కంచె మేస్తున్న కాంగ్రెస్!
ముందరి కాళ్లకు ‘బంధాలు’
ప్రత్యర్థి చేతికి ఆయుధాలు
పన్నిన ఉచ్చులో విలవిల
ప్రజల్లో తగ్గుతున్న ప్రతిష్ట
వేకువ ప్రత్యేక ప్రతినిధి: ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల కల నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ నూతన తెలంగాణ రాష్ట్రంలో అత్తెసరు బలంతో ఏటికి ఎదురీదుతున్నది. రెండు పర్యాయాలు అధికారం దూరమై ఆశనిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నది. వందేళ్ళకు పైగా చరిత్ర కలిగి, ప్రత్యేక గుర్తింపు పొందినప్పటికీ ప్రస్తుతం రాష్ట్రంలో కంచె చేను మేసిన తీరుగా ఆ పార్టీ పరిస్థితి మారిపోయింది. ప్రత్యర్థి పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ ఎత్తుగడల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నది. ప్రధానంగా అధికార టీఆర్ఎస్ పార్టీ చేతిలో కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ‘పావులు’గా మారుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలను పక్కనపెడితే పార్టీలో అంతర్గత కుమ్ములాటలే పూర్తి శాపంగా పరిణమించాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
2014కు ముందు సమైక్య రాష్ట్రంలో అధికారంలో ఉండి తెలంగాణ ఇచ్చినప్పటికీ నూతన రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకోలేక టీఆర్ఎస్కు రాష్ట్రాన్ని అప్పగించింది. రెండు పర్యాయాలు అధికారానికి దూరమైన ఇంకా ఆ పార్టీ తీరులో మార్పురాకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు ప్రత్యామ్నాయాన్ని , భరోసాను అందించడంలో విఫలమైతున్నది. కనీసం ఆ పార్టీ నేతల మధ్య ఐక్యత సాధించలేకపోవడం శాపంగా మారుతున్నది.
కాంగ్రెస్ నేతల్లో కానరాని మార్పు
ఎనిమిదేళ్ళుగా కేంద్రంలో, రాష్ట్రంలో అధికారానికి దూరమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకుల్లో ఇంకా ‘పాత’ ఆధిపత్య, అహంకార ధోరణి మారకపోవడంతో ప్రజల్లో రానురాను చులకనవుతున్నారు. జానారెడ్డి, రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి, హన్మంతరావు, జగ్గారెడ్డి, భట్టి విక్రమార్క, పొన్నాల ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారు. గ్రూపు విభేదాలు తమ పార్టీకి అదనపు అందమంటూ....అదేదో గొప్పగా చెప్పుకతిరిగే కాలం ఇప్పుడు లేదనే విషయాన్ని ఇంకా గుర్తించకపోవడంతో అప్పుడప్పుడు ఈ నాయకుల తీరు నవ్వులపాలవుతున్నది. అంతర్గత విభేదాలను పరిష్కరించుకుని ప్రత్యర్థి టీఆర్ఎస్ను ఐక్యంగా ఎదుర్కోవాల్సిన పార్టీ ప్రధాన నాయకత్వంలో పొడచూపుతున్న విభేదాలు ఎజెండాగా మారుతున్నాయి. ఆ పార్టీని నమ్ముకున్న ద్వితీయ శ్రేణి నాయకులు, కేడర్‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. రానురాను ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా పట్టించుకోకుంటే రానున్న రోజుల్లో ఆ పార్టీకి ఆత్మహత్యాసదృశ్యంగా మారనున్నది.
కాంగ్రెస్‌లో కాకలుతీరిన నేతలు సైతం సమయం, సందర్భం, పార్టీ లాభ, నష్టాలు బేరీజు వేసుకోకుండా తమ వ్యక్తిగత ప్రయోజనంతో అహంభావం ప్రదర్శించడం వల్ల కోరి ఆపదలు కొని తెచ్చుకుంటున్నారు. ఇదే అదునుగా నాయకుల తీరును అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు అవహేళన చేస్తున్నారు. ఇలాంటి వరుస సంఘటనలు జరుగుతున్నా కాసింత గుణపాఠం తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు.
గులాబీ ఎత్తులకు కాంగ్రెస్ చిత్తు
కాంగ్రెస్‌లో జరిగే పరిణామాలన్నీ పరిశీలిస్తున్న ప్రజలు, రాజకీయ పరిశీలకులు విస్తుపోతున్నారు. కోల్పోయిన అధికారాన్ని దక్కించుకుని, చేజారిన ప్రతిష్టను, పరువును నిలబెట్టుకునేందుకు, రాష్ట్రంలో ప్రజలకు అన్నింటా అండగా నిలవాల్సిన ప్రధానప్రతిపక్ష మైన కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వేస్తున్న ఎత్తలకు చిత్తైతున్నాయి. కాంగ్రెస్‌లో నేతలు తన్నుకుంటుంటే ప్రజల్లో పలచన చేసే కార్యక్రమాన్ని టీఆర్ఎస్, బీజేపీలు అప్రతిహతంగా కొనసాగిస్తున్నాయి. రెండు పక్షాలు కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని బలహీన పరిచే ప్రయత్నాల్లో సఫలమవుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ను నామరూపాలు లేకుండా చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఒక్కోసారి కలిసిపోయి, ఇంకొన్ని సమయాల్లో వేర్వేరుగా రెండు పక్షాల నాయకులు పనిచేస్తున్నారనేది బహిరంగ సత్యం. అయినా కాంగ్రెస్ నాయకులు అప్రమత్తంగా వ్యవహరించకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జగ్గారెడ్డి పేల్చిన ‘తటస్థ’ లేఖ
కాంగ్రెస్‌లోని ప్రధాన నాయకులైన రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి మధ్య ఇటీవల ఐక్యతా రాగం కనబడగానే సంగారెడ్డి ఎమ్మెల్యే, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రూపంలో బాంబు పేలింది. జగ్గారెడ్డి తన ఆత్మగౌరవ సమస్యను ముందుకు తెచ్చారు. కోవర్టుగా తన పై ముద్రవేస్తున్నారంటూ వ్యక్తిగత ప్రతిష్టను కాపాడుకునేందుకు కాంగ్రెస్‌కు దూరమైతున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఒక వైపు బుజ్జగింపుల పర్వం సాగుతుండగా లేఖ లీకైంది. ప్రస్తుతానికి తాను ఏ పార్టీలో చేరడంలేదని ప్రకటించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి లక్ష్యంగా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించనున్నట్లు చెప్పకుండానే చెప్పారు. ఈ వ్యవహారం మరోసారి కాంగ్రెస్‌లో ఏ మేరకు ప్రభావం చూపుతుందనేదానికంటే పార్టీ శ్రేణుల్లో విశ్వాసాన్ని సన్నగిల్లచేస్తుందనడంలో సందేహం లేదు. ఇదిలా ఉండగా జగ్గారెడ్డి తటస్థవైఖరిలో దాగిన మర్మమేమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏదోవిధంగా ప్రజలకు కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా కనబడకుండా చేయాలనే ప్రత్యర్ధి పార్టీల లక్ష్యం ఎప్పటికప్పుడు నెరవేరినట్లేనని భావిస్తున్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి సంఘటనలు ఏ పరిణామాలకు దోహదం చేస్తుందోననే చర్చ మరోసారి ప్రారంభమైంది.