అలుముకున్న నిరసన మేఘాలు
– ఆందోళనల్లో రాజకీయ పక్షాలు
– ఆరోపణలకు అధిక ప్రాధాన్యం
– పరస్పర విమర్శలతో పెరిగిన వేడి
– అధికార పార్టీల తీరుపై సందేహం
ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో రాజకీయ నిరసన మేఘాలు అలుముకున్నాయి. ఆందోళనలు, ధర్నాలతో అట్టుడుకుతోంది. అధికార పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీలు ఈ ఆందోళనకు శ్రీకారం చుట్టగా మిగిలిన విపక్షాలైన కాంగ్రెస్, కమ్యూనిస్టులు, టీజెఎస్లతో సహా ప్రజాసంఘాలు, రాజ్యాంగ పరిరక్షణ సమితి, గిరిజన రిజర్వేషన్ సమితి తదితర పోరాటవేదికలు ప్రజా సమస్యలు ఎజెండాగా నిరసనలు చేపడుతున్నారు. క్రమంగా ఈ నిరసనలు ఆందోళన స్థాయికి చేరుకుంటున్నాయి. దీని వల్ల రాష్ట్రంలో రాజకీయ పక్షాల కార్యకలాపాలు వేగంపుంజుకున్నాయి. పరస్పర విమర్శలు, మాటల యుద్ధాలకు తోడు ప్రత్యక్ష నిరసనల్లో భాగస్వామ్యం కావడం వల్ల రాష్ట్రంలో వేసవి ఎండతో పాటు రాజకీయ వేడికూడా క్రమంగా పెరుగుతోంది.
– వరి, గ్యాస్, పెట్రో ధరల పై గులాబీ నిరసన
టీఆర్ఎస్ తాజాగా మరోసారి ధాన్యం కొనుగోళ్ళ అంశాన్ని ఎజెండాపైకి తెచ్చింది. వరి కొనుగోళ్ళ పేరుతో బీజేపీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. దీనిపై ఆందోళనలు కొనసాగిస్తోంది. దీనికి పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు జతకూడాయి. రాష్ట్రస్థాయి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ ఆందోళనలకు ప్రత్యక్ష నాయకత్వం వహిస్తున్నారు. రాష్ట్రంలో అధికారాన్ని కాపాడుకోవడం లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.
– కరెంట్, బస్‌చార్జీలపై బీజేపీ నిరసన
తొలి నుంచి రాష్ట్రంలో తమ బద్ధశత్రువు టీఆర్ఎస్ అన్నట్లు బీజేపీ నాయకులు బిల్డప్ ఇస్తున్నారు. అంటకాగినంత కాలం రెండు పక్షాలు కలిసి పయనించాయనేది మరిచిపోతున్నారు. ఇప్పుడు కరెంట్‌చార్జీలు, పెంచారని, భూ సమస్యలు, రాష్ట్రాభివృద్ధి అంటూ మధ్య ‘హిందూ’ పాతబస్తీ, ఓవైసీ అంటూ మతాన్ని జోడించి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రెండు పార్టీల ధర్నాలు, రాస్తారోకోలు, అరెస్టులు హడావుడి పెరిగిపోయింది. రెండు పార్టీల మధ్య ఘర్షణలతో ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారు. అధికార పార్టీలు కావడంతో అంగబలాలను, ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు.
– అధికార పక్షాల తీరుపై సందేహం
ప్రజా సమస్యలు తమ ఎజెండాగా చెప్పుకుంటున్నప్పటికీ అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల చిత్తశుద్ధిపట్ల సందేహాలు వ్యక్తమైతున్నాయి. ఈ రెండు పక్షాలు ఫక్తు రాజకీయ లబ్ది కోసం ప్రజా సమస్యలను ఎజెండాపైకెక్కిస్తున్నారనే విమర్శలున్నాయి. అక్కడా, ఇక్కడా ఎనిమిదేళ్ళుగా తామే అధికారంలో ఉంటూ సమస్యలను పరిష్కారించాలనే నిజాయితీని కనబరచడంలేదు. టీఆర్ఎస్ బీజేపీపైన, బీజేపీ టీఆర్ఎస్పైన ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ రాజకీయ వేడిని పెంచుతున్నారు. పైగా ఈ రెండు పార్టీల మధ్య ఇటీవల స్నేహం చెడినట్లు వ్యవహరిస్తున్నారు తప్ప ఇంతకాలం సాగిన దోస్తీని మాత్రం విస్మరిస్తున్నారు. ఈ వాగ్వివాదాలు, మీడియా సమావేశాలతో ప్రజాలోచనలు పక్కదోవపట్టించడం తప్ప సమస్యలను పరిష్కరించేందుకు మాత్రం ప్రయత్నించడంలేదు.
– ఆందోళనలతో కాంగ్రెస్‌లో కదలిక
ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషించేందుకు కిందామీదా పడుతూన్న కాంగ్రెస్ ఇటీవల గాఢినపడుతున్నట్లు కన్పిస్తోంది. కొంత ఆలశ్యంగానైనా ఈ రాజకీయ చదరంగంలోకి చొరబడి తమ వంతు ప్రజలను కదిలించే కార్యక్రమాలను చేపడుతోంది. మన ఊరు, మన పోరు, వరి కొనుగోళ్ళు చేపట్టాలని, పెంచిన విద్యుత్ చార్జీలు, బస్సుచార్జీలు, గ్యాస్, పెట్రో, డీజిల్ చార్జీలు తగ్గించాలని డిమాండ్‌చేస్తూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అంతర్గతంగా విభేదాలున్నా పార్టీ నేతల గొంతు పెరిగింది. జిల్లాల్లో నాయకులు పాదయాత్రలు, ప్రజాసమస్యలు, పరామర్శలంటూ కొంత వేగం పుంజుకున్నది. ఇది మరింత పెరిగితేగానీ అధికార పక్షాల బండారం బయటపడే అవకాశం ఏర్పడుతోంది. ప్రతిపక్షానికి కనీస గౌరవం దక్కుతోంది.
– వామపక్షాలు, విపక్షాల నిరసన
రాష్ట్రంలో వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎం–ఎల్) పక్షాలు, టీజేఎస్, వైఎస్సార్టీపీ, ప్రజాసంఘాల కార్యకలాపాలు కాస్త ఊపందుకున్నాయి. గులాబీ పార్టీతో కలిసి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నారు. పార్టీ శ్రేణుల్లో మళ్ళీ కాస్తా కదలిక పెరిగింది. కేసీఆర్ కొత్త రాజ్యంగం కావాలనే డిమాండ్‌ను నిరసిస్తూ ఏర్పడిన రాజ్యాంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కాంగ్రెస్, ఎమ్మార్పీఎస్, టీజేఎస్, ఇతర వామపక్షాలు ఆందోళనల్లో పాలుపంచుకుంటున్నాయి. ఇంకో వైపు నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజాసంఘాల నేతృత్వంలో నిరసనలు పెరిగాయి. గిరిజన రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్రంలో టీఆర్ఎస్ తీరును విమర్శిస్తూ గిరిజన సంఘాలు ఆందోళనకు దిగాయి. పోడు భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తూ అటవీప్రాంతంలో ఆదివాసీ గిరిజన సంఘాలు ఉద్యమాలను కొనసాగిస్తున్నాయి.
– పెరుగుతోన్న ప్రజా గొంతుకలు
ప్రజాసంఘాలు, విపక్షాలు, ప్రజల కదలిక వల్ల అధికార పార్టీల బండారం, అధికారంలో ఉంటూ ప్రజాసమస్యలను పక్కదోవపట్టించి తిరిగి అధికారాన్ని దక్కించుకునేందుకు ఆడుతున్న నాటకాలు బహిర్గతమయ్యే అవకాశం ఉంది. ప్రజలను విభజించేందుకు మతం, కులం, ఇతర సమస్యలను వినియోగించుకుంటున్న కుట్రలను ప్రజలు చేధించేందుకు ఈ ప్రజాసంఘాల పాత్ర గణనీయంగా మారనున్నది. ప్రజా గొంతుకు పెరిగితే పాలకులపై ఒత్తిడి పెరుగునున్నది.