కాళేశ్వరం సంక్షోభం: అబద్ధాల లెక్కలు – అథారిటీ వాస్తవాలు

కాళేశ్వరం సంక్షోభం: అబద్ధాల లెక్కలు – అథారిటీ వాస్తవాలు                                    

 

​ 1. 20 టీఎంసీల 'సరళీకృత' లెక్క వెనుక ఉన్న అసలు ప్రమాదం (Hydraulic Pressure & Stability)

​విమర్శకులు చెబుతున్నట్టు అన్నారం (10.87 టీఎంసీలు), సుందిళ్ల (8.8 టీఎంసీలు) కలిపితే సుమారు 19.67 టీఎంసీలు. గోదావరి వరద 28 లక్షల క్యూసెక్కులు వచ్చినప్పుడే భద్రాచలానికి ఏమీ కాలేదు కదా, ?                                        

ఈ 2 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జ్ ఒక లెక్కా? అని కొందరు ప్రెస్ మీట్లలో సింపుల్ ఈక్వేషన్లు చెప్తున్నారు.

​కానీ ఇక్కడ ఇంజనీరింగ్ లెక్క నదిలో పారే వరద పరిమాణం (Discharge) కాదు... బ్యారేజీల నిర్మాణ భద్రత (Structural Stability).

​మేడిగడ్డ పునాదుల వైఫల్యం: దిగువన ఉన్న మేడిగడ్డ బ్యారేజ్ (16.17 టీఎంసీలు) పునాదులు (Raft) కుంగిపోయాయి. పైపింగ్ ఫెయిల్యూర్ వల్ల బ్యారేజ్ కింద ఉన్న ఇసుక కొట్టుకుపోయింది.

​బ్యాక్ వాటర్ ప్రెజర్ (Backwater Effect): ఒకవేళ ఎగువన ఉన్న అన్నారం, సుందిళ్లలో 20 టీఎంసీల నీటిని పూర్తి స్థాయిలో (Full Reservoir Level - FRL) నింపితే, అది మేడిగడ్డ వైపు మరియు ఎగువన ఉన్న నదీ తీరాలపై తీవ్రమైన హైడ్రాలిక్ ఒత్తిడిని (Uplift Pressure) పెంచుతుంది.

​NDSA నివేదిక ప్రకారం, పునాదుల కింద 'సీపేజ్' (ఉత్ప్రవాహం) కంట్రోల్ కాకుండా, గేట్లు పూర్తిగా ఎత్తి ఉంచకుండా నీటిని నిల్వ చేస్తే.. ఈ ఒత్తిడికి బ్యారేజీల గైడ్ బండ్‌లు, ఆప్రాన్‌లు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. అంటే కేవలం 20 టీఎంసీల నీరే కదా అని మనం నిర్లక్ష్యం చేస్తే, అది బ్యారేజ్ పునాదులను శాశ్వతంగా సమాధి చేస్తుంది.

​2. కన్నెపల్లి పంప్ హౌస్ – డిజైన్ డొల్లతనం (The Design Fallacy)

​పట్టిసీమ, తాడిపూడిలతో కన్నెపల్లిని పోల్చడం సాంకేతిక అజ్ఞానం.

​పట్టిసీమ ఎత్తిపోతల: ఇది కేవలం నది ఒడ్డున, సహజసిద్ధమైన వరద ప్రవాహాన్ని (Flood flow) నేరుగా పోలవరం కుడి కాలువలోకి పంప్ చేసే తాత్కాలిక గ్రావిటీ ఆధారిత వ్యవస్థ. దీని డిజైన్ హెడ్ చాలా తక్కువ.

​కన్నెపల్లి (మేడిగడ్డ లిఫ్ట్): ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ-స్టేజ్ అండర్ గ్రౌండ్/సెమీ-అండర్ గ్రౌండ్ లిఫ్ట్ సిస్టమ్. ఇక్కడ ఒక్కొక్కటి 40 మెగావాట్ల సామర్థ్యం గల 17 భారీ మోటార్లు ఉన్నాయి.                                                                                                          

​మునకకు అసలు కారణం: జూలై 14, 2022న కన్నెపల్లి పంప్ హౌస్ మునిగిపోవడానికి కారణం గోదావరి వరద కాదు, ఆ పంప్ హౌస్ చుట్టూ కట్టిన ఫోర్‌బే (Forebay) మరియు ప్రొటెక్షన్ వాల్ డిజైన్ లోపం.

నది గరిష్ట వరద మట్టం (HFL - Highest Flood Level) లెక్కించడంలో గత ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగం ఘోరంగా విఫలమైంది. పంప్ హౌస్ రక్షణ గోడల కంటే ఎక్కువ ఎత్తులో వరద నీరు వచ్చి లోపలికి చేరింది.

​నాడు నోరు మెదపని వాళ్లు.... 

2022లో పంప్ హౌస్ మునిగినప్పుడు ఈ మోటార్ల రీ-వైండింగ్, ప్యానెల్ బోర్డుల మార్పిడి కోసం ప్రజల సొమ్ము వందల కోట్లు అదనంగా ఖర్చు చేశారు. 2023లో కేవలం 9 రోజులు 6 టీఎంసీలు తోడగానే అంతా బాగుంది అని సర్టిఫికేట్ ఇచ్చేసిన నాటి అధికార పత్రికా అధిపతులు.. ఆ తర్వాత మళ్లీ వచ్చిన వరదకు పంప్ హౌస్ ఎందుకు దెబ్బతిన్నదో ప్రజలకు సమాధానం చెప్పాలి. లోపభూయిష్టమైన డిజైన్లను సమర్థిస్తూ నాాడు పత్రికలు నడిపిన  మేధావులు ఇవాళ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ గురించి మాట్లాడటం హాస్యాస్పదం. 

"పట్టిసీమ మ్యాప్‌లు చూపించే మేధావులకు.. కాళేశ్వరం మునక దృశ్యాలు కనిపించడం లేదా?"

​పట్టిసీమ అనేది నది ప్రవాహాన్ని కాలువల్లోకి ఎత్తిపోసే ఒక సాధారణ 'ఆన్-షోర్' (On-shore) పంపింగ్ వ్యవస్థ. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి అలా కాదు. అది బ్యారేజ్ బ్యాక్-వాటర్ ఒత్తిడిపై ఆధారపడి నడిచే సంక్లిష్టమైన వ్యవస్థ.

​గూగుల్ మ్యాప్స్ చూపిస్తూ గొప్పలు చెప్పే కేసీఆర్ పరివారానికి.. తప్పుడు డిజైన్ల వల్ల 2022లో కన్నెపల్లి పంప్ హౌస్ నిలువునా మునిగిపోయిన గ్రౌండ్ రియాలిటీ తెలియదా? దిగువన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయి, పునాదుల భద్రత ప్రమాదంలో పడినప్పుడు.. ఎగువన అన్నారం, సుందిళ్లలో నీటిని నిల్వ చేసి మోటార్లు ఆన్ చేస్తే వచ్చే 'హైడ్రాలిక్ ప్రెజర్' వల్ల మిగిలిన బ్యారేజీలు కూడా కొట్టుకుపోతాయన్న కనీస ఇంజనీరింగ్ జ్ఞానం వారు వీరీ దగ్గర లేరా?                                                                                               

 పట్టిసీమ అనేది కేవలం నది ఒడ్డున నీటిని తోడే ఒక చిన్న పంప్ హౌస్ మాత్రమే. అక్కడ ఎగువన భారీ బ్యారేజ్ గానీ, నిల్వ ఉంచే జలాశయం గానీ లేదు. కానీ కాళేశ్వరం అనేది బ్యారేజీల ఆధారిత మల్టీ-స్టేజ్ ప్రాజెక్ట్. మేడిగడ్డ బ్యారేజ్ పునాదులు కుంగిపోయిన .. "బ్యారేజ్ పునాదే కదిలిపోయి ప్రమాదంలో ఉంటే, పట్టిసీమలాగా ఇక్కడ నీటిని ఎలా నిల్వ చేస్తారు? ఎలా పంపింగ్ చేస్తారు?"

."పట్టిసీమ ఎప్పుడైనా ఇలా మునిగిపోయిందా? కన్నెపల్లి పంప్ హౌస్ డిజైన్ లోపాలు, గరిష్ట వరద మట్టాన్ని (HFL) తప్పుగా అంచనా వేయడం వల్లే కదా వందల కోట్ల ప్రజాధనం బురదపాలైంది?"

​పట్టిసీమ గ్రావిటీ కాలువ ఫోటోలను, కాళేశ్వరం భారీ లిఫ్ట్ స్కీమ్‌తో పోల్చడం.. ప్రజలను తప్పుదోవ పట్టించడమే!       

   అయితే ఇక్కడ మేధావుల పేరుతో కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. నిపుణుల కమిటీ ఎప్పుడేస్తారు? అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ల తర్వాత కూడా ఆ సమీక్ష, దిద్దుబాట్లు ఎందుకు చేయలేదు?"అది కదా అడగాల్సింది." వందకు వంద శాతం ఈ ప్రశ్నలు సహేతుకమే..... 

​ప్రభుత్వాలు మారిన తర్వాత కూడా సమీక్షలు, దిద్దుబాటు చర్యల్లో ఇంత కాలయాపన ఎందుకు జరుగుతోంది? రెండున్నరేళ్లు గడుస్తున్నా శాశ్వత పరిష్కారం ఎందుకు చూపలేదు? అనే నిలదీత నిఖార్సైనది      కానీ, ఈ జాప్యం వెనుక కేవలం రాజకీయ ఉదాసీనత మాత్రమే ఉందా, లేక కొన్ని సాంకేతిక, చట్టపరమైన సంకెళ్లు ఉన్నాయా అని లోతుగా పరిశీలిస్తే కొన్ని చేదు నిజాలు కనిపిస్తున్నాయి. 

 NDSA (National Dam Safety Authority) పరిధి మరియు చట్టపరమైన చిక్కులు:

డ్యామ్ సేఫ్టీ యాక్ట్-2021 ప్రకారం, ఒకసారి మేడిగడ్డ లాంటి అంతర్రాష్ట్ర ప్రాజెక్టులో ఇంత పెద్ద నిర్మాణ లోపం (Structural Failure) బయటపడ్డాక, దానిపై తుది నిర్ణయం తీసుకునే సర్వాధికారాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని NDSA (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) చేతుల్లోకి వెళ్తాయి. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని అక్కడ మళ్లీ కాంక్రీట్ పనులు చేయడానికో, లేదా నీటిని నిల్వ చేయడానికో చట్టం ఒప్పుకోదు. NDSA నిపుణుల కమిటీ ఇప్పటికీ వివిధ దశల్లో పరీక్షలు (Geotechnical and Geophysical investigations) చేస్తూనే ఉంది. వారి పూర్తి నివేదిక మరియు క్లియరెన్స్ రాకుండా రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఖర్చు పెట్టే సాంకేతిక హక్కును కోల్పోయింది.

 నేర పరిశోధన (Vigilance/Judicial Inquiry) మరియు సాక్ష్యాల లెక్కింపు....

ప్రాజెక్టు కుంగుబాటుకు గల కారణాలపై విచారణ జరుగుతోంది. పునాది కింద అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి 'జియో-ఫిజికల్' పరీక్షలు చేయాల్సి ఉంటుంది. బ్యారేజ్ కింద ఉన్న ఇసుక, కాంక్రీట్ పొరల (Raft) పరిస్థితిని అంచనా వేయడం అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. ఆ నివేదికలు రాకుండా, బాధ్యులెవరో తేలకుండా, అక్కడ ముందస్తుగా ఎలాంటి దిద్దుబాట్లు చేసినా... అది అసలైన తప్పులను లేదా సాక్ష్యాలను పక్కదారి పట్టించినట్లు అవుతుందనే న్యాయపరమైన చిక్కు కూడా ఇక్కడ నెలకొంది.

తాత్కాలిక దిద్దుబాట్లు – శాశ్వత ప్రమాదాలు:

రెండున్నరేళ్లుగా సమీక్షలు జరగలేదనడం కంటే, నిపుణుల సూచనల మేరకు కేవలం 'తాత్కాలిక రక్షణ చర్యలు' (Interim Remedial Measures) మాత్రమే చేపట్టారు. శాశ్వత పునరుద్ధరణ (Restoration) చేయాలంటే డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) మారాలి. డిజైన్లను పూర్తిగా మార్చాలి. దానికి హైడ్రాలిక్ మోడల్ స్టడీస్ చేయాలి. ఇవన్నీ జరగకుండా తొందరపడి ఏ చిన్న తప్పుడు నిర్మాణం చేసినా, రేపు వచ్చే భారీ వరదకు మొత్తం బ్యారేజీ కొట్టుకుపోయే ప్రమాదం ఉందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెబుతోంది.

ఇక్కడ రాజకీయ బురదజల్లుడు..  పనుల పునరుద్ధరణలో కాలయాపన జరుగుతోంది అనేది అక్షర సత్యం. ప్రభుత్వాలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి విచారణల పేరుతో కాలం వెళ్లదీస్తున్న మాట కూడా వాస్తవమే. ఒక తెలంగాణ ఉద్యమకారులుగా ఎవరైన దీనిని ప్రశ్నించాల్సిందే.  

​కానీ ఇక్కడ భయమల్లా ఒక్కటే ... పాలకుడేవడైనా కాని వారు చేసిన ఆలస్యానికి, వ్యవస్థల కాలయాపనకు బలవుతూ... క్షేత్రస్థాయిలో సాంకేతిక ప్రమాణాలను విస్మరించి, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే, అది రేపు గోదావరి తీర ప్రాంత ప్రజలకు కోలుకోలేని శాశ్వత నష్టాన్ని మిగులుస్తుందేమోననే ఆందోళన ఎవరికైనా రావల్సిందే.

​వ్యవస్థల జాప్యాన్ని ప్రశ్నిస్తూనే, సాంకేతిక భద్రతను డిమాండ్ చేయడం మన బాధ్యత.               

ప్రస్తుత ప్రభుత్వానికి ఒక డెమోక్రాట్‌గా నా సూటి విశ్లేషణ & హెచ్చరిక

​గత ప్రభుత్వ తప్పులను ఎండగట్టడం ద్వారా ప్రస్తుత ప్రభుత్వం తన బాధ్యత నుండి తప్పుకోలేదు. రెండున్నరేళ్ల సమయం గడిచినా ఇంకా బురద పేరుకుపోయింది అని సాక్షాత్తూ ముఖ్యమంత్రి గారే చెబుతుంటే, అది పరిపాలనాపరమైన ఆలసత్వాన్ని సూచిస్తుంది.

​పనుల మందగమనం: 2022 మునక తర్వాత తాత్కాలిక మరమ్మతులు జరిగాయి. కానీ, ఆ తర్వాత మళ్లీ వ్యవస్థ ఎందుకు అస్తవ్యస్తమైంది? ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (O&M) విభాగానికి బడ్జెట్ కేటాయింపులు ఎందుకు సకాలంలో జరగలేదు?

​వృధా అవుతున్న వరద జలాలు: గోదావరిలో ప్రతి ఏటా వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తోంది. ప్రాజెక్టుల పునరుద్ధరణను అత్యవసర యుద్ధప్రాతిపదికన (War Footing) చేపట్టకపోతే, ప్రతీ వర్షాకాలం ఇలాగే పరస్పర విమర్శలతో కాలయాపన జరుగుతుంది తప్ప రైతాంగానికి పైసా ఉపయోగం ఉండదు.

​పరిష్కార మార్గం (The Democratic Way Forward):

​సాంకేతిక పారదర్శకత: NDSA నిపుణులు సూచించిన జియో-ఫిజికల్ స్టడీస్, అండర్-వాటర్ స్కానింగ్ నివేదికల లెక్కలను ప్రభుత్వం ప్రజల ముందు పెట్టాలి.

స్వతంత్ర జల నిపుణుల కమిటీ: కేసీఆర్ పరివారానికి చెందిన భజన ఇంజనీర్లను కాకుండా.. జలసాధన ఉద్యమంలో పనిచేసిన స్వతంత్ర నిపుణులు,ప్రజాపక్ష  మేధావులతో ఒక పర్యవేక్షణ కమిటీ వేసి, కాంట్రాక్టర్ల తప్పులను సరిదిద్దాలి.

​కాలపరిమితితో కూడిన పునరుద్ధరణ: కన్నెపల్లి పంపుల నిర్వహణ మరియు బ్యారేజీల గ్రాౌండ్ స్టెబిలైజేషన్ పనులకు నిర్దిష్ట కాలపరిమితి (Deadline) విధించి పనులు పూర్తి చేయాలి.

​రాజకీయ పంతాల కోసం ప్రాజెక్టులను నిర్వీర్యం చేసినా తప్పే... వాటిని బాగు చేయడంలో అలసత్వం ప్రదర్శించినా తప్పే. ఈ రెండింటినీ ఎండగట్టడమే ఒక నిజమైన తెలంగాణ వాది బాధ్యత.._                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                         ---బండి.దుర్గా ప్రసాద్ (సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ ప్రజా స్వామిక వేదిక కన్వీనర్)_7981184205

Relative Post

Newsletter