అది వరంగల్ డిక్లరేషన్ కాదు కాంగ్రెస్ డిక్లరేషన్
ఇంద్రావతి కాలమ్
అది వరంగల్ డిక్లరేషన్ కాదు కాంగ్రెస్ డిక్లరేషన్
నిన్న( మే 6) వరంగల్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సంఘర్షణ సభ మొత్తంగా చూసినప్పుడు విజయవంతం అయ్యిందనే చెప్పవచ్చు . కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసిన విధంగానే జన సమీకరణ చేయగలిగింది . టిఆర్ఎస్ పట్ల ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత కూడా ఎక్కువ జన సమీకరణకు తోడ్పడింది . ప్రజలలో వ్యతిరేకత పెరుగుతున్నదని టీఆర్ఎస్ నాయకులకు అర్థం కావడం లేదు . ఈ సభలో వరంగల్ డిక్లరేషన్ ప్రకటించబోతున్నట్లు గా బాగా ప్రచారం చేశారు . చెప్పినట్టుగానే రేవంత్ రెడ్డి ఈ సభలో వరంగల్ డిక్లరేషన్ ను ప్రకటించాడు . ఇందులో ముఖ్యంగా రైతాంగ సమస్యలను లక్ష్యంగా చేసుకుని హామీలు ఇవ్వబడినాయి . ప్రధాన పంటలకు కనీస మద్దతు ధర , నకిలీ విత్తనాల సమస్య , రుణమాఫీ లాంటి పాత సమస్యలకు పాత పరిష్కారాలనే ప్రకటించారు . కాకపోతే డబ్బు పరిమాణం పెంచారు అంతే . ఈ డిక్లరేషన్ లో కొత్తగా చెప్పిన విషయం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ రద్దు చేస్తామని . ఈ విషయాన్ని ప్రకటిస్తున్నప్పుడు ప్రజలు సంతోషంతో చప్పట్లు కొడుతూ ఆహ్వానించారు . ధరణి పోర్టల్ వలన ప్రజలలో వ్యతిరేకత పెరుగుతున్నదనే విషయం టీఆర్ఎస్ నాయకులకు అర్థం కావడం లేదు . ధరణి పోర్టల్ తో దేశంలోనే గొప్ప పని చేశామని , ప్రపంచ దేశాల వారు పొగుడుతున్నారని గొప్పలు చెప్పుకుంటున్నారు టిఆర్ఎస్ నాయకులు . మొత్తానికి వరంగల్ డిక్లరేషన్ లో కొత్తగా చెప్పిన విషయం , పరిష్కారం ధరణి పోర్టల్ ఒకటి మాత్రమే మిగతావన్ని పాతవే . నిజానికి ఇవన్నీ ఎన్నికల హామీలు . వీటన్నింటినీ ఎన్నికల ప్రణాళికలో మేనిఫెస్టోలో చెప్పుకోవచ్చు . వీటికి వరంగల్ డిక్లరేషన్ అని ప్రత్యేకంగా పేరు పెట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ? గతంలోనే చారిత్రాత్మకమైన వరంగల్ డిక్లరేషన్ తెలంగాణ రాష్ట్ర ఆందోళన సందర్భంగా ప్రకటించబడింది . దానికి తెలంగాణ ప్రజలలో ఒక పేరు , ఒక అనుకూల భావం ఉంది , దానిని ఉపయోగించుకోవడానికి ఎన్నికల హామీలకు వరంగల్ డిక్లరేషన్ అని పేరు పెట్టారు . కానీ ఆ డిక్లరేషన్ కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ గానే చరిత్రలో మిగిలిపోతుంది . గతంలో మర్రి చెన్నారెడ్డి , ఎన్టీ రామారావు , రాజశేఖర్ రెడ్డి,కేసీఆర్ లు విప్లవ ఉద్యమాల యొక్క ప్రభావాన్ని తమ ఎన్నికల ప్రయోజనాల కొరకు ఉపయోగించుకున్నట్లుగానే రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఇండైరెక్టుగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు . అందులో భాగంగానే వరంగల్ డిక్లరేషన్ అని పేరు పెట్టడం జరిగింది .
రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎవరూ కూడా ఒక శక్తివంతమైన ఉపన్యాసం ఇవ్వలేకపోయారు . ప్రజలలో ఏర్పడుతున్న టిఆర్ఎస్ వ్యతిరేకతను కూడా ఉపయోగించుకోలేకపోవడానికి ఇది కూడా ఒక కారణమే . కాంగ్రెస్ నాయకులు అందరూ తత్తర బిత్తర ఉపన్యాసాలు ఇచ్చారు . రేవంత్ రెడ్డి మంచి ఉపన్యాసమే ఇచ్చాడు కానీ ఉపన్యాసం ప్రారంభమే జై సోనియమ్మ అంటూ బిగ్గరగా నినాదాలు ఇచ్చి మొదలు పెట్టాడు . సోనియమ్మ రాష్ట్రం , సోనియమ్మ రాజ్యం ఏర్పాటు చేస్తామని చెప్పాడు . అయితే ప్రజలు ఎవరూ స్పందించలేదు . చివరికి జై తెలంగాణ నినాదం కూడా ఇవ్వలేదు రేవంత్ రెడ్డి . జై తెలంగాణ అనేది కేవలం ఉబుసుపోక అరిచే ఒక నినాదం కాదు . అది తెలంగాణ ప్రజల ఆకాంక్ష యొక్క ప్రతిబింబం . అది తెలంగాణ ప్రజల హృదయ స్పందన , ప్రతిధ్వని . జై తెలంగాణ నినాదం తెలంగాణ ప్రజల గుర్తింపు . అందుకే బీజేపీ వాళ్లు తెలంగాణ అస్తిత్వాన్ని అంతం చేయడం కొరకు ముందు జై తెలంగాణ నినాదాన్ని క్రమంగా ప్రణాళికాబద్ధంగా అంతం చేయడానికి పూనుకున్నది . జై తెలంగాణ నినాదాన్ని జై శ్రీరామ్ అనే నినాదంతో కప్పి వేయాలని చూస్తున్నది . రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ లు కూడా కావాలనే జై తెలంగాణ అన లేదా లేక కాకతాళీయంగానే అనలేదా ? తెలంగాణ ప్రజలలో టిఆర్ఎస్ పట్ల పెరుగుతున్న వ్యతిరేకతను ఉపయోగించు కొని , ఇదే అదనుగా జై తెలంగాణ నినాదాన్ని జై సోనియమ్మ నినాదంతో రిప్లేస్ చేయాలని అనుకుంటున్నారా ? ఇలా కావాలనే జై తెలంగాణ నినాదం ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో భవిష్యత్తు కష్టమే . బిజెపి కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలు జాతీయ ప్రయోజనాల పేరిట ప్రాంతీయ , రాష్ట్రాల ప్రజల ఆకాంక్షలను వారి ప్రత్యేకతలను పట్టించుకోకపోవడం వల్లనే ప్రాంతీయ పార్టీలు పుట్టుకు వచ్చాయి . అటువంటప్పుడు రాష్ట్రాల ప్రత్యేకతలను వాటి అస్తిత్వాన్ని గుర్తించకపోతే ఆయా ప్రాంతాల ప్రజలు కూడా జాతీయ పార్టీలను పట్టించుకోరు . రేవంత్ రెడ్డి పదేపదే సోనియమ్మ నినాదం ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నుండి మాత్రమే నడపబడుతుంది అనే సంకేతాలు ఇచ్చినట్లు అయ్యింది . తెలంగాణ అస్తిత్వం కొరకు సంస్కృతి కొరకు దశాబ్దాలపాటు పోరాడిన తెలంగాణ ప్రజలు మరోసారి ఢిల్లీ పెత్తనాన్ని ఢిల్లీ నుండి అన్ని ఆదేశాలు జారీ కావడాన్ని ఆమోదించలేరు . కాంగ్రెస్ పార్టీ తన జాతీయ పార్టీ దృక్పథం నుండే , ప్రాంతీయ ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతీయ అస్తిత్వాన్ని గుర్తించినప్పుడే తెలంగాణ లాంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోగలదు .
నిజానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల కంటే రాహుల్ గాంధీ మంచి ఉపన్యాసం ఇచ్చాడు . రాహుల్ ఉపన్యాసం సందర్భంగా ప్రజలు చాలా సార్లు చప్పట్లు కొడుతూ సంతోషం వ్యక్తం చేశారు . మొత్తానికి రాహుల్ పరిణితి గల ఉపన్యాసం ఇచ్చాడు . తెలంగాణ కాంగ్రెస్ నాయకుల లాగ తెలంగాణను మేమే ఇచ్చామని చెప్పలేదు . తెలంగాణ రాష్ట్రం కొరకు మీరు పోరాటం చేసారు మీతో పాటు మేము ఉన్నాము . అంతిమంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం అని తెలిసినా సోనియాగాంధీ తెలంగాణను ఇచ్చింది అని చెప్పాడు . ఈ విషయం చెప్పినప్పుడు కూడా ప్రజలు చప్పట్లు కొడుతూ స్పందించారు . నిజంగా సోనియా గాంధీ మీద గౌరవభావమో అభిమానమో పెరగాలంటే తెలంగాణ సాధనలో ఆమె పాత్ర ఏమిటో చెప్పడం ద్వారానే సాధ్యమవుతుంది . ఊరికే సోనియమ్మ అని నినాదాలు ఇవ్వడం ద్వారా ఊడిపడేది ఏమీ ఉండదు . ఇంకా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడుతుంది అనుకున్నాము కానీ ఒక నియంతృత్వ ప్రభుత్వం ఏర్పడింది అన్నాడు . టీఆర్ఎస్ ను కాంగ్రెస్ పార్టీలో కలుపుతామని కలపకుండా కేసీఆర్ మోసం చేశాడని కానీ లేక మేమే అధికారంలోకి వచ్చేది కెసిఆర్ మోసం చేయడం వల్లనే మేము అధికారంలోకి రాలేదని కానీ అనలేదు . ప్రశాంత్ కిశోర్ కారణంగా తెలంగాణలో టిఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మధ్య పొత్తు ఏర్పడే అవకాశం ఉన్నదని జోరుగా ప్రచారం అయ్యింది . ఈ ప్రచారం వలన కాంగ్రెస్ పార్టీ నాయకుల లో భ్రమలు , అపోహలు ఏర్పడినాయి . పొత్తు వలన ఎవరికి టికెట్ వస్తుందో , ఎవరికి పోతుందో తెలియని స్థితిలో కాంగ్రెస్ స్థానిక నాయకత్వం దృఢంగా పనిచేయలేదు . దీన్ని బద్దలు కొట్టడానికే రాహుల్ , టిఆర్ఎస్ కు కాంగ్రెస్ కి మధ్య ఎట్టిపరిస్థితులలోనూ పొత్తు ఉండదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పాడు . అసలు టిఆర్ఎస్ కు బిజెపికి మధ్యనే పొత్తుకు అవకాశం ఉన్నదని తర్కబద్ధంగా చెప్పాడు . బీజేపీకి తెలంగాణలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు . సైద్ధాంతికంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు . అందుకే బీజేపీ ఢిల్లీ నుండి రిమోట్ కంట్రోల్ తో టిఆర్ఎస్ ప్రభుత్వం ను నడపాలని చూస్తున్నదని చెప్పాడు . ఈ డి , ఐ టి , సి బి ఐ , లు కెసిఆర్ ఇంటి పైన దాడి చేయకపోవడమే ఇందుకు సాక్ష్యం అంటూ సభికులను ఆలోచించే విధంగా చెప్పాడు . వాస్తవంలో కూడా బండి సంజయ్ లాంటివాళ్ళు పదేపదే కేసీఆర్ ను జైలుకు పంపుతామని , మా దగ్గర అవినీతి ఆరోపణల సాక్ష్యాలు ఉన్నాయి అని ఎన్ని సార్లు చెప్పినా , కేసీఆర్ పైన ఎటువంటి విచారణకు కేంద్రం పూనుకోలేదు . రాహుల్ గాంధీ మరో ముఖ్యమైన ప్రకటన క్యాడర్లో విశ్వాసం కల్పించే విధంగా చెప్పాడు . అసలే అవిశ్వాసం అనుమానాలతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీకి అది అవసరం .ప్రజలలో ఉన్న వారికి , ప్రజలలో పనిచేసే వారికి మాత్రమే టికెట్లు ఇస్తామని దృఢంగానూ నమ్మే విధంగానూ చెప్పాడు . ఇదే విషయాన్ని తిరిగి గాంధీభవన్లో కూడా రాహుల్ గాంధి చెప్పాడు .
మొత్తంగా జనసమీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ విజయవంతం అయ్యింది . తెలంగాణాలో బిజెపి ది మూడవ స్థానం లేదా నాల్గవ స్థానం మాత్రమే అని కాంగ్రెసు చూపించింది . తెలంగాణ ప్రజల మరియు మీడియా దృష్టిని ఆకర్షించ గలిగింది . ఈ సభలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ కార్యకర్తల లో విశ్వాసం కలిగేలా ఉత్సాహపూరిత ఉపన్యాసం ఇచ్చాడు . అయితే ఈ సభ విజయవంతం కావడానికి మొత్తం కాంగ్రెస్సే కారణం కాదు . టిఆర్ఎస్ మీద పెరుగుతున్న వ్యతిరేకత కూడా కారణం .
టిఆర్ఎస్ మీద వ్యతిరేకత తో కాంగ్రెస్ కు పెరుగుతున్న జనసమర్ధన ఇది . అయితే దీన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా ఉపయోగించుకునే స్థితిలో ఉందా అనేది అసలు ప్రశ్న . పరిస్థితులు అనుకూలంగా ఉన్నంత మాత్రాన దానికదే విజయం లభించదు . కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల మనోభావాలను ప్రయోజనాలు సరిగ్గా గుర్తించి దాని కనుగుణమైన కార్యక్రమం తీసుకున్నప్పుడు మాత్రమే విజయం కాంగ్రెసును వరించగలదు . అందుకు కాంగ్రెస్ పార్టీ ఇంకా చాలానే కసరత్తు చేయాల్సి ఉంటుంది .
-లంకా పాపిరెడ్డి