పర్యటనకు ముందు రోజు అనుకోని మలుపులు సిరికొండ మధుసూదనాచారి వర్సెస్ గండ్ర రమణారెడ్డి వర్గం సమయం కోసం వేచి చూస్తున్న నాయకులు
భూపాలపల్లి, వేకువవార్త: జయశంకర్ జిల్లా కేంద్రమైన భూపాలపల్లి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖరారైన రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన అకస్మాత్తుగా రద్దైన కారణాలు ఆసక్తిని రేపుతున్నాయి. కేటీర్ పర్యటన ముందు రోజు నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి , ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి వర్గాల మధ్య జరిగిన ఘర్షణల ఫలితంగానే కేటీఆర్ టూర్ క్యాన్సిల్ అయినట్లు భూపాలపల్లి పట్టణంలో చర్చ జరుగుతుంది. పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం వస్తున్న కేటీఆర్ కార్యక్రమాలలో వర్గపోరు జరిగితే అది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరిగే ప్రమాదం ఉందని గ్రహించిన టీఆర్ఎస్ అధినేత ఆ పర్యటనను రద్ధు చేయించినట్లు ప్రచారం జరుగుతుంది. అసలేం జరిగింది... జిల్లా కేంద్రమైన భూపాలపల్లి పట్టణంలో గండ్ర రమణారెడ్డి వర్గం నాయకులు కేటీఆర్ పర్యటనను దృష్టిలో పెట్టుకుని ఫ్లెక్సీలు కట్టేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందులో బాగంగా పట్టణంలో ఉన్న అన్ని హోర్డింగ్లను గండ్ర వర్గం నాయకులు ఎంచుకున్నారు. సిరికొండ మధుసూదనాచారి పరాజయం పాలయ్యాక ఆయనను నమ్ముకుని ఆయన వెంట తిరిగే నాయకులు మధుసూదనాచారి ఫోటోలతో కూడిన హోర్డింగ్స్, ఫ్లెక్సీలు ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే వర్గానికి ప్రధాన కూడళ్లలో తమ నాయకుడి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు తగిన ప్రాధాన్యత లభించదేమోనని ఆందోళనకు గురై సిరికొండ వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను రాత్రికి రాత్రి పీకివేసినట్లు తెలిసింది. అంతే కాకుండా సిరికొండ వర్గ కార్యకర్తలకు ప్రస్తుత ఎమ్మెల్యే వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు ఫోన్లు చేసి మీ నాయకుడి ఫోటోలతోటి అదనంగా ఫ్లెక్సీలు కట్టొద్దని బెదిరించడంతో సమస్య మొదలైంది. ఈ విషయం చిలికి గాలివానగా మారుతుందేమో అని గ్రహించిన ప్రభుత్వ పెద్దలకు పోలీస్ ఇంటలిజెన్స్ అధికారులు సమచారం చేరవేశారు. దీంతో కేటీఆర్ పర్యటన రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఇదే సమయంలో భూపాలపల్లి మండలం దీక్షకుంటలో ఓ కార్యకర్త తండ్రి మృతి వార్త తెలియడంతో కేటీఆర్ పర్యటన రద్దైన తెల్లవారి ఎమ్మెల్సీగా ఎన్నికై మొదటిసారి వస్తుండడంతో పెద్ద కాన్వాయితో అటవీ ప్రాంతమైనప్పటికి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించి తనను నమ్ముకున్న కార్యకర్తలలో నూతన ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్బంగా భూపాలపల్లి పట్టణం నుంచి వెళ్లిన కార్యకర్తలు కలిసి ముందు రోజు జరిగిన పరిణామాలన్నీ చెప్పేందుకు ప్రయత్నించగా అటువంటి విషయాలన్నీ నా వద్ద చెప్పవద్దని కార్యకర్తలను ఆదేశించారు వర్గ పోరులో తగ్గేదేలే... భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలరీత్యా అధికార పార్టీ టీఆర్ఎస్లోకి మారారు. అప్పటి వరకు నియోజకవర్గంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు అభ్యర్థిగా ఉన్న సిరికొండ మధుసూదనాచారి అపజయం పాలు కావడం.. కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లోకి వచ్చిన ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి వర్గంతో అప్పటికే నిప్పు ఉప్పు అన్నట్లుగా ఉన్నవారు కలిసిపోవడానికి పెద్దగా పరిస్థితులు అనుకూలించలేదు. అయినప్పటికి కొంతమంది నాయకులు మాత్రం సిరికొండను వదలిపెట్టి గండ్ర ఇలాకాలో సీట్లు పదిలం చేసుకున్నారు. మరికొంతమంది మాత్రం సిరికొండకు రాష్ట్రంలో ఏదో ఒక పదవి వస్తుందని అప్పటివరకు ఓపిక పడతామంటూ మధుసూదనాచారి కోసమే పనిచేస్తామన్నట్లుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సిరికొండ మధుసూదనాచారి ఎమ్మెల్సీగా నామినేట్ కావడంతో ఆయన వర్గం నాయకులు, కార్యకర్తల్లో మళ్లీ హుషారు పెరిగింది. ఇప్పటి వరకు వర్గపోరు పెద్దగా లేని భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే రమణారెడ్డి–ఎమ్మెల్సీ మధుసూదనాచారి కార్యకర్తల మధ్య వర్గ పోరు మరింతగా పెరిగే అవకాశం ఉంది.