బయటికి రావడంతో గులాబీ నేతలకు గుబులు మొదలైంది. కేసీఆర్ ఓటమి భయంతోనే పీకే ను రంగంలో కి దింపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయిన ప్రజల మనస్సును గెలవలేక చతికిలపడిపోతున్నట్లు రాజకీయ పరిణామాలు తెలియజేస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో తానొక్కడినే ముందు నడిచినట్లు చెప్పుకునే కేసీఆర్ పాలనలో తానొక్కడే తీసుకునే నిర్ణయాలకు ఓటమి చవిచూసే అవకాశం కల్పించుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గట్టెక్కించేందుకే పీకే రంగంలోకి..
గతంలో కేసీఆర్ ఒక సర్వే సంస్థతో రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి ఫలితాలు చూసి కంగుతిన్నట్టు తెలుస్తోంది. ఆ సర్వే నివేదికలో కేవలం 20 నుంచి 30 వరకే గెలుస్తామని నివేదికలు రావడంతో గులాబీ బాస్‌కు గుబులు మొదలై పీకే ని రంగంలోకి దింపినట్లు రాజకీయ చాణక్యులు అభిప్రాయపడుతున్నారు. గులాబీ పార్టీలో వలసవాదుల ఆధిపత్యం అవినీతి అక్రమాలు, డబుల్ బెడ్‌రూముల్లో అవినీతి , దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి తదితర సమస్యలను ప్రజలు తెరపైకి తెస్తున్నారని పీకే టీం సర్వేలో తేటతెల్లమైందని చర్చ జరుగుతోంది. పోడు భూములకు పట్టాలు ఇస్తానని వాగ్దానం చేసిన కేసీఆర్ నేడు మరిచిపోయే సరికి ఏజెన్సీలో ఆదివాసీ ప్రాంతాల్లో గులాబీ పార్టీపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని పీకే తన నివేదికలో స్పష్టం చేసినట్టు సమాచారం. ముందస్తు ఎన్నికలకు వెళ్తే కేసీఆర్‌కు ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది. 20నుంచి 30సీట్లు దక్కే అవకాశం ఉన్నట్టు మొదటి స్థానంలో కాంగ్రెస్, మూడో స్థానంలో బీజేపీ, రెండో స్థానంలో టీఆర్ఎస్ ఉండొచ్చన్న ఊహగానాలు వెలువడుతున్నాయి. ఏదిఏమైనా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడ గులాబీ పార్టీ తుడుచుకపోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.