పడకేసిన పథకాలు -అటకెక్కిన అభివృద్ధి
పడకేసిన పథకాలు -అటకెక్కిన అభివృద్ధి
ఒక కుటుంబం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ అప్పుల పైననే ఆధారపడి విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉంటే ఏ ఆర్థిక వ్యవస్థ అయినా తీవ్ర సంక్షో భంలో పడుతుందని ఇటీవల వెనిజులా, శ్రీలంక దేశాలు ఎదుర్కొంటున్న రాజకీయ, ఆర్థిక సంక్షోభాన్ని గమనిస్తున్న వాళ్ళందరూ అర్థం చేసుకోగలరు. మన రాష్ట్రం మిగులు బడ్జెట్తో మొదలైనప్పటికీ ప్రస్తుతము అప్పుల ఊబిలో చిక్కి మరిన్ని అప్పులు తీసుకోవడానికి శతవిధాల ప్రయత్నాలు సాగిస్తున్నది. ప్రభుత్వ చెల్లింపులు దినదిన గండంగా పరిణమించింది. ఆర్భాటంగా మొదలుపెట్టిన అనేక పథకాలు అభివృద్ధి పథకాలు ప్రకటనలకు శంకుస్థాపనలకే పరిమితమవుతున్నాయి. ప్రభుత్వం గత 8 ఏళ్లుగా ఇబ్బడి ముబ్బడిగా అనుత్పాదక వ్యయాలు విపరీతంగా పెంచుకుంటూ పోయింది. ప్రస్తుతం మన రాష్ట్రం 4,50,000 కోట్ల రూపాయల నికర అప్పును కలిగి ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతి నెలకు 4,500 కోట్ల రూపాయల వడ్డీలు, వాయిదాలు చెల్లించాల్సి వస్తోంది. మరో 4500 కోట్ల రూపాయలు ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్లు చెల్లించడానికి సరిపోతుంది. ఇక ప్రభుత్వానికి దినదినం సమకూరే రాబడులన్నీ అప్పులకు, వడ్డీలకు ఉద్యోగుల జీతభత్యాలు పెన్షన్లకే సరిపోతుంది. ఇక సంక్షేమ పథకాలు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వ నిర్వహణ ఖర్చులు అప్పులు తెస్తే గాని పూట గడవకుండా ఉన్నది.. అప్పుల మీదనే అమితంగా ఆధారపడి మన ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ను వాస్తవ పరిస్థితులకు భిన్నంగా పెంచుతూ ఉన్నది. ప్రస్తుత సంవత్సరం 2,56,000 కోట్ల వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పటికీ ఇందులో 88 వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి సమకూర్చుకోవడానికి ప్రతిపాదించిందే.. ఇంకా 40 వేల కోట్ల రూపాయలు కేంద్ర గ్రాంట్లు రావచ్చునని బడ్జెట్లో ప్రతిపాదించింది. ఇంత పెద్ద బడ్జెట్ కేవలం ప్రజలలో ఒక హైపు సృష్టించడానికి చేసిందని బడ్జెట్ అంచనాలను మరియు వాస్తవాలను బట్టి చెప్పవచ్చు. 2,56,000 కోట్లలో 1,28,000వేల కోట్లు అప్పులు మరియు కేంద్ర గ్రాంట్లు పద్దుల కింద చూపించినవే. వాస్తవానికి ఈ సంవత్సరం అప్పులు గ్రాంట్లు కలిపి కేవలం 43 వేల కోట్లు మాత్రమే సమకూరే అవకాశం ఉన్నట్లు ఇటీవల ప్రభుత్వ అధికార వర్గాల అంచనాలు.దాదాపు బడ్జెట్లో 80 వేల కోట్ల రూపాయల(34 శాతం) పైగా నిధులు ఇక రానట్లే లేదా లేనట్టే.. వాస్తవానికి మన రాష్ట్రం సమకూర్చుకొనే అన్ని రకాల వనరులు(రాబడి అప్పులు మరియు కేంద్ర గ్రాంట్లు) కలిపితే 1,80,000 కోట్లకు మించని పరిస్థితిలు ఏర్పడ్డాయి.
కేవలం జీతాలు, పెన్షన్లు, ఆర్థిక వ్యవస్థ నిర్వహణ ఖర్చులు ప్రతి నెలకు 16 నుండి 17వేల కోట్ల రూపాయల చొప్పున సంవత్సరానికి 1,92వేల కోట్ల రూపాయలు తప్పనిసరిగా ఖర్చు చేయవలసి వస్తున్నది. ఇంకా అదనంగా రైతుబంధు 15 వేల కోట్లు, దళిత బంధువు 17వేల కోట్లు మొత్తం 32 వేల కోట్ల రూపాయలు ఈ రెండు పథకాలకు సమకూర్చుకోవాలి.దళిత బంధు, రైతుబంధులతో పాటు ప్రభుత్వ వార్షిక ఖర్చులు తక్కువలో తక్కువ 2,24000 కోట్ల రూపాయలకు మించి ఉన్నది. ఇక రాష్ట్ర అభివృద్ధికి ప్లాన్ ఎక్స్పెండిచర్ క్రింద ఖర్చు చేయడానికి నిధులు నిండుకున్నట్లే. ప్లాన్ ఖర్చులు ఆర్థిక అభివృద్ధికి కావలసిన వివిధ రకాల అవస్థాపన సౌకర్యాలు కల్పించడానికి ప్రతి సంవత్సరం చేసే వ్యయాలు.జీతభత్యాలు, పెన్షన్లు, దళిత బంధువు, రైతుబంధు మొదలగు అవసరాలకే ప్రస్తుతం సమకూరే ఆర్థిక వనరులు సరిపోవటం లేదు. అందుకే ప్రభుత్వము ఎంతో ఆర్భారంతో ప్రకటించిన అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు పడకేసుకొని అమలుకు నోచుకోవడం లేదు.
సంక్షేమ పథకాలలో ముఖ్యంగా
57 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వృద్ధులకు పెన్షన్లు ఇవ్వడం ప్రారంభించలేదు. గత నాలుగు సంవత్సరాల నుండి వాయిదాలు వేసుకుంటూ వస్తున్నది ప్రభుత్వం. బీసీ విద్యార్థులకు ఫీజు చెల్లింపులు జరగడం లేదు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులకు కేంద్రం నుండి నిధులు వస్తుంటాయి. ఇక బీసీ విద్యార్థుల పరిస్థితి అకమ్యగోచరం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు సబ్సిడీలు ఇవ్వవలసిన 14 లక్షల దరఖాస్తులు గత నాలుగు సంవత్సరాల నుండి ప్రభుత్వ కార్యాలయాల్లో కుప్పలుతేప్పలుగా పడి ఉన్నాయి.విదేశీ విద్య కొరకై బీసీ విద్యార్థులకు ఇచ్చే ఆర్థిక సహాయం అందడం లేదు. అభివృద్ధి పథకాలు కూడా నిధులు లేక అటకెక్కినాయి. రుణమాఫీ అమలు చేయకపోవడం వల్ల రైతుల రుణభారము రెండింతలకు చేరింది. గ్రామపంచాయతీలకు ఇచ్చే నిధులు మంజూరు కాక అప్పులు తెచ్చిన సర్పంచులు ఆవేదనలో ఉన్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నత పాఠశాలలు జూనియర్, డిగ్రీ కళాశాలలు ఎలాంటి సౌకర్యాలు లేక శిథిలావస్తులో పడ్డాయి, విశ్వవిద్యాలయాలు నిధుల కొరత వల్ల నియామకాలు లేక లైబ్రరీ, కంప్యూటర్, పరిశోధన వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోతున్నాయి. కేవలం జీతాలకే కటకట ఉండగా అభివృద్ధి మాటే ఎరుగరు. విద్యార్థులు, పరిశోధకులు, టెంపరరీ ఉద్యోగులు ఆందోళనకు దిగడం నిత్య కృత్యమైంది.
పావలా వడ్డీ బకాయిలు గత నాలుగు సంవత్సరాల నుండి మహిళా సంఘాలకు దాదాపు 4,000 కోట్ల మేరకు చెల్లింపులు నిలిచిపోయినాయి. ఈ సంఘాలు కూడా ఎదుగు బదులు లేకుండా నిలిచిపోయాయి. సంక్షేమ హాస్టల్లో భోజన వసతులు మెరుగ్గా లేవని విద్యార్థుల గొడవలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆరోగ్యశ్రీ బకాయిలు ఉద్యోగుల ఈ హెచ్ ఎస్ స్కీము ద్వారా మెడికల్ చెల్లింపులు ప్రైవేటు హాస్పటల్ లకు ఏళ్ల తరబడి రాకపోవడం వల్ల ఈ స్కీములు కూడా అమలు జరగడం లేదు కల్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం ఆర్థిక సహాయం ఏళ్లు గడిచిన అందడం లేదు. భర్తలు చనిపోయిన స్త్రీలకు నాలుగు సంవత్సరాల నుండి పెన్షన్లు మంజూరు కావడం లేదు. రైతుల పంట బీమా రాష్ట్ర ప్రభుత్వపు వాటా చెల్లించకపోవడం వల్ల రైతులు నష్టపోయిన పంటలకు పరిహారం రావడం లేదు. కాంగ్రెస్ కాలంలో రైతులకు వ్యవసాయ పరికరాలపై విత్తనాలు ఎరువులు కొనుగోలు పై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీలు, ప్రోత్సాహకాలు నిలిచిపోయాయి. గత ఎన్నికల ముందు నిరుద్యోగులకు ప్రకటించిన 3016 రూపాయల నెలవారి నిరుద్యోగ భృతి చెల్లింపులు నాలుగేళ్లు గడిచిన ప్రారంభం కాలేదు. డబుల్ బెడ్ రూముల కథ కంచికి చేరింది. గృహాలు లక్ష్యంలో 10 శాతం కూడా పూర్తి కాలేదు. లబ్ధిదారులకు అందలేదు. హనుమకొండలో ప్రజా కవి కాలోజీ కళాక్షేత్రం గత ఏడున్నర సంవత్సరాల నుండి పూర్తికాకుండానే మిగిలి ఉన్నది. ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యాసంస్థల్లో లక్షకు పైగా ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయకుండా మిగిలిపోయాయి. ఉద్యోగ విరమణ చేసిన విశ్రాంత ఉద్యోగులకు రిటైర్మెంట్ సందర్భంలో చెల్లించాల్సిన డబ్బులు నెలలు సంవత్సరాలైనా వారి ఖాతాలో పడడం లేదు. ఉద్యోగుల జిపిఎఫ్ ఖాతాలో డబ్బులేక వారికి రుణ సౌకర్యం నిలిచిపోయింది. ప్రతి నెలవారీగా ఉద్యోగులకు పెన్షనర్లకు చెల్లింపులు కష్టతరమై ప్రతి నెల 20వ తేదీ వరకు కూడా పూర్తి జీతాలు పెన్షన్లు చెల్లించలేకపోతున్నది మన ప్రభుత్వం.
ఎల్లవేళలా ఖజానా ఖాళీగా ఉండటం వల్ల చెల్లింపులు చేయడానికే
నిత్యం ఇబ్బందులతో సతమతమవుతున్నది ప్రభుత్వము.
అదనపు అప్పులు పుట్టకపోవడం వల్ల ప్రజలకు విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రభుత్వము సత్వర చర్యలు చేపట్టడానికి సాహసించడం లేదు. హైదరాబాదులో మాత్రం వరదలు సంభవించినప్పుడు జిహెచ్ఎంసి ఎన్నికలు వచ్చినందువల్ల ఇంటింటికి పదివేల రూపాయలు చొప్పున సహాయం అందించిన ప్రభుత్వం ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏర్పడిన వరదల బీభత్సానికి నష్టపోయిన లక్షలాదిమందికి ఆర్థిక సహాయం అందించ లేక పోతున్నది.కేవలం అధికారుల హడావుడితో పాటు నాయకుల పరస్పర నిందారోపణలు ప్రకటనలు గుప్పిస్తున్నారు. కానీ తక్షణ సహాయము పునరావాస కార్యక్రమాలు చేపట్ట లేకపోతున్నారు. కేవలం కేంద్రంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై నిందలు మోపుతూ ప్రకటనలు ఇస్తున్నారు. ముఖ్యంగా డొల్లబోయిన ఆర్థిక వ్యవస్థ ప్రకృతి వైపరీత్యాలను కూడా ఆదుకునే స్థితిలో లేదని పరిస్థితులే తెలియ జేస్తున్నాయి. సంపన్న రాష్ట్రంలో ప్రజలకు అన్ని సమస్యలే మిగిలిపోతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో సమాఖ్య స్ఫూర్తితో ప్రజల సమస్యలను కష్టాలను నివారించడంలో కలిసి పని చేయాలి. ప్రజలు కష్టాల్లో ఉంటే పార్టీలు, నాయకులు రాజకీయ ప్రయోజనాల కొరకై రాష్ట్ర కేంద్ర నాయకులు కేవలం కీచులాడుతున్నారు.
అప్పులు పుట్టకపోవడం వల్ల అభివృద్ధి, సంక్షేమ పథకాలు పడక వేసినట్లే భావించాల్సి వస్తున్నది. ఇంకా విచ్చలవిడిగా అప్పులు చేయడం వల్ల భావితరాల తెలంగాణ ప్రజలకు అది పేను భారంగా మారిపోతున్నది. మన రాష్ట్రం తో పాటు తమిళనాడు ఆంధ్ర ప్రదేశ్ రాజస్థాన్ పంజాబ్ రాష్ట్రాలు అదేవిధంగా కేంద్రం కూడా అప్పుల భారం పెంచుకుంటూ పోతున్నవి. అప్పులు విపరీతంగా పెరగడం వల్ల దేశములో ద్రవయోల్బణం ఏడు శాతానికి పైగా పెరిగి ప్రస్తుతం అదుపు తప్పుతున్నది. రూపాయి విలువ గత ఎనిమిది సంవత్సరాలలో 25% దిగిపోయి అధమ స్థాయికి చేరుకున్నది. భారతదేశం గాని తెలంగాణ రాష్ట్రం గాని మరో శ్రీలంక కావడం మంచిది కాదు. అందుకే రాష్ట్రాలు , కేంద్ర ప్రభుత్వము పరిమితికి మించి అప్పులు చేయడం వల్ల ఆర్థిక సంక్షోభంతో పాటు రాజకీయ అస్థిరత్వం కూడా ఏర్పడే ప్రమాదం ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనులు స్తంభించి పోవడం వల్ల దీర్ఘకాలిక అభివృద్ధి జరగక పేద ప్రజలు నిరుద్యోగులు నిరాశకు గురి అవుతున్నారు. తెలంగాణ అభివృద్ధి అంటే కేవలం నాయకులు కార్పొరేట్ సంస్థలు అభివృద్ధి చెందినట్లయితే అది బంగారు తెలంగాణ కాలేదు. బ్రతుకు తెలంగాణ గాని మిగిలిపోతున్నది. మానవాభివృద్ధికి కావలసిన విద్య, వైద్య రంగాలను గాలికి వదిలి కేవలం నాయకులకు ఆర్థిక ప్రయోజనాలు సమకూర్చే ప్రాజెక్టులు, పార్టీలకు ఓట్లు కురిపించే సంక్షేమ పథకాలను అమలు చేయడం వల్ల రాష్ట్రం ఇప్పుడే కాదు ఇంకా భవిష్యత్తులో మరింత ఆర్థిక సమస్యలతో తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేయబడే ప్రమాదం పొంచి ఉన్నది. విధానకర్తలు బాధ్యతాయుతమైన ఉన్నత స్థాయి అధికారులు ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి విధానాలను చక్కబెట్టి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో మునిగిపోకుండా కాపాడవలసిన అత్యవసర పరిస్థిరతులు ఈ రాష్ట్రంలో నెలకొన్నవని గుర్తించాలి.
-ప్రొఫెసర్ కూరపాటి వెంకట్ నారాయణ