ఒక్కడుగు వెనక్కు రెండడుగులు ముందుకా!?
ఒక్కడుగు వెనక్కు
రెండడుగులు ముందుకా!?
– అధికార పార్టీ కొత్త ఎత్తుగడ
– పూలింగ్‌లో భారీ మతలబు
– హోల్డింగ్‌లో లాండ్ పూలింగ్
– నిరసనలతో ‘కుడా’ వెనుకంజ
– రైతన్న మెడపై వేలాడుతోన్న కత్తి
(ప్రత్యేక ప్రతినిధి): వరంగల్‌లో ప్రకంపనలు సృష్టిస్తూ, ప్రభుత్వాన్ని భయపెట్టిన రైతుల ఆందోళనలతో కుడా తాత్కాలికంగా దిగివచ్చింది. లాండ్ పూలింగ్ విషయంలో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) తాత్కాలికంగా వెనుకంజ వేసింది. ఇదంతా త్కాలికమేనని స్పష్టమవుతోంది. రైతుల్లో చిచ్చుపెడుతున్న రాజకీయ కుట్రలను ఎదుర్కొని రానున్న రోజుల్లో ఇదే రైతులను ఒప్పించి, మెప్పించి లాండ్ పూలింగ్ చేపడుతామంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అంటే అగ్గిరాజుకుంటున్న రైతుల ఉద్యమం పై నీళ్ళుజల్లి, రానున్న రోజుల్లో అధికార పార్టీకి ఇది మరింత ఇబ్బందిగా మారి ఓట్ల రాజకీయంలో తమ ఆధిపత్యానికి గండికొట్టే ప్రమాదం ఉందని భావించిన సర్కారు తాత్కాలికంగా తమ భారీ ప్రణాళికను కోల్డ్‌స్టోరేజీలో పెట్టింది. ఏది ఏమైనా రైతులను మభ్యపెట్టేందుకు మరో నాటకానికి తెరతీసినట్లు భావించాల్సి వస్తోంది. అధికార పార్టీకి అందిన అనుంగు సమాచారం, ఇంటెలిజెన్స్ నివేదికల ఫలితంగా ఈ తాత్కాలిక వెసులుబాటును ఎంచుకున్నట్లు భావిస్తున్నారు. ఒక్కడుగు వెనక్కు వేస్తున్నారంటే రేపు పరిస్థితులు అనువుగా మారగానే రెండడుగులు ముందుకు వేసి తమ ప్రణాళికను పకడ్బంధీగా అమలు చేసేందుకు స్కెచ్వేసినట్లు అర్ధమవుతోంది.
– సర్కార్ ఎందుకు స్పందించలేదు?
లాండ్ పూలింగ్ వ్యవహారంలో రాష్ట్ర మంత్రులుగానీ, ప్రభుత్వంగానీ స్పందించకుండా కుడా పేరుతో ప్రకటన జారీ చేయడంలో ప్రత్యేక వ్యూహం దాగి ఉందంటున్నారు. ఎందుకంటే కుడా లాండ్ పూలింగ్ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించకుండా హోల్డ్‌లో పెట్టినట్లు ప్రకటించడంలోనే మతలబుంది. ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే ఈ వారం రోజుల వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తోన్న ఇద్దరు ‘ముఖ్య’ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులు జిల్లాలో పర్యటించారు. రైతుల నిరసన సెగ వారు రుచిచూశారు. వీరెవరూ స్పందించకుండా తాత్కాలికంగా కుడాను పావుగా చేసి కాలం కలిసొచ్చిన తర్వాత రైతుల నెత్తిన చెయ్యిపెట్టాలని భావిస్తున్నారు.
– పూలింగుకు సర్కారు మొగ్గు
ప్రభుత్వం రైతుల నుంచి భూములు తీసుకోవాలంటే చట్టబద్దంగా భూమిని సేకరించేందుకు అవకాశం ఉండగా దొడ్డిదారిలో పూలింగ్‌కు సిద్దం కావడంలోనే పెద్ద మతలబుందనేది నిపుణుల విమర్శ. రైతుల్లో ఆశలు పెంచి వారిని మభ్యపెట్టడం దుర్మార్గమంటున్నారు. పైగా రైతుల పట్ల, వారి సంక్షేమం తమ ప్రభుత్వానికి ఎంతో ప్రేమ, చిత్తశుద్ది ఉన్నదంటూ మాటలతో మాయచేసేందుకు యత్నిస్తున్నారు. పొరుగు రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు రాజధాని నిర్మాణం పేరుతో అమలు చేసిన పూలింగ్ను జగన్ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకించడం గమనార్హం. అక్కడ ఫెయిల్యూర్ అయిన పూలింగ్ను వరంగల్‌లో ప్రయోగాత్మకంగా చేపట్టేందుకు ప్రయత్నించడం విశేషం.
– భారీ ప్రణాళికకు తాత్కాలిక విరమణ
గతంలో ఎన్నడూ లేని విధంగా మూడు జిల్లాలైన వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లోని 11 మండలాల పరిధిలోని 27 గ్రామాల్లో సుమారు 22వేల ఎకరాల రైతుల భూమిని పూలింగ్ చేసేందుకు భారీ ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఏడాది కాలంగా ప్రభుత్వమే తెరవెనుక ఉంటూ ఈ భూ నాటకాన్ని కొనసాగించింది. సర్కార్ పథకం, కుడా ప్రణాళిక రంగూ, రూపు ఇటీవల బహిర్గతమై రైతుల్లో ఆందోళన పెరిగి క్రమంగా అది నిరసనలు, ఆందోళన స్థాయికి చేరుకున్నది. ఈ స్థితిలో లాండ్ మైన్ తమ పార్టీ బలాన్ని దెబ్బతీస్తోందనే నిఘా వర్గాల నివేదిక మేరకు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు భావిస్తున్నారు.
ఎందుకంటే పైకి కుడా లాండ్ పూలింగ్నునిలిపివేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నట్లు చెబుతున్నప్పటికీ తాను విడుదల చేసిన ప్రకటనలో తాత్కాలిక వెనుకంజ అంటూ స్పష్టం చేశారు. అంటే పెద్ద మొత్తం చేపట్టిన లాండ్ పూలింగ్ వెనుక అధికార పార్టీకి చెందిన పెద్దలు, ప్రజాప్రతినిధుల లాభనష్టాలున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇంత పెద్ద ఆర్ధిక వనరును అంత సులభంగా వదులుకునేందుకు మనసురాక తాత్కాలిక వెసులుబాటును ఎంచుకున్నట్లు చెప్పవచ్చు.
– రైతు మెడపై వేలాడుతోన్న పూలింగ్ కత్తి
రానున్న కాలంలో ఈ లాండ్ పూలింగ్ అత్యంత జాగ్రత్తగా చేపట్టే ప్రమాదం ఉంది. అంటే పూలింగ్ కత్తి రైతు మెడపైన వేలాడుతూనే ఉంది. తాత్కాలికంగా రాజకీయ పక్షాల జోక్యం, రైతుల్లో పెల్లుబుకుతున్న నిరసనలను పెద్దవిగా మారక ముందే వెనక్కుతగ్గింది. అయితే ఈ పూలింగ్ను వదిలిపెట్టాలని సర్కారు మనుసులో, కుడా ఆలోచనల్లో లేదని అర్ధమవుతోంది.
– ప్రలోభాల పథకానికి పూర్వ ప్రణాళిక
భవిష్యత్తులో రైతుల్లో కొందరిని రకరకలా ప్రలోభాలుపెట్టి వారి మధ్య నెలకొన్న ఐక్యతకు చిచ్చుపెట్టాలనేది ఎత్తుగా భావిస్తున్నారు. విభజించు పాలించు నీతితో తమ పాచికను అమలు చేసే యోచన ఉన్నట్లు అనుమానం కలుగుతోంది. అధికార పార్టీగా తమకు ఉన్న అండదండలు, అధికారుల సహకారం, అర్ధిక, నాయకులు, కార్యకర్తల బలాన్ని వినియోగించుకుని సెంటిమెంట్లు, వ్యక్తిగత ప్రయోజనాలు కల్పించి రైతులు ఏకంకాకుండా చాపకింద నీరులా తమ ప్రయత్నాలు చేపట్టి ఒక్కో మెట్టేక్కి పూలింగ్ను పూర్తి చేయాలని యోచిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. భారీ స్థాయిలో 22వేల ఎకరాలను దశలవారీగా చేపట్టి కొందరు రైతులను లొంగదీసుకుని తమ కుట్రను అమలు చేసే అవకాశాలున్నాయి.
– ఇప్పటికే బినామీ చేతుల్లో లాండ్
లాండ్ పూలింగ్‌కు ముందే కొందరు బడా బాబుల చేతుల్లోకి వేల ఎకరాలు చేరాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ బడా బాబులు, బినామీ వ్యక్తులు ఈ పూలింగ్‌లో ప్రకటించిన సర్వేనెంబర్లలో ఈ దొంగల చేతుల్లో ఉన్న భూ వివరాలు లేనట్లు రైతులు ఆరోపిస్తున్నారు. తమ భూమిని లాండ్ పూలింగ్‌లో చేర్చి మీ భూమెందుకు ఇందులో లేదని ప్రశ్నిస్తున్నారు. తెరవెనుక జరిగిన భాగోతంలో స్థానిక అధికార పార్టీ పెద్దల హస్తం, వివిధ రాజకీ పక్షాల నేతలున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
– లాండ్ పూలింగ్ను నిలిపివేస్తున్నాం:
––– సుందర్ రాజు, కూడా చైర్మన్
కుడా ఆధ్వర్యంలో ఇటీవల వరంగల్ హానుమకొండ జిల్లాల పరిధిలో చేపట్టిన ల్యాండ్ పూలింగ్ను నిలిపివేస్తున్నామని సంస్థ చైర్మన్ సుందర్ రాజు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. గతవారం రోజుల నుండి గ్రామాల్లో రైతులు చేస్తున్న ధర్నాలను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. స్థానిక ఎమ్మెల్యేలను కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం. సీఎం కేసీఆర్ రైతులకు ఈగ కూడా వాలనివ్వద్దనే పట్టుదలతో సీఎం కేసీఆర్ ఉన్నారు. సీఎంగా కేసీఆర్ ఉన్నంత వరకు రైతుల కన్నీళ్లు పెట్టనివ్వరు. ఔటర్ రింగ్ రోడ్డు కు అనేక మంది రైతులు సహకరిస్తున్నా వారిని కొంతమంది తప్పుదోవ పట్టించారు.కాగా ల్యాండ్ పూలింగ్ ను హోల్డింగ్ లో పెడుతున్నామని కూడా వైస్ చైర్మన్ ప్రావిన్య ప్రకటించడం గమనార్హం.రైతులను ఒప్పించి మెప్పించిన తర్వాతనే పూలింగ్ ప్రక్రియ చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. అయితే ఛైర్మన్ హామీకి వైస్ చైర్మన్ ప్రకటన భిన్నంగా ఉండడం గమనించ దగ్గ విషయం.