మైదానాలు ఉప్పొంగే రాత్రులు!
మైదానాలు ఉప్పొంగే రాత్రులు!
మానవ చరిత్ర ఎప్పుడూ నిశ్చలంగా ఉండదు. స్వార్థం పెరిగిపోయిందని, "కేరీరిజం" వ్యామోహంలో యువత మునిగిపోయిందని, వాట్సాప్ స్క్రీన్‌లు, పబ్జీ (PUBG) గేమ్స్, ఎంజాయ్‌మెంట్‌ల మత్తులో ఉన్న నేటి తరం ఏ సామాజిక అంశంపైనా స్పందించదనేది నిస్సందేహంగా ఒక భ్రమ అని నేటి జెన్ జీ (Gen Z) ఉద్యమంతో తేలిపోతోంది.
జీవన స్థితిగతులు మెరుగుపరుచుకోవడం కోసం, దోపిడీ నుంచి విముక్తి కోసం, అన్నిటినీ మించి న్యాయసాధన కోసం అనాదిగా ప్రజానీకం పోరాడుతూనే వస్తున్నారు. అవి బానిస తిరుగుబాటులు అయినా, భూస్వామ్య వ్యతిరేక రైతాంగ పోరాటాలు అయినా... పాలకులకు వ్యతిరేకంగా సాగిన పాలితుల పోరాటాలు, ప్రభుత్వాలపై ప్రజల తిరుగుబాటులూ ఇవన్నీ పరిణామక్రమంలో భాగంగానే సాగుతూ వస్తున్నాయి.
పాలకులు, సమాజంలోని పెద్దలు ఏ తరాన్నైతే అచేతనంగా చేశామనుకున్నారో... అదే తరం తిరుగుబాటు రణభేరి మోగించి చరిత్ర రథచక్రాన్ని మలుపు తిప్పుతుంది.పాలకులు ప్రజల ఆకాంక్షలను గౌరవించకుండా ఎలాగైనా అణచివేయాలని దమనకాండకు దిగినప్పుడల్లా ఆగ్రహోదగ్రులై ప్రజలు తిరగబడుతూ, ఎదిరిస్తూ పోరాడుతూనే వస్తున్నారు. ప్రజా పోరాటాల వల్ల స్వేచ్ఛా స్వాతంత్ర్య లక్ష్యాల ముందు నిరంకుశత్వం, నియంతృత్వం తలవంచుతూ వచ్చాయి – ఇవన్నీ చరిత్ర చెప్పిన సత్యాలు. మౌలిక పౌరహక్కులనే నిరాకరించిన మొదటి చార్లెస్ తల ఎగరలేదా..? లూయి చక్రవర్తితో రాజరికమే అంతమయింది. 1789 ఫ్రెంచి విప్లవం యావత్తు యూరప్‌ను కదిలించివేయలేదా?
చారిత్రక పరిణామక్రమంలో ఫ్రెంచి విప్లవం నుంచి తెలంగాణ పోరాటం, నక్సల్బరీ పోరాటాల సాలు నుంచి నేటి ప్రపంచ రాజకీయాల వరకు ఇదే సత్యం నిరూపితమైంది. ఈ రోజు మన కళ్లముందు సాగుతున్న "జెన్ జీ (Gen Z) ఉద్యమం", "కాకరోచ్ (Cockroach) ప్రతిఘటన", మరియు విద్యావ్యవస్థల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా *"ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్"*తో చెలరేగిన దేశవ్యాప్త విద్యార్థి తుఫానులు అందుకు సజీవ సాక్ష్యాలు!
1. స్క్రీన్‌ల నుంచి వీధుల దాకా: "జెన్ జీ" అవతరణ!
ఈ తరం యువత కేవలం 'లైక్‌లు', 'షేర్‌ల'కే పరిమితం కాలేదు. డిజిటల్ యుగంలో పెరిగిన వీరు తమ హక్కుల పట్ల, భవిష్యత్తు పట్ల ఎంతో స్పష్టతతో ఉన్నారు.
అణచివేతకు అడ్డుకట్ట: సోషల్ మీడియాను కేవలం వినోదానికే కాక, పాలకుల అణచివేతను, లోపాలను ఎండగట్టే డిజిటల్ ఆయుధంగా మలుచుకున్నారు.
మౌనాన్ని బద్దలు కొట్టిన తరమది: "మాకేంటిలే" అని నిశ్శబ్దంగా ఉండిపోయే తరం కాదు ఇది; ప్రభుత్వం ఎక్కడ తప్పు చేసినా ప్రశ్నించే నైతిక బలాన్ని, ఐక్యతను చాటుతోంది.
2. 'కాకరోచ్ పోరాట పటిమ' & దేశవ్యాప్త విద్యార్థి ఉద్యమం
ప్రజాస్వామికమైన డిమాండ్ పోరాడేవాళ్ల సంఖ్య బలన్నీ, నైతిక బలాన్ని పెంచుతుందనే నమూనా లాంటిది ఈనాటి యువత ప్రతిఘటన. ఎంతటి అణచివేత ఎదురైనా, ఎన్ని రకాల నిర్బంధాలు ఎదురైనా... నలిగిపోకుండా మళ్లీ మళ్లీ ఉద్భవించే శక్తి ఈ తరానికి ఉంది.
NEET అక్రమాలు & ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తుఫాన్:
ఇటీవల విద్యా వ్యవస్థలో జరిగిన నెట్/నీట్ (NEET/NET) అవకతవకలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు లక్షలాది మంది విద్యార్థుల కష్టాన్ని, భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసినప్పుడు ఈ తరం ఊరుకోలేదు.
ధర్మేంద్ర ప్రధాన్ (కేంద్ర విద్యాశాఖ మంత్రి) రాజీనామా డిమాండ్: ఢిల్లీ వీధుల నుండి మొదలై దేశమంతటా పాకిన ఈ ఆందోళన కేవలం ఒక మంత్రి పదవికి వ్యతిరేకంగా సాగింది కాదు. ఇది విద్యావ్యవస్థలోని అక్రమాలపై జరిపిన సింహగర్జన!
జెన్ జీ, మిలీనియల్స్, ఆల్ఫా జనరేషన్ ఐక్యత: నిరసనలు తెలపడం మాకేమీ చేతకాదు అనుకున్న పాలకులకు, ఈ తరం గజ్జెకట్టి వీధిపోరాటాలకు దిగి తమ సత్తా ఏంటో చూపిస్తున్నది.
3. తరతరాల పోరాట స్పూర్తి – నూతన మానవ విలువల వికసనంతోనే ప్రజాస్వామ్య బలం
"చట్ట సభలు, పార్లమెంట్లు బాతాఖానీ క్లబ్బులు" అని తేలినప్పుడు, న్యాయం చట్టసభల్లో దొరకనప్పుడు, వీధులే న్యాయస్థానాలుగా మారతాయని చరిత్ర నిరూపించింది.
మైదానం మండుతోంది... మార్పు తథ్యం: నాడు తెలంగాణ సాయుధ పోరాటంలో అడవి ఉప్పొంగినట్లే, నేడు నగరాల నడుమ, ఇంటర్నెట్ నాడుల్లో విద్యార్థి లోకం మైదానంలో సమర శంఖం పూరిస్తోంది. "చరిత్ర నిర్మాణంలో ప్రజలే నాయకులు, యువతే దానికి చోదక శక్తి!"
4. భవిష్యత్తు : నిరసన నుంచి సమగ్ర సామాజిక మార్పు వైపు!
ఈ రోజు చెలరేగుతున్న ఉద్యమం లేదా నిరసన అనేది కేవలం నీట్ (NEET) పరీక్షల అవకతవకలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, రీ-ఎగ్జామ్స్ నిర్వహణ లేదా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వంటి ఒక నిర్దిష్ట ఘటనకో, తాత్కాలిక సమస్యనో పరిమితమైపోకూడదు. అది కేవలం ఒక ప్రారంభం మాత్రమే!
నేడు పోరాడుతున్న జెన్ జి యువత సాధించాల్సినది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పూర్తికాదు. రేపటి సమాజంలో ఏ రూపంలో అన్యాయం ఎదురైనా, ఏ రూపంలో అసమానతలు పడగవిప్పినా గొంతు విప్పి ప్రశ్నించినప్పుడే యువత యొక్క నైతిక బాధ్యత, కర్తవ్యం పరిపూర్ణమవుతాయి.
ఎప్పుడైతే విద్యార్థి లోకం, యువత సమకాలీన సామాజిక, ఆర్థిక, రాజకీయ రుగ్మతలపై కూడా అదే స్థాయిలో ప్రతిఘటనను చూపుతారో...
అప్పుడే నేటి తరంపై ఉన్న "స్వార్థపరులు, కేరీరిస్టులు" అనే ముద్రలు, నిందలు శాశ్వతంగా తొలగిపోతాయి.
అప్పుడే ఈ దేశ భవిష్యత్తుకు, యువశక్తికి నిజమైన సార్థకత చేకూరుతుంది.
"న్యాయం కోసం.. విముక్తి కోసం.. సమానత్వం కోసం జరిగే పోరాటాలకు వయసుతో నిమిత్తం లేదు!"
– బండి దుర్గాప్రసాద్
(సామాజిక రాజకీయ విశ్లేషకులు)
7981184205